Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – అరవై రెండవ అధ్యాయం

బ్రహ్మ యిలా అన్నాడు :-

పరభార్యలను కూడడం, పాపులను సేవించడం, ఇతర ప్రాణులపట్ల కఠినంగా వ్యవహరించడం మొదటి నరకం అని చెప్పబడతుంది. పండ్లు దొంగిలించడం, పనిపాటలు లేకుండా తిరగడం, వృక్షజాతులను నరకడం ఈ మహాపాపాలు రెండవ నరకం. నిషేధింపబడిన వస్తువులు గ్రహించడం, అవధ్యులను వధించడం, బంధించడం, డబ్బుకోసమై కలహించడం మూడవ నరకం. సర్వప్రాణులకు భీతికలిగిస్తూ ప్రపంచంలోని వస్తువులు నాశనం చేయడం, తన విధులనుండి వైదొలగుట నాలుగవనరకం. ఇతర జీవులను చంపడం మిత్రులపట్ల కుటిలంగా ప్రవర్తించడం, తప్పుడు ప్రమాణాలు (ఒట్లు) చేయడం, మధుర పదార్ధాలను తాను వంటరిగా భుజించడం అయిదవ నరకం అంటారు. కుట్రలు చేయడం, పండ్లు మొదలైనవి దొంగిలించడం, యితరుల మార్గాన్ని అడ్డుకోవడం, కలిసినవారిని నాశనం చేయడం యానాలు (బండ్లు) అపహరించడం ఆరవ నరకం. రాజుకు చెందవలసినది హరించడం, రాజ భార్యలతో మూర్ఖంగా సంభోగించడం, రాజ్యానికి ద్రోహం చేయడం ఏడవ నరకంగా పరిగణిస్తారు. లోభితనం, అత్యాశ, లోభంతో ధర్మనీతినీ ధనాన్ని నాశనం చేయడం, నోట చొల్లుకార్చుతూ మాట్లాడడం (పేరాస), ఎనిమిదో నరకం. బ్రాహ్మణులను (తమ యిండ్ల నుండి) వెళ్ళగొట్టడం వారలను అపహరించుకుని పోవడం, ఆ బ్రాహ్మణులను నిందించడం, తన బంధువులతో విరోధం యివి తొమ్మితో నరకం క్రింది పరిగణించబడతాయి. శిష్టుల ఆచారాలు వదిలివేయడం, శిష్యులను ద్వేషించడం, శిశువుల హత్య చేయడం శాస్త్రాలు దొంగిలించడం, ధర్మాన్ని హత్య చేయడం (సన్మార్గాతి క్రమణం) పదవ నరకం. ఆరు అంగాలు ఖండించి హత్య చేయడం, ప్రభువు తనకు విహితాలయిన ఆరుగుణఆ (పను)లు ప్రదర్శించకుండా నిరోధించడం పదకొండవ నరమని సజ్జనుల మతం.సజ్జనులతో నెల్లప్పుడు శత్రుత్వం, ఆనాచారం, చెడుపనులు చేయడం, (విధ్యుక్తమైన) సంస్కారాలు గాలికి వదిలివేయడం. పన్నెండవ నరకం. పురుషార్థ సంపాదనంలో (ధర్మార్థ కామమోక్షసాధనం) అడ్డుపడడం, వాటి అపహరణం, మంచి వారలలో అభిప్రాయ భేదాలు సృష్టించడం. పదమూడవ నరకం, కృపణత్వం, ధర్మరాహిత్యం, అలాగే నిషిద్ధమైన దహనకాండ జరపడం నిందనీయమైన పదునాలుగవ నరకం. అజ్ఞానం, అసూయ, పరిశుభ్రత, మొదలయిన అశుభకార్యాలు చేయడం, అబద్ధాలు చెప్పడం పదిహేనవ నరకం. సోమరితనం, అతిగా యితరుల మీద ఆక్రోశపడడం, అన్నివిధాల (తగలబెట్టడం, విషం పెట్టడం, శస్త్రలతో కొట్టడం, ధనాపహరణం, భూమిని భార్యను అపహరించడం) ఆతతాయిత్వం, అగ్నికాండ, పదహారవ నరకం. పరభార్యాభిలాష, సత్యంపట్ల వైముఖ్యం ద్వేషబుద్ధి నరకకారణాలు. యిలాంటి పాపాలలో చిక్కుకున్న మానవుడు ఈ పాపాల సమూహాన్ని ‘పుత్‌’ నరకమంటారు. వీటినుండి బయటపడుటకూ భగవంతుని ప్రసన్నుని చేసుకొనుటకూ, పుత్రుణ్ణి కని అతడి ద్వారా రక్షణ పొందాలి. భగవంతుడు ప్రసన్నుడై సత్పుత్రుని ప్రసాదిస్తాడు. అతడు పితరులను నరకముక్తుల చేప్తాడు. అందువలనననే ఓ సాధ్యా ! సుతునకు పుత్రుడని పేరుగలిగింది.

ఇక శేషపాపాల లక్షణం చెబుతా విను. దేవతలకు ఋషులకు పితరులకు, విశేషించి మనుష్యులకు ఋణపడటం సర్వవర్ణ సాంకర్యం, ప్రణవ (ఓం) విసర్జనం, పాపకర్మిత్వం, మత్స భక్షణం, ఇతరులతో నిషిద్దమైన మైథునకర్మ, నేయి విక్రయించడం, చండాలుర పరిగ్రహణము, తన దోషాలు కప్పిపెట్టుకొనుట, యితరుల దోషాలు బయట పెట్టుట, మాత్సర్యం, దుష్టభూషణం, క్రూరత్వం, టాకిత్వం (దుష్టుల పేర్లు ఉచ్చరించుట), తాళవాదిత్వం (దుష్టులతోమాటాడినందున వచ్చేపాపం) యిలాంటి వాచాదోషాలు, అధార్మికత్వం దారుణత్వం, ఇవన్నీ నరక కారకాలయిన పాపాలు. ఈ పాపాలలో మునిగినవాడు శంకరుని ప్రసన్నుని చేసుకున్నచో శంకరుడు అశేషజ్ఞానమూర్తియగుటచే, ఓ ధర్మపుత్రా ! శారీరికనాచిన మానసికాలై, ఆ జన్మలో మాతాపితలు, సోదరబాంధవ ఆశ్రితులయిన వారెల్లదు కావించిన పాపాలుకూడా సర్వం, పుత్ర శిష్యుల ద్వారా పోగొట్టుకోవచ్చు. సుతులు శిష్యులు అందు సమర్థులు. అందుకు విపరీతంగా జరిగితే ఫలితాలు కూడ విపరీతంగా సంభవిస్తాయి. కాబట్టి ఓ సాధ్యా! జ్ఞాని అయినవాడు పుత్రులను శిష్యులను కలిగి ఉండాలి. దీని ఆంతర్యం గ్రహించినచో శిష్యునికన్న పుత్రుడే శ్రేష్ఠుడని తెలుసు. పుత్రుడు సర్వపాపాలనుండి రక్షిస్తే శిష్యుడు శేషించిన పాపాల నుండి మాత్రమే కాపాడతాడు. పులస్త్యుడిలా అన్నాడు నారదా! తపోధనుడైన అసాధ్యుడు పితామహుని మాటలకలరి ప్రభూ! నేను ముమ్మాటికీ మీకు పుత్రుణ్ణి. దయచేసి నాకు యోగం తెలియజేయండి. అన్నాడు. సనత్కుమారుని మాటలు విని పరమేష్ఠి – వత్సా ! నీ తల్లిదండ్రులు నిన్ను నా కొసగినచో నీవు నాకు పుత్రుడవు అవుతారనగా నా సాధ్యుడు దేవాదాయాదుడనగా నెవరో ఆ పద్ధతి నాకు తెలుపమని ఆర్థించాడు. అంతట ఓ నారదా ! పితామహుడు నవ్వి వత్సా! వినుమని అసాధ్యునితో ఇలా చెప్పాడు.

ఔరసుడు క్షేత్రజుడు దత్తుడు కృత్రిముడు గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు అని దాయాదులు ఆరు రకాలు. ఈ ఆరుగురకు ఋణ, పిండ, ధన, క్రియ, గోత్ర సామ్యం, కులవృత్తి, ప్రతిష్ఠలనేవి తలిదండ్రులనుంచి సహజంగా సంక్రమిస్తాయి. వీరుగాక కానీనుడు, సహోఢుడు, క్రీతుడు, పునర్భవుడు, స్వయం దత్తుడు పారశవుడనే ఆరురకాల దాయాదులున్నారు. అయితే వీరలకు మాత్రం ఋణ పిండ దానక్రియా గోత్ర, కులవృత్తి ప్రతిష్ఠలనేవి సంక్రమించవు. వీరు పేరుకు మాత్రం పుత్రులే కాని కులగోత్ర సంభవులు కారు. బ్రహ్మ మాటలు విని సనత్కుమారుడు భగవాన్‌ ! వీరల తారతమ్యం విశేషాదులు దయతో చెప్పమని అర్థించగా నా బ్రహ్మ యిలా చెప్పాడు. పుత్రా! తనవల్ల తన భార్యకు కలిగినవాడు ఔరసపుత్రుడు. అతడు తండ్రికి ప్రతిరూపమైనవాడు. నపుంసకుడు లేక వ్యసనాలకు లోనై దుర్బలుడౌన భర్త అనుమతితో భార్య మరొకరిద్వారా కనిన పుత్రుడు క్షేత్రజుడు. తలిదండ్రులచే దత్తుగా యివ్వబడిన వాడు దత్తుడు. మిత్రుడికిచ్చినవాడు కాని మిత్రుని పుత్రుడుగాని క్రీతులని పెద్దలు నిర్ణయించారు. ఏ యింట ఎవనికి పుట్టినవాడో తెలియని వాడు గూఢకుడనబడతాడు. లేక బయటనుంచి తెచ్చి పెంచుకోబడిన వాడు స్వయందత్తుడు. పెండ్లికి ముందు కన్యకు పుట్టిన వాడు కానీనుడు. వివాహానికి పూర్వమే గర్బవతి అయిన భార్యకు కలిగిన వాడు సహోఢుడు.మూల్యం చెల్లించి తెచ్చుకున్నచో వాడు క్రీతుడు. రెండు లక్షణాలు గలవాడు పునర్భవుడు అనగా ఒకరికిచ్చిన కన్యను బలాత్కారంగా అపహరించి తెచ్చి వివాహమాడిన తర్వాత పుట్టినవాడిని పునర్భవుడంటారు. కరువు కాటకాల్లో ఆకలితో అల్లాడుతూ కాని యితర విపరీత పరిస్థితుల్లో కాని వచ్చి తన్ను తాను ఆర్పించుకునేవాడు స్వయందత్తుడు. బ్రాహ్మణునకు శూద్రాంగనవల్ల కలిగిన వాడు పారశవుడు. ఈ కారణాలవల్లనో వత్సా ! నీ మాటమీద నిన్ను నేను పుత్రునిగా తీసుకోజాలను. కావున త్వరగా వెళ్ళి నీ తల్లిదండ్రులను పిలచికొని రమ్ము. నారదా ! వెంటనే నాసాధ్యుడు తన తల్లిదండ్రులను స్మరించిన మాత్రాన్నే వారలచ్చటకు వచ్చిచేరారు. అలావచ్చిన ధర్ముడు అహింసాదేవి పరమేష్ఠికి ప్రణామం చేసి కూర్చున్నారు. అలా సుఖాసీనులైన తల్లిదండ్రులను చూచి సనత్కుమారుడిలా అన్నాడు.

తండ్రి ! యోగవిద్యను గ్రహించాలని నేను పరమేష్ఠి బ్రహ్మను అర్థిస్తే ఆయన నన్ను తన పుత్రునికమ్మని నాడు. కనుక మీరలు నన్నాయనకు యివ్వగలరు. కుమారుని మాటలు విని ఆ ధర్మాహింసలు పితామహునితో భగవాన్‌! ఈనాటినుండీ మా యీ కుమారుడు నీపుత్రుడు కాగలడు. అని వెంటనే తాము వచ్చిన చోటికాదంపతులు వెళ్ళిపోయారు. అంత పితామహుడు విషయ భూషణుడైన ఆ సాధ్యపుత్రుడు సనత్కుమారునకు ద్వాదశపత్రక యోగం ఉపదేశించాడు. శిఖమీద ఓంకారం ఉంటుంది. దాని తలమీద మేషరాశి ఉంటుంది. దీనికి మాసం వైశాఖం. ఇది ప్రథమపత్రకం. ముఖం మీద ‘స’ కారం, వృషభరాశి జ్యేష్ఠ మాసంతో కూడినది రెండవ పత్రకం . రెండు భుజాలమీద ‘మో’ కారం, మిధునరాశి ఆషాడ మాస యుక్తమైనది మూడవ పత్రకం. రెండు నేత్రాలమీద ‘భ’ కారం కర్కట రాశితో శ్రావణ మాసంతో కూడి ఉంటుంది. ఇది చతుర్థ పత్రకం హృదయ దేశాన ‘గ’ కారంతో సింహరాశితో భాద్రపద మాసంతో యుక్తమై ఉంటుంది. ఇది పంచమ పత్రకం. ‘వ’ కారం కవచ నిష్ఠమై కన్యారాశితో ఆశ్వయుజ మాసంతో కూడి ఉంటుంది. అది ఆరవ పత్రకం. బ్రహ్మ అస్త్ర సమూహాన్ని ఆశ్రయించి ‘తే’ కారంతో తులారాశితో ఉంటుంది. కార్తిక మాసం కలిగిన ఈవత్రకం ఏడవది. నాభితో కూడి ‘వా’కారం ఉంటుంది. వృశ్చికరాశి మార్గశిర మాస సహితమైన ఈ పత్రకం ఎనిమిదవది. నడుమును ఆశ్రయించిన ధనూ రాశితో ‘సు’ కారం ఉంటుంది. మాసం పుష్యం ఇది నవమ పత్రకము. ఊరువుల మీద ‘దే’ కారం మకరరాశి ఉంటాయి. మాసం మాఘం . పదవ పత్రకం. మోకాళ్ళమీద ‘వా’ కారం కుంభరాశి పాల్గుణ మాసాలతో ఏకాదశ పత్రకంగా విలసిల్లుతుంది. ఇక పన్నెండవ పత్రకం పాదాల మీద మీనరాశితో చైత్ర మాసంలో ఉంటుంది. ఇలా ద్వాదశ పత్రాత్మకమైన కేశవ వాసుదేవ పరమాత్మ చక్రం పన్నెండు అరలు (అంచులు) రెండు నాభులు కలిగి ఉంటుంది. మూడు మూర్తులలో కనిపించినా ఆ పరమేశ్వరుడొక్కడే. ఆ సర్వేశ్వరుని రూపం ఈ విధంగా ద్వాదశాత్మకంగా ఉంటుంది. ఓ మునిశ్రేష్ఠా ! దీనిని తెలిసిన వారలకు మరల మరణం అంటూ ఉండదు.

ఆ బ్రహ్మ రెండవ రూపం సత్వగుణ సంపన్నం. నాలుగు రంగుల్లో నాలుగు ముఖాలు నాలుగు బాహువులు చక్కని అంగ ప్రత్యంగాలతో పీతాంబరం ధరించి నయనానందకరంగా ఉంటుంది. మూడవది తమో ప్రధానమైన శేషమూర్తి. ఆ లక్ష్మీ వరుడు సహస్రముఖాలు సహస్ర పాదాలతో ప్రజాప్రలయం చేస్తాడు. రజోగుణ సమ్మితమైన నాలుగవ రూపం ఎర్రటి రంగులో నాలుగు ముఖాలు రెండు చేతులతో నొప్పు నాయాదిపురుషుడు మాలాధరుడై సృష్టి కార్యం నెరవేర్చుతుంటాడు.అవ్యక్త బ్రహ్మనుండి నిర్గమించిన ఈ మూడు వ్యక్త (ప్రత్యక్ష) రూపాలు. అంతనా ప్రభువునుండి మరీచి మొదలయిన ఋషులు వేల సంఖ్యలో జన్మించారు. ఓ మునిశ్రేష్ఠా ! ఈ విధంగా నీకు మతిపుష్టివర్థకమైన పరమాత్మ పురాణ రూపాన్ని వివరించి చెప్పాను. అలాంటి చతుర్భుజ ప్రభువును ఆ దురాత్ముడగు మురుడు యముని మాట ప్రకారం సమీపించాడు. ఆ వచ్చిన వాడిని చూచి మధుసూదనుడు రాక్షసా ! నీవెవరవు ? ఎందులకు వచ్చావని అడుగగా వాడు నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంతట నా రాక్షసాంతకుడు నాతో పోరాటానికి వచ్చినవాడివైతే నీగుండె భయంతో అలా దడదడ కొట్టుకుంటున్న దెందులకు ? జ్వరార్తుల్లాగా వణికిపోయే పిరికివారలతో నేను యుద్ధం చేయను సుమా ! అన్నాడు. అంతట వాడు, తన గుండెమీద చెయ్యి పెట్టుకొని, ఆఁ! ఆఁః ఎవరి గుండె? ఎక్కడ ఎందుకు కొట్టుకుంటున్నది ? అంటూ ఉండగా నా హరి అతి లాఘవంతో మృదువుగా తన చక్రాన్ని ప్రయోగించి చేతితో సహా వాడి వక్షఃస్థలాన్ని చీల్చి సంహరించాడు. దేవతలందరు తమ బాధలు తొలగి ఆ కమల నాభుని జయజయధ్వానాలతో కీర్తించారు. నారదా! ఈ విధంగా చక్రధరుడు యుక్తితో గావించిన మురదానవ సంహారకథ నీకు వివరించాను. ఇందువలనే ఆ నృహింహ విభుడు మురారిగా ఖ్యాతివహించాడు.

ఇది శ్రీ వామనమహాపురాణంలో ముప్పదియైదవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment