Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – డెబ్బయ్యవ అధ్యాయం

పులస్త్యుడు చెప్పప్రారంభించాడు :-

ప్రమథుల చేతిలో హతమైన తన సైన్యాన్ని చూచి ఆ అంధకుడు రాక్షసగురువైన శుక్రుని సమీపించి యిలా అన్నాడు. ”భగవన్‌! తమ అండ చూచుకొని మేము దేవ కిన్నర గంధర్వాదులను సంహరిస్తున్నాము. బ్రహ్మర్షీ! ఇటు చూడుడు. నాచే రక్షితమైన సేన అంతయు ప్రమథులచేత పరాభవింపబడి అనాథవలె పారిపోయి వచ్చింది. నా సోదరులయిన కుజంభాదులు చనిపోయారు. ఓ భార్గవా! ఇక ప్రమథులో కురుక్షేత్రం ఫలం లాగా అక్షయంగా ఉన్నారు. కాబట్టి మేము శత్రువుల చేతిలో పరాజయం పొందకుండా తగిన ఉపాయం చేయండి. అంధకుని మాటలు విని, దేవర్షీ ! ఆ బ్రహ్మర్షి దానవేశ్వరునితో అద్భుత వచనాలు పలికాడు. అంధకా ఊరడిల్లుము. నీమేలుకోసం యత్నిస్తాను. నీకు ప్రియం కలిగిస్తాను. అలా ఓదార్చి ఆ కవి, శుచియై సంజీవని విద్యను విధివిధానంగా వినియోగించగా అంతకు ముందు యుద్ధంలో చనిపోయిన దైత్యదానవ శ్రేష్ఠులంతా లేచి కూర్చున్నారు. కుజంభాది దైత్యులు మరణించి మరల లేవడం యుద్ధానికిరావడం చూచి నందీశ్వరుడు శంకరునితో ఇలా అన్నాడు. మహాదేవా ! ఈ అద్భుతాన్ని ఆలకించండి. అనూహ్యంగా అసంభవమైనది. చచ్చిన వారలు మరల బ్రదుకుట సంభవించినది. ప్రమథుల శక్తిశౌర్యాల వల్ల యుద్ధంలో మరణించిన దైత్యులనందరనూ భార్గవుడు తనవిద్యచేత బ్రతికించాడు. ఆ విధంగా మేము గాంచిన మహత్‌ సంగ్రామమంతా వ్యర్థం గావించబడింది. నంది మాటలు విని శివుడు స్వకార్యసిద్ధికై అతనితో నీవు వెళ్ళి ఆ శుక్రుని నా ఎదుట గొనిరమ్ము. నేను సమయోచితంగా మాటలాడి అతనిని నిరోధించెదనని, వానిని పంపాడు. అలా శంకరునిచే ఆదేశింపబడి ఆ గణాధిపతి అయిన నంది, శుక్రుని పట్టుకొనుటకై రాక్షస సైన్యం వద్దకు వెళ్ళాడు.

అలా వస్తూన్న నందిని చూచి రాక్షసవీరుడైన హయకంధరుడాయనను అడ్డగించాడు. అడవిలో సింహాన్నెదిరించిన లేడిలాగ తనకెదురైన ఆ దైత్యునిమీదకు లంఘించి నంది, నూరు అంచులుగల తన వజ్రాయుధంతో మోది మూర్చబడగొట్టాడు. వానిని తప్పించుకొని వస్తూన్న నందిని కుజంభ, జంభ, బలి, వృత్ర, ఆయఃశిరులను అయిదుగురు దైత్యశార్దూలాలు చుట్టుముట్టారు. మయుడుహ్లాదుడాదిగా గల యితర దానవ వీరులు గూడ అనేక ఆయుధాలు చేపట్టి నందిమీద దాడిచేశారు. అలా ఆ రాక్షసవీరులచే దెబ్బలు తింటూన్న ఆ గణాధిపతిని ఆకాశంలో నిలబడి బ్రహ్మమొదలయిన దేవతలు చూచారు. ఆ పరిస్థితి గమనించిన బ్రహ్మ యింద్రునితో, వెళ్ళండి మీరంతా వెళ్ళి ఈ అదనున శంకరునకు సహాయపడండని పంపాడు. దానితో యింద్రాదులంతా వాయువేగంతో శివసైన్యానికి బాసటగా ఆకాశాన్నుంచి ఊడిపడి నిలచారు. మహానదులంతా త్వరత్వరగా మహాసముద్రంలోపడి కలిసినట్లా దేవతలు శివసైన్యంలో పడి కలిసిపోవడంతో భయంకరమైన ఘోషతో యిరువర్గాలు తలపడ్డాయి. ఆ గందరగోళంలో తప్పించుకుని ఆ నందీశ్వరుడు వెళ్ళి రథంమీద నుంచి సింహం కుందేలును లాగినట్లు శుక్రుణ్ణి ఒడిసి పట్టుకొని, ఆయన రక్షణ కోసం వచ్చిన వారందరినీ నేలబడగొట్టి శివుని ముందుతెచ్చి పడవేశాడు. ఆ శుక్రుని అమాంతంగా శివుడు తన నోటిలో వేసికొని మింగివేశాడు. అలా శివుని ఉదరంలో బంధింపబడి ఆ భార్గవుడు భక్త్యాదరాతలో నా మహాదేవుని యిలాస్తుతించాడు. ”హరా! వరదా! గుణశాలీ నీకు నమస్కారము. శంకరా త్ర్యంబకా మహేశా నీకు నమస్సులు, జీవనా! లోకేశ్వరా! వృషాకపీ! మదనాంతకా! కాలనాశనా! వామదేవా నీకు అంజలులు! స్థాణూ, విశ్వరూపా, సదాగతీ, వామనా, మహాదేవా శర్వా! ఈశ్వరా నమోవాకములు. త్రినేత్రా హరా, భవా శంకరా ఉమాధవా, జీమూతకేతూ, గూహావాసీ, స్మశానప్రియా, భస్మధరా, శూలధరా పశుపతీ గోపతీ తత్పురుషోత్తమా! నీకు మాటిమాటికీ నమస్సులు. ఇలా స్తోత్రం చేసిన శుక్రుని పట్ల ప్రీతుడై శంకరుడు వరము కోరుకోమనగా నతడు నీ ఉదరం నుండి బయటపడునట్లు అనుగ్రహించమని వేడుకొన్నాడు. అంతట హరుడు తన నేత్రాలు మూసికొని, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా ! నా కడుపులోనుండి బయటకు వెళ్ళుమని ఆదేశించాడు. అలా శివుని ఉదరంలో నుండి బయటకు వచ్చుటకు ప్రయత్నిస్తూ అందులో పాతాళాది భూవనాలను సాగరాలను సచరాచర జీవులను ఆదిత్య రుద్ర వసు విశ్వదేవాదులను యక్షకిన్నర గంధర్వాప్సరస సమూహాలను, మునులను, మనుష్యులను చూచి, పరిభ్రమించసాగాడు.

శివుని ఉదరంలో తిరుగుతూ ఆ భార్గవుడు పశుకీటపిపీలికాలను వృక్షగుల్మలతాదులను ఫలమూలాలను ఓషధులను స్థల జలచరాలను అనిమిషులను నిమేషులను, చతుష్పాదులను, ద్విపాదులను, వ్యక్తావ్యక్త సగుణ నిర్గుణ ప్రాణులను చూస్తూ అత్యంత కౌతుకంతో ఒకే దివ్య సంవత్సరకాలం తిరుగాడుతూ నడపినా బయట పడేదారి కనుగొనలేకపోయాడు. ఓ నారదా! అలా తిరిగి తిరిగి అలసిపోయి కర్తవ్యం తోచక భక్తితో ఆ పరమ శివునకు శరణాగతుడై ఇలా ప్రార్థించాడు. ”ఓ మహారూపా! అక్ష సూత్రాలను ధరిచిన విశ్వమూర్తీ సహస్రాక్షా మహాదేవ ప్రభో! నీకు శరణాగతుడనయ్యాను. ఓ శంకరా శర్వాశంభో సహస్ర నేత్ర చరణధరా భుజభూషణా! నీ విశాల హృదయంలో సకల భువనాలను దర్శించి అలసిపోయి నీ పాదలకడ ఆత్మ సమర్పణం చేస్తున్నాను. నన్ను కరుణించుము”. శుక్రుని దీన పరిదేవనం విని మహాత్ముడగు శంభుడు నవ్వి ఇలా అన్నాడు. ”భార్గవా! నీవునాకు పుత్రుడవైనావు. నా శిశ్నంద్వారా బయటకు రమ్ము. ఇతర విచారాలన్నీ మానుము. నేటి నుంచి నీవు ‘శుక్రు’డనే పేరుతో చరాచర జీవులందరకు స్తపనీయుడవు అవుతావు”. అలా చెప్పి శంకరుడా భార్గవుని శిశ్న మార్గాన బయటకు వదిలాడు. అలా శిశ్న ద్వారాన వెలువడి భార్గవుడు శుక్రమహానుభావుడుగా ఖ్యాతుడయ్యాడు. అంతట నాతడు శర్వునకు ప్రణమిల్లి త్వరగా రాక్షస సేనలోకివెళ్ళి చేరాడు. తమ గురువు తిరిగి వచ్చినందులకా దానవులంతా సంతోషించి గణాధిపతులతో మరల యుద్ధానికి సన్నద్దులయ్యారు. శివగణాధిపతులు గూడ దేవగణాలతో కలిసి ఆ దానవులతో విజయకాంక్షతో సంకుల సమరం గావించారు. ”ఓ తపోధనా ! పరస్పర జయకాంక్షతో తలపడిన వారల పోరు భయంకరమైన ద్వంద్వ యుద్ధంతో మరింత ఘోరమైంది. అంధకుడు నందితో, ఆయఃశిరుడు శంకరునితో, బలి కుంభధ్వజునితో, విరోచనుడు నందిషేణునితో , అశ్వగ్రీవుడు విశాఖునితో, వృత్రుడు శాఖునితో, బాణుడు నైగమేయుడగు బలునితో తలపడ్డారు. మహా వీర్యుడగు వినాయకుడు గండ్రగొడ్డలి ధరించి రాక్షస శ్రేష్ఠుడు తుహుండునితో ఢీకొనగా దుర్యోధనుడు మహాబలి ఘంటాకర్ణునితో పెనుగులాడ మొదలుపెట్టాడు.

హస్తి కుండోదరునితో, హ్లాదుడు వీరుడైన ఘటోదరునితో, ఇలా ఆ పరాక్రమవంతులైన రాక్షసులు ప్రమథులు పరస్పరం ఓ దేవర్షీ! వందల దివ్య సంవత్సరాలు యుద్ధం చేశారు. అంత వరకు ప్రక్కన నిలబడియున్న ఇంద్రుడు వజ్రాయుధంతో యుద్ధానికి రాగా జంభుడను మహాదైత్యుడాయనను అడ్డగించాడు. శంభుడను దైత్యుడు బ్రహ్మతో, కుజంభుడను వీరుడు, రాక్షసాంతకుడూ మహౌజసుడునగు విష్ణువుతో, శాల్వుడు వినస్వంతునితో, త్రిశిరుడు వరుణునితో ద్వైమూర్ధుడు వాయువుతో, రాహువు చంద్రునితో, విరూపధృక్‌ మిత్రునితో పోరు సాగించారు. ధరుడు మొదలుగా గల వసువులెనమండుగురూ, శరభ, శలభ, పాక, పృథు, విపృథు, వాతాపి యిల్వలులను ఎనిమిది మంది మహా దైత్యులతో సంగ్రామం సాగించారు. విష్వక్సేనుడాదిగాగల విశ్వదేవగణాల వారినందరనూ అసహాయ శూరుడైన కాలనేమి అనే రాక్షసుడొక్కడే ఎదుర్కొన్నాడు. విద్యున్మాలి అనే మహాదైత్యుడొక్కడే రణ కుతూహలంతో ఏకాదశ రుద్రులమీద విరుచుకపడ్డాడు. నరకుడు అశ్వినులతో, ద్వాదశాదిత్యులతో శంబరుడు, నివాతకవచ లిర్వురు, మిగిలిన సాధ్యులతో మరుత్తలతో తలపడి పోరు సాగించారు. ఈ విధంగా ప్రమథులు, దేవతలు దానవవీరులతో వేలాది జంటలుగా నేర్పడి ఆరువది దివ్యసంవత్సరాల కాలం ఘోరంగా పోరాడారు. అయినా ఆ ప్రమథామరులను, రాక్షసులు నిర్జింపజాలక తమ మాయను గప్పి వారందరనూ మ్రింగివేశారు. అలా ప్రమథులను దేవతలను రాక్షసులు మ్రింగివేయగా నా మందరగిరి శిఖరం నల్లని వర్షాకాలపు మేఘాలతో కప్పబడిన కొండకొమ్ములాగా కనిపించిది. రాక్షసుల మాయను గ్రిహించిన మహేశ్వరుడుగ్రుడై ఒక్క పర్యాయం గట్టిగా ఆవులించాడు. ఆయన ఆవులింత గాలి సోకినంతనే ఆ మహా దానవులంతా ఆలస్యం (సోమరితనం) తో స్పూర్తిని కోల్పోయి మెల్లగా గొణుగుకుంటూ వికారంగా తమ నోళ్ళను తెరచి, చేతుల్లోని ఆయుధాలను జారవిడిచి, ఆవలించసాగారు. అలా ఆ దైత్యులంతా నోళ్లు తెరవగానే వారలు మ్రింగిన ప్రమథులు దేవతలూ అందరూ , ఆకులతో వాళ్ళ శరీరాల్లో నుంచి బయటపడ్డారు. కారుమేఘాల్లాంటి రాక్షసుల నోళ్ళ నుంచి దేవతలు ప్రమథులు తమ సహజ నేత్ర కాంతులతో బయట పడటంతో, మెరుపు తీగ లతో నిండిన మేఘాల్లాగ ఆ దృశ్యం శోభించింది. ఓ తపోధనా! అలా బయటపడిన దేవతలు ప్రమథులు యినుమడించిన క్రోధంతో మరల దానవులతో యుద్ధం చేయసాగారు.

అంతట శర్వ రక్షితులైన ఆ ప్రమథ దేవగణాల చేతిలో దానవులు వరసగా రాత్రింబవళ్ళు మాటిమాటికి చావు దెబ్బలు తిని ఓడిపోయారు. అప్పుడు ఏడు వందలేండ్ల తర్వాత, సంధ్యోపాసన చేసేందుకు అష్టాదశ భుజమలు ధరించి శివుడు, నిశ్చయించుకొని , సరస్వతీ నదిలో విధి పూర్వకంగా స్నానంచేసి, ఆచమనం చేశాడు. భక్తియుతుడై దోసిలిలో పుష్పాలు తీసికొని సమర్పించాడు. శిరస్సు వంచి, ”హిరణ్య గర్భే” త్యాది మంత్రాలు జపిస్తూ సూర్యుడు ప్రదక్షిణంగావించాడు. అంతనా శూలపాణి- ‘ఓత్వష్టా ! నీకు నమస్సుల’ నిస్ఫుటంగా ఉచ్చరిస్తూ, బాహు దండాలు త్రిప్పుతూ భావగంభీరంగా నృత్యం చేయసాగాడు. పరమ శివుడలా నాట్యం చేయుట చూచి భావిహ్మలులై ప్రనుథులు దేవతలందరూ ఆయనతో బాటు నృత్యం చేయసాగారు. ఆ విధంగా తృప్తిగా సంధ్యోపాసనం సాంధ్య నృత్యం నిర్వర్తించి ఆ దేవాధిపుడు రాక్షసులతో మరల యుద్ధానికి సిద్ధపడ్డాడు. అలా త్రినేత్రుని అండ చూచుకొని, దేవప్రమథగధాలు భయమంటూ లేకుండా విజృంభించి, దైత్య దానవులందర్నీ పరాజితులను గావించారు. తన బలాలు విరిగిపోవడం శంకరుడజేయుడుగా నిలవడం చూచి అంధకుడు సుందున పిలిచి యిలా అన్నాడు. ”ఓ మహా వీరా సుందా! నీవు నా సోదరుడవు ! అన్ని విధాల విశ్వసించదగినవాడవు. నేను చెప్పునది విని నీకు చేతనైనంతగా సాయపడవలయును. రణ నిష్ణాతుడైన ఈ శంకరుడితర కారణాలవల్ల దుర్జయుడుగా ఉన్నాడు. ఆ శైల పుత్రియోమో నా మనస్సు దోచుకున్నది. అందుచేత మన మిద్దరము వేషాలు మార్చి ఆ చారుహాసిని వద్దకు వెళ్లుదము. పద, నేను శివుని రూపం ధరిస్తా, నీవు నందిగా మారిపో. అలా వెళ్లి వంటరిగా నున్న ఆమెను అనుభవించి తిరిగి వచ్చి దేవగణాలను సంహరిస్తాను. ”అందుకు మంచిదని హర్షించి ఆ సుందుడు మాయ చేత నందిగా మారాడు. అంధకుడు యుద్ధపు గాయాలతో ఉన్న శివుని రూపం ధరించి మాయ నందితో మందరగిరిమీద శివుని నివాసానికి అదురు బెదురు లేకుండా వెళ్లాడు. నంది చేయి పట్టుకొని యుద్ధపు వ్రణాలతో నింటికి వస్తున్న ఆ అంధకుని దూరాన్నుంచి చూచి ఆ గిరి కన్యా, వారిద్దరు కూర్చొనగా, మాలిని జయలతో యిలా అన్నది. ”జయా! చూచావా, నాకోసం యుద్ధం చేసి అలసిపోయి గాయాలతో స్వామి వచ్చాడు. వెంటనే నేను స్వయంగా చికిత్స చేస్తాను. నీవు నిలవ వుంచిన పాత్ర నేయి, పెరుగు, ఉప్పు, బీజికాదులు తీసుకరమ్ము. అవి కలపి నూరి గాయాలకు పట్టిస్తా. త్వరగా వెళ్ళు”

అంతనా జయ, ఓ యశస్వినీ ! అలాగే నీ భర్త గాయాలకు చికిత్స చేయవమ్మా అన్నది. అంతట తన ఉత్తమాసనం నుంని లేచి ఆ గిరజ శివుడని భ్రమించి వానికెదురుగా వెళ్ళింది భక్తితో. ఆ శూలపాణి రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించగా యిరు పార్శ్వాలు నుండవలసిన వృష చిహ్నాలు లేకుండుటతో, ఆ మాయా విగ్రహాన్ని దానవుడుగా గుర్తించి ఆ పార్వతి వెంటనే అట నుండి పారిపోయింది. దేవి అంతర్యాన్ని పసిగట్టిన ఆ అంధకుడు సుందుని వదలి ఆ హరురాణిని వేగంగా వెంబడించాడు. ఎటు పోయిననటు వచ్చుచున్న ఆ దైత్యుని చూచి కాళ్లు తడబడగా ఆ గిరికన్య భయ విహ్వలయై యిల్లువదలి బయట ఉద్యానవనంలోకి పరుగెత్తినది. ఆ సఖులు గూడ భయంతో ఆమె వెంట పరుగెత్తారు. ఓ మునిశ్రేష్ఠా కామంతో కళ్లు కప్పిన ఆ అంధకుడు విడువక ఆమెను అక్కడకు గూడ అనుగమించాడు. ఆ దేవి తపో వ్యయానికి భయపడి వానిని శాప దగ్ధుడిని చేయకుండా తానొక తెల్ల జిల్లేడు చెట్టు మొదలుతో లీనమైపోయింది. సఖులు గూడ చెట్ల పొదల్లో అదృశ్యమై పోయారు. ఓ మునీ! అంతటవాడామె నశించినదని తలచి సుందుని చేయి పట్టుకొని మరల తన సేనను కలిశాడు. యుద్ధం మరింత తీవ్రంగా సాగింది. అంతట దేవగణ శ్రేష్ఠుడైన శ్రీ విష్ణువు, శివునకు ప్రియము చేయుటకై చక్రగధాధరుడై రాక్షస బలాన్ని ఊచకోత కోయసాగాడు. శార్‌ఙ్గధనుస్సు నుండి బయలుదేరిన ఆయన బాణాలొక్కొక్కటీ, అయిదుగురిని, ఆరుగురినీ, ఏడుగురినీ, ఎనిమిది మందినీ, ఆ చీకట్లను చేధించే సూర్యకిరణాల్లాగా గ్రుచ్చి సంహరించాయి. ఆ శ్రీహరి కొందరను గదతో, మరెందరినో చక్రధారలతో మృత్యువు పాలుగావింనాడు. కొందరను హలంతో మెడలు పట్టి లాగి రోకటిపోట్లతో తలల బ్రద్దలుగొట్టాడు. ఎందరినో తన చూపులతోనే యమసదనానికి పంపాడు. ఇక వైనతేయుడు తన పక్షాఘాతాలతో వజ్రంలాంటి ముక్కుతో వక్షంతో దొరికిన రాక్షసులందరినీ దునుమాడాడు. ఇక ఆది పురుషుడైన ముసలి బ్రహ్మ తన విశాలమైన కమలంతో బ్రహ్మబలాన్ని, సమస్త పుణ్యతీర్థాల సారాన్ని ప్రోక్షించి దేవగణాలవారికి శతాధిక గజాలశక్తిని చేకూర్చుతూ ఉంటే, ఆ అఘమర్షణ జలబిందువులే పిడుగుల్లా తగిలి దానవులు కొండ శిఖరాల్లాగ కూలిపోసాగారు.

అలా బ్రహ్మ విష్ణులు యుద్ధం జేయడం రాక్షసులను సంహరించడంచూచి ఇంద్రుడుకూడా వజ్రాయుధం పట్టుకొని యుద్ధానికి దిగాడు. ఆయనను చూచి ఖలుడను అసురసత్తముడు తాను యుద్ధం చేస్తూన్న గదాభరుణ్ణీ విమానస్థుడైన బ్రహ్మను వదలి ఇంద్రుని మీదకు పిడికిలి బిగించి లంఘించాడు. దేవదానవుల కజేయుడైన ఆ బలశాలి మీద దేవరాజు వేయి అంచులు గల తన వజ్రాన్ని గిరగిరి త్రిప్పి బలంకొద్దీ పోరాపో! మూర్ఖా ఈ దెబ్బతో చచ్చావంటూ విసిరివేశాడు. ఆ వజ్రమా బలుని నెత్తికి తగిలి వేయిముక్కలయిపోయింది. నారదా! అంతట నా బలుడు యింద్రునెదుర్కొనగా నాతడు భయంతో రణం వదలి వెనుకముఖంపట్టాడు. అతనిని చూచి జంభుడు ముందుకు వెళ్ళి, నీవు దేవతల ప్రభువువైయుండి యిలా యుద్ధం వదలి వెళ్ళడం యుక్తంకాదు. నిలునిలువుమంటూ ఎదుర్కొనగా నా దేవపతి త్వరత్వరగా విష్ణువు వద్దకు వెళ్ళి ”ప్రభూ! నీవు నా స్వామివి. నేను శరణాగతుడను. నిరాయుధుడనైన నన్ను జంభుడు తరుముతున్నాడు. భగవన్‌! ఆయుధమేదైనా త్వరగాయివ్వండని వేడుకున్నాడు. అందులకా విష్ణువు ఓ యింద్రా నీ గర్వం టెక్కూ వదలి వెళ్ళి అగ్ని దేవుని వేడుకో. ఆయన ఆయుధం యిస్తాడని పంపాడు. జనార్దనుని మాటవిని పరుగుపరుగున అగ్నివద్దకు పోయి ఆ దేవపతి ”ఓ అగ్నీ! శరణు శరణు ! నా వజ్రం విరిగిపోయింది. జంభుడు యుద్ధానికి పిలుస్తున్నాడు. దయచేసి నాకాయుధాన్నియిచ్చి కాపాడుమనగా నాపావకుడు ఇంద్రా! రాజువనే గర్వం విడచి నన్ను అర్థించినందుకు సంతోషం యిదిగో అమోఘమైన శక్తి తీసికొనుచు తనశక్తితో కూడిన ఆయుధన్నిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదా ! అలా అగ్ని దత్తమైన నూరు గంటలతో ఆలరారే దారుణ శక్తిని గ్రహించి ఆ శతమఖుడు జంభుని చంపుటకుద్యమించాడు. ఆలోపుననే ఆ దైత్యుడు మెరుపుదాడిచేసి తన పిడికిలితో, ఇంద్రుని ఐరావతం కుంభస్థలం బ్రద్దలు చేశాడు. దానితో ఆ ఏనుగు పూర్వం యింద్ర వజ్రహతమైన శైలంలాగా కూలిపోయింది. ఏనుగు మీదనుంచి దూకి యింద్రుడు మందగిరిని వదలి భూమ్మీద పడిపోయాడు.

అలా క్రిందబడి పోతున్న యిందుని చూచి సిద్ధచారణులు శక్రా ! పడిపోకుము. అక్కడే నిలబడుము. అని చెప్పారు. ఆ యింద్రుడు యోగశక్తితో క్షణకాలం నిలబడి, యానం లేకుండా శత్రువుతో నెలా పోరాడగలనన్నాడు. అందులకా దేవగంధర్వులు, ప్రభూ! చింతింపకుము. మేమొక రథం పంపుతున్నాము. దానిపైనెక్కి యుద్ధం చేయండని చెప్పి మరుక్షణమే శుభలక్షణాలు గలిగి విశాలమై, వానర ధ్వజంతో ఆకుపచ్చని ఉత్తమాశ్వాలుగల్గి, చిరుగంటలతో బంగారంతో నిర్మించబడిన రథాన్ని విశ్వావసు మొదలయిన దేవతలు తెచ్చియిచ్చారు. అయితే సారథిలేని ఆ రథాన్ని చూచి, సారధి లేకుండా గుర్రాలను అదుపులో పెట్టుకుంటూ ఒక్కడినే ఎలా పోరాడగలను? సారథి నెవరినైనా పంపుచో నేను యుద్ధంచేసి శత్రుసంహారం చేస్తాను. లేనిచో వీలుపడదని యింద్రుడన్నాడు. అంతట నారాదా! ఆ గంధర్వులు, దేవ రాజా! మావద్ద సారథి ఎవరూ లేరు. మీరే స్వయంగా రథం నడుపుకొని యుద్ధం చేయవలసినదేయనగా, నా యింద్రుడా ఉత్తమస్యందనాన్ని వదలి, ఒడలిమీది హారాలు వస్త్రాలు ఊడిపోగా, ఆయుధాలు, కవచం, జట్టుముడి వీడి తలవణకి పోతూండగా భూమిమీదపడి పోయాడు. ఆ సహస్రాక్షుని పతనం చూచి భూమి కంపించింది. అలా కంపిస్తున్న భూమిని చూచి శమీకుడను మహర్షి భార్య భర్తను చూచి నాథా వెంటనే మన పసివాడిని తెచ్చి బయటపడెయ్యండి. ఆలసించ వద్దన్నది. అందులకు కారణం అడిగిన భర్తతో నా శీలపతి స్వామీ ! భూమి కంపించిన క్షణంలో బయటపడవేసిన వస్తువులు ద్విగుణంగా వృద్ధి అవుతాయని దైవజ్ఞుల వచనము. అని చెప్పగా నా ముని వెంటనే తన పసిబాలుని యింట్లో నుంచి బయట పడవేసి లోపట కట్టివేసిన రెండెడ్లను కూడ తెచ్చుటకు లోపలకు వెళ్ళాడు. అంతట నామె వారించి. నాథా సమయం మించిన తర్వాత బయటవేసిన వస్తువలలో సగం నశించి పోతాయని ఆ ప్రయాత్నాన్ని ఆపింది. ఓ దేవర్షి ! అంతట నా శమీకుడు బయటకు వెళ్ళి చూడగా సరిగ్గా తనకుమారుని పోలిన మరొక బాలకుడుండటం చూచి అద్భుతానంద పరవశుడయ్యాడు. ఆ రెండవ బాలుడు దేవ ప్రార్థన చేయడం చూచి యోగ్యురాలయిన తన గృహిణితో ప్రేయసీ ! ఈ రహస్యం అద్భుతం ! నాకు తెలియరాకున్నది. ఈ రెండవ బాలుని గుణగణాలు, భవిష్యత్తు, అదృష్టం, అతడు చేయబోవు కర్మలు ఎలా ఉంటాయో ఆ విషయం గూడ చెప్పమని అర్థించాడు.

అందులకామె నాధా, ఆ విషయాలు మరొకప్పుడు చెప్పెదను. నేడు కాదనగా నా బ్రాహ్మణుడలా కాదు. నా కిప్పుడే చెప్పవలయును. లేనిచో నేనీ రోజు భోజనమే చేయనని పట్టుబట్టాడు. అంతటనామె సరే మీరు గందరగోళంలో పడి అడుగుతున్నారు గనుక హిత వాక్యలు చెబుతాను వినండి ఈ బాలుడు రథచోదకు (కారు) డవుతాడు”. అని చెప్పినది. ఆమె నోటి నుండి ఆ మాటలు వెలువడినంతనే ఆ బాలుడు ఏమీ తెలియనివాడై యుండియు పైకి ఎగిరి ఇంద్రునకు సహాయం చేయుటకు వెళ్తున్న సంగతి గ్రహించిన విశ్వావసు మొదలైన గంధర్వులంతా తమ తేజస్సునాతనికి ధారబోశారు. అలా గంధర్వ తేజోయుక్తుడై ఆ శిశువు శక్రుని సమీపించి, దేవరాజా ! రండు రండు! నీకు ప్రియం కలుగునట్లుగా సారథ్యం చేస్తానన్నాడు. అది విని యింద్రుడిలా అడిగాడు. ”నీవెవరి పుత్రుడవు బాబూ? అశ్వాలనెలా అదుపులో పెట్టగలగుదువా యని నాకు సందేహంగా ఉన్నది”. అందులకా శిశువు-సురేశ్వరా! ఋషి తేజస్సుతో భూమి నుండి ఉద్భవించాను. గంధర్వ తేజంతో వృద్ధి నొందాను. అశ్వయానంలో విశారదుడనని చెప్పగా, యోగులలో శ్రేష్ఠుడగు నా యింద్రుడూ, మాతలి అని పేరుగల ఆ బాలుడూ వినువీథికి వెళ్ళారు. త్రిదశాధీశ్వరుడగు నా యింద్రుడు ఉత్తమ రథం మీద కూర్చొనగా నాబాలుడు శమీక ఋషి పుత్రుడు గుర్రాల పగ్గాలను పట్టుకొని నిలబడ్డాడు. అంతట నా దేవరాజు మందగిరికి వెళ్ళి శత్రు సేనలోకి ప్రవేశించాడు. అక్కడ తేజస్వికి ఒక మహాధనుస్సు పంచ వర్ణాలతో తెలుపు, ఎరుపు, గోధుమ, పసపు రంగులలో- బాణసమూహంతో కూడి కనిపించింది. అంత సంతోషంతో నా సురశ్రేష్ఠుడా ధనుర్బాణాలను గ్రహించాడు.

తర్వాత, సత్వరజస్తమో గుణాత్మకులైన త్రిమూర్తులకు మనసానమస్కరించి, ఆ మహాచాపాన్ని సంధించి బాణం తొడిగాడు. అంతనా శతక్రతువు ధనుస్సు నుంచి నెమలి ఈకల రెక్కలతో రెపరెపలాడుతూ పుంఖానుపుంఖాలుగా మహోగ్ర శరాలు వెలువడి శత్రు సంహారకాండ సాగించాయి. బ్రహ్మ విష్ణు శివనామాంకితాలయి శత్రువులనుదునుమాడుతూ వెడలిన ఆ బాణాలు భూమ్మాకాశాలను దిశవిదిశలనూ కప్పివేశాయి. నారదా! వాని తాకిడికి ఏనుగులు పీనుగలయ్యాయి. రథాలు విరిగి పోయాయి. అశ్వాల శ్వాసలెగిరిపోయాయి. మావటివాండ్రు విలవిల్లాడుతూ నేలకొరిగిపోయారు. శత్రువాహినిలో అత్యధిక భాగం హతమైపోయింది. ఇంద్రుని బాణాగ్నికి దహించుకపోతున్న తమ సైన్యాన్ని చూచి కుజంభ జంభిలులిద్దరూ భయం కరమైన గదాదండాలు త్రిప్పుతూ క్రోధోన్మత్తులై ఆ మహాత్ముడగు సురనాయకుని సమీపించారు. అలా యింద్రుని మీద కురుకుచున్న వారలను చూచి శ్రీహరి శత్రు వినాశకరమైన సుదర్శన చక్రం వేగంగా త్రిప్పి కుజంభుని మీదకు వదలగా దాని అగ్ని జ్వాలలకు వాడు ప్రాణాలు గోల్పోయి రథం మీద నుండి క్రిందబడిపోయాడు. అలా మాధవుని చేతిలో తన సోదరుడు చచ్చుట చూచి జంభుడు కోపంతో నిప్పులుమియుచూ, చావుమూడిన లేడి సింహం మీదకు అంఘించినట్టులా దేవరాజు మీద విరుచుకపడ్డాదు. అలా ఎత్తి వస్తూన్న జంభుని చూచి శక్రుడు ధనుర్బాణాలు వదలి మృత్యుదండంలాంటి అగ్నిదత్త మైన శక్తిని తీసికొని వానిమీదకి గట్టిగా విసిరాడు. గంటలు గలగల ధ్వనులతో తనమీదకు వస్తున్న ఆ శక్తిమీదకు వాడు గదను ప్రయోగించాడు. ఆ గదను క్షణకాలంలో భస్మంచేసి ఆ శక్తి సూటిగా వెళ్లి జంభుడి వక్షాన్ని చీల్చివేసింది. దాంతో ఆ దేవ విరోధి విగతప్రాణుడై నేలకొరిగాడు. వాని మరణం చూచి రాక్షసులు కూడ పలాయనం గావించారు. జంభుడు హతుడై రాక్షస బలాలు విరిగిపోవుటతో ప్రమథ దేవగణాలు జనార్దనుని పూజించారు. ఇంద్రుణ్ణి ప్రశంసించారు. అంతటనా పర్వతభేది శర్వుని ఎదుటకు వెళ్ళి నిలచాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో నలుబది మూడవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment