Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – డెబ్భై ఐదవ అధ్యాయం

పులస్త్య వచనము : –

ఓ నారదా ! బాణుడు యుద్ధభూమికి తిరిగి రావడంతో యితర దైత్య వీరులు కూడ తమ తమ శస్త్రాస్త్రాలతో యుద్ధోత్సాహులై తిరిగి వచ్చారు. మహా తేజస్వి అయిన విష్ణువు బాణుడు (బలిసుతుడు) అజేయుడని తెలిసికొని దేవతలతో తలపడగా, తాను అంతర్థానమై పోయాడు. జనార్దునుడు వెళ్లిపోవుట తెలిసికొన్న శుక్రాచార్యుడు ఆనందంతో – ఓ బలీ! గోవిందుడు దేవతలను వదలి వెళ్లాడు. ఇది మంచి అవకాశం. నీవు విజృంభించి వారలను జయించుమని’ బలిని ఆదేశించాడు. పురోహితుని మాటలకు సంతోషించి ఆ బలిదైత్యుడు గద తీసికొని దేవతల మీద విరుచుపడ్డాడు. బాణుడు తన వేయి చేతులతో పెక్కు ఆయుధాలను ఉపయోగించి వేలాది దేవతలను సంహరించాడు. మయదానవుడు తన మాయను విస్తరించి నానా రూపాలు ధరించి దేవ సైన్యాన్ని చిందర వందర చేయసాగాడు. విద్యుజ్జిహ్వుడు, పారిభద్రుడు, వృషపర్వుడు, శతాక్షుజు, విరూపాక్షుడు, విక్షరుడు మొదలగు వీరులంతా దేవసైన్యాన్ని చెండాడసాగారు. అలా దానవుల చేత పరాజితులై యింద్రాది దేవతలంతా విష్ణువు లేకుండుట చూచి వెనుకంజ వేశారు. అలా విరిగిపోయిన దేవ సైన్యాన్ని బలి బాణాదులు వెన్నంటి తరిమి వేశారు. ముల్లోక విజయానికి సన్నద్ధులయిన ఆ అసురుల దెబ్బలకు తాళలేక దేవతలు స్వర్గాన్ని వదలి పెట్టి బ్రహ్మలోకానికి వెళ్లిపోయారు. అలా యింద్ర సమేతులై దేవతలు బ్రహ్మనెలవు వెళ్లడంతో పుత్ర మిత్ర బంధు పరివారంతో సహా బలి నిష్కంటకమైన స్వర్గానికి అధిపతి అయ్యాడు. ఓ నారదా! యింద్ర పీఠాన్ని కైవసం చేసుకొని బలి ఇంద్రుడయ్యాడు, బాణుడు యముడయ్యాడు. వరుణుడుగా, మయుడు, చంద్రుడుగా రాహువు, అగ్నిగా హ్లాదుడు, సూర్యుడుగా స్వర్భానుడు ఆయా అధికారాలను చేజిక్కించుకున్నారు. బృహస్పతి స్థానానికి శుక్రుని అభిషేకించారు. తక్కిన అధికార లితర దైత్యులకు యిచ్చారు. అయిదవ కలి ద్వాపరయుగాల సంధి కాలంలో ఆ భయంకరమైన దేవాసుర సంగ్రామం జరిగి బలి శుక్ర పదవి నలంకరించాడు. సప్త పాతాళాలు భూర్భువస్సు వరాది త్రిలోకాలు వశం గావించుకుని దశలోకాధిపతిగా విఖ్యాతి పొందాడు. స్వర్గ సింహాసనాన్ని అధిరోహించి ఎనలేని దుర్లభ సౌఖ్యాలననుభవించ సాగాడు. విశ్వావసు మొదలయన గంధర్వులు గానంచేస్తూ ఉంటే, తిలొత్తమాదిగా గల అప్సరసలు నాట్యం చేసేవారు. యక్ష కిన్నర వద్యాధరులు వివిధ వాద్యాలు మేళవించి ఆ బలి రాజేంద్రుణ్ణి సంతోషపెట్టేవారు.

అలా దైత్యేశ్వరుడైన బలి వివిధ స్వర్గభోగాలు అనుభవించి ఒకనాడు తన పితామహుడు పరమభాగవతుడునగు ప్రహ్లాదుని మనసారా స్మరించాడు. మనుమడు స్మరించి నంతనే ఆ అసురోత్తముడు పాతాళా న్నుంచి త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. అలా వచ్చిన తాత గారిని చూడగానే బలి సింహాసనం దిగి రెండు చేతులూ జోడించుకున ఆ మహనీయునకు సాష్టాంగ పడి మ్రొక్కాడు. చరణాల కడ పడియున్న ఆ మహావీరుని ప్రహ్లాదుడు ప్రేమతో లేవ నెత్తి కౌగలించుకొని శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చున్నాడు. సుఖోపవిష్టుడైన పితామహుని చూచి బలి యిలా అన్నాడు. “పితామహా! తమ అనుగ్రహం వల్ల నా బలాధిక్యత ప్రదర్శించి యింద్ర రాజ్యాన్ని సంపాదించాను. అలా గెలిచిన ఈ త్రిలోక రాజ్యాన్ని తమ రునుభవించండి. నేను భృత్యుడనై సేవ చేస్తాను. తమ చరణాబ్జ పూజచేస్తూ తమ ఉచ్ఛిష్టాన్నం భుజిస్తూ జీవించ గలిగినచో నా అంతటి భాగ్యశాలి మరొక డుండబోడు. ప్రభో! తమబోటి మహనీయుల సేవలో గల్గు తృప్తి సార్ధకత్వం, ఈ రాజ్య పాలనంలో నాకు కలగడం లేదు.”ఓ ద్విజోత్తమా! అలా బలి పలికిన మాటలు విని, ప్రహ్లాదుడు ధర్మ కామార్థ సాధకా లియన వాక్యాలు చెప్పాడు. “చిరంజీవీ! నేనాడో బంధు మిత్ర పరివారంతో నిష్కంటకంగా సకల విధాలయిన రాజ్యభోగాలు అనుభవించి , సకల గౌరవాలు పొంది, యధేష్టంగా దాన ధర్మాలు చేసాను. పుత్రులను కన్నాను. ఆ భూలోకాధిపత్యాన్ని వదలి యప్పుడు యోగసాధనలో నున్నానయ్యా! నీవు నాకు సమర్పిచిన ఈ రాజ్యాన్ని తిరిగి నీ కిస్తున్నాను. ఇదేవిధంగా పెద్దలను సేవిస్తూ నీవు ఈ రాజ్యాన్ని పరపాలించుము.’ అలా అని తన కుడిచేతిలో మనుమని చేయిపట్టుకుని తిరిగి అతనిని ఇంద్ర సింహాసనం మీద కూర్చుండ బెట్టాడు. నారదా! ఆ బలి మహేంద్రుని సర్వ రత్న భూషితమైన సింహపీఠం మీద కూర్చొని మఘవాను (ఇంద్రు)ని వలె ప్రకాశించాడు. అలా సింహాసనం మీద కూర్చొని చేతులు జోడించి మేఘ గంభీ స్వరంతో తాతగారిని యిలా అడిగాడు. “తాతా! ముల్లోక రాజ్య పరిరక్షణ చేస్తూ, ధర్మార్థ కామ మోక్ష సాథకాలయిన కర్తవ్యాలు ఏ విధంగా నేను అనుష్టించ వలెనో దయచేసి ఆదేశించండి” ఆ మాటలందుకుని శుక్రాచార్యుడు గూడ “ఓ మహాభుజా! యోగ్యమైన కర్తవ్యం ఉపదేశించండి” అంటూ ప్రహ్లాదుని అర్థించాడు.

బలి శుక్రుల అభ్యర్ధన నాలకించి ఆ భాగవత దైత్యుడు, ధర్మార్థయుక్తమైన ఉత్తమ ఉపదేశం యిచ్చాడు. “వత్సా ! రాజువైన నీవు, భవిష్యత్తులో నిలచి లోకానికి హితం కలగుజేసే కార్యాలు చేయ దగుదువు. ధర్మానికి విరుద్ధం కాని విధంగా, ధనము నార్జించుము. కామ్యసాధనం ఎల్లరకు అనుకూలంగా యిహపరాల్లో శ్రేయం కలిగే విధంగా ఆచరించుము. ఓ మహామతీ! అడుగడుగున శ్లాఘింపబడునట్టుగా, కీర్తి కలుగునట్లుగా, అపయశస్కరంకాని విధంగా కర్మాచరణము చేయుము. ఉత్తములగువారు, తమ యిండ్లలో వృద్ధులు, మిత్రులు, చుట్టాలు, జ్ఞాతులు, గుణవంతులు, బ్రాహ్మణులు గౌరవింపబడుటకు పేరు ప్రతిష్ఠలు కలుగుటకే సరిసంపదలను కాంక్షిస్తారు. అర్ధహీనులను ఆదుకొనుటకే అర్ధోపార్జనం చేస్తారు. కాబట్టి పుత్రా! నీ రాజ్యంలో ఉత్తమ కులజులూ, యోగ్యులగు తదితరులూ, నిశ్చింతగా నివసించుటకు తగిన ఉత్తమ కార్యాలు చేస్తూ నీ యశస్సు దశదిశలా వ్యాపించు నట్టు నడుచు కొనుము. ఎల్లపుడూ భూమి బ్రాహ్మణులతో నలకంరింప బడి, క్షత్రియులతో పరివృతమై సస్యమమృద్ధమై, సేవాభావం గల వారితో కళకళలాడుతూ ఉన్నపుడే, దానిని పరిపాలించు రాజులకు అభివృద్ధి కనుకు రాజుకూ, రాజ్యానికీ కల్యాణం కలిగే పవిత్ర యజ్ఞ యాగాదులు, ఉత్తములూ శ్రుతి శాస్త్రవేత్లూ చేయునట్టుగా, వారు దివ్యమైన క్రతువులూ తపస్సూ చేయునట్టుగా, విప్రుల కనుకూల మగు వాతావరణం నెలకొల్పుము. యజ్ఞాగ్ని ధూమం వల్లనే రాజులకు శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. కనుక నోబలీ! నీ రాజ్యంలో నీ అనుజ్ఞతో ఎల్లెడలా తపస్సంపన్నులూ, యజనంయాజనం అధ్యాపనం చేసే విప్రోత్తములు, పూజార్చనలు అందుకొను నట్లుగా యత్నింపుము. శస్త్రోపజీవు లగు క్షత్రియులు, వేదాధ్యాయనం యజ్ఞాలు చేస్తూ, వదాన్యులై ప్రజాపాలనం చేయునట్లుగ ప్రోత్సహించుము. వాణిజ్య ప్రవీణు లగు వైశ్యులు దాతలై యజ్ఞాధ్యాయనం యజ్ఞాలు చేస్తూ వదాన్యులై ప్రజాపాలనం చేయునట్లుగ ప్రోత్సహించుము. వాణిజ్య ప్రవీణులగు వైశ్యులు దాతలై యజ్ఞాధ్యయనాలు చేస్తూ వ్యవసాయం పశుపాలనం చక్కగా నిర్వర్తించు నట్లు జాగ్రత్త వహించుము. బ్రాహ్మణ, క్షత్రయ, వైశ్యులకు వారల ధర్మ నిర్వహణంలో సేవా సహకారాలు అందిస్తూ నీ ఆజ్ఞాను కారులై శూద్రులు మెలగునట్లు చూచుకొనుము. చతుర్వర్ణాల వారు తమ తమ ధర్మాలు చక్కగా ఆచరించిన నాడు ధర్మ వృద్ధి కలుగుతుంది. ధర్మవృద్ధితో రాజులు అభ్యుదయం చేకూరుతుంది. కనుక నీ రాజ్యంలోని వారంతా స్వధర్మ నిరతులగు నట్లు పాటుపడుము. ధర్మహానియే రాజ్యహానికి హేతువని పెద్దల నిర్ణయం. “తన పౌత్రున కిలా హితోపదేవం చేసి ఆ మహనీయుడు ముగించాడు. ఓ నారదా! ఆ బలి చక్రవర్తి,”తమ ఆదేశం తలదాల్చుతున్నా” నని చేతులు జోడించాడు.

ఇది వామన పురాణంలో నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment