నారదుడు ప్రశ్నించాడు : –
ఓ ద్విజోత్తమా ! ప్రహ్లాదుడు డే యే తీర్థాలలో పర్యటించాడు. ఆ వివరాలు సమగ్రంగా చెప్పండి.
ఆ వివరాలు చెప్పండి. అందుకు పులస్త్యుడిలా అన్నాడు. నారదా ! వినుము పాపపంకాన్ని క్షాళనం చేయ గలిగిన ఆ ప్రహ్లాదుని తీర్థ యాత్రా విశేషాలు చెబుతున్నా, ప్రహ్లాదుడు బంగారు పర్వతం మేరువును వదలి, భూలోకంలో దేవతలచే చుట్టబడి కళ్యాణ ప్రదంగా భావించ బడే మానస తీర్థానికి వెళ్ళాడు. ఆ సరస్సులోనే శ్రీహరి మత్స్య శరీరంతో ఉన్నాడు. అచట నా అచ్యతుని వేదోక్త విధిగా పూజించి ఉపవసించి దేవ ఋషి పితృ మానవులను అర్చించి పాప నాశిని యగు కౌశికీ తటాన గల కూర్మ భగవానుని దర్శించుటకు వెళ్ళాడు. ఆ మహానదిలో స్నానం చేసి జగన్నాధుని అర్చించి ఉపవసించి శుచియై విప్రులకు దక్షిణ లిచ్చాడు. ఆ కూర్మ మూర్తికి మరల ప్రణమిల్లి అక్కడ నుండి కృష్ణుడను పేరు గల హయ ముఖ విష్ణు దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ పవిత్ర సరస్సులో మునికి దేవ పితృ తర్పణాలు గావించి హయగ్రీవ మూర్తిని పూజించి అక్కడ నుండి పవిత్ర క్షేత్రం హస్తినాపురికి వెళ్ళాడు. అక్కడ విధ్యుక్తంగా స్నానం చేసి చక్రపాణి గోవిందుని పూజించి తర్పణాదులు వదలి లోకేశ్వరుడగు త్రివిక్రముని దర్శించాడు. అప్పుడు నారదు డిలా ప్రశ్నించాడు. ”మహర్షీ ! ఇదేమి ? ప్రస్తుతం వామన దేవు డావిర్భవించి బలిని బంధించి ముల్లోకాలను ఆక్రమించ బోతూండగా, యింతకు పూర్వకాలాననే ఆ త్రివిక్రముడు వెలసినట్లు చెబుతున్నారే, ఇది ఎట్లా పొసగ గలదు? అప్పుడు విష్ణు డెవరిని బంధించాడో తెలియ చేయండి. నారదుని ప్రశ్నకు పులస్తుడు యిలా చెప్పసాగాడు. వినవయ్యా చెబుతున్నాను. ఆ విష్ణువెవరో ఎప్పుడవతరించి ఎవనిని వంచించాడో వినుము. ధుంధుడు అనే కశ్యపముని ఔరసుడు దను గర్భాన ఉద్భవించాడు. వాడు మహా బలవంతుడు. అతడు బ్రహ్మను తపస్సు ద్వారా మెప్పించి యింద్రాది దేవతల చేత చావు లేకుండా వరం పొంది విజృంభించి స్వర్గం మీదకు వెళ్ళాడు. నాల్గవ కలి యుగా రంభంలో వాడలా విజృంభించి యింద్రాది దేవతలను పార ద్రోలి తనే ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. అది హిరణ్యకశిపుడు జీవించిన సమయం. ఆ ధుంధుని ఆశ్రయించి ఆ హిరణ్య కశిపుడు విక్రమించి, మందర గిరి ప్రదేశాన సంచారం చేస్తూవుండగా దేవతలందరూ దుఃఖార్తులై బ్రహ్మ లోకానికి వెళ్ళి పోయారు.
అలా దేవతలు బ్రహ్మలోకంలో ఉంటున్నారని విని ఆ ధుంధుడు దైత్యులతో యిలా అన్నాడు. మనం దేవతలను జయించుటకు బ్రహ్మ లోకానికి వెడ్దాము పదండి. ధుంధుని మాటలకు దైత్యు లిలా బదులు చెప్పారు. ఓ దైత్యశ్రేష్ఠా ! బ్రహ్మ సదనానికి వెళ్ళ గల శక్తి మనకు లేదు. ఆ మార్గం చాలా దుర్గమమైనది. యిక్కడకు అనేక వేల యేజనాల కవతల మహర్షులచే సేవించబడే మహ ర్లోకం ఉంది. ఆ మహర్షుల దృష్టి సోకినంత మాత్రాననే దైత్యులు దగ్ధమైపోతారు. అక్కడ గోమాత లుంటారు. ఆ గోవుల పాదరజం తాకినంతనే మనం భస్మమై పోతాము. అక్కడ కారు కోట్ల యోజనముల దూరాన తపస్వులచే నిండిన తపోలోకం ఉంది. అక్కడ ఉండే సాధ్య దేవతల నిశ్వాస మారుతపుతీవ్రతను మనం భరించి బ్రతుక లేము. దాని కావల ముప్నది కొటి యోజనాల దూరాన వేయి మంది సూర్యుల ప్రభతో వెలిగే సత్యలోకం ఉంది. దాని అధిపతియే నీకు వరాలు ప్రసాదించిన బ్రహ్మ. అక్కడి వేదధ్వని తరంగాలకు దేవతలు వికసిస్తారు. దైత్యులు వారి లాంటి యితరులు ముడుచు కుని పోతారు. కాబట్టి ఓ మహావీరా ! నీ సంకల్పం మానుకొనుము. వైరజ భువన ప్రాప్తి నరులకు ఎప్పుడూ దుష్కరమే ! వారల మాటలు విని ధుంధుడు మరల నా రాక్షసులతో నాకు బ్రహ్మ లోకానికి వెళ్ళి దేవతలను జయించాలని పట్టుదలగా ఉంది. ఏ కర్మలు చేస్తే మన మక్కడకు పోగలము ? సహస్రాక్షుడు దేవతలతో కలసి అక్కడకు ఎలా వెళ్ళ గలిగాడు ? ఆ రహస్యం ఉపాయం చెప్పండనగా వార లది తమకు తెలియదని శుక్రాచార్యులా రహస్యం చెప్ప గలరని అన్నారు. వెంటనే ధుంధుడు రాక్షస పురోహితుని బిలచి, ”గురుదేవా ! ఏ కర్మ చేస్తే బ్రహ్మలోక గమనం సిద్ధిస్తుందని అడిగాడు. అందుల కా శుక్రుడో నారదా ! యిలా చెప్పాడు ‘దైత్యేంద్రా ! పూర్వ కాలాన వృత్రాసుర శత్రువైన శక్రుడు పవిత్రమైన అశ్వమేధ యజ్ఞాలు నూరు ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావం వల్లనే అతడు బ్రహ్మ లోకానికి పో గలిగాడు.” శుక్రుని మాట విని ఆ మహావీరుడు నూరు అశ్వమేధాలు చేయాలని సంకల్పించు కున్నాడు. వెంటనే తన వార లందరనూ అసుర గురువును సమావేశ పరచి తన నిశ్చయం చెప్పాడు. ”నేను దక్షిణలతో సహా నూరశ్వమేధాలు చేయ నిశ్చయించాను. మన మందరం భూలోకానికి వెళ్లుదాము పదండి. అక్కడి రాజు లందరను ఓడించి అవసరమైన ధనరాసులు సేకరించుదాము. యక్షులను పిలిచి నవ నిధులు తెప్పించు కుందాము. పవిత్రమైన దేవికా తీరానికి ఋషుల నందరను పిలిపించండి. ఆ నది పరమ పవిత్రమైనది. సర్వసిద్ధి ప్రదాయని. దానికి తూర్పు తీరాన అశ్వమేధ దీక్ష వహిస్తాను.”
దేవ శత్రువు మాటలు విని అసుర పురోహితుడు సంతోషించి తధాస్తని ధనరాసుల కోసం ఆదేశించాడు. యజ్ఞ సంభారాలు చేరగానే ధుంధు దైత్యుడు పాప వినాశని దేవికా నదీ తూర్పు తటాన నొక శుభముహార్తాన భార్గవేంద్రుడైన శుక్రాచార్యుని చేత అశ్వమేధయాగ దీక్ష స్వీకరించాడు. ఆ యజ్ఞంలో భార్గవుని వంశానికి చెందిన విప్రులే బుత్విజులు సదస్యులుగా శుక్రుని అనుమతితో పాల్గొన్నారు. వారందరూ శుక్ర శిష్యులూ పండితులూనూ, రాహువు మొదలగు వారందరును శుక్రుని అనుజ్ఞతో ఆ రాక్షసేశ్వరుడు యజ్ఞశ్వాన్ని వదిలారు. దాని రక్షణకై అసిలోముడను మహాదైత్యుడు వెంట వెళ్ళాడు. ఆ మహాయజ్ఞ కుండంలో నుంచి బయలుదేరిన ధూమ పటలాలు భూమి మీద పర్వత వన సరిత్ర్ప దేశాలు మీద పది దిక్కులా వ్యాపించి స్వర్గాన్ని ఉద్యమించినాయి. స్వర్గాన్ని ఆవరించిన ఆ యజ్ఞ ధూమ వాసనలను వాయువు బ్రహ్మలోకం దాకా కొనిపోయాడు. ఓ నారదా ! ఆ యజ్ఞ గంధాన్ని ఆ ఘ్రణించి దేవతలు దిగాలు పడి అది హయమేధ దీక్షుతుడైన ధంధుని యజ్ఞశాల లోనిదని తెలుసుకున్నారు. చేయునది లేక భయవిహ్వలులై ఇంద్రునితో కలిసి సర్వలోకరక్షకుడైన జనార్దనుని వద్దకు వెళ్ళారు. వరదుడైన ఆ పద్మనాభ దేవునకు ప్రణమిల్లి చేతులు జోడించుకుని డుగ్గుత్తిక పడిన స్వరంతో యిలా విన్నవించుకున్నారు. ఓ దేవదేవ ! భగవన్ ! చరాచర రక్షకా ! సురార్తి హరణా ! విష్ణో మా మొర వినండి ! బ్రహ్మ దత్త వరాలచే విజృంభించి బలవంతుడైన ధుంధుదైత్యుడు, దేవతల నందరను జయించి స్వర్గరాజ్యం అపహరించాడు. వాడి అభ్యుదయాన్ని పినాకపాణి శివుడు దక్క యితరులెవ్వరూ నిరోధించజాల కున్నారు. అందుచేత ఉపేక్షించ బడిన రోగం వలె వాడింకా బలవంతుడై యిప్పుడు బ్రహ్మ లోక వాసులను కూడా జయించే ఉద్దేశ్యంతో శుక్రాచార్యుని మంత్రణతో శతాశ్వమేధ దీక్ష వహించాడు. ప్రభో ! ఇక ఏ మాత్రం ఆలస్య చేయకుండా ఆ దుష్టుని యజ్ఞం పూర్తి కాకుండా వెంటనే దానిని ధ్వంసం చేయు విధానం ఆలోచంచండి దానితో మా కష్టాలు తీరి పోతాయి.
దేవతల మాటలు విని మధుసూదనుడు వారల కభయ మిచ్చి పంపాడు. దైత్యుడజేయు డగుట నెరింగిన ఆ హరి మాయోపాయం చేత ఆ ధుంధుడిని, ధర్మనిష్ఠితుణ్ణి బంధించ వలెనని నిశ్చించు కున్నాడు. అంతట తానొక మరుగుజ్జు రూపం ధరించి దేవికా నదీ జలాల్లో దేహ త్యాగం చేసి ఒక కొయ్య లాగా పడి పోయాడు. ఏ ఆధారం లేకుండా అలా నీళ్లల్లో మునిగి వీడిన వెండ్రుకలతో పైకి లేస్తూ మునుగుతూ మళ్లీ తేలుతూ యాదృచ్ఛికంగా ఆ యజ్ఞ దీక్షితుడైన దైత్యుని కంట బడ్డాడు. వెంటనే యితర దైత్యులు బుత్విక్కులూ అంతా చూశారు. అంతట ఆ మునిగి పోతున్న బ్రాహ్మణ కుమారుని రక్షించేందుకై యజ్ఞ శాల వదలి ఆ బ్రాహ్మణులూ సదస్సులూ యజమాని ధుంధుడూ అందరూ నదిలోకి పరుగెత్తి మునిగి పోనున్న ఆ వామన బ్రాహ్మణుణి బయటకు లాగారు.అలా ప్రాణాలతో బయటపడిన ఆ మరుగుజ్జును చూచి సంతోషించి వారందరూ, నీవెవరవు ఎందులకు నీళ్ళలో పడిపోయావు. నిన్నెవరు నదిలో పడదోసిరంటూ ప్రశ్నలు వేశారు. వారల మాటలు విని వడవడ వణికి పోతూ ఆ బ్రాహ్మణుడు ధుంధునీ యితరులను చూచి యిలా అన్నాడు. ప్రభాసుడనే పేరు ప్రతిష్టలు గల గుణవంతుడైన బ్రాహ్మణ డుండెడి వాడు. ఆయన సకల శాస్త్ర విదుడు వారుణ గోత్రీకుడు. ఆయనకు మంద బుద్దులూ దుఃఖభాజనులైన పుత్రు లిద్దరు కలిగారు. వారిలో మొదటి వాడు నా అన్న పేరు నేత్రభాసుడు, రెండవ వాడి నైన నా పేరు గతిభాసుడు. ఓ రాక్షసేశ్వరా ! సంపన్నుడై బంధువులతో చక్కని గృహంలో ఉండేవాడు. ఆయన దివ్య గుణాలు కలిగి చక్కగా అంంగా ఉండేవాడు. చాలా కాలం తర్వాత ఆయన గతించగా మేమిర్వురమూ అంతిమ సంస్కరాలు కర్మలు యథావిధిగా చేసి యింటికి చేరాము. అంతట నేను మా అన్నను చూచి తండ్రి వదలిన ఆస్తిని పంచుకుందామని కోరగా మా అన్న నీకు భాగం లేదు. కుబ్జులకు, వామను (మరుగుజ్జు)లకు, కుంటివారికి నపుంసకులకు, కుష్టువారికి, పిచ్చి, గ్రుడ్డి వారలకు ఆస్తిలో భాగం ఉండదు. బ్రతకినన్నాళ్ళు తిండి తింటూ యింట్లో ఉండడమే నీ వంతు. కాబట్టి భాగం కోరే హక్కు నీకు లేదు. పొమ్మన్నాడు. అందుకు నేను ఎదురు తిరిగి నాకెందుకు భాగం రాదు ? ఏ న్యాయం ప్రకారం నాకు భాగముండదో చెప్పమని అడిగినంతనే మండిపడి అశక్తుడ నైన నన్నమాంతంగా ఎత్తి ఈ నదిలో పడేశాడు. ఒక సంవత్సరంగా ఈ నదీ జలాల్లో కొట్టుకొని పోతూ ఈనాడు మీ చేత రక్షించబడ్డాను. ఇది నా విషాదగాధ. ఇంత కారుణ్య భావంతో ఆత్మీయువలెనన్ను బయటకు తీసి రక్షించి ఆపద్భాంధవులైన మీరెవరూ చెప్పండి. అపర దేవేంద్రుడి లాగ వెలిగి పోతున్న ఈ మహా భుజుడెవరు ? యజ్ఞ దీక్షలో నున్నాడు. మహా సంపన్నులుగా ఉన్న దయామయులు మీరంతా ఎవరైనదీ చెప్పి పుణ్యం కట్టుకొనుడు.
అంత నా వామనుని మాటలు విని భార్గవులయిన బుత్విజులు ”మేము భృగు వంశీయు మైన బ్రాహ్మణులము. ఈ మహా తేజస్వి ధుంధు డను రాక్షస చక్రవర్తి. మహా భోగి మహా దాత మహా వితరణ శీలి, యజ్ఞ దీక్షలో నున్నా ”డని చెప్పారు. అంతట నా ద్విజులా దివ్య వామనునకు లాభకరమైన మాటలు ఆ ధుంధునితో యిలా చెప్పారు. ”ఓదైత్యేశ్వరా ! ఈతనికి సర్వోపస్కరాలతో శ్రీమంతమైన ఆవాసం వివిధరత్నాలు దాస దాసీ జనం యివ్వ దగుదువు. ” పురోహతుల మాటలు విని ఆ దైత్యవల్ల భూసురుడా వామనునితో బ్రాహ్మణోత్తమా ! నీకు వలసిన దంతయు నిచ్చెదను. కోరుకొనుము. యివి గోధనరాసులు, దాస, దాసీ జనాలు, ఇండ్లు, స్వర్ణరాసులు, రధగజతురగాలు. ఇవన్నీ యిస్తున్నాను తీసికొను”మని చెప్పాడు. దానవపతి వాక్యాలు విని భగవంతుడైన ఆ వామనుడు ధుంధునితో స్వార్థ సిద్ధి కరాలైన మాట లీవింధగ పలికాడు. తోడ బుట్టిన సోదరుడు అపహరించిన ఆస్తిని కాపాడుకోలేని అసమర్థుడు నీవిచ్చే ఈ ధనరాసులను రక్షించుకో గలడా ? వీటిని యితరులు అపహరించరా ? దైత్యేంద్రా ! ఈ దాన, దాసీలు, పరిజనం, గృహ, రత్న వస్త్రాదులన్నీ సమర్థుడైన విప్రోత్తమున కిమ్ము. నా శరీర ప్రమాణాన్ని దృష్టిలో నుంచుకొని అందులకు సరిపడు నట్టుగా మూడడుగుల చోటు యిమ్ము. అంతకు మించినది నేను రక్షించు కొన జాలను.
ఆ మహాత్ముని వచనాలు విని బుత్విజులూ ఆ దైత్యపతి నవ్వుకున్నారు. అతడు మరేమయు గ్రహించ నన్నందున ఆ ధుంధు రాక్షసుడు మూడడుగుల నేల ప్రదానం చేశాడు. ఆ మహాసురుడు, యశోధను డామూడుడుగులు యివ్వగానే అనంత శక్తుడైన ప్రభువు మూడడుగుల విరాడ్ స్వరూపాన్ని ధరించి, ముల్లోకాలూ ఆక్రమింపసాగాడు. ఆ రాక్షసుల నందరను హత మార్చి ఋషులకు ప్రణామం చేసి మొదటి అడుగుతో, సముద్రపర్వత పట్టణాలతో నిండిన భూమినంతనూ ఆక్రమించాడు. రెండవ అడుగుతో దేవతల నివాసమైన స్వర్గ సహితమైన భువర్గోకాన్నీ సూర్య చంద్ర గ్రహ నక్ష మండలంతో కూడిన నభో దేశాన్ని నింపి వేశాడు. అలా దివినీ భువినీ తొక్కి పెట్టి యిస్తా నన్న మూడో అడుగుకు చోటు లేక పోవటంతో భగవంతుడైన ఆ త్రివిక్రమ దేవుడు క్రోధాతిరేకంతో మేరు పర్వతం లాంటి తన శరీరంతో ఆ దానవవీరుని వీపుమీద పడిపోయాడు. నారదా! వాసుదేవు డలా దైత్యుని మీద పడిన వెంటనే ఆ ప్రదేశాన ముప్పది వేల యోజనాల మేరకు భూమిలో బ్రహ్మాండమైన గోయి ఏర్పడింది. అంతట నా దైత్యుని దేహాన్ని చీల్చి ఆ గోయిలోనికి విసరి వేసి బ్రహ్మాండమైన యిసుకను వర్షించి ఆ గుంటను పూడ్చి వేశా డాసుర సంరక్షకుడు. తర్వాత నా జనార్దనుని ప్రసాదం వల్ల శతక్రతువు తాను గోలు పోయిన స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొంది దేవతలతో కలిసి నిష్కంటకంగా పరిపాలించాడు. భగవంతుడగు నారాయణుడావిధంగా దైత్యేంద్రుణ్ణి యిసుక సముద్రంలో పూడ్చి వైచి ఆ ప్రదేశాన కాళిందీ రూపాన్ని ( నదిగా ) ధరిచి అంతర్థానమూ పోయాడు. మహర్షి ఈ విధంగా పూర్వ కాలంలో విష్ణు దేవుడు ధుంధు రాక్షసుని జయించుటకై త్రివక్రముడైనాడు. అలాంటి పవిత్రాశ్రమాని కా పుణ్యాత్ముడైన దైత్య నందనుడు (ప్రహ్లాదుడు) వెళ్ళాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹