Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 -తొంబై నాల్గవ అధ్యాయం

పులస్త్యుడిలా అన్నాడు :-

రసాతలానికి వెళ్లిన దైత్యేశ్వరుడు బలి శుద్ధ స్పటి కమణి సోపానాలతో వివిధమణులతో చక్కని నగరం నిర్మించుకున్నాడు. ఆ నగరం మధ్యన వజ్రాల అరుగులతో, ముత్యాల తోరణాల ద్వారాలతో, విశ్వకర్మ నిర్మించిన విశాలమైన భవనంలో నివాసం చేస్తూ వివిధాలైన దేవ మానుష భోగాలను వింధ్యావళి యను ధర్మ పత్నితో కలిసి అనుభవించాడు. ఆయన వేయిమంది బార్యలలో నా వింధ్యావళి ప్రధానురాలు. సద్గుణ రాశి, శీలవతి. ఆమెతో కలిసి అలా ఆ విరోచన సుతుడు సుతలంలో సకల భోగాలు అనుభవిస్తూండగా నొకపరి ఆ పాతాళానికి రాక్షస తేజో హారి అయిన సుదర్శన చక్రం వచ్చింది. ఆ రాక్షసనగరంలో చక్రం ప్రవేశించ గానే సముద్ర క్షోభకు సమానమైన గొప్ప తుముల ధ్వని వ్యాపించింది. అది విన్నంతనే ఆ బలి దైత్యుడదరి పడి ఖడ్గం దూసి ఏమిటీ ఉపద్రవమని ప్రశ్నించాడు. అతని భార్య వెంటనే అతనిని శాంతింప జేస్తూ ఖడ్గం కోశంలో పెట్టండి. ఈ ధ్వని దైత్య చక్ర సంహారి యగు విష్ణుదేవుని చక్రానిది. మహాత్ముడగు వామనదేవుని ఈ దివ్యాయుధం మనకు పూజనీయం. అని కర్తవ్యమెరిగించి, చేతిలో అర్ఘ్య పాత్ర తీసికొని భర్తతో బయలు దేరింది. ఇంతలో వేయి అంచులతో వెలిగి పోతూ విష్ణు చక్రం వారలను సమీపించగా నా దైత్య నాథుడు అంజలి ఘటించి భక్తి యుక్తుడై సుదర్శనుని పూజించి ఇలా స్తోత్రం చేశాడు.

శ్రీ సుదర్శన చక్ర స్తవము

దైత్య చక్రనాశకమగు శ్రీహరి చక్రానికి నమస్కరిస్తున్నాను. వేయి కిరణాల దీప్తితో వేయి అంచుల తో వెలిగే పవిత్ర మగు విష్ణు చక్రానికి నమస్సులు. ఈ సుదర్శన దేవునకు నాభి యందు బ్రహ్మ, ముఖ భాగాన శూలపాణి శంకరుడు, అంచుల మొదళ్లలో ఇంద్రాదిత్య అగ్నుల తో కూడిన దేవ సమూహం, నిలచి యున్నారు. ఈ ప్రభువు వేగం వాయు, జల, అనల, పృధివీ, గగన, సమన్వితము. అప్రతిహతము! అర(ఆకు)ల కిరువైపులా మేఘాలు, విద్యుత్తులు, గ్రహ తారకలు, పరివేష్టించి ఉన్నవి. బాహ్య ప్రాంతాన వాలఖిల్యాది తపోధనులు సేవిస్తూ ఉన్నారు. అలాంటి శ్రేష్ఠమైన వాసుదేవుని ఆయుధానికి ప్రణమిల్లు తున్నాను. ఓ ప్రభూ! సుదర్శన దేవా! విష్ణు చక్ర రాజా! నేను దేహంతో, వాణితో, మనస్సుతో చేసిన పాప సమూహాన్నంతా నీ అగ్ని శిఖలతో దహించి వేయుము. నా వంశంలో తల్లి వైపున గానీ, తండ్రి వైపున గాని సంభవించిన పాపాలన్నింటినీ తక్షణమే హరించుము. ఓ అచ్యుతుని ఆయుధమా! నీకు నమస్సులు. నా మానసికాలయిన ఆధులు (బాధలు) శరీర సంబంధితాలయి వ్యాధులు (రోగాలు) నశించును గాక! ఓ చక్రేశ్వరా! నీ పవిత్ర నామ స్మరణం చే నా దురితా లన్నీ క్షయమగు గాక! నీకు శతశః నమస్సులు!

అలా స్తుతించి, ఆ బుద్ధి మంతుడా సుదర్సన భగవానుని భక్తితో నర్చించి పాప ప్రణాశకు డగు పుండరీకాక్షుని స్మరించాడు. ఆ చక్రం బలి పూజనందుకొని అసురలందరను తేజో హీనుల గావించి దక్షిణ విషువ త్కాలాన (దక్షిణాయనం) పాతాళం వదలి వెళ్లి పోయింది. నారదా ! సుదర్శనం వెళ్లగా వ్యాకుల మైన ఘోర మగు నాపదకులోనై ఆ బలిరాజేంద్రుడు తన తాత యగు ప్రహ్లాదుని స్మరించాడు. వెంటనే ఆ పరమ భాగవతుడు సుతలాన్ని చేరుకుని ఎదురుగా అర్ఘ్య పాత్రతో నిలబడిన మనుమని చూచాడు. ఓ బ్రహ్మన్‌ పితామహుడూ, ఈశ్వరుడు నైన ప్రహ్లాదుని విధి పూర్వకంగా అర్చించి రెండు చేతులు జోడించుకుని బలి అతనికి ఇలా విన్నవించాడు. వ్యాకుల చిత్తుడనై నేను స్మరించినంత నే తమరు దయ చేశారు. ఓ తాత పాదా! నాకీ సమయాన హిత మూ, పథ్యము, శ్రేయస్కరమూ నైన కర్తవ్యమేదో సెలవిండు! సంసారంలో ఉంటూ దాని బంధాల్లో పడకుండా ఉండుటకు ఆచరించ దగిన దేమి? సంసార సముద్రంలో పడి కొట్టుకునే అల్ప బుద్ధులగు మానవులకు దానిని దాటించ గల నావ ఏది ఏమి చేస్తే నరుడీ సంసార సాగారాన్ని దాటగలడు? నారదాబలి చేసిన ప్రశ్నకు ఆ దైత్య భాగవతుడు బాగా ఆలోచించి, ప్రపంచ జీవులకు మేలుకలుగ జేసే ఉపాయాన్ని యిలా వివరించాడు. సాధు!సాధు!దానవేశ్వరా? చక్కని ప్రశ్న అడిగావు. చక్కగా వినుము. నీకునూ సంసార కూపంలో బడిన వార లందరకూ హితమేదో చెబుతున్నాను. వత్సా! బలీ! ఈ సంసారం ఒక సముద్రం, అది ద్వంద్వాలు – సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, మంచిచెడ్డలనే పరస్పర ప్రతికూల పవనాల తాకిడికి ఎప్పుడూ అల్ల కల్లోలంగా ఉంటుంది. భయంకర మైన విషయ వాసనలే అందులోని నీరు. అలాంటి సముద్రం లోనికి మానవులు ఎలాంటి నావ లేకుండా దూకు తారు. పైపెచ్చు భార్యా బిడ్డల పోషణ రక్షణ లనే బరువు నెత్తిన వేసుకొని దిగుతారు. అటువంటి దుఃఖార్తులకు ఒకే ఒక ఆధారం, నావ గలదు. ఆ నావయే విష్ణు భగవానుడు. ఆది మధ్యాంతరహితు డగునా శ్రీహరి నారాయణుని, కళ్యాణప్రదాతను, వరేణ్యుడగుదేవ దేవుని, గరుడ వాహనుడగు శ్రీయఃపతిని, ఆశ్రయించిన ధీరులకు యమ ధర్మరాజు వీటికి వెళ్ల వలసిన అవసరం ఉండదు. ఎందుకనగా నా యముడు పాశహసస్తులయిన తన భటులకు చెవిలో యిలా ఆదేశిస్తాడు. దూతలారా! భగవంతుడగు విష్ణు నాశ్రయించిన వారి పొంతకు పోకుడు. వైష్ణవులు కాని వారల పైననే అధికారము కలదు సుమా. విష్ణు భక్తులపైన కాదు. నరశ్రేష్ఠు డగు ఇక్ష్వాకు ప్రభువు పరమ భక్తుడిలా శాసనం గావించాడు. విష్ణు భక్తులగు వారిపై యమున కెలాంటి అధికారమూ లేదు. హరిని కీర్తుంచిన నాలుకయే నాలుక, ఆయన కర్పితమైనదే నిజమైన చిత్తము, ఆ ప్రభువును పూజించు చేతులే శ్లాఘాపాత్రాలు, శ్రీహరి , పాద కమలాలను అర్చించని చేతులు చెట్ల కొమ్మలకు సమానములు.

శ్రీహరి గుణ గానం చేయని నాలుక కప్ప గొంతుతో సమానం, కొండ నాలుకతో సమానం. రోగిష్టి నాలుక. విష్ణు పాద కమలాలను పూజింపని వాడు జీవించినా చచ్చిన వానితో సమానం. వానిని చూచి బంధువు లంతా విలపించాలి.

ఎల్లపుడు వాసుదేవుని పూజలో మునిగి యుండే వారు మరణించినను వారలకోసం చింతింపగూడదు. యిది సత్యం. నిజం చెబుతున్నాను. శరీరం కలవీ, మానసిక (కాల్పనిక) మైనవీ, నోట ఉచ్చరించేవి, ఆకారం కలవీ, లేనివీ, కనిపించేవీ, కనపడనివి, స్పర్శకు అందేవి, కదిలేవీ, కదలనివీ– సమస్త వస్తువులు కేశవాత్మకాలే! భగవంతుడగు వామనుని నాలుగు విధాల అర్చించేవారు, దేవ దానవ సహితము లగు లోకాలన్నంటినీ అర్చించినట్లే అగును. బిడ్డా!

బలీ! సముద్రంలో రత్నాలు ఎలా అసంఖ్యాకాలుగా ఉంటాయో, అలాగే ఆ చక్ర ధరుని కళ్యాణ గుణాలు కూడ అనంతాలు, లెక్కింపరానివి. బాబూ! శంఖ చక్ర గధా శార్‌ జ్ఞ ధరుడు, గరుడధ్వజుడు, లక్ష్మీపతి, వరదుడు, భవ భయ నాశకుడు నగు విష్ణుని ఆశ్రయించిన వారలు తిరిగి సంసార కూపంలో పడరు. ఎవరి చిత్తంలో సదా గోవిందుడు ఉంటాడో వారికి పరాభవమంటూ ఎన్నడూ ఉండదు, వారు చావుకు భయపడరు. భక్త పరాయణుడగు విష్ణు దేవుని శరణొందిన వారలకు యమ దర్మనం కాని, నరకవాసం గాని ఉండదు.

విష్ణు భక్తునకు కలిగే ఉత్తమ గతులు కేవల శ్రుతి శాస్త్ర పండితులైన విప్రులకు లభించవు. యుద్దంలో శత్రువు నెదిరించి మరణించినవారలకు లభించు పదవి కన్న అధికమైన పదవిని విష్ణు భక్తులగు నర శ్రేష్ఠులు పొందుదురు. ధర్మశీలురు సత్వ గుణ సంపన్నులు నగు మహాత్ములకు లభించు నట్టి ఉత్తమ గతులు భగవత్సేవకులు అనుభవిస్తారు.

ఓ దైత్య శార్దూలా! అనన్య చిత్తంతో వాసుదేవుని భజించు వారు సర్వ భూత నివాసి, సూక్ష్ముడు, అవ్యక్తుడు నగు నా ప్రభువు శ్రీ విగ్రహంలో లీన మౌతారు. అనన్య మనస్కులై భక్తి పూర్వకంగా కేశవున కు నమస్కరించువారు పవిత్ర తీర్థాల వలె. శుచి మంతులౌతారు. నడుస్తూ, లేస్తూ, నిద్రిస్తూ, మేలుకుంటూ, తింటూ, త్రాగుతూ, సర్వకాల సర్వావస్థలలోను నారాయణ ధ్యానమగ్నులగు వారలను మించిన పుణ్య భాజన లుండబోరు. భవ బంధచ్ఛేది, ఖడ్గ పరిశుధారియగు వైకుంఠునకు విధి విధానంగా ప్రణామాలు చేసినచో పునర్భవం ఉండదు.

ఆ ప్రభువు సర్వక్షేత్రాల్లో ఎల్లపుడు క్రీడిస్తూంటాడు, ఆ మహాతేజస్వి అందరి దేహాలలో ఆసీనుడై ఉంటాడు. అయితే ఆయన వారి కర్మలచే బంధించ బడడు. విష్ణువును ప్రేమించే వారలను ఆయన కూడ ప్రేమిస్తాడు.

ఓ బలీ ! భక్తితో సదా వినమితులై దామోదరుని ధ్యానార్చలు గావించు భగవత్పరాయణులకు పునర్జన్మ ఉండదు. ప్రాతః కాలాననే మేల్కొని మధుసూదనుని భక్తితో స్మరించు వారలు సంసార మనే రొంపిలో పడరు. ఉదయం లేచి విష్ణుని కళ్యాణ గాథలు వినువారలు, స్తుతించు వారలు, సమస్త ఆపదలను అధిగమించెదరు.

శ్రీహరి వాక్యామృతాన్ని తమ నిర్మలాలైన కర్ణ పాత్రల తో గ్రోలి తృప్తి చెందు వారు అన్ని కష్టాలనూ అధిగమించెదరు. చక్ర గదాధరునిపై అవ్యభిచారిణి యగు భక్తి నెరపు వారలు యోగేశ్వరు డగు శ్రీహరి శాశ్వత పదాన్ని పొందుతారు.

శ్రీ విష్ణుని అద్భుత కార్యాలను సదా మానసించు భక్తులు పొందే పరమ పదాన్ని వేయి జన్మల కాలం తపస్సు చేసినా పొంద లేరు. నిరంతరం పరా భక్తి తో విష్ణుని మానసించని వాడు ఎంత జపం చేసినా, ఎన్ని మంత్రాలను ష్ఠించినా, ఎన్నాళ్ళు తపస్సు చేసినా, ఎన్ని ఆశ్రమాలు సేవించినా, ఏమి ప్రయోజనం?

మధుసూదనుని ద్వేషించువారలు చేసే యజ్ఞాలు వృథా. వేదాధ్యయనం వృధా. దాన వ్రతాలు వృధా. తపస్సు వృధా. కీర్తి ప్రతిష్ఠలు వృధా. జనార్దనుని భక్తునకు బహు మంత్రాల వల్ల లాభమేమి?

ఓం నమోనారాయణాయ అనే ఒక్క మంత్రమే సర్వార్థాలను సిద్దింప జేస్తుంది. విష్ణువునే దిక్కని నమ్మువారలకు పరాజయ మెక్కడిది?

ఇందీవర శ్యాముడగు జనార్దనుని హృదయంలో ప్రతిష్ఠించు కొనువారలకు పరాభవమెక్కడ?

కనుక సర్వ మంగళకరుడు, వరదాయకుడు, వరేణ్యుడు, సర్వలోక, ప్రభువు నగు నారాయణునకు నమస్కరించి సర్వ కార్యాలు చేసు కోవాలి. దురాచారం వల్ల సంభవించే విష్టి వ్యతి పాతం మొదలయిన ఘోర విపత్తులు ఓ మహా దైత్యా ! విష్ణు నామ స్మరణ మాత్రాన నశించి పోతాయి. వేయి కోట్ల తీర్దాల సేవనం, నూరు కోట్ల తీర్ద స్నానం శ్రీ మన్నారాయణనకు చేసే ఒక్క నమస్కారంలో పదహారవ భాగానికి గూడ సమానం కాజాలవు! విష్ణు నామ సంకీర్తనం వల్ల పృథివిలో గల సర్వ తీర్థాల ఫలం సర్వ దేవాలయాలను చూచిన పుణ్యం లభిస్తుంది శ్రీ కృష్ణ నమస్కార పరాయణులగు వారలకు లభించే ఉత్తమ లోకాలు ఎన్నెన్నో వ్రతాలు చేసిన వారికీ ఎంతో కఠోర తపస్సులో మ్రగ్గిన వారలకూ లభించవు.

ఇతర దేవతలను ఆర్చిస్తూ కృష్ణుని మీద కపట భక్తి నటించే నరుడు కూడా సాధు మహాత్ములు పొందే ఉత్తమ గతిని పొందుతాడు.

నిరంతరాయంగా హృషీకేశుని పూజించు వారలకు గలిగే ఫలం శాస్త్రోక్త విధిగా తపస్సు చేసిన వారలకు గూడ దొరకదు. త్రి సంధ్యల యందు పద్మ నాభుని స్మరించే మేధావులు ఉపవాస ఫలాన్ని పొందుతారు. సందేహం లేదు. కనుక నో బలీ! శాస్త్రోక్త విధి గా కర్మాచరణం చేస్తూ శ్రీవారిని ఆదాధించుము, ఆ ప్రభువు అనుగ్రహం వల్ల శాశ్వతమైన పరమ సిద్ది పొందుతావు. మనసాప్రభువు మీదనే ఉంచుము. ఆయనకు భక్తుడవు కమ్ము. ఆయనకు ప్రీతిగా యజ్ఞాదులు (కర్మలు) గావింపుము. ఆయనకే నమస్కరించు చుండుము. ఆ దేవుని ఆశ్రయించినచో పుత్రా ! సకల సుఖాలు పొందుతావు. ఆది పురుషుడు, అనంతుడు, అజరుడు, అవ్యయుడు నగు హరిని ఎవరు రాత్రిం బవళ్లు ప్రతి దినం స్మరిస్తారో, ఆ మానవులు మంగళ మయము, సర్వత్రా వ్యాపించినదీ, బ్రహ్మమయము, ప్రాచీన తమము, తరుగనిదీ స్థిరమైనదీ నగు విష్ణు పదాన్ని పొందుతారు.

రాగ ద్వేషాలు లేక పర అపర జ్ఞానం కలిగి ఏ మానవులు సుర గురుడగు నారాయణుని నిరంతరం స్మరిస్తారో, వారలు చక్కగా కడుగబడి తెల్లని మబ్బు పొర తొలగి రాజహంసల వలె సంసార ముద్ర జలాన్ని తరించి తీరానికి చేరుకుంటారు.

అచ్యుతుడు, ఈశ్వరుడు, కల్మష దూరుడు, పద్మనేత్రుడు, శ్రేష్ఠుడునగు ప్రభువును నిరంతరం ధ్యానించే వార లా ధ్యాన ప్రభావం వల్ల తమ కిల్బీషాలు బాధలు తొలగి పోగా తిరిగి మాతృస్తన్య పానం అంటూ చేయరు (వారలకు మళ్లీ జన్మ ఉండదు). పద్మనాభుడు, పరుడు, వరదుడు, శంఖ చక్ర గదా పద్మ ఖడ్గ ధరుడు, పద్మాలయ (లక్ష్మి)ము, పద్మ, భ్రమరము నగు దేవుని స్మరించి వారలామధుసూదనుని స్థానానికి చేరుకుంటారు.

ఏ నరులు భక్తి పరులై సంకీర్తనీయుడగు భగవల్లీలలు వింటారో, వారల సకల పాపాల నుండి ముక్తులై అమృతం త్రాగిన వారి వలె సుఖంగా తృప్తితో జీవిస్తారు. కాబట్టి వత్సా! సజ్జనులగు వారలు శ్రద్దతో భగవన్నామ ధ్యానము, స్మరణం, కీర్తనము, శ్రవణం, పఠనం చేస్తూ ఉండాలి.

దానినే దేవతలు పూజతో సమానంగా పరిగణించి ప్రశంసిస్తారు. బాహ్యభ్యంతరాలైన భయాలు విడిచి ఈశ్వరు డగు నా కేశవుని పుష్ప పత్ర జల పల్ల వాదుల తో పూజించని వాడు విధి (బ్రహ్మ) అనే తస్కరుని చేత సర్వం దొంగిలించ బడినవాడు అవుతాడు ఇది తథ్యం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment