పులస్త్యుడు తరువాతి కథ కొనసాగించాడు
ఓ నారదా! అలా దేవత లంతా స్వర్గం వదలిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్లిన తర్వాత బలి రాజేంద్రుడు ముల్లోకాలను ధర్మం తప్పకుండా పరిపాలించాడు. జగత్తు నంతా కృతయుగంగా మారిపోవడం గమనించిన కలి భయంతో తన స్వభావానికి తగినట్టుగా సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ కాళ్లు పట్టుకున్నాడు. అక్కడ యింద్రాది దేవతలు రాక్షసులతో కూడి బ్రహ్మ తన తేజస్సుతో, పరిసరాన్నంతా వెలిగింపజేస్తూ దర్శన మిచ్చాడు. బ్రహ్మ రెండు పాదాలు పట్టుకొని ఆ కలి, ‘ప్రభో! రక్షించండి. బలి నా స్వభావాన్నే నాశనం చేశాడని గోలపెట్టాడు. అది విని ఆ మహాయోగి విరించి, “పిచ్చివాడా! నీవొక్కడి స్వభావాన్నే కాదు, ఆ మహాబలి, మొత్తం లోక స్వభావాన్నే నశింపజేశాడు. చూడటం లేదా ? ఇరుగో యింద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, చివరకు సూర్యుడు కూడ ఎలా తేజస్సు కోల్పోయి కూర్చున్నారో! చూడు. ఈనాడు ఆ ఒక్క సహస్రశీర్షుడు నగు శ్రీహరి దక్క ఆ బలి అభ్యుదయాన్ని నిరోధించగలవాడీ మూడు లోకాల్లో మరొకడు లేడు.ఆ అవ్యయుడైన లక్ష్మీపతియే, ధర్మ నిరతుడైన ఆ బలి చక్రవర్తి రాజ్యం – భూలోకం స్వర్గం – సంపద కీర్తి అన్నీ హరించ గల సమర్ధు డని చెప్పగా విని ఆ కలి దీనవదనాలతో ఉన్న యింద్రాది దేవతలను చూచి చేయునది లేక విభీతక అరణ్యానికి వెళ్లాడు. నారదా! అలా ఆ కలి వినిర్గమించిన తర్వాత ముల్లోకాల్లో కృతయుగం వ్యాపించ, చాతుర్వర్ణాల వారిలోనూ ధర్మం నాలుగు పాదాలా నిలచింది. అహింస, తపస్సు, సత్యం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దయ, దానం, అక్రౌర్యం, సేవ, త్యాగరూపాలైన యజ్ఞకర్మలు సర్వత్రా వెల్లివిరిశాయి. నరపతులు అప్రమత్తులై ప్రజాపాలనం చేయ సాగారు. అలా ముల్లోకాలూ ధర్మం లో స్థిరపడి నిలవడంతో, వరదాత్రి అయిన త్రిలోకలక్ష్మి ఆ దానవేశ్వరుని కడకు వెళ్లింది. ఇంద్రుని వదలి తన వద్దకు వచ్చిన ఆ లక్ష్మిని చూచి బలి – ‘అమ్మా నీ వెవరు? ఎందుకు వచ్చినా వని ప్రశ్నించాడు.
ఆ బలి మాటలు విని కమలాల మాల ధరించిన ఆ లక్ష్మీదేవి యిలా అన్నది. “ఓ బలీ! నే నెవరైనదీ, రాణి నైన నేను విధి లేక నీవద్దకు ఎందుకు వచ్చినదీ చెబుతున్నా వినుము. అప్రమేయ బలశాలి అయని చక్రగదాధరుడు యింద్రుని వదలి వెళ్లి పోవడంతో నేను నీ వద్దకు వచ్చాను. ఆ జనార్ధనుడు సౌందర్యవంతులైన నలుగురు యువతులను నిర్మించాడు. వారిలో నొకతె తెల్లని రూపంతో తెల్లని వస్త్రాలు, తెల్లని మాలలు, పరిమళ వ్ర్యాలు ధరించి సత్వగుణ ప్రధానయై తెల్లని ఏనుగు మీద ఆసీనురాలై యుంటుంది. రెండవ యువతి రాజసగుణ ప్రధానయై ఎర్రని దేహకాంతితో, ఎర్రని వస్త్రాలు, పూల మాలలూ ఎర్రని చందన లేపనాలూ ధరిచి ఎర్రని అశ్వాన్ని ఎక్కి ఉంటుంది. ఇక తామస గుణాశ్రమురాలైన మూడవ యామె పసపు పచ్చని శరీర కాంతితో, పీతాంబరం, పీతమాల్యాలు, పీత గంధానులేపనం ధరించి బంగారు రథం మీద ఉంటుది. నాలుగవ రమణి త్రిగుణాత్మకురాలై నీల వస్త్ర నీలమాల్య నీలగంధ లేపనం ధరించి నల్లని వృషభం మీద శోభిస్తూ ఉంటుంది. వీరిలో సత్వగుణాత్మికయై శ్వేతవర్ణంలో శ్వేత గజారూఢయైయున్న సరస్వతి విరించి, చంద్రుడు, ఆయన అనుచరుల కడకు వెళ్లి చేరింది. రక్తవర్ణంతో రక్త వస్త్రాదులతో ఎర్రని గుర్రం మీద విరాజిల్లే రజో గుణాత్మికను దేవరాజైన యింద్రునకు మనువునకు ఆయన లాంటి వారలకు ప్రదానం చేశాడు (హరి). పీతాంబరాన్ని ధరిచిన కనకస్యందనం మీద నుండే సుందరిని ప్రజాపతులకు శుక్రాచార్యునకు వైశ్యులకూ యిచ్చాడు. నల్లని తుమ్మెద కాంతితో నీల వస్త్రాదులు ధరించి నీల వృషభాన్నెక్కిన నాలుగవ ఆమెను దానవులు, నిరృతులు, విద్యాధరులు, శూద్రులూ, గ్రహించారు. బ్రాహ్మణులు శ్వేతవర్ణాంగిని సరస్వతి అని పిలుస్తూ బ్రహ్మతో కలసి యజ్ఞ యాగాల్లో మంత్రాలతో స్తోత్రం చేస్తారు. ఓ దైత్య శ్రేష్ఠా! రక్తాంబర ధారిణిని క్షత్రియులు జయలక్ష్మి అని పేర్కొని మనువు యింద్రుడాదిగ గలవార లాయశస్వినిని కొని యాడుతుంటారు. బంగారు కాంతి గల సుందరిని వైశ్యులు ప్రజాపతులు, శుక్రుడూ లక్ష్మి అనే పేరుతో ఆరాధిస్తారు. దైత్య, విద్యాధర, శూద్రాదులు నీలవర్ణాంగిని శ్రీదేవి అంటూ భక్తితో స్తోత్రం చేస్తారు. ఈ విధంగా ఆ శంఖ చక్ర గదాధరుడా నలుగురనూ వేర్వేరుగా విభజించాడు.”అక్షయాలైన నిధులు ఈ నలువురు నిన్నా శ్రయించి యున్నవి. ఆ ప్రకారం ఇతహాస పురాణాలు, వేదాలు, వేదాంగాలు అరువది నాలుగు కళలు, శ్వేతకు సంబంధించినవి, మహాపద్మధిగా రూపొందినవి. వెండి, బంగారాలు, ముత్యాలు, రథాశ్వ గజ భూషణాలు, శస్త్రాస్త్రాదికాలు, వస్త్రాలు ‘పద్మ’నిధి అను పేర రక్తవర్ణాంగికి చెందినవి. గోమహిష సంతతులు, ఖర ఉష్ట్రాదులు, భూమి, ఓషధులు, పశువులు, ‘పీత’కు చెందినది మహానీలనిధి లోనివి. ఈ జాతులన్నింటికీ చెందినవి యింకా మిగిలి యున్నవీ అన్నీ కలిసి, నీలవర్ణాంగికి చెందినవై ‘శంఖ’ నిధిగా పరిగణింపబడతాయి. ఓ దానవ నీరా! ఈ నాలుగు శ్రేణులకు చెందిన మానవుల ప్రత్యేక లక్షణాలు యిక తెలుసుకొనుము. చెబుతున్నాను. సత్య, శౌచ, నిరతులై, మఖ దానాది క్రియలలో వినోదించు నరులు మహాపద్మనిధి నాశ్రయించువారు. దర్పం అభిమానాలతో యజ్ఞాలు చేస్తూస్పురద్రూపులై ఉదారంగా దక్షిణలొసగుచూ సర్వసామాన్య సుఖాలనుభవించు వారు పద్మవిధికి చెందినవారు. మహానీలనిధికి చెందిన నరులు సత్యాలు, అసత్యాలు పలుకుతూ, దానం చేయుటలోను, సంపాదనలోను ఆసక్తి కలవారై, న్యాయ, అన్యాయపరులై ఉంటారు. ఇక శంఖనిధికి సంబంధించిన వారలు నాస్తికులు, శౌచహీనులు, కృపణులు (లోబులు) భోగవిముఖులై చౌర్య, అనృతాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఓ బలీ! ఈ నిధులకు చెందిన మానవుల స్వరూప స్వభావాలు చెప్పాను. ఆ నలుగురు యువతులలో రజో ప్రాధాన్యం కలిగిన ‘జయశ్రీ’ అను దానను నేను. నిన్నాశ్రయించ వచ్చతిని. సాధు జనులను మోహించిన నా ప్రతిజ్ఞ ప్రకారం నేను మహాశౌర్య నిధులగు వారినే దప్ప నపుంసకుల ఎడ కన్నెత్తి గూడా చూడను. శౌర్యంలో నీతో సమానుడుగా నిన్ను మించిన వాడు గానీ ముల్లోకాలలో ఎవడూ లేడు. నీ యీ బలాధిక్యాన్ని చూచి మురిసి పోయి వచ్చాను. యుద్ధంలో విక్రమించి యింద్రుని సైన్యం నిర్జించిన మహావీరుడవు.
“ఏవం గుణ సంపన్నుడవైన నీ అపూర్వ సత్త్వం, సర్వాధిక మానిత్వ శౌండీర్య వీర్యాలు చూచి పరమ ప్రీతితో నీ వద్దకు వచ్చాను. దైత్య శిరోమణీ! హిరణ్యకశిపుని వంగడంలో జన్మించిన నీ విలాంటి ఘనకార్యాలు చేయడంలో ఆశ్చర్య మేమాత్రమూ లేదు. నీ ప్రపితామహుడైన దితిజుడు కూడ పరు లపహరించిన త్రైలోక్య రాజ్యలక్ష్మిని, శత్రు నిర్మూలనం గావించి విక్రమించి వశ పరచుకున్నాడు! ఈ విధంగానే దానవేంద్రుడగు బలికి తన విషయం వివరించి సర్వత్రా వెలుగు వెన్నెలలు వెదలజల్లుతూ ఆ చంద్రముఖి యగు జయలక్ష్మి ఆ చక్రవర్తి యింట్లో ప్రవేశించి విభూతులు ప్రదర్శించింది. వెంటనే హ్రీ (లజ్జ) శ్రీ, ధీశక్తి, ధృతి(దైర్యలక్ష్మి) కీర్తి, ప్రభ (వెలుగు) మతి, క్షమా, ఐశ్వర్యం, విద్య, నీతి, దయ శ్రుతి, స్మృతి, యశోమూర్తి, శాంతి, క్రియాశక్తి, పుష్టి, తుష్టి, రుచి, సత్వాశ్రయాలైన యితర మంగలకర సిద్ధులన్నీ బలి అండ జేరి సుఖంగా విశ్రమించాయి. సద్భుద్దీ సుబుద్ధీ అయిన ఆ మహనీయు డగు బలిరాజేంద్రుడు అలా సకల విభూతులు తన్నాశ్రయించగా మృదుభాషి, మధురభాషి, సత్యభాషియై తపో యజ్ఞాలు చేస్తూ భూరి దానాలు చేస్తూ, తన వారలను రక్షించుకుంటూ, త్రిలోకపాలనం గావించాడు. మహర్షే! ఆదానవేంద్రుని ఆదర్శ పరిపాలనలో ప్రజ లాకలి దప్పిక లేరుగరు. దైన్య మాలిన్యాలంటూ ఎక్కడా లేవు. మానవ సమాజ మంతా నియమ పాలనం చేస్తూ ధర్మవిహితంగా సుఖాలనుభవిస్తూ ద్విగుణీకృతమైన శోభతో విరాజ్లిల్లింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹