నారదుడు ప్రశ్న చేశాడు : –
బ్రహ్మర్షి ! పరమ భక్తుడైన ప్రహ్లాదులు శ్రద్దగా జపించిన గజేంద్ర మోక్షణం మొలయిన నాలుగు స్తోత్రాలేమో చెప్పండి అపుడు పులస్త్యుడిలా చెప్ప సాగాడు. ఓ తపోధనా! దేనిని జపిస్తే వింటే స్మరిస్తే దుఃస్వప్నాలు నశించునో ఆ గజేంద్ర మోక్షణ గాధను ముందుగా వినుము. తర్వాత సారసత్వ పాప ప్రశమన స్తోత్రాలు చెబుతాను. సర్వ రత్నాలతో నిండిన త్రికూట మనే భవ్య పర్వతం ఉంది. సూర్య కాంతితో వెలిగే మేరు పర్వతానికి ఆ త్రికూట పర్వతం పుత్రడు. దేవర్షి గణాలు సేవించే ఆ పర్వతం క్షీర సాగరంలో నుంచి ఉద్భవించింది. దాని నునుపైన శిలలను ఆ సాగర తరంగాలు కడుగుతూంటాయి. అనేక సెలయేళ్లతో కల కల లాడే ఆ పర్వతాన్ని గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, సిద్ద, చారణ, పన్నగ, విద్యాధరులు తమ భార్యలతో కలిసి సేవిస్తుంటారు. జితేంద్రియులగు తపస్వులకు ఆట పట్టు ఆ గిరి. తోడేళ్ళు, గజేంద్రాలు దాని మీద సంచరిస్తుంటాయి. ఆ పర్వతం నిండా పున్నాగ, కర్ణికార (గన్నేరు), బిల్వ, ఉసిరిక, పాటల, మామిడి, కడిమి, కదంబ, చందన, అగరు, సంపెంగ శాల, తాళ, తమాల, సరళ, అర్జున, పర్పటమొదలయిన ఎన్నో రకాలవృక్షాలు ఏపుగా పెరిగి నేత్ర పర్వం గావిస్తాయి. అనేక ధాతుమయాలైన దాని శిఖరాల నుంచి జాలువారే జల పాతాలతో అందాలు చిందించే మూడు సానువులతో అది అలరారుతూంటుంది. లేళ్లు, వానరాలు, సింహాలు, మదపుటేనుగులు జీవాలను చంపి తినే యితర జంతువులతో చకోర మయూరాల నాదాలతో ఆ ప్రదేశం కోలాహలంగా ఉంటుంది. ఆ మూడు శిఖరాలలో ఒకటి బంగారుమయమై దివాకరున కావాసంగా చక్కని పరిమళాలు వెదజల్లే నానా పుష్పాలతో నిండి ఉంటుంది. చంద్రున కావసమైన రెండవ శిఖరం రజత నిర్మితం. అది శ్వేతమేఘ సమూహం లాగ తుషారపటలాల్లా గా మనోహరంగా ఉంటుంది. ఇంద్రనీల, వజ్ర, వైడూర్యకాంతులతో దిశలను వెలిగిస్తూ ఉండే మూడవ శిఖరం బ్రహ్మకు నెలవు. సర్వోత్తమమైనది. అది కృతఘ్నులకూ, కౄరులకూ, నాస్తికులకూ, తపస్సుచేయని పాపులకూ గోచరం కాదు.
ఆ పర్వతాగ్రాన బంగారు కమలాలతో నిండిన చక్కని సరోవరం నీటి బెగ్గురులు రాజహంసలు జల కుక్కుటాల కల ధ్వనులతో నయన శ్రవణాభిరామంగా శోభిస్తుంది. అందులో కలువలు, నల్ల కమలాలు, కల్హారాలు, తెల్ల కమలాలు, శతపత్రాలూ, కాంచన శోభతో నిండి ఉన్నాయి. మరకత మణుల్లాగ కమల పత్రాలు నలువైపులా పరచుకుని ఉన్నాయి. సరోవరం చుట్టూ వెదురు పొదలు దట్టంగా వ్యాపించాయి. అలాంటి అందమైన సరోవరంలో ఏనుగుల పాలిట మృత్యువులాగ అరమోడ్పు కనులలో నీళ్లలో కన పడకుండా దాడి కొని ఒక భయంకరమైన మొసలి మాటు వేసికొని ఉండేది. అలా ఉండగా నొక పర్యాయం తెల్లని దంతకాంతులతో ముఖం వెలిగి పోతున్న ఒక గజ సమూహ నాయకుడు మద జలధారలు చెంపల నుండి స్రవిస్తూ ఉండగా దాహార్తుడై మద వాసనలతో ఆపర్వతాన్ని ముంచేస్తూ ఐరావతాన్ని బురుడిస్తూ నడుస్తున్న కాటుక కొండ లాగ బయలుదేరి అచటకు వచ్చాడు. మద మూర్ణితనేత్రాలలో నీరు త్రాగుటకై ఆ సరోవరంలోకి ఆతురతతో దిగాడు. నీరు త్రాగి తామర కొలనులో విహరిస్తూన్ని ఆ గజాధిపతిని కనపడకుండా నీళ్లలో పొంచి ఉన్న ఆ క్రూర గ్రాహం గట్టిగా తన కోరలతో పట్టుకున్నది. ప్రక్కనే నిలబడి ఆడ ఏనుడుల గుంపు ఏమీ చేయలేక చూస్తూ ఆక్రోశిస్తూ ఉండిపోయింది. ఆ మొసలి మద గజం కాలు పట్టుకొని సరస్సులోనికి లాగుతూంటే ఆ బలమైన వరుణ పాశానికి లోనై విడిపించుకొనే ప్రయత్నం కూడా చేయలేని అసహాయ స్థితిలో చలనం మాని నిలబడిపోయింది. ఆ ఏనుగు . అలా ఘోరమైన పాశాలతో బంధిపబడి గజేంద్రుడు శక్తి కొలది ఘీంకరిస్తూ పెడ బొబ్బలు పెట్టసాగాడు. క్రమంగా శక్తీ ఉత్సాహం కోల్పోయి ఘోర విపత్తుకూ బాధకూ తట్టుకొన లేక మనసారా హరిని స్మరించాడు. పూర్వజన్మలలో నారాయణుని చరణకమల భక్తిని అభ్యసించిన వాడై ఉన్నందున, ఆ గజశ్రేష్ఠుదు పూర్వసంస్కార పుణ్య పరిపాకం వల్ల పదిశుద్దమైన అంతఃకరణంతో సర్వేంద్రియాలను ఆ గదుడధ్వజునిపై లగ్నం చేసి నిశ్చలమైన విశ్వాసంతో నా ప్రభువుకు శరణాగతుడై నాడు. అలా అనన్యమైన చిత్తంతో మధించిన అమృతం నుంచి వెలువడే నురుగునకు వలె తెల్లనైన శంఖం, చక్రం, గద ధరించిన ఆ కేశవుని, మంగళ ప్రదాలయినవేయి నామాలతో వెలుగొందే అభవుని, సర్వలోక నాయకుని, కరా(తొండము) గ్రాన బంగారు కమలం పట్టుకొని తన బంధ విముక్తికై దీన హీన స్వరంతో యిలా స్తోత్రం చేశాడు.
గజేంద్రస్తవము
ఓం ప్రణవ రూపుడవు మూల ప్రకృతివీ, అజేయుడ వగు నో మహాత్మా నీకు నమస్కారము. ఆశ్రయ రహితుడవు. స్వతంత్రుడవు. నిష్కాముడవు నగు నీకు నమస్సులు. సృష్టికంతకూ ఆది బీజానివీ, సర్వ ప్రథమ ప్రవర్తకుడవు, అనంతుడవు, ఒక్కడవు అవ్యక్తుడవు నగు నీకు మాటి మాటికీ నమస్సులు. రహస్య మయుడవు, గుప్తుడవు, గుణరూపివి, గుణాలలో విహరించువాడవు, తర్కానికి, ప్రమా(కొలత)కూ అతీతుడవు, సాటి లేని వాడవు నగు నీకు నమస్కారము. శివా! శాంతా! చింతారహితా! యశస్వీ! సనాతనా! వెనుకటివాడా! పురాతనుడా! నీకు నమస్సులు. దేవాధిదేవా! స్వభావరూపా! జగత్ప్రతిష్ఠాపకా! గోవిందా! నీకు నమస్సులు. పద్మనాభా! యోగోధ్భవా విశ్వేశ్వరా మంగళరూపా హరా నీకు ప్రణామాలు నిర్గుణుడూ గుణాత్మకుడునగు దేవునకు నారాయణునకు విశ్వునకు దేవతల పరమ ఆత్మ అయిన ప్రభువునకు ప్రణామములు ఒకనిమిత్తంగా వామనరూపం ధరించిన నారాయణునకు సాటిలేని పరాక్రమం కలవానికి లక్ష్మిని ధనమును చక్రగదా ఖడ్గాలుగను ధరించిన పురుషోత్తమునకు నమోహకములు గుహ్యునకు వేదనిలయునకు, మహోదరునకు (నృ) సింహునకు దైత్యహారుడగు తచుర్భుజునకు బ్రహ్మఇంద్ర, రుద్ర, ముని, చారణులచేతస్తుతింప బడువానికి, దేవోత్తమునకు, చ్యుతి లేని వరదాయకునకు ప్రణామాలు. సర్పశయ్య మీద ప్రీతితో నెల కొని యుండు దేవునకు ఆవు పాలు, బంగారం, శుకం, నీల మేఘం, వీని బోలిన వానికి, పీతాంబర ధారికి, మధుకైటభుల వధించిన వానికి, విశ్వరూపికి, అందమైన కిరీటం గల అజరునకు నమస్సులు. బొడ్డులో నుండి పుట్టిన కమలం మీద బ్రహ్మను కవిగ యుండు వానికి, పాల సముద్రలో నుండు యశోధనునకు, చిత్ర చిత్రాలయిన కిరీటాలు భుజకీర్తులు ఆభరణాలు ధరించు సర్వేశ్వరునకు వరదాతలలో మేటి యగు వానికి ప్రణామములు. బ్రహ్మకు, దేవతలకు నివాస భూతుడైన లోకాధినాధునకు, సంసార నాశకునకు, ఆత్మ కల్యాణానికి తెరపైన నారాయణునకు, ఆది వరహ మూర్తికి నమస్సులు కూటసుడు తెలియని వాడయ్యును గోచరుడయ్యే అచింత్య రూపికి, కారణుడు, ఆదిదేవుడు నగు నారాయణునకు యుగాంత వేళల గూడ విడిచి యుండు పురాణ పురుషునకు దేవతలందరకు స్వామి యుగు వానికి శరణాగతుడ నగు చున్నాను ! యోగేశ్వరుడు చిత్ర విచిత్రమైన సుందర శిరోవేష్టనము గలవానికి, తెలియబడ రాని మొదటి తత్వానికి ప్రకృతి కంటే భిన్నుడైన వానికి, క్షేత్రజ్ఞునకు, ఆత్మభవునకు, వరణీయు డగు వాసుదేవునకు ప్రసన్నుడ నగు చున్నాను !
ఏ తత్వాన్ని మహర్షులు అదృశ్యము, అవ్యక్తము, అచింత్యము, క్షయము కానిది, సనాతనము (మొదలు లేనిది) బ్రహ్మమయ మనికీర్తిస్తారో ఆ తత్త్వ స్వరూపుడైన సనాతన పురుషుని, గూడమైన దేవుని శరణు వేడు చున్నాను. ఎవనిని అక్షరుడని, బ్రహ్మయని, సర్వోపగతుడని కోనియాడెదరో ఎవనిని (నామమును) విని మృత్యువు ముఖా న్నుంచి తప్పించుకుంటారో అలాంటి ఈశ్వరుని ఉత్తమ గుణాలకు సంతోషించే శాశ్వతుడగు విష్ణువునకు శరణాగతుడనగు చున్నాను. జనార్దనుడైన ఏ ప్రభువు కారణము, కార్యము, క్రియ మూడును తానై ఎలాంటి కొలతలకూ అందని వాడో, హిరణ్య బాహువో, పద్మనాభుడో, వేదాలకు నిధియో అలాంటి మహా బలుడగు విష్ణువును, దేవేశుని, శరణు వేడుచున్నాను. అమూల్యమైన కేయూర కిరీటాది స్వర్ణ రత్నాలంకృతమైన ఉత్తమా భరణాలు శరీరం నిండావెలుగుచుండగా పీతాంబరం, భక్తి అనే చిత్రమాలను ధరించిన కేశవుడే నాకు దిక్కు. సంసార కారణుడు, వేద విదులలో శ్రేష్ఠుడు, యోగులలోను, సాంఖ్యులలోను ఉత్తముడు, ఆదిత్య, వసు, రుద్రాశ్వినుల కాంతితో సర్వులకూ ప్రభువై ఆత్మ స్వరూపి అయిన అభిచ్యుతడే నాకు శరణ్యుడు. శ్రీవత్స చిహ్నంతో సాటి నేలి శోభతో వెలిగే అభయ ప్రదాతకు, సూక్ష్మమూ, శాశ్వతము నగు తత్వానికి శరణాగతుడను. సర్వజీవులకు జని స్థానమై, గుణ రహితుడై, సంగరహితులు, జితేంద్రియులు నగు వారలకు పరమ గతియగు పరమేశ్వరునకు, ప్రపడు నగు భగవంతునకు భక్తితో శరణాగతుడ నగు చున్నాను. త్రివిక్రముడు, త్రిలోకేశుడు, ఎల్ల జీవులకు పితామహుడు, యోగాత్ముడు, మహాత్ముడు నగు జనార్దనుని శరణు వేడు చున్నాను. ఆదిదేవుడు, జన్మరహితుడు. కల్యాణకరుడు, వ్యక్తుడు, అవ్యక్తుడు, సనాతనుడు, అణురూపి, బ్రాహ్మణ ప్రియుడు నగు నారాయణుడే నాకు గతి. ఓ శ్రేష్ఠుడా! నీకు నమస్కారం ! సర్వసహాయా ! నాకు సహాయ పడుము. అణువులలో అణుస్వరూపా ఈ భక్త పరమాణువును కాపాడుము అద్వితీయుడా! ఒకడైన వాడా! లోక తత్త్వ స్వరూపా! ఈ భక్తపరమాణువును కాపాడుము. అద్వితీయుడా! ఒకడైనవాడా! లోక తత్వ స్వరూపా! పరులకు పరమైన తత్వమా! సహస్రశీర్షా అనంతానీకు ప్రణామములు! వేద నిష్ణాతులైన మహర్షులు నిన్నేపరమ తత్వంగా, బ్రహ్మాదులందరకూ ఆధార భూతుడవుగా కొని యాడుదురు. ఓ పుండ రీక నయనా ! నీకు నమస్కారము! అభయ ప్రదాయకా నీకు శరణు! సుబ్రహ్మణ్య దేవా! నీకు నమస్కారము! అభయ ప్రదాయకా నీకు శరణు! సుబ్రహ్మణ్య దేవా! నీకు నమస్కారము! శరణాగతుడనైన నన్ను రక్షించుము.
పులస్త్యుడిలా అన్నాడు : – శంఖ చక్ర గదాధరుడూ, అమోఘ సంభవుడు (సార్థక జన్ముడు) నగు విష్ణుదేవుడు గజేంద్రుని భక్తికి సంతోషించి ఈ సరస్సులో సాన్నిధ్యాన్ని కల్పించు కొన్నాడు. లోకాధారుడు మహా లోకాధారుడు మహా తపోధనుడు నైన ఆ గరుడవాహనుడు వచ్చి మహా వేగంతో ఆ గజాన్నీ, మొసలినీ రెంటినీ సరుస్సులో నుండి లాగిబయట పడవేసి చక్రంతో మకరి కంఠాన్ని ఉత్తరించాడు. శరణాగతుడైన ఆ గజాధిపునకు బంధ మోక్షం కలిగించాడు. దేవలుని శాపం వల్ల మకరిగా మారిన హూహూ అనే గంధర్వుడు కృష్ణుని చే వధింప బడి శాప విముక్తుడై దివికి చేరుకున్నాడు. గజేంద్రుడు గూడ విష్ణు కరస్పర్శ వలన దివ్యదేహం ధరించాడు. అలా గజ గంధర్వులిద్దరూ ఆపదలు వీడి ముక్తులయ్యారు. అంతట వారిద్దరా పుండరీకాక్షుని పూజించాడు. శరణాగత వత్సలు డైన ఈ మహా యోగి మధుసూదన డంతట నా గజేంద్రుని జూచి ఓ నారదా! ఇలా అన్నాడు. ఎవరైతే నిన్నూ, నన్నూ, ఈ సరోవరాన్ని, ఇచటి గుల్మ, కీచక, రేణువులను, మేరు పుత్రుడైన గిరి శఖరాన్ని, మకరిసంహారాన్ని, అశ్వత్థవృక్షాన్ని, భాస్కరుని, గంగను, నైమిషాన్ని, పవిత్రాంతఃకరణతో, స్థిర బుద్దితో కీర్తిస్తారో, భక్తితో శుచులై ఈ పవిత్రగాధను వింటారో వారల దుస్వప్నాలు నశించి శుభ స్వప్నాలు కలుగుతాయి. ప్రతి దినము ప్రాతఃకాలాన మేల్కాంచి ఏ నరులైతే మత్స్య, కూర్మవరాహ, వామన, గరుడ, నారసింహావతారాలను, వారి కార్యాలను, సృష్టి ప్రలయ కారకుడైన నాగేంద్రుని, సమాహిత చిత్తంతో స్మరిస్తారో వారలు సమస్త పాపాలనుండి విడి వడి వూణ్యలోకాలకు పోతారు.
పులస్త్యుడిలా అన్నాడు. గరుడ ధ్వజుడైన ఆహృషీకేశవుడీ విధంగా వరా లిచ్చి ఆ గజ గ్రాహాలను తన చేతితో నిమిరాడు. అంత నా గజేంద్రుడు దివ్య దేహం ధరించి మధుసూదననుని పాదాల కడ శరణాగతు డయ్యాడు. నారదా! అంతట శ్రీ నారాయణ దేవుడా నారాయణ పరాయణుడగు గజరాజునకు మకరి నుండియే కాక పాపాల నుండి కూడ ముక్తి ప్రసాదించాడు. అనంతరమా అద్భుతకర్ముడు విష్ణుడు, ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, స్తోత్రాలు చేస్తూండగా వెళ్లిపోయాడు. దుర్విజ్ఞేయ గమనుడైన శ్రీహరి గావించిన గజేంద్ర మోక్షణాన్ని తిలకించిన యింద్రాది దేవతలందరా భక్త వత్సలునకు చేతులు మోడ్చి వందనాలు చేశారు. మహర్షులు చారణులు ఆశ్చర్య పులకితులై స్తవనమలు గావించారు. చక్రపాణి నెరపిన అద్భుత చేష్టితాన్ని చూచి ప్రజాపతులలో ముఖ్యుడైన చతుర్ముఖుడు యిలా అన్నాడు. ఈ గజేంద్ర మొక్షణ కథను ప్రాతః కాలాన లేచి నిత్యమూ యే మానవులు వినెదరో వారలకు పరమసిద్ది కలుగుతుంది. దుస్వప్నాలు నశిస్తాయి. ఓ తపోధనా! గజరామోక్షణ గాధ పరమ పవిత్రమైనది. పుణ్యప్రదమైనది. దీనిని చదివినా, స్మరించినా, వినినా, సర్వపాపాలు నశిస్తాయి. ఆ క్షణాన్నే! మురారి యొక్క ఈ పావన చరిత్రం సదా గానం చేయతగినది. దీనిని చదివినచో ఆ గజ రాజునకు వలెనే సకల పాప బంధాల నుంచీ విముక్తి కలుగుతుంది. అజితుడం వరేణ్యుడు, పద్మనాభుడు, నారాయణుడు, బ్రహ్మనిధి. సురేశ్వరుడు, పురాణపురుడషుడు లోకపతి అయిన శ్రీవల్లభునకు నమస్కరిస్తున్నారు. నారదా! నీవడిగిన స్తోత్రాలలో మేటి అయి గజేంద్ర కృత స్తవాన్ని వినిపించాను. దీనిని పాడి విని స్మరించి మానవుడు పాప దూరుడు కాగలడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹