Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ఎనబయ్యవ అధ్యాయం

పులస్త్యుడిలా అన్నాడు

పవిత్ర యమునా నదిలో స్నానం చేసి విక్రమ దేవుని పూజించి ఆ రాత్రి ఉపవాస ముండి ప్రహ్లాదుడి, లింగ భేద పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్మలోదకాల్లో స్నానం చేసి భక్తితో దర్శించి ఒక రాత్రి ఉపవసించి పిమ్మట కేదార క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్నానాదులు చేసి అభేదబుద్ధితో మాధవ ఉమాధవులను అర్చించి ఏడు దినాలు ఉపవసించి ఆమీద కుబ్జామ్ర క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ఉత్తమ తీర్థంలో మునిగి మనో నిగ్రహంతో ఉపవాసం చేసి హృషీకేశ్వరుని దర్శించి బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉండగా ఆ విద్వాంసుడు భక్తి పూర్వకంగా సరస్వతీ జలాలలో అవగాహనం చేస వరాహ తీర్థంలో గరుడ వాహనుని భక్తితో సేవించి తర్వాత భద్రకర్ణంలో చంద్రశేఖరుడగు జయేశ్వరుని దర్శించి పూజ చేసి ఆ ప్రహ్లాదుడు విపాశా నదికి వెళ్ళాడు. ఆ నదిలో మునిగి బ్రాహ్మణ ప్రియుడగు దేవదేవుని పూజించి ఉపవాసం గావించి ఇరావతికి వెళ్లి పరమేశ్వర దర్శనం చేసుకున్నాడు. ఆ స్వామిని అర్చించి పూర్వం శాకల నగరంలో పురూరవుడు దుర్లభమైన ఐశ్వర్య సౌందర్యాలు పొందాడు. కుష్ఠు రోగ పీడీతుడైన భ్రుగువాస్వామి ప్రసాదం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా సత్సంతానాన్ని గూడ కనినాడు. అది విని నారదుడు ఓ బ్రహ్మర్షి ! పురూరవుడే విధంగా పూర్వ కాలాన ఆ విష్ణువు నారాధించి తన కురూపత్వాన్ని పోగొట్టుకుని సౌందర్య సంపదలు పొందినదీ వివరించి చెప్పండని అడుగగా పులస్త్యుడావుదంతం చెప్పసాగాడు. నారదా ! పురూరవుని కధ పాపహరమైనది. వినుము. పూర్వం త్రేతాయుగారంభంలో అది జరిగింది. మద్ర దేశంలో శాకల మనే ప్రసిద్ధ నగరం ఉండేది. ఆ ఊరిలో ధనవంతుడు గుణవంతుడు నానాశాస్త్రకోవిదుడు మహా భోగి అయిన సుధర్ముడనే వణిజుడు (వ్యాపారి) ఉండేవాడు. అతడొక పర్యాయం విశేషంగా విలువ గల సరకులు తీసికొని చరాస్తి తీసికొని తన రాష్ట్రం వదలి సురాష్ట్ర దేశానికి వెళ్తుండగా మార్గ మధ్యాన దొంగలు అడ్డగిచి ఆయన సర్వస్వాన్ని, ఎడారి ప్రదేశంలో దోచుకు పోయారు. సర్వస్వం కొల్పొయి కట్టు బట్టలతో మగిలిన ఆ వ్యాపారి తన దుర్దశకు మిక్కిలిగా దుఃఖించి అసహాయుడై ఆ ఎడారి దేశంలో పిచ్చివాడి వలె తిరుగ సాగాడు. అలా ఒకనాడు అరణ్యంలో తిరుగుతూ తనవలెనే ఏకాకిగా నిలబడిన ఒక జమ్మి చెట్టువద్దకు చేరాడు. ఆ చుట్టు పట్లపక్షులు గాని మృగాలు గాని ఏవీ కనుపించలేదు. నడక శ్రమతో ఆకలితో తూలి పోతూ ఆ సుధర్మడాశమీ వృక్షం క్రింద కూలబడి నాడు.

వెంటనే పడుకొని గాఢంగా నింద్రించి మధ్యాహ్న వేళకు, బడలిక తీరి పోగా మేలు కొనే సరిగి ఎదురుగా వంద లాది ప్రేతాల చే పరివేష్టితుడైన ఒకానొక ప్రేతాన్ని చూచాడు. ఆ ప్రేత నాయకుడిని మరొక ప్రేతం మోసుకుని వచ్చింది. ఎందరో పిండ భుక్కులైన ప్రేతాలు ఎండిన శరీరాలతో ముందర పరుగిడుతూ వచ్చారు. అలా అరణ్యంలో తిరిగి వచ్చి ఆ ప్రేతపతి శమీ వృక్షం క్రింద ఆ కోమటి బిడ్డను చూచి స్వాగత పూర్వకంగా అభివాదం చేశాడు. ఇద్దరూ శ్రమ మూలాన సుఖోపవిష్టులై పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ ప్రేతనాయకుడు తన వణిక్‌ మిత్రునితో యిలా అన్నాడు – సౌమ్యా ! నీ వెవరవు ? ఎక్కడ నుండి రాక ? ఎక్కడకు వెళ్తున్నావు ? ఈ మృగపక్షి విహీనమైన మహారణ్యాని కెలా వచ్చి చేరావు ? నీకు క్షేమ మగుగాక ! అంతా వివరంగా చెప్పుము. అది విని ఓ నారదా! ఆ వణిక్పుత్రుడు ఉన్న దున్నట్టుగా, స్వదేశాన్ని వదలడం దారిలో సర్వస్వం కోలు పోవడం వివరంగా చెప్పాడు. అది విని ఆ వణిక్సుతునితో బాటు ఆ ప్రేత నాయకుడు గూడ దుఃఖించి ఆప్యాయతతో అతడి నిలా ఓదార్చాడు. బాబూ! ధనం పోయిందని విచారించకుము. సమయం కలిసి వస్తే ధనం మళ్ళీ వస్తుంది. భాగ్య క్షయంతో ధన క్షయం కలుగుతుంది. భాగ్యం కలిసి వస్తే మళ్ళీ అభ్యుదయం కలుగుతుంది. అంతే కాని విచారంతో శరీరాన్ని క్షీణింప జేసుకుంటే ఏమి అనుభవించ నగును ? కనుక దిగులు మానుము. తర్వాత తన సేవకుల నందరను పిలిచి, యిదుగో ఈ సోదరుడు మన అతిధి. పూజ్యుడు. నా స్వజనంలోనివాడు. యితనిని చూస్తే నా స్వజనులను చూచినంత ఆనందంగా ఉందని అంటూండగా ఎక్కడ నుంచో ఒక దృఢమైన మట్టి కుండ పెరుగన్నంతో నిండుగా వచ్చి ఎదుట కనిపించింది. మరొక గట్టి కొత్త కుండ నిర్మలోవకంతో నిండి వచ్చింది. ఆ రెండు పాత్రలను అందులోని అన్న జలాలను చూచి ఆ మహామతి ఆయన ప్రేత నాయకుడావణికుణ్ణి చూచి బాబూ ! లేచి అహ్నికాలు తీర్చుకొనుమని చెప్పాడు. అనంతరం ఆ నాయకుడా కడుపార పెరుగన్నం చల్లని మంచి నీరు ఆరగింప చేసి, తర్వాత తన పరివారానికి కంతకూ భోజనం పెట్టాడు. అందరూ ఆరగించి నీరు త్రాగిన తర్వాత ఆ ప్రేత నాయకుడు తానూ ఆ దధ్యోదనం తిని చల్లని నీరు యధేచ్చగా త్రాగాడు. అందరూ అలా తృప్తులైనంతనే ఆ కోమటి బిడ్డడు చూస్తుండగనే ఆ రెండు పాత్రలూ అదృశ్యమైన పోయాయి.

ఆ అద్భుతం చూచిన కోమటి బిడ్డ కుతూహలం కోద్దీ ఆ ప్రేత నాధుడిని ప్రశ్నంచాడు. సాధూ ! ఈ నిర్జనారణ్యంలో ఈ అమృతోపమమైన అన్నం నిర్మల జలంతో నింపిన పానపాత్ర ఎలా వచ్చాయి? ఈ నీభృత్యు లెవరు ? నీ కంటె బక్క చిక్కి వర్చస్సు లేకుండా ఉన్నారేల ? నీవూ వారల కంటే పుష్టిగా తేజస్విగా ఉన్నావు. తెల్లటి వస్త్రాలు ధరించి యిందరను పోషిస్తున్న నీవెవరు ? ఈ శమీ వృక్షం విషయమేమిటి ? ఈ విషయా లన్నీ నాకు చెప్పుము. వణిక్‌ పుత్రుడి మాటలు విని ఆ ప్రేతాల పెద్ద పూర్వం గడచిన తన జీవిత గాధనంతా పూస గ్రుచ్చినట్టుగా చెప్పాడు. బాబూ! పూర్వం శాకల నగరంలో నేను సోమ శర్మగా ప్రసిద్ధి కెక్కిన విప్రుడను. మా తల్లి పేరు బహుళాదేవి. నా పొరుగున నే మహాధనికుడైన సోమశ్రవు డనే వైశ్యుడుండేవాడు. అతడు విష్ణుభక్తుడు యశస్వి. నేనూ పరమ మూర్ఖుణ్ణి డబ్బు ఉన్నప్పటికి బ్రాహ్మణుల కిచ్చెడి వాడను కాను, కడుపు నిండా మంచి భోజనం కూడ చేసే వాడిని కాదు. మహాలోభిని, దుర్మార్గుడను, ఏ నాడైనా షడ్రసోపేతంగా భోజనం చేశానంటే ఆ రాత్రి ఎవరో మనుష్యులు వచ్చి నా వళ్ళు హూనం చేసి పొయ్యేవారు. తెల్లవారగానే నాకు భయం కరమైన విషూచి (కలరా) కలిగి మరణ బాధ పడుతూండే వాడిని. ఆ విధంగా సిగ్గు మాలిన పాపిష్టి జీవితం గడపేవాడిని. తరవాణి, నువ్వుల చక్క, పేలపిండి, ఆకుకూరలు, పాడై పోయిన అన్నం యిలాంటి వాటితో రోజులు గడిపే వాడిని. ఈ విధంగా చాలా కాలం గడచి పోగా భాద్రపద మాసంలో ద్వాదశీ పర్వం వచ్చింది. మా నగరంలోని బ్రాహ్మణులూ, క్షత్రియులూ, యితరులూ పర్వస్నానం చేసేందుకు ఇరావతి నడ్వల సంగమానికి వెళ్లారు. నా పొరుగు మిత్రుడు వైశ్యునితో కలసి నేను కూడ వెళ్ళి సంగమ స్నానం చేసి శుచినై ఏకాదశీ ఉపవాసం గావించాను. ఆ పర్వాన సంగమ స్నానం లో పవిత్రుడు జ్ఞాని ధర్మనిష్ఠు డైన ఒక బ్రాహ్మణునకు క్రొత్త జల కుంభాన్ని వస్త్రాచ్ఛాదనంతో, గొడుగు ఒక జత పాదరక్షలతో కూడా కలిపి యిచ్చాను. మరొక కుండలో తియ్యని పెరుగన్నంనింపి యిచ్చాను. డెబ్బది యేండ్లు నా జీవిత కాలంలో నేను గావించిన దానం అదొక్కటి మాత్రమే.

మరణానంతరం నేను ప్రేతాన్నైనాను. నేను దానం చేసిన ఆ అన్నమే తింటున్నా. ఈ మహాప్రేతా లేవీ అలా దానం చేయనందున నా అన్నం తిని జీవిస్తున్నారు. నేను దానం చేసిన జలకుంభం అన్న కుంభం రోజూ మధ్యాహ్న వేళకు యిలాగే వస్తాయి. నేను తిననంతవరకు అక్షయంగా ఉంటాయి. నేను తిని నీరు త్రాగిన వెంటనే వెళ్ళిపోతాయి. నేను వెనుక దానం చేసిన గొడుగే ఈ జమ్మి వృక్షం నాకు నీడ యిస్తున్నది. నేను దానం చేసిన చెప్పులే ప్రేతాల రూపంలో నన్ను మోసికొని వెళ్లాయి. ఓ ధర్మజ్ఞా ! నా లోభి గుణాన్నీ, శ్రవణ ద్వాదశి వ్రత మహా ఫలాన్ని నీకు వివరించి చెప్పాను. ఇది ఎంతో పుణ్య వర్థకమైనది. ”ఆ మాటలు విని ఆ వణిజుడు యిలా అడిగాడు”-. దయచేసి నాకు భవిష్యత్‌ కర్తవ్యం కూడ చెప్పండి”. అంత నా ప్రేత పాలకు డిలా అన్నాడు – మిత్రమా ! వినుము. నీకూ నాకూ గూడ కల్యాణకరమైన విషయం చెబుతున్నాను. అనేక తీర్థాలతో కూడిన గయా క్షేత్రానికి వెళ్ళి శుచిగా స్నానం చేసి నాపేరు చెప్పి పిండ ప్రదానం చేయుము. దానితో నాకు ప్రేత దేహ విముక్తి కలుగుతుంది. సర్వదాతలు ఉండే లోకాలకు పోతాను. ఇక ఈ భాద్రపద శుద్ధ బుధ శ్రవణా నక్షత్రంతో గూడిన ద్వాదశి వ్రతం ఆచరించినచో అనంత సుఖాలు కలుగుతాయి సుమా. ”అలా చెప్పి ఆ ప్రేత నాయకుడా వణిజుని ప్రేత భుజాల మీద నెక్కించి ఆ ఎడారి దాటించి రమ్యమైన శూరసేన దేశానికి చేర్చాడు. అచట తన శక్తి సామర్థ్యంతో నావణిజుడు బాగా వ్యాపారం చేసి ధనం సంపాదించి పవిత్రమైన గయాశిరక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ప్రేత నాయకుడు చెప్పిన విధంగా అతనికీ అతని సహప్రేతాలకు నామ గోత్రాలతో ఆనుపూర్వికంగా పిండ ప్రదానం చేశాడు. తర్వాత తన పితృదేవతలకూ దాయాదులకు పిండ ప్రదానం చేసి ఆ బుద్ధిమంతుడు తిలలు లేకుండా తనకూ ఇతరులకు పిండదానం చేసుకున్నాడు.

ఓ నారదా ! అలా ఆ వర్తకుడు పిండ ప్రదానాలు చేసి నంతనే ఆ ప్రేతాలన్నీ ప్రేత యోని వదలి బ్రహ్మ లోకానికి వెళ్ళి పోయాయి. అతడు తన నగరానికి తిరిగి శ్రవణ ద్వాదశీ వ్రతాన్ని చేసి కాల ధర్మం చెందాడు. గంధర్వ లోకంలో చాల కాలం భోగాలనుభవంచి శాకల నగరంలో ఉత్తమమైన మానవ జన్మ పొందాడు. తన ధర్మాలు అనుష్ఠిస్తూ శ్రవణ ద్దాదశీ వ్రతాన్ని తప్పకుండా పాటిస్తూ దేహత్యాగం చేసి యక్షుడై యక్షలోకంలో అన్ని విధాల భోగాలు అనుభవించాడు. అనంతరం భూలోకంలో రాజునకు పుత్రుడై జన్మించి క్షాత్రధర్మం అనుష్ఠిస్తూ దాన భోగాసక్తుడై గోవులను విడిపించుటకై శత్రువులతో పోరాడి జయించి కాలం చేశాడు. అనంతరము యింద్ర లోకంలో దేవతల పూజ లందుకుంటా దుర్లభా లైన భోగాలనుభవించి పుణ్య క్షయం కాగా శాకలనగరంలో బ్రాహ్మణుడుగా జన్మించాడు. సర్వశాస్త్ర నిష్ణాతుడై ఒక ఉత్తమ సౌందర్య రాశి అయిన ద్విజ పుత్రికను పెండ్లాడు. చూచేందుకు వికారమైన రూపంతో ఉన్నందున ఆ కన్య విద్వాంసుడైన ఆ భర్తను ఏవగించుకుని అవమాననించుటతో చాలా దుఃఖించి అతడు యిరావతీ నదీ తటాన గల విష్ణుదేవుని ఆరాధించి అందమైన రూపాన్ని వరంగా పొందాడు. అచట నక్షత్ర పురుష వ్రత యుక్తంగా జన్మలో సుందరవిగ్రహుడై భార్యవద్దకు పోయి ఆమెతో సకల భోగాలూ అనుభవించాడు. పూర్వ జన్మ వాసనల వల్ల శ్రవణ ద్వాదశీ వ్రతాలు చేస్తూ ఆ ద్విజుడు కురూపియై కూడా భగవత్కృప వల్ల మన్మధరూపుడై మరణానంతరం పురూరవుడై జన్మించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment