Skip to content Skip to footer

🌹 శ్రీ వామన మహాపురాణం 🌹 -ఎనభై రెండవ అధ్యాయము

పులస్త్యుడిలా చెప్పసాగాడు :-

ఓ నారదా ! ఋషి కన్య అయిన పవిత్ర ఇరావతికి వెళ్ళి స్నానం చేసి ఆ ప్రహ్లాదుడు చైత్ర అష్టమి నాడు జనార్దనుని పూజించాడు. అచట శుచియై పుణ్య ప్రదమైన నక్షత్ర వ్రత మాచరించి ఆ దానవేశ్వరుడు కురుక్షేత్రానికి వెళ్లాడు. ఐరావత మంత్రాలతో సుదర్శనుడగు చక్రతీర్థుని అర్చించి విధ్యుక్తంగా స్నానం చేశాడు. ఆ రాత్రి ఉపవసించి భక్తితో కురుధ్వజుని పూజిచి శుచియై నృసింహదేవుని చూచుటకు వెళ్ళాడు. ఆ దానవపతి దేవికా నదిలో మునిగి నృసింహుని పూజించి ఆ రాత్రి అక్కడ వసించి మరునాడు గోకర్ణక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి తూర్పు దిక్కున విశ్వకర్మను పూజించి మరొక దిశగా కామేశ్వరుని దర్శించుటకై వెళ్లాడు. అక్కడ స్నాతుడై కామేశ్వర మహాదేవుని పూజించి ప్రహ్లాదుడు మహాజల మధ్యాన పుండరీకానికి వెళ్లాడు. అక్కడ స్నానం చేసి పితృ దేవతలకు తర్పణాదు లిచ్చి పుండరీకుని అర్చించి మూడు రోజులు గడిపాడు. అనంతరం విశాఖ యూప క్షేత్రంలో అజిత భగవానుని దర్శించి స్నానం చేసి శుచియై కృష్ణు తీర్థంలో మూడు రాత్రులు గడిపాడు.అనంతరం హంస పదంలో హంసేశ్వరుని సేవించి ఆ భాగవతుడు అఖండేశ్వరుని దర్శించుటకై పయోష్ణి వెళ్లాడు. పయోష్ణిలో స్నానం చేసి అఖండేశ్వరుని అర్చించి ఆ మతిమంతుడు కుమారిలుని చూచుటకు వితస్తకు వెళ్లాడు ఆ వితస్తలో మునిగి, జ్యోతిర్మయులైన వాలఖిల్య ఋషులచే ఆరాధింపబడిన దేవేశ్వరుని అర్చించి తాను చేసిన పాపాలన్నీ నశింప జేసుకున్నాడు. అక్కడ దేవతల ప్రీత్యర్ధమూ లోక కల్యాణార్థం కామధేవు కపిల అను గోవును కనిన, దేవహ్రదమనే తీర్థంలో స్నానం చేసి భక్తితో శివుని ఆరాధించి విధి విధానంగా పెరుగు తిని మణిమంతానికి ప్రయాణ మైనాడు. ప్రజానపతి నిలయమైన ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి ఆ మహామతి హరునీ చతుర్ముఖునీ దర్శించి యథావిధిగా పూజించాడు. ఆరు రాత్రులా ప్రదేశంలో గడిపి మధునందిని వెళ్ళాడు. తేనె లాగ తియ్యగా ఉండే ఆ నదీ జలాలలో స్నానమాడి శూలపాణి చక్రధారి హరినీ ఆ దానవ శ్రేష్ఠుడు దర్శించాడు.

నారదుడు పులస్త్యుని మాట విని యిలా ప్రశ్నించాడు. బ్రహ్మర్షీ ! శంకరుడు సుదర్శనాన్ని వాసుదేవుడు శూలాన్ని ఎందుకు ధరించారు దయచేసి చెప్పండి. అందుల కాపులస్త్యుడిలా చెప్ప సాగాడు నారదా ! ఈ ప్రాచీన గాథ చెబుతాను వినుము. దీనిని పూర్వం విష్ణువు భవిష్య మనువుకు చెప్పండి. ఒకప్పుడు జలోద్భవుడనే మహాదైత్యేంద్రుడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవునారాధించాడు. ఆయన సంతోషించి, దేవాసురలకు అవధ్యుడుగాను, స్వంత ఆయూధాల చేత ఎవరిచేతను చంపబడకుండునట్లును, బ్రహ్మర్షుల శాపాలు వానికి తగులకుండు నట్లును, నీటిలో నీటి గుణాన్ని అగ్నిలో అగ్ని గుణాన్ని కలిగియుండునట్లూ అసాధ్యమైన వరాలు ఆ దుష్టుడికిచ్చాడు. అంతటితో మదించి ఆదానవుడు దేవర్షులను రాజులను అందరూ బాధిస్తూ భూమిమీద తిరగడం మొదలుపెట్టాడు. యజ్ఞాది ధర్మకార్యాలు ధ్వంసం చేయసాగాడు. వాడి బాధలు పడలేక దేవతలు మానవులు రాజులు విష్ణునివాసాలికి వెళ్ళి మొరబెట్టుకోగా ఆయన వారిని వెంటబెట్టుకోని హరుని నివాసమైన హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ హరులిరువురు ఆలోచించుకొని ఎలాగైనా దేవతలకు ఋషులకు మేలు చేసేందుకైనా వాడిని సంహరించ నిశ్చయించుకున్నారు. తమ తమ ఆయుధాలను పరస్పరం మార్చుకున్నారు. ఆ జలోద్భవుని సంహరించేందుకు భయంకర రూపాలు ధరించి వాడిని వెతకసాగారు. అలా హరులిరువురు ఆయుధాలు మార్చుకుని తనను పరిమార్చుటకై ఘోర రూపాలతో బయలుదేరడం వారలు అవధ్యులు కావడం తెలుసుకొని ఆ దానవుడు భయకంపితుడై జలాల్లో మునిగి కూర్చున్నాడు. ఆ దేవశత్రువు నీళ్లలో కరిగిపోవడం తెలుసుకుని తీయని జలాలుగల ఆవిశాలానది ఉభయ తీరాల్లో కనపడకుండా అదృశ్యులై నిలిచారు. కొంతవడి జలోద్భవుడు మెల్లగా నీటినుండి బయటకు వచ్చి బెదురు చూపులతో నలువైపులా చూస్తూ హరిహరులు వెళ్లిపోయారని నిశ్చయించుకుని దుర్గమమైన హిమాద్రి శిఖరానికెగబ్రాకి కూర్చున్నాడు. అలా వాడు నాగరాజ శిఖరాన తిరుగాడడం చూచి శంకర నారాయణులిరువురు మహా వేగంతో పరుగెత్తి తమ ఆయుధాలతో వాడి శరీరాన్ని ఛేధించారు. శంఖ చక్రధారులకూ, విష్ణుశూలాఘాతానికి దేహం చిల్లులు పడిపోగా బంగారు కాంతిగల శరీరంతో, ఆకాశాన్నుంచి తెగిపడే ఉజ్వల నక్షత్రంలాగా ఆదుష్టుడా శైలశిఖరాన్నుండి గతప్రాణుడై పడిపోయాడు. ఆ విధంగా లోకకంటకుడైన ఆదుష్టుని సంహరిచేందుకు శివుడు చక్రాన్నీ విష్ణువు శూలాన్నీ ధరించవలసి వచ్చింది. ఆ సంఘటన శివుని పాదాఘాతంవల్ల శిశిరగిరి నుంచి ఉద్భవించిన పాపనాశిని వితస్తానదీ పరిసరాలలో జరిగింది ప్రహ్లాదుడు ఆప్రదేశాన్ని దర్శించి దేవాదిదేవులయిన ఆ హరిశంకరులను పూజించి భక్తితో ఉపవాసం గావించి శివకేశవులచేత రక్షితుడైన ఆనగాధి రాజు హిమవంతుని చూచుటకు వచ్చాడు. ఆ గిరీశుని విధ్యుక్తంగా అర్చించి బ్రాహ్మణులకు దానాలొసగి విశాలమైన హిమాలయ పాద ప్రదేశానగల భృగుతుంగ క్షేత్రానికి వెళ్లాడు. అచ్చట దేవశ్రేష్ఠుడైన విష్ణువునకు శంకరుడు చక్రాయుధాన్ని ప్రదానం చేయగా దాని శక్తిని పరీక్షింపదలచి విష్ణువు దాన్ని ప్రయోగించి, శివుణ్ణి మూడు ముక్కలుగా ఖండించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment