Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – అరవై ఒకటవ అధ్యాయం

నారదుడిట్లనియె : –

అంబిక నందీ, యిర్వురే అంధకాసురునితో నేలపోరాడిరి ? ఆ సమయాన శంకరుడెచట నుండెను. పులస్త్యుడిట్లు చెప్పెను. మునీ ! వెయ్యేండ్లు మోహంలో మునిగి నందున అప్పటినుండి శివుని వీర్యం క్షీణమై ఆయన తేజస్సును కోల్పోయాడు. తన శరీరంలోని అంగాలు అలా బలం కోల్పోవడం గమనించిన ఆ శివుడు లెస్సగా ఆలోచించి తపోచర్యకు పూనుకున్నాడు. అలా దీక్షబూని, పార్వతిని సమాధాన పరచి నందిని ఆమెకు కాపుగా నియమించి ఆ మహేశ్వరుడు భూమిమీద తిరుగసాగాడు. మహాముద్రాకృతిలో మెడను నిలిపి. మహాసర్పాల కుండలాలూ కంకణాలూ నడుముకు మానవాస్థికల మేఖల ధరించి కుడి చేతిలో కపాలం ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఎక్కడా ఒకరోజుకన్నా ఎక్కువ కాలం ఉండకుండా, చెట్లక్రిందా గిరులలో సానువులలో నదులవెంటా తిరుగ మొదలెట్టాడు. అలా గడ్డలు కాయలు నీరు వాయువు భక్షస్తూ ముల్లోకాల్లో తొమ్మిదివందలేండ్లు పర్యటించాడు. అనంతరం నోటిలో తాంబూల విడెము పెట్టుకొని ప్రాణవాయువును నిరోధించి రమణీయమైన హిమవంతంమీద నొక సమతల ప్రదేశంలో నాయతి నిలిచి పోయాడు. అంతట నా తమలపాకులనూ జటామండలాన్ని చీల్చకొని ఆవెలుగులు జిమ్మే పరమేష్టి కపాలం భూమ్మీద పడిపోయింది. విడెము క్రింద బడటంతో గిరి శిఖరం బ్రద్దలై అక్కడ సమతలభూమి ఏర్పడి పవిత్రమై కేదారమనే తీర్థం ఉద్భవించింది. మహర్షేఅంత నా వృషకేతనుడు ఆ తీర్థనికి పాపాలు పొగొట్టి పుణ్య వృద్ధి గావించ మోక్షసాధకమగునట్లుగా వరప్రదానం చేశాడు. ఓ తీర్థరాజమా! ఏ మనుజులు ఆరునెలలు కాలం నియమంతో మధుమాంసాదులు, ఇతరుల వండిన భోజనాదులు వర్జించి బ్రహ్మచర్యంతో, నీ పవిత్ర జలపానం చేస్తూ దీక్ష నెరపుదురో వారల హృదయ కమలాల్లో నాలింగం స్థిరంగా ఉంటుంది. ఇది సత్యము. తిరగి వారల బుద్ధి పాపకార్యాలకు పోదు. వారల పితృదేవతల కక్షయ శ్రాద్ధఫలం లభిస్తుంది. స్నాన దాన తప హోమ జపాదులొనరించు వారల కక్షయ ఫలము అభిస్తుంది. మృతులగు వారలకు తిరిగి పుట్టుక ఉండడు. అలా శివునిచేత వరం పొంది ఆ కేదారమతిపవిత్ర క్షేత్రమై ఆ త్రినేత్రుని వచనానుసారం మానవులను పవిత్రుల గావిస్తూ దేవతను తృప్తిపరుస్తూ విరజిల్లుతోంది.

కేదారానికి అలా వరాలిచ్చి హరుడు త్వరత్వరగా పాపరాశిని సూర్యకుమారియైన యమునానదిలో స్నానం చేయుటకు వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి హరుడు శుచియై, నూరు తీర్థాల మధ్య వెలుగుతున్న పాపవిధ్వంసినీ, ప్లక్ష వృక్ష సంభవ అయిన సరస్వతీ నదికి వెళ్ళాడు. ఆ నదీ జలాల్లో ప్రవేశించి మునిగి కూర్చొని శివుడు ‘దృపద గాయత్రీ’ మహామంత్ర జపం చేస్తూ ఉండిపోయాడు. ఓ కలి ప్రియా ! సంవత్సరకాలం దాటినా శంకరుడా నీళ్ళలోనుంచి బయటకు రాలేదు. ఇంతలో సప్తలోకాలు సముద్రాలతో సహా చలించిపోయాయి. నక్షత్రాలతో సహా గ్రహాలు భూమ్మీద రాలి పోయయి. ఇంద్రాది దేవతల ఆసనాలు కదలిపోయినాయి. మహర్షులంతా లోకాలకు శుభమగుగాక అని జపిస్తూ స్వస్తి వాచనాలు చేయసాగారు. ఆ లోక సంక్షోభానిక అదరిపడి దేవతలు బ్రహ్మను సమీపించి ప్రభూ! ఏమిటీ సంక్షోభం? దీనికి కారణమేమని అడిగారు. అందుకా పద్మభవుడు తనకు గూడ కారణం తెలియదంటూ, చక్రగదాధరుడగు నచ్యుతుని చూడబోవుదమన్నాడు. బ్రహ్మ వచనానుసారం ఇంద్రాదులంతా బ్రహ్మను ముందిడుకొని మురారి నివాసానికి వెళ్ళారు. అదివిని నారదుడు ఓ మహర్షీ! ఆ మురారి ఎవరు? దేవా యక్షుడా కిన్నరుడా రాక్షసుడా లేక మానవుడా? వివరించమని అడగగా నా పులస్త్యుడు సత్త్వరజస్తమో గుణాలు కలిగి వాటికతీతుడై సర్వవ్యాపి అయిన మధుసూదనుడే ఆ మురహంత అని వివరించాడు. మరల నారదుడందుకొని, ఆమురరాక్షనుడెవని కుమారుడు? వానినేల యుద్ధంలో విష్ణువు వధించాడని ప్రశ్నించాడు.

పులస్త్యుడిట్లనియె : – నారదా ! పాపనాశనము పుణ్యావహము విచిత్రమూ నైన మురాసుర వధ వృత్తాంతం చెబుతున్నా వినుము. కశ్యప మహర్షికి దనువువల్ల మురాసురుడనే దానవుడు కలిగాడు. ప్రముఖులైన దేవతల చేతుల్లో దైత్యులందరు హతులుగావడంచూచి చావుకు భయపడి వాడనేక సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. వాని తపస్సుకు సంతోషించి పితామహుడు వత్సా! వరం కోరుకో అన్నాడు. అందుకు వాడు పితామహా! నేనెవరిని అర చేతితో తాకుదునో వారు అమరులైనా సరే ముద్ధంలో చనిపోవునట్లు వరమివ్వండి అని అర్థించాడు. బ్రహ్మ అట్లేయని అంతర్థానమై పోయాడు. అంతట నా దానవుడు దేవ నివాసమైన (మేరు) పర్వతానికి వెళ్ళి దేవ యక్ష కింనరాదులను యుద్ధానికాహ్వానిస్తే ఎవరూ యుద్ధానికి రాలేదు. అంతట కోపంతో వాడమరావతికి వెళ్ళి ఇంద్రుని యుద్ధానికి పిలవగా నతడా దానవునితో పోరాడుటకు సమ్మతించలేదు. అంతవాడు చేతిని పైకెత్తి అమరావతీ నగరంలోకి చొచ్చకొని పోగా ఎవరూ నిరోధించలేదు. నేరుగా యింద్రుని సదనానికి వెళ్ళి ఆమురుడు నాతో యుద్ధమైనా సాగించు లేదా అమరావతి వదలి వెళ్ళిపో అని నిలదీశాడు. నారదా ! వేరే మార్గం లేక దేవేంద్రుడమరావతి వదలి భూలోకానికి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడి సింహాసనంతోబాటు ఐరావత గజాన్ని వజ్రాయుధాన్ని వాడపహరింపగా నా సురపతి భార్యబిడ్డలు దేవతలు తోడురాగా యమునానది దక్షిణతీరానికి వెళ్ళి తనకొక నగరాన్ని నిర్మించుకొన్నాడు. మురాసురుడు సకల భోగాలనుభవిస్తూ స్వర్గంలో ఉండి పోయాడు. మయుడు తరుడు మొదలయిన యితర దనుజులు గూడ మురాసురిని వద్దకు వెళ్ళి స్వర్గ సుఖాలనుభవించ సాగారు. ఆ దానవడొక పర్యాయం వంటరిగా భూసంచారం చేస్తూ, గజారూఢూడై సరయూనదికి వెళ్ళాడు. ఆ నదీతీరాన యజ్ఞదీక్షితుడై యున్న సూర్యవంశ నృపతి రఘుమహారాజును చూచి, నాతో యుద్ధం చేయాలి లేదా ఈ యజ్ఞాన్ని మానుకోవాలి. దేవతలను యిక ఎంత మాత్రం యజ్ఞాలతో ఆరాధించడం పనికిరాదని శాసించాడు. అది చూచి మిత్రావరులు తనయుడైన వశిష్ఠుడు మహాతపస్వి ఆ దానవుని సమీపించి యిలా అన్నాడు.

”దైత్యవీరా ! మానవుల జయించునందున ప్రయోజనమేమి ? అజేయులైన వారలను శాసించుము. నిజంగా యుద్ధం చేయాలనుకుంటే యమధర్మరాజును అదుపులో పెట్టు. అతడిని జయించావంటే భూలోకాన్నంతా జయించినట్లే అవుతుంది. అని పలికిన వసిష్ఠుని మాట విని దండపాణియైన ధర్మరాజును జయించేందుకు బయలుదేరాడు. మురుడవధ్యుడనీ తన మీదకెత్తి వస్తున్నాడని విని, యముడు మహిషాన్నధిరోహించి కేశవుని వద్దకు వెళ్ళి నమస్కరించి మురాసురుడి ఆగడాలు వివరించాడు. అందులకా జనార్దనుడు నీవు వెళ్ళి ఆ రక్కసుని నా వద్దకు పంపుమని ఆదేశించాడు. అంతట త్వరగా తిరిగి తన నగరానికి వచ్చేసరికి మురుడుకూడ వచ్చిచేరాడు. యముడు వానికెదురేగి, దానవేశ్వరా ! నీ యిష్టప్రకారం చేస్తాను. నేనేంచేయాలో చెప్పుమన్నాడు. అందులకా మురుడు యామా! ఈ క్షణంనుంచీ నీవు జీవుల ప్రాణాలనపహరించుట మానెయ్యాలి. లేదో నీతల నరికి పారేస్తానన్నాడు. అంతట ఓ నారదా ! ఆ యముడా దానవుడితో నీవునాపై అధికారినుంచి నన్ను కాపాడుచో నేను నా కర్తవ్యాన్ని వదిలేస్తా. నీ ఆదేశాన్ని శిరసావహిస్తా నన్నాడు. అందుకు వాడు, నీమీద అధికారం నెరపువాడెవడో తెలుపుము. నేను వానిని నిర్జించి తప్పక నిన్ను రక్షిస్తానన్నాడు. అందుకు యముడు శ్వేతద్వీపవాసి చక్రగదాధారి అయిన విష్ణువు అదుపాజ్ఞలలోనే నున్నానని చెప్పగా వాడు ఆ దుర్జయుడైన విష్ణువుండే చోటు చెప్పగనే స్వయంగా వెళ్ళగలనన్నాడు. యముడదివిని క్షీర సముద్రానికి వెళ్ళు. అక్కడ నీకు జగన్మయుడు లోకాధినేత అయిన భగవానుడు విష్ణువు కనిపిస్తాడన్నాడు. మురాసురుడిదిగో యిప్పుడే ఆ కేశవుడి దగ్గరకు వెళ్తున్నా. నేను తిరిగి వచ్చే వరకు నీవు నీ మానసంయమన కర్తవ్యాన్ని నెరవేర్చకూడదు సుమా. అనగా యముడు సరే నీయిష్ట ప్రకారమే చేస్తా కాని ఎలాగైనా ఆయనను నాపై నియంతను జయించేందుకు ప్రయత్నం చేయుము. గట్టిగా యుద్ధం చేయమన్నాడు. అలాగేనని బీరాలు పలుకుతూ ఆ మురుడు శేషపర్యంకం మీద నాలుగు రూపాలతో విరాజిల్లే జనార్దనుని నివాసం క్షీరసముద్రానికి ప్రయాణమై పోయాడు.

నారదుడిట్లనెను :- ఒక్కడైన విష్ణువు నాలుగు రూపాలు గలవాడుగ నేల చెప్పబడినాడు? అందుకు కారణం ఆయన సర్వగుడగుటయా లేక అవ్యక్తుడగుటయా ? అందులకు పులస్త్యుడిట్లనియె. అవ్యక్తుడూ సర్వగుడూ ఒక్కడూ అయి ఉండియు నా జగన్నాథుడు చతుర్మూర్తి అయిన వివరం నారదా ! చెబుతున్నా వినుము. వాసుదేవుడుగా పేర్కొనబడే ఆ పరతత్వం తర్కానికి అతీతమైనది. ఇది అని నిర్దేశింపరానిది అవ్యక్తమైనది శుక్ల వర్ణం కలిగి శాంతియే రూపంగా కలిగినది. అది ద్వాదశ పత్రాలు గలిగినది. అంతట నారదుడో బ్రహ్మర్షి ! ఏ విధంగా ఆ తత్వం శుక్లమైనది శాంతమైనది తర్కాతీతమైనది ఉత్తమమైనది. దానిలోగల ద్వాదశపత్రాలు ఏవియో వివరించండన్నాడు. పులస్త్యుడిలా చెప్పాడు. అత్యంతగూఢమైన ఈ తత్వాన్ని మొదట పరమేష్ఠి ప్రజాపతి సనత్కుమారునకు తెలుపగా నాయననుండి నేను విన్నాను. నారదుడంతట, బ్రహ్మ స్వయంగా వినిపించిన ఆ సనత్కుమారుడెవరు? వివరంగా చెప్పండని అర్థించగా పులస్త్యుడిలా చెప్పాడు. ధర్మునకు అహింస అనే భార్యవలన యోగశాస్త్ర విధులయిన కుమారులు నలుగురు కలిగారు. వారిలో పెద్దవాడు సనత్కుమారుడు రెండవవాడు సనాతనుడు, మూడవవాడు సనకుడు నాలవవాడు సనందనుడు. వీరుగాక సాంఖ్యవేత్తలు కపిల, వోడు, ఆసురి, యోగివరుడు తపోనిధి అయిన పంచశిఖుడు ఉన్నారు. వారు పెద్దవారైయుండియు చిన్నవారలకు జ్ఞానయోగం చెప్పలేదు. మహాయోగ ప్రమాణం మాత్రమే చెప్పారు. అంతట సనత్కుమారుడు కమలభవుడైన బ్రహ్మనుచేరి యోగవిజ్ఞానాన్ని ఆర్థిస్తే ఆయన యిలాఅన్నాడు. ఓ సాధ్యుడా ! నీవు నా పుత్రుడవగుటకంగీకరిస్తే ఆ శాస్త్రం నీకు చెప్పగలను. ఎవరికి పడితే వారలకు సత్యం చెప్పగూడదు. అందుకు తిరుగులేదు. అందుకు సనత్కుమారుడు ప్రభూ! నీకు శిష్యుడనుకనుక నేను పుత్రుడనేకదా. పుత్రునకు శిష్యునకుభేదమేమి గలదు? అని అనగా బ్రహ్మ అలాకాదు ధర్మపుత్రా, శిష్యునికన్నా పుత్రునిలో విశేషం ఉంటుంది. అది ధర్మకర్మ నిర్వహణకు సంబంధించినది. పుత్‌ అనే నరకంనుంచి రక్షించేవాడు పుత్రుడయితే శేషించిన పాపాన్ని హరించే వాడు శిష్యుడనబడును. ఇది శ్రుతివచనం. అని విశ్లేషించగా సనత్కుమారుడా పున్నామనరకం, శేషపాహరణం అంటే ఏమో విపులంగా చెప్పమని కోరాడు. అంతట కమలభవుడు ఓ సాధ్యా! యోగాంగయుక్తమైన నీ విజ్ఞానం చాలా పురాతనమైనది. ఉగ్రమైనది, భయాలు పోగొట్టేది. అది నీకు చెబుతున్నాను. వినవలసిందన్నాడు.

ఇది శ్రీ వామనమహాపురాణంలో ముప్పది నాల్గవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment