Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ఎనభై మూడవ అధ్యాయం

నారదుడు ప్రశ్నించాడు :-

స్వామీ ! ఆ అసమాక్షుడు శివుడు లోకనాధుడైన విష్ణునకు లోకపూజితమైన చక్రాయుధం ఎందులకిచ్చెను? అందుకు పులస్త్యుడిలా చెప్పపాగాడు. నారదా ! ఈ చక్ర ప్రధానకధ మహా పురాతనమైనది. శివమాహత్మ్యాన్ని పెంపొందించేదని. చెబుతున్నా జాగ్రత్తగా వినుము. ఒకప్పుడు వేత్త ద్విజాతిశ్రేష్ఠుడు మహానుభావుడు గృహస్థాశ్రమంలో వున్నవాడు ”వీతమన్యుడు” అనువాడు ఉండెను. ఆత్రేయుడు, అతని భార్య పతివ్రత శీలవతి, పతియే ప్రాణంగా భావించిన సాధ్వి, పేరు ధర్మశీల. ఒకప్పుడు ఋతుకాలంలో ఆమెను ఆ మహర్షి కలియగా వారలకు ఉపమన్యుడను శ్రీమంతుడు కలిగాడు అతడ్ని దరిద్రానికిలోనై తనపుత్రునకు రోజూ ”పాలు” అని చెప్పి బియ్యపు పిండి కలిపిన నీరు యిస్తూ ఉండేది. పాలరుచి తెలియని ఆ బాలుడు ఆపిండి నీటినే త్రాగుతూ వచ్చాడు. ఒకనాడు తండ్రి వెంట ఒక బ్రాహ్మణ గృహంలో భోజనానికి వెళ్లగా అక్కడ మధురమైన క్షీరాన్నం వడ్డించారు. ఆ ప్రాణ పుష్టుకరమైన పాయాసాన్ని కడుపార త్రాగిన ఆ బిడ్డ మరునాడు తల్లి యిచ్చిన బియ్యపు నీరు త్రాగలేదు. బాల్య చాపల్యాన పాలు తెమ్మని ఏడువసాగాడు. వేరే ఏమిచ్చినా వద్దంటూ స్వాతి చినుకు కోసం చాతకం లాగ పట్టుబట్టి కూర్చున్నాడు. పిల్లవాని ఏడ్పు తన అసహాయతకు కుమిలిపోతూ ఆ తల్లి ధర్మశీల రుద్ధకంఠంతో – నాన్నా ! ఉమాపతి పశుపతి శూలధరుడు విరూపాక్షుడైన శంకరుడు అప్రసన్నుడైన చోట పాలెక్కడ నుంచి వచ్చునయ్యా ? నిజంగా పుష్టినిచ్చే పాలు కావాలంటే ఆ త్రిశూల ధరుడైన విరూపాక్షుణ్ణి ఆరాధించు తండ్రీ ! ఆ జగన్మయుడు, సర్వకల్యాణ ప్రదాత సంతోషిస్తే పాలే కాదు అమృతమే త్రాగవచ్చు బాబూ ! అని విలపించింది. తల్లి మాట మనస్సుకు నాటిన ఆ బాలుడు – అమ్మా ! నీవారాధించమనిన ఆ విరూపాక్షుడెవరమ్మా ? ఎలా ఉంటాడో చెప్పమ్మా అని అర్థించగా నా ధర్మశీల, బాబూ ! ఆ విరూపాక్షదేవుడెవరో చెబుతున్నా వినుము అని చెప్పసాగింది.

బాబూ ! పూర్వం శ్రీ దాముడనే ఘోరరక్కసుడు ముల్లోకాలను జయించి లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళాడు. ఆ దురాత్ముని చేష్టవల్ల లోకాలన్నీ శ్రీ హీనాలైపోయాయి. వాసుదేవుని శ్రీవత్సాన్ని కూడ హరించాలని ఆ దుష్టుడు సంకల్పించాడు. వాడి దురాలోచన గ్రహించిన జనార్దనుడు వానిని వధించ గోరి మహేశ్వరుని వద్దకు వెళ్లాడు. ఈ లోపున యోగమూర్తియై అవ్యయుడైన శివుడు హిమాచలం మీద పీఠభూమిగా ఉన్న సమతల స్నిగ్ధ ప్రదేశాన స్థానమేర్పరచుకున్నాడు. ఆహరి సహస్ర శీర్షుడైన ఆమహాదేవుని సమీపించి, ఆయనను తన ఆత్మస్థునిగా భావించి ఒంటికాలి బొటనవ్రేలు మీద నిలచి వేయి సంవత్సరాలు ఆయోగిగమ్యుడూ లక్షణాతీతుడైన పరబ్రహ్మను ఆరాధించాడు. విష్ణువు చేసిన ఆ ఉగ్రతపస్సునకు సంతోషించి వరంగా, తేజోమయమైన దివ్యసుదర్శన చక్రాన్ని యిస్తూ యిలా అన్నాడు. జనార్దనా ! ఇది సర్వప్రాణి భయంకరమైన మృత్యుచక్రాన్ని బోలిన చక్రం. ఇతర ఆయుధాలన్నింటినీ నాశనం చేయగల ఉత్తమ ఆయుధం. ఈ సుదర్శన చక్రం పన్నెండు ఆకులూ ఆరు నాభులు రెండు యిరుసులూ కలిగి మహావేగం కలది. దీని ఆకులలో దేవతలు పన్నెండు మాసాలు, పన్నెండు మేషాదిరాసులు, ఆరు ఋతువులూ ఉన్నాయి. సూర్యచంద్రాగ్నులు వరుణుడు శచీపతి విశ్వేదేవతలు ప్రజాపతులు, హనుమంతుడు ధన్వంతరి మొదలైన సర్వ దేవమయమైన ఈ ఆయుధం సజ్జనుల రక్షణకై రూపింపబడినది దీనిలో తపస్సు, తపస్వులు పన్నెండుగూరూ చైత్రాది ఫాల్గుణాంతాలయిన మాసాలు ఉన్నాయి. ఇలాంటి దివ్యాయుధాన్ని తీసుకుని దేవశత్రువును సంహరించుము. ఇంద్రుడు ఆరాధించిన ఆ అమోఘాస్త్రాన్ని యోగబలంచేతనేను నానేత్రాలలో యింతవరకు ధరించాను. శివుడు చెప్పిన మాటలువిని శ్రీహరి ఆయనతో యిలా అన్నాడు ఓ మహాదేవా ! ఈ అస్త్రం అమోఘమవునో కాదో నాకెలా తెలుస్తుంది? ఎక్కడా ఎదురు లేకుండా ఉండేవరాయుధమైనదీ లేనిదీ తెలుసుకొనుటకుగాను, దీనిని నీమీదనే ప్రయోగించి నా సందేహం తీర్చుకుంటాను సిద్ధంగా ఉండండి.

వాసుదేవుని మాట విని ఆ పినాకపాణి , జనార్దనా ! అలాగైతే వెంటనే సందేహించకుండా చక్రం నామీద ప్రయోగించమని ఆదేశించాడు. ఈశ్వరుని మాట విని వెంటనే తేజోరాశి అయిన ఆ ఆయుధాన్ని శ్రీహరి ప్రయోగించగా నది శివుని శరీరాన్ని మూడు భాగాలుగా విశ్వేశ్వరుడు, యజ్ఞేశ్వరుడు, యాజకుడుగా ఖండించింది. హరుడు మూడు భాగాలుగా ఖండితుగుట చూచి విష్ణువు సిగ్గుతో కుంచించుకుపోయి ఆమహనీయుని కాళ్లమీద పడిపోయాడు. అంతట భవుడు ప్రేమతో నాహరిని చూచి దామోదరా చింతింపకుము, లెమ్ము లెమ్ము. ఈ మార్పు నాలో కనిపించే భౌతిక దేహానికే వర్తింస్తుంది. కాని నా అసలు రూపం అచ్ఛేద్యం అదాహ్యం. దానినే శక్తి ఖండించలేదు. నీ చక్ర ప్రయోగంలో ముక్కలైన ఈ శరీరం గూడ కల్యాణ ప్రదంగా పరిణమిస్తుంది. ఈ మూడు ఖండాలలో మొదటిది హిరణ్యాక్షుమనీ రెండవది సువర్ణాక్షమనీ మూడవది విరూపాక్షమనీ ప్రసిద్ధి చెందుతాయి. ఈ మూడు నరులకు పుణ్యం కలుగజేస్తాయి. యిందులో నీవు బాధపడవలసినదేవీ లేదు. ఈ చక్రం తీసికొని దేవ విరోధి అయిన ఆ అసురుణ్ణి హతమార్చమని చెప్పగా గరుడధ్వజుడు మేరుపర్వతానికి వెళ్ళి శ్రీదామదైత్యుని చూచాడు. ఆ దేవదర్పహరుడి మీద చక్రం ప్రయోగించి శిరస్సు తెగవేశాడు. అలా చక్రధారకు తలతెగి ఆ రాక్షసుడు వజ్రధారకు తెగిపడే గిరి శిఖరం లాగా నేల మీద పడిపోయాడు. అంతట నామురారి శివుని విరూపాక్షుని పూజించి ఆయన అనుమతి పొందిన సుదర్శనాయుధంతో క్షీరసాగరానికి వెళ్లాడు. కుమారా ఉపమన్యూ ! ఆ ప్రభువే విరూపాక్షుడు త్రినేత్రుడు ఆయన నారాధిస్తే నీకు కావలసిన క్షీరాన్న భోజనం లభిస్తుంది తల్లి మాటలకు సంతోషించి ఆబాలుడు పట్టుదలతో విరూపాక్ష దేవుని ఆరాధించి క్షీరభోజనాన్ని సమకూర్చుకున్నాడు. నారదా ! శివుని శరీరం మూడుగా ఛేదింపబడటం శ్రీహరికి శివుడు సుదర్శన ప్రదానం చేయడం ఎలా సంభవించిందీ నీకు చెప్పాను. ఆ అసురభాగవతుడు ప్రహ్లాదుడు పుణ్యసంపాదనకై ఆ క్షేత్ర రాజానికి వెళ్ళి చేరాడు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment