బలి ఇలా అన్నాడు:-
పితామహా! మీరు నాకు అంతయు వివరించారు జనార్దనుని చక్కగా ఆరాధించిన వారలకు ఏ పదవి కలుగుతుందో వివరించండి ఏ విధంగా ఆరాధిస్తే ప్రభువు సంతోషిస్తాడు? ఆ జగద్గురువు ప్రీతికై ఏ యే దానాలు తగినవి? ఉత్తమమైనవి ఏ యే తిథులలో ఉపవాసాదు లాచరిస్తే ఆ దేవుడు ప్రీతు డౌతాడు? సంతోష స్వాంతులూ సోమరులు కాని వారలు యింకా ఏమేమి చేయవలెనో అదంతా చెప్పండి అది విని ప్రహ్లదుడిలా చెప్పసాగాడు. ఓ బలీ! శ్రద్ధ గల వారు భక్తితో జనార్దనునుద్దేశించి యిచ్చే దానాలు ఉత్తమమైన వని అక్షయ ఫలాలు యిస్తాయని మునులు చెబుతారు. ఏయే రోజుల్లో నరుడు భగవద్దత్తమైన చిత్తంతో తన్మయుడై ఉపవసించి ఆ జగత్పతిని ఆరాధిస్తాడో అవి ఉత్తమ తిధులు. బ్రాహ్మణ శ్రేష్టు లను పూజించినచో జనార్దనుని పూజించుటయే అగును. విప్రులను ద్వేషించు మూఢులు నరకగాములౌతారు. ఇది తథ్యం. బ్రాహ్మణులు నాకు శరీరం. నా భక్తులగు వారు బ్రాహ్మణులను పూజించాలి అని శ్రీహరి వక్కాణించాడు. జ్ఞాని కానీ అజ్ఞాని కానీ బ్రాహ్మణుని అవమానించరాదు. వారలు విష్ణుదేవుని దివ్య శరీరం గనుక బ్రాహ్మణులు పూజార్హులు. ఇక ఓ మహాదైత్యా చక్కని రంగు, రూపం, సుగంధం మధువు గల పుష్పాలు భగత్పూజకు తగినవి. ఇక దానాలు, తిథులు, పువ్వులను గురించి వివరిస్తాను. వినుము. జాజి, నూరు రేకుల తామరలు, దొంతర మల్లె, బాణ, సంపెంగ, అశోక, కరవీర, నవమల్లిక, పారిభద్ర, పాటల వకుళ (పాగడ), గిరిశాలిని, తిలక, జపాకుసుమ, పీతక, నాగరాది పుష్పాలు అచ్యుతుని పూజకు ప్రశస్తమైనవి. ఒక్కమెగలి పువ్వు మాత్రం పూజలో వాడకూడదు. యితర పరిమళ పుష్పాలు ఉపయోగించ వచ్చు. ఇక పత్రాల్లో బిల్వ పత్రాలు, జమ్మి, భృంగ (గుంటగర), పత్రం, మృగాంక తమాల ఉసిరిక పత్రాలు కేశవుని పూజకు ఉత్తమమైనవి. ఈ పుష్పాలకు సంబంధించిన పత్రాలు గూడ శ్రీ హరి పూజకు వాడవచ్చు.
తీగలు, చిగురుటాకులు, దర్భాంకురాలు, రక రకాలైన జల పుష్పాలు, కమలాలు, యిందీవరాలు, కలువలు మెదలయినవి మృదువైన గరిక పోచలు, భగవత్పూజలోన ఉపయోగించవలెను. ప్రభువు శ్రీ విగ్రహానికి చందనం కుంకుమ అగురుతో లేపనం చేసి దశాంగంలోనివైన మహిష, కోయన చక్కలు, సిహ్లికం, అగరు, శంఖ, జాజికాయల పొడి ధూపం వేయాలి. ఇవి స్వామికి ప్రీతి కరాలు. చక్కగా వండి తయారు చేసిన యవ గోధుమ శాలి అన్నము, నూవులు, పెసలు, మినుములతో వండిన భక్ష్యాలు, శ్రీ హరికి యిష్టమైన నైవేద్యము. ఇక దానాలలో గోదానం, భూదానం వస్త్ర అన్న సువర్ణ దానాలు, మధుసూదనునకు చాలా ప్రీతి కలిగించునవి. మాఘ మాసంలో నూవులు, నూవులతో చేసిన ధేనువు (తిలధేనువు) వంట చెరకు, మాధవుని ప్రీతికై దానం చేయాలి. ఫాల్గుణ మాసాన వడ్లు, పెసలు, వస్త్రలు, జింక చర్మం మొదలయినవి గోవిందుని ప్రీతికై దానం చేయాలి. చైత్రంలో చిత్రాలు, వస్త్రములు, పరుపులు, ఆసనాలు, విష్ణు ప్రీతికై బ్రాహ్మణులకు దానం చేయతగును. ఓ బలీ! వైశాఖంలో వాసనలు వెదజల్లే చందనం పూల మాలలు, జ్యేష్ఠ మాసంలో నీరు నింపిన పాత్రలు, జలధేనువులు (ఆవు ఆకారంలో జల పాత్రలు)తాటియాకు విసనకర్రలు, మంచిగంధం, వట్టివేరు, త్రివిక్రమ దేవుని ప్రీతికై సాధువులకు తరచుగా యిస్తూండాలి. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు, ఉసిరిక మెదలగునవి వామన దేవుని తృప్తికై దానం చేయాలి. శ్రావణమాసం శ్రీ ధరుని ప్రీతికి గాను నేతితో, పాలతో నింపిన కడవలు, పేరిన నేతితో చేసిన గోవు (ఘృత ధేనువు) పండ్లు, జ్ఞానులగు వారు దానం చేయాలి. భాద్ర పద మాసంలో హృషీకేశుని తృప్తి పరచుటకై పాలు, నేయి, తేనె, బెల్లంతో వండిన పాయసాన్నము, లవణము యివ్వ వలెను. ఆశ్వయుజ మాసంలో నరులు భగవత్ ప్రీతికై నూవులతో చేసిన అశ్వం, వృషభం, పెరుగు, రాగి, ఇనుము దానం చేయాలి. కార్తిక మాసంలో బంగారం, వెండి ప్రమిదలలో దీపాలు, రత్నాలు, ముత్యాలు, దామోదరుని సంతుష్టికై దానం చేయాలి. మార్గశిరంలో ఖడ్గాలు, గుర్రాలు, ఏనుగులు, బండ్లు, మేకలు, గొర్రెలు, కేశవుని ప్రీత్యర్థం దానం చేయాలి. భవనాలు నగరాలు, యిండ్లు, వాకిండ్లు, కేశవుని తుష్టికై పుష్యమాసంలో భక్తితో దానం చేయాలి. ఇక ఈ నెలా ఆ నెలా అనే విచక్షణ లేకుండా ఎల్ల కాలాల్లోను దాస దాసీలను, అలంకార వస్తువులను, షడ్ర సోపేతమైన భోజనము, దానం చేస్తే ఆ పురుషోత్తముడు ఎంతో సంతోషిస్తాడు. తనకు అన్నింటిలోను యిష్టమైన దానిని తనవద్ద వానిలో పవిత్రమైన వస్తువును దేవ దేవు డగు చక్రపాణి ప్రీతికై దానం చేయాలి.
విష్ణు దేవునకు ఆలయ నిర్మాణంచేయించునతడు శాశ్వతాలైన పుణ్యలోకాలను జయిస్తాడు. పుష్పములు, ఫలాల తోటలు, దానం చేయునతడు కోరిన కోర్కెలు శ్లాఘించ దగినవి, అనుభవిస్తాడు. విష్ణు దేవాలయం నిర్మింపజేయు నతడు తన పితామహునకు ముందు ఎనిమిది తరాల వారిని తన తర్వాత ఎనిమిది తరాల వారిని తరింప చేస్తాడు. ఓ దైత్య ముఖ్యా! యదువులలో పరమశ్రేష్ఠుడైన జామఘుని ఎదుట అతని తపోనిష్ఠుల, యోగులు, నగు పితరులు ఒక పరి యిలా గానం చేశారు. మా వంశంలో ఎవడైనా శ్రీహరి భక్తుడు జన్మిస్తాడు? ఎవరైనా విష్ణు ఆలయం నిర్మాణం చేస్తాడా? కేశవాలయానికి విలేపనం (వెల్ల వేయించు) వేయించు వాడెన్నడైనా జన్మిస్తాడా? భక్తితో విష్ణ్వాలయ ప్రాంగణం చక్కగా ఊడ్చిశుభ్రం చేయ గల శుచి మంతుడు మావంశంలో పుడతాడా? మనవంశంలో విష్ణ్వాలయానికి ధ్వజం, దీప సామగ్రి, పూలు యితర అర్చన సామగ్రి దానం చేయు ఉత్తములు పుడతారా? పాతకాలు, మహా పాతకాలు, ఉపపాతకాలు చేసిన వారైనను విష్ణువు దేవాలయంలో చిత్రాలు వేయిస్తే ఆ పాపాలన్నీ భస్మమౌతాయి. పితరులు ఎంతో ఆశతో ఆ కాంక్షతో గావించిన ఆ ఉద్గారాలను విన్నంతనే ఆ మహారాజు జ్యామఘుడు భూలోకంలో విష్ణుదేవుని ఆలయ నిర్మాణం చేయించాడు. దానిని రకరకాల రంగులు వేసి స్వయంగా అలంకరించాడు. ఆ వాసుదేవ భక్తుడు, కేశవుడు గావించిన అద్భుత కార్యాలను పంచ రంగుల చిత్రాల రూపంలో గోడ మీద చిత్రించాడు. ఎన్నో దీవ పాత్రాలు విధి పూర్వంగా ఆలయానికి దానం చేశాడు. ఓ బలీ! ఆ పాత్రలను సుగంధ తైలాలతో నేతితో నింపి వానిలో జ్యోతులు స్వయంగా వెలిగించాడు. రంగు రంగుల ధ్వజపతాకలను, ధ్వజ స్తంభాలకు తొమ్మిది రంగుల మంజిష్ఠ (పసుపు) పూసి, తెల్ల పాటల కుసుమాలతో నలంకరించిన వానిని నెల కొల్పాడు. చూడ ముచ్చట గొలిపే ఎన్నోపూలతోటలను పండ్ల తోటలను వేయించి వానిని వివిధాలయిన లతా గుల్మాలతో దేవదారు వృక్షాల శీతల ఛాయలతో నింపి వేశాడు. వాని లోపల తన అంతః పుర రాజ భవనాలను నిర్మించిన శిల్ప నిపుణుల చేత రత్న జటితాలయిన శిలా వేదికలు నిర్మింపజేశాడు. ఆ దృఢ మైన వేదికల మీద సన్యాసులను వేద విద్వాంసులను బ్రహ్మచారులను జ్ఞానులను దీనులను అంగవైకల్యం కలవారలను దాన సత్కారాదులతో తృప్తి పరచేవాడు, ఆ ధర్మిష్ఠుడు జితేంద్రియుడు నగు నరపతి పితరుల కోరిక ననుసరించి ఈ విధంగా సత్కార్యాలు గావించి విష్ణులోకానికి వెళ్ళాడని పెద్దలు చెప్పగా విన్నాము. వత్సా! బలీ! విష్ణు లోకాలు పొందదలచిన వారందరు నేటికి ఆ జ్యామఘుడు వేసిన రాచబాట మీదనే పయనిస్తున్నారు. కనుక నీవు కూడ వాసుదేవమందిర నిర్మాణం గావించి శ్రోత్రియులైన బ్రాహ్మణులను, విశేషించి పౌరాణికులను, సదాచార సంపన్నులను, అర్చించుము. ధన స్వర్ణ వస్త్రా భరణాదులర్పించి వారల సేవింపుము. ఆ విధంగా సంపద గలిగినపుడే జనతా రూపుడగు జనార్దనుని ప్రీతుని గావింపుము. ఈ విధంగా క్రియాయోగం ద్వారా పూజితుడై మురారి నీ కన్ని విధాలమేలు కలుగుజేస్తాడు. ఓ బలీ! అనంతుడు అచ్యుతుడు నగు జగన్నాదుని నమ్ముకొనిన వారల కెలాంటి కష్టాలు కలుగవు సుమా!
ఇతి త్రివిక్రమ చరితం సమాప్తం
పులస్త్యు డిలా అన్నాడు:-
నారదా ! దైత్యేశ్వరు డగు బలికి ఈ విధంగా సత్య సంవలితాలయిన ఉత్తమ హిత వచనాలు పలుకగా నా విరోచన నందనుడు పితామహుని భక్తితో పూజించాడు. మనుమని పూజ లందుకుని పూర్ణ కాముడగు నా హరి భక్తుడు మోక్షగామి అయ్యాడు. అలా తృప్తితో పితామహుడు వెళ్లి పోయిన తర్వాత నా బలి గృహం చంద్ర కాంతులతో తేజరిల్లింది. ఇంద్రుని శిల్పుల శ్రేష్ఠుడు ఆ బలి కొరకు వాసుదేవుని సుందర విగ్రహాన్ని చేసి యివ్వగా బలి దానిని ఆలయంలో ప్రతిష్టించి తాను తన భార్యతో కలిసి ఆ ఆలయానికి వర్ణ విలేపనం సమ్మార్జనం (ఊడ్చుట) మొదలయినవి స్వయంగా నిర్వహించాడు యవలు శర్కర మొదలయిన వస్తువులు కేశవార్పణం గావిస్తూ అప్రతిమాన మైన సేవలతో నా మధుసూదనుని ఆరాధించాడు. బలి భార్య వింధ్యావళి స్వయంగా స్వామి ఆలయంలో దీపాలు వెలిగించగా ఆ ధీమంతుడు సమర్థులగు పౌరాణికులచేత, విప్రులచేత, ధర్మప్రవచనాలు, సంకీర్తనలు, ఏర్పాటు చేయించాడు. ఆ విధంగా ఉత్తమమైన ధర్మమైన మార్గాన పయనించే దైత్యేశ్వరు డగు బలి దక్షణ బాధ్యతలు స్వయంగా జగన్నాధుడు దివ్య రూపి అయిన జనార్దనుడు తానే వహించి నిలచాడు. ఆ లోకేశ్వరుడు సుదృఢమైన ప్రాకారంతో రక్షత మైన బలి తల వాకిట చేతిలో వేయి సూర్యుల ప్రభతో వెలిగే గద పట్టు కొని శత్రు సమూహాలను సంహరిస్తూ లోనికెవ్వరనూ పోనీయక కాపుగా నిలచాడు! సకల కల్యాణ గుణాభిరాము డగు నారాయణుడు ద్వార పాలకుడుగా వాకిట నిలబడగా గృహాభ్యంతరంలో బలి రాజేంద్రుడా దేవర్షి సేవితుని వివిధోపచారాలతో భక్తియుక్తుడై ఆరాధించాడు. అలా ప్రతి దినము శ్రీహరి పాద కమలాలను పూజిస్తూ ఆ బలి చక్రవర్తి ఆ ప్రభువు ఉపదేశ వాక్యాలను స్మరిస్తూ వినయ సుందరమైన ఆదర్శజీవితం గడిపాడు. ఆ దైత్యేశ్వరు డీపవిత్ర వృత్తాన్ని స్మరిస్తూ మహేంద్రతుల్యుడైన పితామహుడు గావించిన ఇహ పర తారక మైన హిత వచనా లను సత్య వచనాలను నెమరు వేసుకుంటూ కాలం వెళ్ల బుచ్చాడు. వెన్నలాంటి మృదు మానసంగల సజ్జనులు వృద్దుల హేతవచనాలను, వారలు మొదట కటువుగా భాషించినా, లెక్క చేయక ఆదరంతో స్వీకరిస్తాడు. అందు వలన వారలకు శ్రేయస్సు హర్షామోదాలే కలుగుతాయి. ఇందులో సందేహం లేదు ఆపద లనే సర్పాలు కాటు వేసిన వారలకు మంత్రం తెలియని వారలకు వృద్దుల వాక్యమే ఆ విషాన్ని దించ గల పరమౌషధం. వృద్ధుల వచనాలనే అమృతం త్రాగి ఆ ప్రకారం నడచు కునే వారలకు కలిగే తృప్తి సోమ పానంలో ఎక్కడ లభిస్తుంది? ఆపదలలో చిక్కుకొని దారిచూపే వృద్ధులు లభించని వారనలు బ్రతికి యుండియూ చచ్చిన వారితో సమానులే. అట్టి వారి దుర్ధశకు బందు జనం నిజంగా శోకించాలి. విపత్తనే మెసలి చేత జిక్కి దాని నుంచి విడిపింప గల వృద్ధులూ పండితులు, లభించని వారలకు శాంతి అంటూ ఎన్నడూ ఉండదు. ఆపదల్లో మునిగి వ్యసనాలను సుడి గుండంలో కొట్టు కొని పోయే వారికి వృద్దో పదేశాలు వినా మరేదీ గట్టుక చేర్చజాలదు. కుక వృద్ధులగు పెద్దల మాటలను విని ఆచరణలో పెట్టే అదృష్టవంతులకు అక్కడి కక్కడే సత్పలితాలు కలుగుతాయి. అందుకు దృష్టాంతం విరోచన నందునుడైన బలి వృత్తాంతమే.
ఇది శ్రీ వామన పురాణంలో ఎనిమిదవ అధ్యాయం శ్రీ త్రివిక్రమ చరిత్రం ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹