Skip to content Skip to footer

శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ఎనభై ఎనిమిదవ అధ్యాయం

పాప శమన స్తోత్రము

పులస్త్యుడు రెండవ పాప శమన స్తోత్రం నారదున కిలా వివరించాడు నారదా రెండవ పాపశమన స్తోత్రం వినుము దీనిని చక్కగా అధ్యయనం చేసినచో సర్వ పాపాలు నశించి పోతాయి.

ఓం! మత్స్య మూర్తికి నమస్కారము. దేవేశ్వరుడగు కూర్మదేవునకు, గోవిందునకు, హయగ్రీవునకు, నమస్కరిస్తున్నాను. త్రివిక్రముడు భవుడు నగు విష్ణునకు ప్రణామాలు. శివ కేశవులకు, హృషీ కేశ కార్తి కేయులకు, ప్రణామాలు. నారాయణునకు గరుడాసనునకు కైమోడ్పులు. ఊర్ద్వకేశి, నృసింహుడు, రూపధారి కురుధ్వజుడు, కామపాలుడు, అఖండుడు నగు బ్రాహ్మణ ప్రియునకు నమస్కరిస్తున్నాను. అజితునకు, విశ్వకర్మకు, పుండరీకునకు, ద్విజప్రియునకు, హంసునకు, శంభునకు, ప్రజాపతి సహేతు డగు విరించికి నమస్సులు. శూలపాణి చక్రధరులకు, జోహారులు. శివ విష్ణు హిరణ్య నేత్ర గోపతులకు, పీతాంబరునకు ప్రణామములు. గదాధరునకు, కుశేశయునకు, పాపనాశకునకు, ఆర్దనారీశ్వరునకు నమోవచనములు. గోపాలునకు, వైకుఠునకు, అపరాజితునకు, విశ్వరూపునకు, సౌగంధికి, సదాశివునకు ప్రణామాలు చేయుచున్నాను. పాంచాలికునకు, హయగ్రీవునకు, స్వయంభువునకు, అమరేశునకు, పుష్కరాక్షునకు, పయోగంధికి కేశవునకు నమస్కారములు. అవిముక్త ప్రభువునకు, లోలునకు, జ్యేష్ఠేశ్వరునకు, మధ్యమునకు, ఉపశాంతునకు, మార్కండేయ జంబుకులకు, ప్రణామములు. పద్మ కిరణునకు నమస్సులు. బడవా ముఖునకు జోతలు. కార్తికేయ బాహ్లీక శఖి రూపు డగు ప్రభువుకు ప్రణామాలు. స్థాణువునకు, అనఘనకు, వనమాలాధరునకు, లాంగవీశునకు, శ్రియః పతికి, నమస్కరించెదను. త్రినేత్రునకు, హవ్యవాహనునకు, త్రిసౌవర్లునకు, ధరణీ ధరునకు ప్రణామములు. త్రిణాచికేతునకు, బ్రహ్మేశునకు, శశి భూషణునకు, కపర్దీశునకు, సర్వామయ వినాశునకు ప్రణమిల్లుతున్నాను.

చంద్రసూర్యులకు, ధ్రువునకు, మహాఓజస్వియగు రుద్రునకు, పద్మనాభునకు, హిరణ్య, నేత్రునకు, అవ్యయుడగు స్కందునకు, నమస్కరించెదను. భీమ హంస దేవులకు, హాటకేశ్వరునకు, ప్రాణ తర్పణునకు, సదా నమస్కార మొనరింతును. బంగారు కవచంతో వెలిగే మహా యోగీశ్వరునకు, శ్రీనివాసునకు, పురుషోత్తమునకు, ప్రణామములు. చతుర్భుజునకు, వసుధావల్లభునకు, వనస్పతికి, పశుపతికి, అవ్యయడగు ప్రభువుకు జోతలు. శ్రీకంఠునకు, వాసుదేవునకు, నీలకంఠ సదండినులకు నమస్కారములు. శర్వునకు, అనఘనకు, గౌరీశునకు, వీశునకు, ప్రణమిల్లెదను. మనోహరుడగు కృష్ణ కేశునకు, చక్ర పాణి, యశోధరునకు, మహాభుజుడగు కుశప్రియునకు, ప్రణామములు. భూధరునకు, ఛాదిత గదునకు, సునేత్రునకు, శూల శంఖునకు, భద్రాక్షునకు, వీరభద్రునకు, శంకుకర్ణునకు నమస్కారములు. వృషధ్వజ, మహేశ్వర, విశ్వామిత్ర, శశిప్రభులకు, ఉపేంద్ర, గోవింద, పంకజ ప్రియులకు నమస్సులు. సహస్ర శిరసు డగు స్వామికి, కుంద మాలా ధరునకు, రుద్ర దేవాధిపతికి, కాలాగ్నికి, కృత్తివాసునకు నమస్కృతులు. ఛాగలేశునకు, పంకజాసనునకు, సహస్రాక్షునకు, కోకనదునకు, హరి శంకరునకు, ప్రణామములు. అగస్త్యునకు, గరుడునకు, విష్ణునికి, కపటునకు, వాగ్రూపియగు బ్రహ్మకు, సనాతనునకు, బ్రహ్మకు, బ్రహ్మతత్పపరునకు, నమోవాకములు. అప్రతర్క్యునకు, చతుర్భాహునకు, సహస్రాంశునకు, తపోమయునకు, ధర్మరాజుకు, గరుడవాహనునకు నతులొనర్తును. సర్వభూతాంతర్గతుడు, శాంతుడు, నిర్మలుడు, సర్వలక్షణుడు, మహాయోగికి, అవ్యక్తునకు, పాప నాశనునకు వందనము లొనర్తును. నిరంజనుడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిర్మల పద వాచ్యునకు, పాప హంతకు, శరణ్యుడగు సర్వేశ్వరునకు శరణాగతుడ నగుచున్నాను!

ఓ నారదా ! ఈ స్తోత్రం పవిత్రమైనది బహు పురాతనమైనది. అగస్త్య మహర్షి చెప్పినది. దీనిని కీర్తించినా స్మరించినా శ్రవణం గావించినా అనేక పాపాలు నశించియశస్సు ధన్యత లభించును.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment