Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – అరవై ఏడవ అధ్యాయం

అరజ ఇలా అన్నది :-

ఓ రాజా నీవు ఎన్నిచెప్పినా ఇటు శీలాన్ని, అటు శాపానలాన్నుంచి నన్ను కాపాడుటకై నేను నీకు లోబడజాలను. తర్వాత ప్రహ్లాదుడు (అంధకునితో) ఇలా అన్నాడు. అలా వాదులాడుతున్న ఆ శుక్రకుమారి తను కామాంధుడైన ఆ బుద్ధిహీనుడు బలాత్కరించి, ఆమె శీలాన్ని ధ్వంసం గావించాడు. అంతట నా ఆశ్రమాన్ని వదలి ఆ నీతిహీనుడు క్రూరుడునైన పృథివీపతి తన నగరానికి వెళ్ళిపోయాడు. పాప మాదీనురాలు అరజ, రజస్రావంతో తడిసి ఆశ్రమ కుటీరంవదలి బయట, తల వంచుకుని, తండ్రి తలచుకొని, వెక్కివెక్కి ఏడుస్తూ రాహువు గ్రసించిన చంద్రుని ప్రియురాలు రోహిణివలె కూర్చున్నది. అనంతరం బహుకాలానికి పాతాళంలో యజ్ఞం పూర్తిచేసుకుని తిరిగివచ్చి శుక్రాచార్యుడాశ్రమం బయట ఋతుస్రావపు మరకలతో నల్లటి మేఘ శకలంతోకూడిన సాయంసంధ్యలాగా పడియున్న ప్రియ పుత్రికను చూచాడు. అంతట కోపంతో అదిరిపడి గర్జిస్తూ, బిడ్డా ! ఎవడమ్మా నిన్ను చెరచిన దుర్మార్గుడు? బుసలుకొట్టే కొండత్రాచుతో ఆడే ఆ దైర్భాగ్యుడు, యమపురికి వెళ్ళేందుకు ఉబలాటపడే ఆ నికృష్టుడెవరమ్మా, అని అడిగాడు, అందులకా బాలిక తండ్రినిచూచి విలపిస్తూ లజ్జాభారంతో కంపిచిపోతూ మెల్లమెల్లగా – తండ్రీ ! నీ శిష్యుడైన దండుడు, నేను విలపిస్తూ ఎంతగా వారించినా లక్ష్యపెట్టక బలవంతంగా నన్ను నాశనంగావిచాడు. అని చెప్పింది. అంతట కోపంతో కళ్ళెర్రజేసి భార్గవుడు ఆచమనంచేసి శుచియై, నాచేత అభయం పొందియు కృతజ్ఞత వదలి గురువనే గౌరవం కూడా లేక, పవిత్రురాలైన అరజకు నా కుమార్తెకు ధర్మచ్యుతి కలిగించిన ఆ దుర్వినీతుడు (దండుడు) ఏడు రాత్రులలోపల తన బల పరివార వాహనాదులతో కూడి రాష్ట్రసమేతంగా శిలావృష్టికి గురియై భస్మీపటలం కాగలడ”ని భయంకరంగా శపించాడు. అనంతరం తన కుమార్తెనుచూచి, కల్యాణీ ! నీవింక పాపవిమోచనానికై తపంచేస్తూ ఉండమని పలికాడు.

ఇక్ష్వాకు తనయుడైన దండుని అలా శపించి శుక్రాచార్యుడు శిష్యులతోకూడి దానవుల నెలవైన పాతాళానికి వెళ్ళాడు. ఏడురాత్రులెడతెరిపి లేకుండా కురిసిన శిలావృష్టికి నలిగి చూర్ణమై. రాష్ట్రసైన్య వాహనాదులతోసహా ఆ దండుడు సర్వనాశనమైనాడు. అప్పటినుంచీ దండకారణ్యం (అరణ్యంగా మారిన దండుని రాజ్యం) దేవతలు వర్జించారు. శివుడు దానిని రాక్షసులకు నివాసంగా చేశాడు. ఈ విధంగా పరకాంతలు, సుకృతం చేసిన వారలనుగూడా భస్మం చేయగలిగియుండగా నిక యితరుల విషయం చెప్పవలెనా? కాబట్టి ఓ అంధకా! దుర్బుద్ధితోగూడిన ఈ ప్రయత్నం విరమించుకో ప్రాకృత (సాధారణ) స్త్రీయే తన స్పర్శతో దహింపగలిగియుండగానిక ఆ జగజ్జనని పార్వతి విషయం చెప్పడమెందులకు? దేవ దానవులంతా ఏకమైనా శంకరుని జయింపజాలరు. కళ్ళు చెదరగొట్టే ఆయన తేజస్సునే వారు చూడజాలరనినచో ఆయనతో యుద్ధం చేసే ప్రశ్నే ఉండదని ప్రహ్లాదుడనగా క్రుద్ధుడై బుసలు కొడుతూ ఆ తేజస్వి అంధకుడు ప్రహ్లాదునితో – ఏమేమి! ఒంటరివాడు బూడిదరాయుడూ ధర్మదూరుడూ ఆయిన ఆ శివుని నాతో పోరాడగలడా? ఇంద్రాది దేవతలనే లెక్కచేయని ఈ అంధకుడు ఆకులు మెక్కుతూ ఆ డంగులము ఖాలు చూస్తూండే దిగంబరుడికి భయపడటమా? అని అపహసించాడు. ఆ కఠోరవచనాలకు చలించి, ఓ నారదా! ఆ ప్రహ్లాదుడు యిలా అన్నాడు. ”నీవు చెప్పునది ధర్మదృష్టితో చూచినా వ్యావహారికంగా చూచినా చాలా అనుచితం. అంధకేశ్వరా! అగ్నికి శలభాలకు, సింహశృగాలాలకు, ఏనుగుకూ దోమకూ, బంగారానికి, చిల్ల పెంకుకూ ఎంత తేడా ఉందో నీకూ ఆ పార్వతీపతికి అంత అంతరం సుమా. ఎంత ఎంత దూరమో ఈ సాహసం చేయవద్దని చెప్పాను. ఇంకా ఇంకా చెబుతున్నాను విను. మహాత్ముడగు దేవర్షి అసితుని హితవచనాలు వినుము. ధర్మశీలుడు, అభిమానం క్రోధం జయించినవాడు, విద్యా వినయవంతుడు, ఇతరులకు హాని కలిగించని వాడు, తన భార్యతోనే తృప్తిపడి పరకాంతలను గోరనివాడు యీ లోకంలో ఎవనికీ భయపడడు. అతనికి ఎక్కడా భయమంటూ ఉండదు. ఇక ధర్మదూరునికి, కలహప్రియుడికి, ఇతరుల బాధించేవానికీ, వేదశాస్త్రాలను వదలినవానికీ, ఇతరుల ధనాన్ని దారలను హరించేవానికీ, ఇతర వర్ణాలవారితో కలిసే వానికి (వర్ణ సంకరునకు) ఇహపరాల్లో ఎక్కడా సుఖమంటూ కలగదు. భాస్కరుడు ధర్మాన్వితుడు, వశిష్ఠుడు క్రోధం వదలినవాడు, సూర్య తనయుడు మనువు విద్యాన్వితుడు అగస్త్యుడు తన భార్యతోనే తృప్తినందినవాడు. వీరందరు నేను చెప్పిన పుణ్యాలు చేశారు. కనుకనే కులక్రమాన్ని తప్పని ఈ మహనీయులంతా తేజోన్వితులై శాపానుగ్రహ సామర్థ్యంకలిగి దేవతలకు సిద్ధులకూ పూజనీయులయ్యారు. ఇక అంగసుతుడు (వేనుడు) ధర్మదూరుడు, విభువనువాడు సదా కలహప్రియుడు, దురాత్ముడగు నముచిపరపీడకుడు, నహుషుడు పరస్త్రీలాలసుడు, హిరణ్యాక్షుడికి పరధనాలమీదనే కన్ను, వానితమ్ముడు (హిరణ్యకశిపుడు) కూడ మూర్ఖుడు దుర్భుద్ధి, ఇతర వర్ణాలవారిని భోగించిన వాడు ప్రతాపి అయిన యదురాజు, ఏరంతా గొప్ప రాజులయినా నామరూపాలు లేకుడా నశించి పోయారు గతంలో.

కాబట్టి పరమగతిఅయిన ధర్మాన్ని ఎన్నడూ వదలరాదు. ధర్మహీనుడు భయంకరమైన రౌరవనరకానికి పోతాడు. మానవులకు స్వర్గమర్త్యాలలో ధర్మమే తరణోపాయము. ఆధర్మమే ఇహపరాల్లో పతనహేతువు. ధర్మాన్వితులగు వారు సదా పరస్త్రీలకు దూరంగా ఉండాలి. పరదారయే ఇరవై యొక్క నరకాలలో పడేస్తుంది. అంధకా ! పరధనదారలను వాంఛించినవాడు అనేక సంవత్పరాలు రౌరవయాతన లనుభవిస్తాడు. ఓ రాక్షసేశ్వరా! ఈ ధర్మవ్యవస్థను పూర్వకాలాన దేవర్షియైన ఆసితుడు గరుత్మంతునకు అరుణునకు వివరించాడు. కాబట్టి విద్వాంసులగు వారు పరస్త్రీలను దూరాన్నుంచే వర్జించాలి. పరస్త్రీలు ప్రజ్ఞాహీనులను వారిని పరాభవానికి గురిచేస్తారు”. పులస్త్యుడు యిలా అన్నాడు. ఇంతదూరం ప్రహ్లాదుడు చెప్పిన నీతివాక్యాలు విని ఆ అంధకుడు ”నీవొక్కడవే ధర్మాన్ని పట్టుకొని వ్రేలాడుము. నాకు ధర్మాచరణం సమ్మతంకాదు.” అంటూ శంబరాసురుడితో, శంబరా! వెంటనే మందరగిరికి వెళ్ళి శంకరునితో నామాటగా చెప్పుము. ఓ బిచ్చగాడా! అందమైన కందరాలతో స్వర్గంలా ఉండే సుందరశైలం నీకెందులకు? ఎవరిచ్చినారని యింకా దానిని అనుభవిస్తున్నావు? ఇంద్రాది దేవతలంతా నా శాసనాన్ని శిరసావహిస్తుండగా, నన్ను లెక్కచేయకుండా యింకా ఎందుకు అచట ఉన్నావు. అంతగా మందరం నీకు ప్రీతిపాత్రమైతే నేను చెప్పినట్లు చేయుము. నీ భార్యను వెంటనే గొనివచ్చి నాకర్పించుము” అదివిని ఆ శంబరుడు పరమేశ్వరునితో పినాకపాణి ఉన్న మందరగిరికి త్వరగావెళ్ళాడు. అంధకుడు చెప్పినది తుచతప్పకుండా శివునకు చెప్పాడు అందుకు పార్వతి వినునట్లుగా హరుడిలా జవాబు చెప్పాడు. ”మందరగిరి నాకు ధీమంతుడైన యింద్రుడిచ్చాడు. కనుక ఆయన అనుమతి లేనిదే నేను దానినెవరికీ యివ్వను. ఇక పార్వతి. పార్వతి విషయమో, అది ఆమెకే వదిలేస్తున్నా. ఆమె వెళ్ళితే నేను కాదనను”. అంతనోమునీంద్రా! ఆ గిరితనయ శంబరునితో ఇలా చెప్పిది. ‘ఓ వీరా! తెలివిగలవాడైన అంధకునితో యిలా చెప్పుము.

నేను సంగ్రామంలో జయపతాకను. నీవూ ఈశ్వరుడు యిద్దరూ జూదరులు. ఈ జీవనద్యూతంలో ఎవరు గెలుతురో వారే నన్ను పొందగలరు”. అంత నా మతిమంతుడైన శంబరుడు తిరిగి వెళ్ళి శివ పార్వతుల సందేశాలను అక్షరశః వినిపించగానే ఆ దానవపతి కోపంతో బుసలుకొడుతూ దుర్యోధనుని పిలచి – ఓ మహావీరా! వెంటనే, కులట స్త్రీని మోదినట్లు యుద్ధభేరిని మోగించమని ఆదేశించాడు. అంత నా దుర్యోధనుడా భేరిని తన శక్తికొలదీ త్వరగా కొట్టసాగాడు. దుర్యోధనుని దెబ్బల కా భేరి భయంకరమైన స్వరంతో సురభివలె అరిచింది. ఆ భేరీ స్వరాన్ని విని మహాదైత్యులందరూ ఈ పుసద్రవమేమని ఆలోచిస్తూ వెంటనే సభాస్థలికి చేరుకున్నారు. అంతట మహాసైన్యాధ్యక్షుడు విషయాన్నంతా నివేదించగా వారంతా యుద్ధానికి ఉబలాటపడసాగారు. అంధకుడితో కలిసి అందరూ ఏనుగులు ఒంటెలు, గుర్రాలు, రథాలు ఎక్కి బయలుదేరారు. అయిదు ఫర్లాంగులు ప్రమాణంగల రథంమీదనెక్కి అంధకుడు ఫాలాక్షుని పరాభవించడానికి పయనమయ్యాడు. జంభుడు, కుంజభుడు, హుండతుహుండులు. శంబరుడు, బాణకార్తస్వరులు, హస్తి, సూర్యశత్రువు, మహోదరుడు, అయశ్శంకువు, శిబి, సాళ్వులు, వృషపర్వవిరోచనులు, హయగ్రీవుడు, కాలనేమి, సంహ్లాద కాలనాశనులు, శరభ, శలభ, విప్రచిత్తి, దుర్యోధన, పాక, విపాక, కాల, శంబరుడాదిగాగల యితర మహాబలులెందరో నానా ఆయుధాలతో రణభూమికి నడిచారు. ఈ విధంగా సన్నద్ధుడై దురాత్ముడైన, ఆ అంధకదానవుడు హరునితో పోరాడుటకై కాలచోదితుడై, బుద్ధిగోల్పోయి, మందరగిరికి పోయి చేరాడు.

ఇది శ్రీవామన మహాపురాణంలో నలభైయవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment