Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ఎనభై ఆరవ అధ్యాయం

పులస్త్యుడిలా అన్నాడు : –

ఒకప్పుడు బ్రాహ్మణ హింసకుడు, దగా కోరు, పరులను పీడించువాడు, నీచుడు, క్రూర స్వభావుడు నైన క్షత్రియాధముడుండెడి వాడు. పితృ దేవతలను, ద్విజులను, వాడెల్లప్పుడు ద్వేషించి హింసించేవాడు. కొంతకాలమునకు ఆయువు తీరి వాడు మరణించి భయంకర రాక్షసుడైనాడు. ఈ కర్మదోషం వల్ల రాక్షస యోనిలో కూడ వాడు మరింత జన పీడకుడుగా నరభక్షకుడుగా రూపొందాడు. అదే రాక్షస వృత్తిలో వాడు నూరేండ్లు గడిపాడు. కంటికి కన పడిన జీవిని, చేతికి అందిన ప్రాణినీ ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా భక్షించేవాడు. అలా చాలా కాలం పాపాచారుడుగా జీవించాడు. వయస్సు బాగా ముదిరిపోయింది. ఒక పర్యాయం వాడోక నదీ తీరాన ఊర్ధ్వ బాహువై జితేంద్రియుడై తపో దీక్షలో మునిగిన ఒక మహా సాధువును చూచాడు. ఆ యోగి దక్షుడు, వాసుదేవ పరాయణుడు. ఈ రక్షాస్తోత్రంతో ఆత్మరక్షణ చేసుకుంటూ తపస్సులో నిమగ్నుడైనాడు. చక్ర ధారియై విష్ణువు నాకు తూర్పున ఉండుగాక, గదాధరుడై ఆ విష్ణువు ఉత్తర దిశన నిలచుగాక. శార్‌ఙ్గ పాణియైన విష్ణువు నాకు పడమరగాను, ఖడ్గ ధరుడై ఆ విష్ణువు ఉత్తర దిశన ఉండుగాక హృషీకేషుడు దిక్కుల మూలలందునూ తక్కిన సందులలో జనార్దనుడూ నిలబడి నన్ను కాపాడుదురు. గాక వరాహ విష్ణువు భూతలాన, నృసింహుడు ఆకాశాన ఉందురు గాక, పదునైన అంచులతో, కన్నులు చెదరి పోయే సూర్యమండల దీప్తితో వెలిగే సుదర్శన చక్ర ప్రేతరాక్షసాదులను సంహరించుటకు సర్వత్రా తిరుగుచున్నది. వేయి కిరణాల వెలుగును గ్రుమ్మరిస్తూ అగ్నిలాగా గద రక్షో భూత పిశాచ డాకినీ శక్తులను సంహరిస్తున్నది. వాసుదేవుని ధనుస్సు విజృంభించి నాశత్రువులను, పశు పక్షి మనుష్య కూష్మాండదులను హత మార్చుగాక. గరుడుని చూచి విషసర్పాలు లొంగిపోయినట్లు ప్రభువు నందక ఖడ్గ ధారజ్వాలలోల మాడిపోయి నా శతృవులు శాంతులౌదురు గాక. విష్ణు చక్ర ధ్వని తరంగాల తాకిడికి యక్షులు, దైత్యులు, కూశ్మాంగనిశాచరులు ప్రేత వినాయకాదులు, క్రూరులైన మనుష్య జృంభక (రాక్షసులు) ఖగసింహాది మృగాలు విషసర్పాలు, సర్వులూ శక్తి కోల్పోయి శాంతులౌదురు గాక. స్మరణ శక్తినీ ఆలోచనా శక్తినీ బల పౌరుషాలను, నీడలను, సుఖ భోగాలను, శుభలక్షణాలను. హరించే కూష్మాండాది దుష్ట శక్తులు విష్ణు చక్ర ధ్వనులచే నశింతురుగాక. దేవ దేవుడగు శ్రీ హరి భజన వల్ల నా బుద్ధీ, మనస్సు, యింద్రియాలు సంపూర్ణ స్వస్థతను భజించు గాక.

పృష్ఠే పురస్తా దధ దక్షిణోత్తరే|
వికోణత శ్చాస్తు జనార్దనో హరిః |
తమీడ్యమీశాన మనంత మచ్యుతం |

నాకు ముందు వెనుక కుడి ఎడమన మూల మూల యందు జనార్దను డుండు గాక. అనంతుడు, నచ్యుతుడు నగు విష్ణునకు ప్రణతుడైన వాని కెట్టి కష్టాలూ కలుగవు. శ్రీ విష్ణుడు, పరబ్రహ్మ పరావధికుడు. అతడే జగత్స్వరూపి. విశ్వాసం తో అచ్యుత నామ స్మరణం చేసి నందున నా త్రివిధాలయిన పాపాలు నశించు గాత. ఈ విధంగా విష్ణు పంజర స్తోత్రం ద్వారా ఆత్మరక్షగావించుకొని ఆపీనుడైన ఆ తపస్వి మీదికారాక్షసుడు లంఘించాడు. అయితే ఆ ద్విజుడు గావించు కున్న రక్షల ప్రభావం వల్ల ఆ రాక్షసుని శక్తి వేగాలన్నీ ఉడిగిపోయి అతడట్లే నాలుగు నెలల కాలం అక్కడ నిలబడి పోయాడు. జపానంతరం సమాధి ముగిసిన తర్వాత నా ద్విజోత్తముడు లేచి ఎదురుగా తేజస్సు గోల్పోయి దీనుడుగా కాందిశీకుడుగా అసహాయ స్థితిలో నిలబడిని రాక్షసుని చూచి వాడి మీద జాలి గొని ఓదార్పు మాటలతో వాడి వృత్తాంతం అడిగాడు అందుకా నిశాచరుడు తన ఉదంతం దాచకుండా చెప్పి ఆయనను చూచి నంతనే తన శక్తులన్నీ ఎలా నశించినదీ చెప్పి, నికృష్టమైన తన స్వభావం మీద విరక్తితో ఆయనను కరుణించమని అర్ధించాడు. మహాత్మా! నేను చాలా క్రూర కర్ముడను. ఎన్నో పాపాలు చేశాను. ఎందరనో చంపి వేశాను. ఎందరు స్త్రీలనో విధవలుగా పుత్రహీనలుగా చేశాను. ఏ పాప మెరుగని అల్ప ప్రాణుల నెన్నింటినో వధించాను. అలాంటి నాకు పాపాల నుంచి విముక్తి ప్రసాదించండి. నాకీ జీవితం మీద రోత పుట్టింది. నాకు తరణోపాయంగా ఏదైనా ఉపదేశం చేయండి. ఆ రక్కసుని వచనాలకు అబ్బురపడి ఆయన సహేతుకమైన ప్రశ్న అడిగాడు. ఇంతటి ఘోర కర్ముడవైన నీకు అకస్మాత్తుగా ఈ మంచి బుద్ది ఎలా కలిగిందయ్యా? ఇదెలా సంభవం? అందుల కానిశాచరుడు–మిమ్ములను సమీపించగానే మీరు గావించిన రక్షా స్తోత్రాలు నన్ను నిర్వీర్యుణ్ణి చేశాయి. నా జవ సత్యాలనీ హరించేశాయి. మీ సాంగత్యం నాలో నిజమైన నిర్వేదాన్ని విరక్తిని కలిగించింది. ఆ రక్షా జపా లేవో అవి ఎలా ఉచ్చరించాలో నేనెరుగను. కాని వాని సంసర్గ మాత్రాన్నే నాలో నిర్వేదం కలిగింది. మీరు ధర్మం తెలిసినవారు. నా మీద దయ దలచి నా పాపాలు ఎలా పోతాయో ఆ విధంగా చేసి నన్ను కాపాడండి. అని దీనంగా ప్రార్థించాడు. అలా రాక్షసుడు చేసిన దీనాలాపాలు విన ఆ మహనీయుడు చాలా సేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఓయీ నీ నికృష్ట జీవితం మీద రోత కలిగి నన్ను ఉపదేశించ మని కోరడం బాగానే వుంది. పాప క్షయం జీవికి ఉపకారకమే కదా! కాని నేను నర భక్షకులగు రాక్షసులకు ఉపదేశం చేయజాలను. అందులకై నీవు ప్రవచన పరులైనవిప్రులను వెళ్లి ఆర్దించుము. అలా సలహా యిచ్చి ఆ ఋషి సత్తముడు వెళ్లి పోగా నా రాక్షసుడు, ఈ పాప మెట్లు పోగొట్టుకో నగునా యని చింత తో క్రుంగి పోయి నాటి నుండి భయంకరమైన ఆకలికి గూడ ఓర్చుకుని ప్రాణులను తినడం మానుకున్నాడు.

ఆరు పూటల కోక పర్యాయం మాత్రమే ఏదో ఒక జంతువును చంపి తినసాగాడు. ఒక పరి ఆకలితో నక నక లాడుతూ తిరుగుతూన్న ఆ రాక్షసుడికి అరణ్యంలో పండ్ల కోసం వచ్చిన ఒక బ్రహ్మాచారి కంట బడ్డాడు. వెంటనే అతనిని గట్టిగా పట్టు కోగా ఆ బ్రాహ్మణ బాలుడు చావు నిశ్చయమని తలచి మృదువుగా సామ వచనాలతో వాని కిట్లా చెప్పాడు. సౌమ్యుడా! నీకు మేలగు గాక. నీవు నన్నేల పట్టు కొంటివో చెప్పుము. నేనేమి చేయ వలయునో ఆదేశించుము. అందులకు ఆ రక్కసుడు ఆరు పూటలు ఆహారం లేకుండా ఉన్న నాకు నీవు దొరికావు. నేనునికృష్టుడను. క్రూరుణ్ణి. బ్రాహ్మణ ద్రోహిని మహాపాపిని. ఆకలి నన్నే దహిస్తున్న దన్నాడు. అందు కాముని కుమారుడిలా అన్నాడు. నీవు తప్పని సరిగా నన్ను తిననెంచినచో నేనిప్పుడే ఈ ఫలాలు మా గురు దేవునకు ఆర్పించి వస్తాను. గురువు గారి కోసమే నేను అడవికి వచ్చాను. ఆయన కొరకై ఏరిన ఫలాలు ఆయన కర్పించుట నా ధర్మము. వ్రతము. అది నెరవేర్చి క్షణంలో తిరిగి వస్తాను. కొంచె మాగుము. ద్విజపుత్రుని మాటల కా నిశాచరుడు, ఆరు పూటల తర్వాత లభించిన జంతువు ఏదైనా సరే దేవుడైనా సరే నేను తిన కుండా వదలను. ఇది నా పాపిష్టి జీవిత చర్య. ఒకవేళ నీవు అంతగా తప్పించు కో దలచితే ఒకే మార్గం ఉంది అది నీవు చేస్తే తప్పకుండా నిన్ను వదిలేస్తాను. అన్నాడు దానికి బ్రాహ్మణ బాలుడు గురువుకు ధర్మానికి నా వ్రతానికి భంగం కలుగని పని ఏదైనా సరే చేస్తాననగా నా దుష్టుడిలా అన్నాడు ఓ విప్రకుమారా! రాక్షసజాతిలో పుట్టిన నేను ప్రకృతి సిద్దంగానే క్రూరుడను, వివేక హీనుడిని పాపకర్ముడను. బాల్యం నుండీ పాపాలంటేనే మక్కువ. ధర్మం మీదికి నా బుద్ది వెళ్లేది కాదు. అలానే నేను మూట కట్టుకున్న పాపాల నుంచి నాకు విముక్తి కలిగే విధానం చెప్పుము. నాపాపాలు నిశ్శేషంగా నశించే ఉపాయం చెప్పావంటే ఎంతటి ఆకలికైనా ఓర్చుకుని నిన్ను వదలు తానులేదో ఈ ఆరవ పూట పాపాచారుడనైన నేను విధిగా నిన్ను భక్షించి ఈ ఆకలి బాధ తీర్చుకుంటాను. నరభక్షకుడనైన నాకు దయ అంటూ లేదు.

ఆ క్రూర రాక్షసునకు కావలసిన తరణోపాయం చెప్పుటకు ఏమీ తోచక ఆ బ్రహ్మచారి గొప్ప విషాదానికి లోనై నాడు చాలా సేపు విచారించి చేయునది లేక జాతవేదుని (అగ్ని దేవుని) కి శరణాగతుడై తగిన జ్ఞానమొసగుమని ఆర్ధించాడు గురు శుశ్రూష తర్వాత శ్రద్దతో అగ్నిని సేవించిన వాడనగుచో ఆ పావకుడు నన్ను రక్షించును గాక! బ్రహ్మచర్యవ్రతం చక్కగా నిర్వర్తించిన వాడనైతే తల్లి దండ్రులను గురువును గౌరవించువాడను గనుక నన్ను అగ్ని రక్షించు గాక. మనో వాక్కాయ కర్మాలలో గురువుపట్ల అనాదరం లేనివాడనైతే నన్ను జాత వేదుడు కాపాడతాడు. నేను చెప్పిన వన్నీ నిజాలైతే ఆ సత్య బలం వల్ల పావకుడు నన్ను కాపాడు గాక ఇలా మనస్సులోనే శపధాలు గావించుకుని నంతనే అగ్ని దేవుని ఆదేశాన్ననుసరించి వెంటనే సరస్వతి అతని ఎదుట గోచరించి ఓ బ్రాహ్మణ బాలకా! భయపడకుము. నిన్నీ ఆపద నుంచి తప్పించుటకు వచ్చాను. ఈ రాక్షసునకు కావలసిన శ్రేయే పాయాన్ని నీ నాలుక మీద నిలచి నేను ఉపదేశించి నిన్ను విడిపించెదను. అలా చెప్పి ఆ లాగే ఆ రాక్షసునకు కనుపించ కుండా బాలకుని నాలుకపై నిలచి యిలా చెప్పసాగింది ఓ నిశాచరా నీకు నీలాంటి పాపులకు శ్రేయస్సు కలుగజేసే విధానము చెబుతున్నా వినుము. సమస్త పాపాలు పోగొట్టి పుణ్యం కలుగజేసే ఈ స్తవం ప్రతి దినమూ ప్రాతః కాలాన మధ్యాహ్న దినాంతములందు జపింప వలయును. ఎల్ల వేళ లందూ జపిస్తే శాంతిని పుష్టినీ కలిగిస్తుంది ఇందుకు సందేహంలేదు.

ప్రణవ (ఓంకార స్వరూపుడైన శ్రీహరి కి కృష్ణునకు హృషీకేశు నకు జగన్నాధు డగు వాసుదేవ జనార్దనునకు నమస్కరించుచున్నాను. ఆయన నా పాపాలు పోగొట్టు గాక! చరా చరా లకు గురువు, నాధుడు, గోవిందుడు నైన శేషశాయికి నమస్సులు. ఆయన నా పాపాలు నశింపజేయు గాక. శంఖ చక్ర శార్‌ ఙ్గ మాలా ధరుడగు శ్రియః పతికి నమస్సులు. నా పాపాలు పోనడచుగాక. విశాలనేత్రుడు, పుండరీకాక్షుడు, అచ్యుతుడు, ఆ రాధ్యులచేత నారాధింప బడే ప్రభువుకు ప్రణామము. నా పాపాలు ఆయన పోగొట్టు గాక. నారాయణునకు నరునకు శౌరికి మాధవునకు మధుసూదనునకు జగదాధారునకు నమస్సులు. నా పాపాలనతడు హరించుగాక. కేశవుడు చంద్ర సూర్య నయ నుడు కంస కేశి సంహారకుడు నగు మహా భుజునకు నమస్సులు. ఆయన నా పాపాలను పోకొట్టు గాక. శ్రీవత్సాంకునకు లక్ష్మీపతికి శ్రీదరునకు శ్రీనివాసునకు శ్రీవల్లభునకు నమస్సులు. ఆ స్వామి నా పాపాలను నశింప జేయు గాక. యోగీశ్వరులు ధ్యానించే సర్వ భూతేశ్వరునకు అక్షరునకు అనిర్దేశ్య స్వరూపి యగు వాసుదేవునకు నమస్సులు. ఆయనకు శరణాగతుడనగు చున్నాను. తమ మనస్సుల నితర విషయాల నుండి మళ్లించి యోగులై ప్రభువు పై నిలపి ధ్యానింతురో అట్టి వాసుదేవుని శరణు వేడుచున్నాను. సర్వ జీవులకు ఆధార భూతుడు సర్వ గమనుడు నగు వాసుదేవుడు పర బ్రహ్మకు శరణాగతుడను. విజ్ఞులు తమ కర్మ క్షయానంతరం ఏ అవ్యక్త అక్షయ తత్వాన్ని చేరుదురో అట్టి దేవునకు శరణాగతుడను. యోగులు పుణ్య పాపాల నుండి ముక్తులైన ఏ ప్రభువును చేరి పునర్జన్మ రహితులయ్యెదరో అట్టి ప్రభువుకు శరణాగతుడను. చతుర్ముఖబ్రహ్మ రూపాన దేవాసుర మానుషసహితమైన జగత్తు నంతా సృష్టించే అచ్యుతునకు శరణాగతుడను బ్రహ్మరూపాన ఎవని నోటి నుండి చతుర్వేదములు వెలువడినవో అట్టి వేద పురుషునకు శరణాగతుడను సృష్టి కార్యం నెరవేరుటకు బ్రహ్మ రూపాన్ని ధరించిన జగన్మాతునకు జనార్దనునకు సనాతనునకు ప్రణామములు. సృష్టి గావించిన తర్వాత యోగి యై నిలచిన రాక్షసాంతకుడగు ఆది పురుషునకు విష్ణువునకు ప్రణ్రామములు చేయుచున్నాను. భూమి నుద్దరించి దైత్యుల వధించి దేవతల రక్షించిన ఆది విష్ణువు జనార్దనునకు ప్రణతుడను. విప్రులు ఏ దేవుని యజ్ఞాల ద్వారా ఆరాధిస్తారో యజ్ఞేశ్వరుడు యజ్ఞ భావనుడు యజ్ఞ పురుషుడు నగు నా సనాతన విష్ణు దేవునకు ప్రణతుడ నగు చున్నాను.

పాతాళ వీధీ భూతాలను, లోకాలను లయింప జేయు అంతకు డగు రుద్రునకు సనాతనునకు నమస్కరించెదను. సృష్టింపబడిన ఈ జగత్తు నంతనూ భక్షించి రుద్ర రూపాన తాండవ నృత్యం చేయు నా సనా తను డగు హరికి నమస్సులు సురాసురులు పితృ గణాలు దేవ గంధర్వ యక్ష రాక్షసులు ఏ ప్రభువు నుండి సంభవించు చున్నవో, ఆ సర్వవ్యాపియగు సనాతనునకు నమస్సులు సమస్త దేవ జాతులు మనుష్య జాతులు ఎవని అంశాలో, ఆ సర్వ వ్యాపి యగు ప్రభువు కు నమస్కరింతును. చెట్టు చేమలు పొదలు పశు మృగాదులు ఏ దేవుని అంశాలో, ఆ విష్ణువునకు నమస్కరించెదను. ఎవని కన్న ఇతరమైనదిలేదో, ఏ మహాత్మునిలో అన్నీ యిమిడి యున్నవో, ఎవడు అన్నింటికి మధ్యన, చివరన నుండునో, అట్టి దేవునకు నమస్కరించు చున్నాను. కొయ్యలో నిప్పు వలె అన్నింటిలో విష్ణువు లీనుడై యున్నాడు. ఆ ప్రభువు నా పాపాలన్నీ మిగుల కుండ నశింప చేయు గాక. బ్రహ్మాది చరా చర జగత్తంతా విష్ణుమయం. బుద్ది గమ్యమైన దంతా ఆయన రూపం. ఆ మహనీయుడు నా పాపం నశింపచేయు గాక. రజస్సత్వ తమో గుణ మయమైన నా వలన జన్మల శుభాశుభ కర్మల వల్ల గలిగిన పాపాలన్నీ నశించు గాక నేను మనో వాక్కాయ కృతములైన కర్మల ద్వారా రాత్రులందు ప్రాతర్మధ్యాహ్న అపరాహ్ణ సమయాలలోను, సంధ్య వేళలలోను, మూట గట్టు కొనిన పాపములూ, లేస్తూ, నడుస్తూ, శయనిస్తూ, చేసిన అశుభ కర్మలు; తెలిసీ తెలియక మదాతిరేకంతో గావించిన సకల పాపాలూ వాసుదేవ నామస్మరణ మాత్రాన్నే నశించి పోవు గాక. పరస్త్రీ పర ధనముల కాశించి పరులకు ద్రోహం తల పెట్టి పర హింసా నిందలు గావించి మహాత్ముల నవమానించి ఆర్జించిన పాపాలు భక్ష్య పేయ (త్రాగుడు) చోష్య లేహ్యముల ద్వారా కూడ బెట్టి కొన్న పాపాలూ అన్నీ నీళ్లలో నుంచిన ఉప్పునకు వలె కరిగి పోవు గాక. బాల్య కౌమార ¸యవ్వన వార్థ క్యాలలో జన్మ జన్మాంతరాలలో నేను చేసిన పాప సమూహం నారాయణ గోవింద హరి కష్ణ ఈశ్వర సంకీర్తనం వల్ల నీళ్లలోని లవణ పాత్రలోని ఉప్పువలెకరగి పోవు గాక. వాసుదేవా! విష్ణూ! హరీ! కేశవా! జనార్దనా! కృష్ణా! భవిష్య నరకాంతకా! కంస నాశకా! అరిష్ట కేశి చాణూరిది దేవశతృ సూదనా నీకు నమస్సులు. మాటి మాటికీ ప్రణామములు. నీవు దక్క బలిని వంచింప గల వాడెవడు? నీవు దక్క హైహయ నరపతి (కార్తవీర్యుని) బాహుబల దర్పం అణచ గలిగిన ప్రభువెవడు?

మధునాశకా! మరొకరెవరు సాగరాన్ని బంధించి, మంత్రి పరివార సైన్య సమేతంగా దశకంఠుని వధించ గలరు? ప్రభూ! నీవు దక్క మరెవ్వరు నంద గోకులంలో విహరిస్తూ ప్రలంబాసుర పూత నాది రాక్షసులను వధించ గలరు? అదుపాజ్ఞలలో పెట్టగలరు? కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ఈ విధంగా పవిత్రాలైన పుణ్య ప్రదాలయిన విష్ణుని గుణగణాలు కీర్తిస్తే, మానవుడు ఏడు జన్మాల్లో, తెలిసి కాని తెలియక కానీ చేసిన మహా పాతక ఉపపాతకా లన్నీ నశించి పోతాయి: యజ్ఞాలు, వ్రతాలు, తపోనిష్ఠలలో మునిగి ఉండే యోగులు తమ పాప పుణ్య ఫలాల నన్నింటినీ, నీళ్లలో పడవేసిన పచ్చి కుండ వలె నశింప జేసుకుంటారు. ఈ స్తోత్రాన్ని ఒక పర్యాయం పఠిస్తే సంవత్సరం పాటు రోజూ పదహారు కుండలతో నువ్వులు దానం చేసింనంత ఫలం కలుగుతుంది. బ్రహ్మ చర్య దీక్ష చెడిపోకుండా మానవుడొక సంవత్సర కాలం ఈ స్తోత్రం జపిస్తే విష్ణు లోకం పొందుతాడు. ఇది నిజమునేనిదంతా సత్యము చెప్పాను ఇందులో లేశ మాత్రమైనా అబద్దం లేదు భయంతో వణికి పోతున్న నన్నీ రాక్షసుడు వదలి వేయు గాక. నారదా! ఆ బ్రాహ్మణుడలా అనగానే రాక్షసుని బంధం విడిపోయింది ముక్తుడైన అతడెలాంటి కోరిక లేకుండానే రాక్షసునితో యిలా అన్నాడు. ఓ సౌమ్యుడా నా ద్వారా నీకు చెప్పబడిన పాపనాశక మైన ఈ విష్ణు సారస్వత స్తోత్రాన్ని అగ్ని దేవుని పంపున వచ్చిన సరస్వతీ దేవి నా నాలుక మీద నిలచి వివరించినది. ఇది ఎల్ల వారలకు శాంతిని చేకూర్చుతుంది. ఈ స్తోత్రం జపిస్తూ ఆ జగన్నాధుని ఆరాధిచినచో నీ శాపం తొలగి పోతుంది. కనుక నో రాక్షసా! దీనిని రాత్రింబవళ్లు జపిస్తూ ఆ హృషీకేశుని దృఢమైన భక్తితో పూజించుము. నీ పాపాలన్నీ పటా పంచలౌతాయి. స్తోత్ర ప్రియుడైన శ్రీహరి ఈ స్తోత్రంతో కీర్తించిన నరుల పాపాలన్నీ నశింప జేస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నారదా! అంతట నా బ్రాహ్మణునకు మొక్కి ప్రసన్నుని గావించుకుని ఆ మహిమాన్వితుడైన నిశాచరుడు తక్షణమే శాల గ్రామ క్షేత్రంలో తపస్సు చేసేందుకు వెళ్లాడు. వాడు యింద్రియాల నదుపులో నుంచుకుని సర్వదా సారస్వత స్తోత్రాన్ని జపిస్తూ అత్యధిక మైన ప్రీతిలో దేవ కార్యాలు నెరవేర్చుకుంటూ జగన్నాధుని ఆరాధించాడు. చివరకాపురుషోత్తమని కృపతో సర్వ పాపాల నుండి విడివడి విష్ణు లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా బ్రాహ్మణుని నోట వాగ్దేవి సరస్వతి ప్రవచించిన పవిత్ర విష్ణు స్తోత్రాన్ని నీకు చెప్పాను. వాసుదేవుని ఈ ఉత్తమోత్తమ స్తవాన్ని చదివిన మానవుడు సర్వ పాపాలు పోగొట్టుకుని మోక్ష పదవిని పొందగలడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment