పులస్త్యుడిలా అన్నాడు : –
అలా నడుము విరిగిన దైత్యసేనను చూచి శుక్రాచార్యుడంధకాసురునితో ”నోవీరా ! రమ్ము నేటికి యింటికి మరల వచ్చి ఈ మందరగిరిమీద హరునితో పోరాడుదమ”నగా నాతడు, ‘బ్రహ్మర్షి ! తమరు చెప్పునది యుక్తముకాదు. నా కుల గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపి యుద్ధభూమిని విడచి రాజాలను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నా అమోఘ వీర్యాన్ని ప్రదర్శించి నేడు ఇంద్రమహేశ్వరులతోసహా దేవదానవ గంధర్వుల నందరనూ జయిస్తాను. చూస్తూండండి. అని ఆ హిరణ్యాక్ష నందనుడు తనసారథిని బుజ్జగిస్తూ యిలా అన్నాడు. మృదువచనాలతో ఓ మహావీరా సారథీ ! మన రథాన్ని శంకరుడున్న వైపుకు నడపుము. నా బాణ పరంపరతో ఈ ప్రమథామర వాహినులను పరిమార్చెదను. అంధకుని మాటలు విని సారథి అట్లని ఉత్తమాశ్వాలను చండ్రకోలతో గట్టిగా ప్రహరించాడు. మహా వేగంతో పరుగెత్తే ఆ అశ్వాల నడుములు నొప్పిపెట్టగా ఎంతగా ప్రయత్నించినా వేగమందుకోలేకపోయాయి. కుంటుకుంటు మెల్లగా రథాన్ని లాగుతూ మందర శైలం మీద ప్రమథుల సేనను సమీపించేసరికి సంవత్సర కాలం పట్టింది. అంతట నా అంధకుడు ప్రచండమైన ధనుస్సు నెక్కుబెట్టి తన బాణ వృష్టితో ఇంద్రోపేంద్ర మహేశ్వర సహితంగా ప్రమథదేవ గణాలందరనూ ముంచివేశాడు. త్రిలోకరక్షకుడైన చక్రపాణి జనార్దనుడు బాణాలతో కప్పబడిన ఆ సైన్యాన్ని చూచి వారలతో యిలా అన్నాడు. ఓ దేవశ్రేష్ఠులారా! అలా చూస్తూ కూర్చున్నారెందుకు? లేవండి. వీరు చచ్చినప్పుడే మనకు జయం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. విజయం పొందదలచినచో నేను చెప్పినట్లు చేయండి. సారథితో సహా వీని అశ్వాలను మట్టుబెట్టండి. రథాన్ని విరగ్గొట్టి శత్రువును విరథుణ్ణి గావించండి. అప్పుడు హరుడు వీడిని దగ్ధంగావిస్తాడు. ఈ దుష్టుణ్ణి ఏమాత్రం ఉపేక్షించ గూడదు.” అని హెచ్చరించినంతనే ఆ ప్రమథ దేవగణాలు యింద్రుడు విష్ణువు తోడు పడగా సన్నద్ధులయ్యారు.
జనార్దనుడగు విష్ణువు రెప్పపాటు కాలంలో తనగదతో కాటుక కొండల్లాంటి గుర్రాలను వేయింటిని మట్టుపెట్టాడు. గుర్రాలు చావగానే స్కందుడు సారథిని ఒడిసిపట్టి తనశక్తితో గుండెలు చీల్చి నేలమీద విసిరికొట్టాడు. సారథి నేలగూలుటతో వినాయకాది ప్రమథులు యింద్రాది దేవతలు చక్రాలు యిరుసు కేతనంతో సహా రథాన్ని ముక్కలుముక్కలు గావించారు. అంత మహాతేజస్వియగు నా దానవుడు రథాన్నీ ధనుస్సును వదలి గదను తీసుకొని దేవతల మీదకు లంఘించాడు. ఏడెనిమిదడుగులు వెళ్ళి నిలబడి, శివుని చూచి వేఘగంభీర స్వరంతో హేతుబద్ధంగా యిలా అన్నాడు. ”ఓ భిక్షూ ! నీ కిందరు సహాయ పడుచుండగా నేనసహాయుడుగా నిలచిపోయాను. అయినా నిన్ను జయించి తీరుతాను. చూడు నా పరాక్రమం! అంధకుడి మాటలు వింటూనే శంకరుడు ఇంద్రుడు బ్రహ్మతో సహా ఆ దేవతల నందరను తన దేహంలోకి వేసుకున్నాడు. అలా అందరనూ తన శరీరంతో ఉంచుకొని శంకరుడు, ”అరే ! దుష్టా ! రారా; నేనూ ఒక్కడనేరా !” అని వాడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అలా సర్వామర గణాలు క్షణంలో మటుమాయం కావడంచూచి అబ్బురపాటుతో వాడు గదను తీసుకొని శివునిమీదకు దూకాడు. వాడు తనవైపు వేగంగారావడంచూచి హరుడు వృషభాన్ని దిగి శూలపాణియై గిరిప్రస్థం మీద నిలబడ్డాదు. వాడు దగ్గరకు రాగానే త్రిలోక భయంకర మైన భైరవ రూపం ధరించి వాడిని హృదయంలో పొడిచాడు. ఓ మునీ! ఆ సమయాన భయంకరమైన దంష్ట్రలతో, కోటి సూర్యుల కాంతిలో పులితోలు జటాజూటం ధరించి, మెడలో నాగహారాలు వేలాడుతుండగా పది బాహువులతో మూడు నేత్రాలతో శివుడు ఆ శాశ్వతుడు, శుభంకరుడు. భాతభావనుడు వెలిగిపోయాడు. తన వక్షఃస్థలంపగిలినా ఆ మహాదైత్యుడా భైరవ మూర్తిని శూలంతో పాటు ఎత్తుకొని క్రోశం దూరం పారిపోయాడు ! అంత నా భగవంతుడు తమాయించుకొని, మహావేగంతో వాడిని గదతో గూడ శూలానికి గ్రుచ్చి చీల్చాడు. ఆ దైత్యుడు కూడ గదతో హరుణ్ణి నెత్తిమీద ప్రహరించాడు. శివుని చేతిలోని శూలం లాగుకొని ఎగిరి దూకాడు. ఆ సర్వాధారుడు. యోగేశ్వరుడైన ప్రజాపాలకుడు శత్రుగదాఘానికి చిట్లిన తలతో నిలబడగా ప్రణం నుండి నాలుగు ధారలుగట్టిరక్తం కారింది. తూర్పుదిశగా కారిన ధారనుంచి, పద్మమాలాధరుడై అగ్నిసమప్రభతో విద్యారాజనే భైరవుడు బయలుదేరాడు.
దక్షిణం వైపు కారి రక్తధారనుండి నల్లని కాటుక కాంతితో ప్రేతాలను అలంకరించుకొని కాలరాజనే భైరవుడు ఉద్భవించాడు. పశ్చిమాన ప్రవహించిన ధారనుండి దిరిసెన పువ్వు కాంతితో ఆకులతో అలంకరించుకొని కామరాజు భైరవుడు వచ్చాడు. మరొక భైరవుడు సోమరాజనువాడు ఉత్తర దిక్కుధారనుంచి శూలం చక్రం మాలను ధరించి బయలు దేరాడు. రక్తసిక్తమైన గాయంనుండి ఇంద్రధనుస్సు కాంతితో శూలంపట్టుకొని స్వచ్ఛంద రాజనే భైరవుడు రాగా భూమి మీద పడిన రక్తం నుంచి సౌభాంజన కాంతితో శూలపాణియై లలిత రాజను భైరవుడు నిర్గమించాడు. వీరు సప్తభైరవ మూర్తులు కాగా నో నారదా ! విఘ్నరాజు అష్టమ భైరవుడుగా ఎన్నబడుతున్నాడు వీరలను భైరవాష్టకంగా స్మరిస్తారు. వీరలు పరివేష్టించి యుండగా నా ప్రధాన భైరవమూర్తి త్రిశూలి, ఆ అంధకుడి దేహాన్ని శూలగ్రాన గ్రుచ్చి ఎత్తి ఛత్రం లాగా ధరించాడు ! ఓ బ్రహ్మర్షీ ! ఆ అంధకుడి శరీరం నుండి ధారాపాతంగా రక్తం ప్రవహించి. శూలపాణి అయిన ఆ సప్తభైరమూర్తి మహాదేవుణ్ణి కంఠం వరకు ముంచివేసింది. అప్పుడు విపరీతమైన అలసట వల్ల శంకరుని ఫాలభాగం నుంచి చెమట బిందువులు జారగా వానినుండి రక్తసిక్తమైన దేహంతో నొక బాలిక ఉద్భవించింది. శివుని ముఖాన్నించి కారిన స్వేదబిందువులు భూమిమీద పడగా అందులో నుంచి ఎర్రటి నిప్పు కణాల్లాంటి బాలకుడు పుట్టాడు. గొంతు ఎండి పోతున్న ఆ బాలకుడా అంధకుని రక్తాన్ని గటగటా త్రాగేశాడు. ఆ కన్యకూడ అద్భుతం గొల్పుతూ ఆ రక్తాన్ని నాలుకతో లపలపమంటూ నాకివేసింది. నారదా! అప్పుడు ఆ భైరవమూర్తి శంకరుడు బాలసూర్యుని కాంతితో ఉన్న ఆ బాలికను చూచి లోకహిత కాంక్షతో యిలా అన్నాడు. ఓ కల్యాణీ: నిన్నికమీద దేవ, పితృ, ఋషి, ఉరగ, యక్ష విద్యాధర, మనుష్యాదులంతా భక్తితో పూజిస్తారు. ఎల్లప్పుడు నీకు బలులు పుష్పాంజలులు అర్పించి స్తోత్రపాఠాలు చేస్తారు. రక్తలేపనం గల దానవగుటచే నిన్ను చర్చిక అనే చక్కని పేరుతో పిలుస్తారు. ”ఈ విధంగా వరదాయకుడైన ఆ పరమేశ్వరునిచే అనుజ్ఞాతయై ఆ భూతాల చెల్లెలు చర్చిక, సింహపు చర్మం ధరించి, భూమి నలువైపులా సంచరించి ఉత్తమ మైన హైంగులతాద్రికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తరువాత నా వరదేశ్వరుడు భూమినుంచి పుట్టిన బాలకుడు కుజునకు సర్వోత్తమమైన వరం యిస్తూ, ఓ మహాత్మా! నీకీనాటినుండి శుభాశుభకరమైన గ్రహాధిపత్యం యిస్తున్నా. దీనితో జగత్తు మీద ఆధిపత్యం కలిగి ఉంటావ”ని అభినందించాడు. అనంతరం వేయి దివ్య సంవత్సరాల వరకు సూర్యాగ్నిమయాలైన తన నేత్రజ్వాలలతో భగవంతుడైన నా భైరవుడా అంధకుని శరీరంలోని రక్తమాంసాదులను శుష్కింప జేశాడు ! వాడిలో చర్మం ఎముకలు మాత్రమే మిగిపోయాయి. పరమశివుని నేత్రాగ్నిలో అంధకుడు తన పాపాలన్నీ భస్మం గావించుకొని పరిశుద్ధుడయ్యాడు. సర్వేశ్వరుడు, సర్వరూపి, అవ్యయుడు, త్రిలోకపతి, వరదాయకడు, సర్వదేవతలకు ఆరాధ్యుడు నైన ఆ మహాదేవుని నిజతత్వం వానికి అవగతమైంది. అంతట చేతులు జోడించుకొని, ఆ దేవుణ్ణి, శరణ్యుణ్ణి యిలా స్తోత్రం చేశాడు.
అంధకుడిలా ప్రార్థించాడు : – ప్రభో ! భీమరూపివగు నో భైరవా ! నీకు నమస్కారము ! త్రిలోకరక్షకా ! శిత శూలపాణీ ! నాగేంద్రహారా! దశభుజధారీ! త్రినయనా! దుర్బుద్దినైన నన్ను కాపాడుము ! సర్వేశ్వరా ! విశ్వరూపా ! నీకు జయమగుగాక ! సురాసుర వందితచరణా, ముల్లోకాలకూ తల్లితండ్రీ అయిన వృషకేతనా! నేను భయంతో నీ అండ జేరితిని. నాకు శరణోసంగుము ప్రభో ! నిన్ను దేవతలు శివుడని కీర్తిస్తారు. సిద్ధులు హరుడవనీ మహర్షులు స్థాణుడవనీ యక్షులు భీముడవనీ, మానవులు మహేశ్వరుడవనీ భజిస్తారు. భూతగణాలు భూతనాథుడవనీ నిశాచరులు ఉగ్రుడవనీ. పుణ్యులు పితరులూ భవుడంటూ నీకు ప్రణతులౌతారు. హరా ! నా పాపాలు హరించు! నీకు దాసుడను ఓ లోకేశ్వరా నన్ను రక్షించుము ! త్రిదేవులు, త్రియుగాలు, త్రిధర్మాలు, త్రిపుష్కరాలు (కమలాలు) త్రివేదాలు, త్రయ్యారుణి, – ఇలా త్రిస్వరూపుడవగు త్రినేత్రుడవు నీవే ! ఓ అవ్యయా ! నన్ను పవిత్రుని గావించి రక్షింపుము. మూడు విధాలా నా చికేతాగ్నివి నీవు. త్రిపదప్రతిష్ఠ గాంచిన వాడవు. వేదాంగవేత్తవు. విషయాలకు అతీతుడవు. ముల్లోకాధిపతివి కళ్యాణ రూపివి, నీకు శరణాగతుడనైనాను. నా భయం పోగొట్టి నన్ను రక్షించుము. ఓ మంగళాకారా ! ఘోరశత్రుడైన కామునకు లొంగిపోయి నేను భయంకరమైన అపరాధం చేశాను. ఓ సర్వ భూతాధీశ్వరా ! గిరీశా ! నీకు శిరసా వందనం చేస్తున్నాను. నా యెడల ప్రసన్నుడవు కమ్ము ! నేను పాపిని, కరుడు గట్టిన పాపాన్ని, పాపంలోనుంచి పుట్టాను. నా ఆత్మ పాపపంకిలమైంది. అలాంటి నన్ను సర్వపాపహరుడవైన భవా ! ఈశానా ! రక్షింపుము! ప్రభూ! నీవే సర్వకారణుడవు. నన్నీవిధంగా పుట్టించావు. కనుక తండ్రీ ! నామీద కోపింపవద్దు. పాపాచారులుగా సృష్టించావు. నా పట్ల కరుణించుము. ప్రసన్నుడవుకమ్ము! నీవే కర్తవు, ధాతవు, జయానివి, మహాజయానివి ! శుభానివి నీవు ప్రణవ ఓంకారం నీవు ధ్రువమై క్షయంలేని తత్వానివి సర్వనియంతవు. బ్రహ్మవు నీవు, పాలించే విష్ణువునీవు; ఈశ్వరుడవు ఇంద్రుడవు వషట్కారానివి ధర్మానివి సర్వమూ దేవేదేవుడవైన నీవే ! సూక్ష్మానివి వ్యక్తానివి అవ్యక్తానివి అన్నీనీవే. స్థావరజంగమాత్మకమైన విశ్వాన్నంతా ఆవరించియున్న ఈశ్వరుడవు నీవే. నీవువిజయుడవు సహస్రనేత్రుడు విరూపాక్షుడవు మహాభుజుడవు అనంతుడవు సర్వవ్యాపివి ప్రాణస్వరూపివైన హంసవు. నీకు చ్యుతి లేదు. గీర్వాణుల నేతవు నీవు శాంతుడవు రుద్రుడవు, పశుపతివి. శివుడవు, త్రయీ (వేదాలు) వేద్యుడవు, త్రయీమయుడవు. క్రోధాన్ని జయించావు. యింద్రియ విజేతవు. అరిషడ్వర్గాన్ని జయించావు. ఓ జయరూపా త్రిశూలధరా! శరణుజొచ్చిన నన్ను రక్షించుము.”
పులస్త్యుడిలా చెప్పాడు : ఓ నారదా ! ఆ విధంగా దైత్యాధిపతి చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ పింగళాక్షుడా హిరణ్యక్ష పుత్రునితో యిలా అన్నాడు. ”అంధకా! రాక్షసాధిపా ! నీవు సిద్ధుడవైనావు. నేను సంతోంషించాను. అంబిక దక్క మరేదైనా వరమడుగుము. ఇచ్చెదను నీకు భద్రమగుకాక!” అదివిని అంధకుడు, ”ప్రభో! నేటినుండీ అంబిక నాకు తల్లి త్రినేత్రుడే తండ్రి. ఆ మాతృశ్రీ చరణారవిందాలకివే వందన శతాలు! ఓ ఈశ్వరా! వరదా! నేనింతవరకు మనసా వాచా చేసిన దుష్టాలోచనలు, దుర్భాషలు, శరీరంతోచేసిన దుష్కృత్యాలు అన్నీ విలయమై పోవునట్లనుగ్రహించుము. జన్మతః నాకు సంక్రమించిన దానవ భావం నశింపజేసి నీ పాదపద్మాలపట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు తండ్రి !” అని ప్రార్థించాడు. అందులకు పరమశివుడు ప్రీతుడై అట్లే అగుగాక! నీపాపమంతా నశించి పోతుంది. నీలోని దైత్య బుద్ధి వదిలించి. నేటి నుండీ నీవు భృంగి అనుపేర గణాధిపతి వయ్యావని వరమిచ్చి త్రిశూలాగ్రాన్నుంచి క్రిందకుదించాడు. వాని శరీరంలోని వ్రణాలన్నింటీని తన చేతితో నిమిరి మాన్పి. ఆరోగ్యవంతుని చేశాడు. అంతవరకు తన శరీరంలో దాచుకొన్న బ్రహ్మాది దేవతల నందరను బయటకు రమ్మని పిలువగా ఆ మహానీయుయులందరూ బయటకు వచ్చి ఆయనకు నమస్కరించారు. అంతట నాత్రిలోచనుడు నందితో సహా గణాలనందరనూ సమావేశపరచి వారలకు భృంగిని చూపి యితడు గణాధిపతి. వెనుకటి అంధకుడు కాడని కంఠోక్తి గావించాడు. గణాధిపత్యం పంపాదించి రక్తమాంసహీనుడై ఎండియున్న ఆ దానవేశ్వరుని చూచి అందరు నా వృషభద్వజుని ప్రశంసిచారు. అంతటనా గౌరీవల్లభుడా దేవతల నందరను ఆలింగనం చేసికొని ”మీమీ నెలవులకు వెళ్ళి సుఖ భోగాలనుభవించుడు, ఇంద్రుడు మాత్రం శుభంకరమైన మలయగిరికి వెళ్ళి తన కార్యం నిర్వర్తించుకొని ఆ మీద స్వర్గానికి వెళ్ళగలడని” వారలకు వీడ్కోలు పలికాడు. పిమ్మట పితామహునకు నమస్కరించి జనార్దనుని కౌగిలించుకొని వీడ్కోలిచ్చాడు. వారంతట త్రివిష్టపానికి వెళ్ళిపోయారు. శతక్రతువు మలయగిరిలో తన కార్యం చక్కబెట్టుకొని దివికి వెళ్లిపోయాడు. అలా ఇంద్రాది దేవతలనందరను పంపివైచి భగవంతుడగు శివుడు ప్రమథ గణాలనందరను యథోచితంగా గౌరవించి అనుమతించగా వారందరు తమతమ వాహనముల మీద శుభ లోకాలకు వెళ్ళారు. నారదా! అక్కడవారు కామధేనువులు, కల్పవృక్షాలు, అమృతనదులు, వెన్నతెట్టెలు గట్టే పాలసరోపరాల మధ్య మహాభోగాలనుభవించారు.
ఓం! శత సహస్ర ప్రణామాలు. భవానీ మాతకు..భూత భవిష్యాలలో లోక ప్రియం గావించే లోక ధాత్రికి, జనయిత్రికి, స్కందమాతకు, మహా దేవ ప్రియురాలికి నమస్సులు! సకలధారిణికి, క్షీర ప్రదాయినికి, చైతన్య రూపిణికి త్రిలోక జననికి వందనాలు! ఓ ధరిత్రీ, దేవమాతా, యజ్ఞరూపిణీ, వేద రూపిణీ, స్మృతి, దయా, లజ్ఞా, కాంతి రూపిణీ! క్రోధ అసూయారూపిణీ! మతీ! సదాపావనీ! దైత్యసైన్యనాశినీ, మహామాయా, వైజయంతీ! సుశుభా! కాళరాత్రీ! గోవింద సోదరీ, హిమవన్నగపుత్రీ, సర్వదేవ పూజితే! సర్వ భూత గణార్చితే! విద్యే! సరస్వతీ! త్రినేత్రజాయే! మృడానీ! సర్వశరణ్యా ! నీకు శరణాగతుడను. నన్ను రక్షించుము! నీకు నమస్సులు!” అంధకుడిలా స్తోత్రం చేయగా సంతోషించి ఆ విభావరి, కాంతిమతి ”పుత్రా! లేలెమ్ము! సంతోషించాను. కావలసిన వరం కోరుకొమ’న్నది. అందులకా భృంగి, ”ఓపార్వతి తల్లీ! త్రికరణాలానే చేసిన పాపాలు నశింపజేయుము. అంబికే! ఈశ్వర చరణాల పట్ల నాకు ఎల్లపుడు భక్తిస్థిరంగా ఉండునట్లనుగ్రహించు”మని ప్రార్థించగా నామె తథాస్తని ఆ హిరణ్యక్షపుత్రుణ్ణి దీవించింది. వాడు హరుని ఆరాధించి గణాధిపతి అయ్యాడు. ‘ఓనారదా! ప్రాచీన కాలంలో విరూపాక్షుడైన పరమశివుడు మహోగ్రమైన భైరవరూపం దాల్చి అంధక మహాదైత్యుడి మద మణిచి, తన కత్యంత భక్తుడైన భృంగిగా మార్చిన ఈ అద్భుత గాధ నీకు వినిపించాను! ఇది పుణ్యప్రదమైనది; పవిత్రమైనది; కళ్యాణములు వర్షించునది; శివ భక్తిని వర్థిల్ల జేయునది; ఉత్తములగు బ్రాహ్మణులు, ధర్మము, ఆయురారోగ్య సంపత్తులు కాంక్షించు వారల సదా కీర్తించ దగినది. అని పులస్త్యుడు ముగించాడు.
ఇది శ్రీ వామన మహాపురాణములో నలుబది నాల్గవ అధ్యాయము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹