నారదుడిట్లనియె :-
ఓ మహర్షీ ! ఆ రాక్షసులు తమలో తాము చర్చించుకొనుచుండగా ఆ దైత్యేశురుని బాణాలతో కొట్టి చీల్చిన వారెవరు? అందులకు పులస్త్యుడిట్లనెను. నారదా! రఘువంశములో రిపుజిత్త (శతృఘ్ను)ను రాజు ఉండేవాడు. అతనికి ఋతధ్వజుడనే తనయుడు కలడు. ఆ ఋతధ్వజుడు సర్వసద్గుణాల నిధి మహాత్ముడు, శూరుడు బలవంతుడు శత్రుసైన్యమర్దనుడు. బ్రాహ్మణుల నేత్రహీనులు దీన దరిద్రుల పట్లనూ స్నేహితుల యెడనూ సమదృష్టి గలవాడు. ఆ రాజ కుమారుడు గాలవ ఋషికోసంగాను జవాశ్వం మీదనెక్కి అర్దచంద్రబాణంతో దుష్టుడైన పాతాళ కేతువు వీపు బ్రద్ధలు కొట్టాడు. అంతట నారదుడో మహాత్మా ! అలా, గాలవమునికోసం, ఆ ఋతధ్వజుడు పాతాళకేతువు నెందుకు ప్రహరించాడని ప్రశ్నించగా పులస్త్యుడు యిలా అన్నాడు. పూర్వం గాలవ ఋషి తన ఆశ్రమంలో తపోమగ్నుడై యుండగా బుద్ధిహీనుడై పాతాళకేతువాయనకు తపోభంగం సమాధి భంగం కావించాడు. ఆ మునీశ్వరుడు వాడిని శాపదగ్ధుణ్ణి చేయగలిగియూ తపోవ్యయానిక వెరచి అలా చేయక మహావ్యథతో ఆకాశం వైపు చూస్తూ వేడి నిట్టూర్పు విడిచాడు. వెంటనే ఆకాశన్నుంచి ఒక ఉత్తమమైన అశ్వం భూమిమీద పడినది. దానితోబాటు ఈ గుర్రం రోజుకు వేయి యోజనాలు పరుగిడ గలదంటూ ఆశరీరవాణి వినిపించింది. ఆ గుర్రాన్ని స్వీకరించి ఋతధ్వజునకిచ్చి ఆ ముని మరల తపోదీక్షలో మునిగి పోగా దానిపై నెక్కి మహావీరుడైన నా రాజకుమారుడు రాక్షసుని బాణాలతో ప్రహరించాడు. అంతట నారదుడు. ఆకాశాన్నుంచి గుర్రాన్ని ఎవరు విడిచారు? ఆ అశరీరవాణి పలికిన వారెవరు? నాకు వింతగా ఉంది. దయచేసి చెప్పుడని అర్థించాడు. అందుకు పులస్త్యుడోనారదా ! ఇంద్రుని ఆస్థాన గాయకుడైన విశ్వావసుడనే గంధర్వ రాజు ఆశ్వాన్ని ఋతధ్వజుని కొరకై ఆయన కుమార్తె కారణంగా భూమిమీద వదలాడు అని చెప్పడు దానితో మరింత వింతపడి నారద ముని, ఆ గంధర్వ రాజే నా యశ్వాన్ని వదిలాడు? కుమలయాశ్వునకు, రాకుమారునకిందువల్ల కలుగు ప్రయోజనమేమిటని ప్రశ్నించాడు.
అందులకు పులస్త్యుడిలా చెప్పాడు :- ఆ విశ్వావసువు కూతురు మదాలస అనుసుందరి శీల గుణాల్లో ముల్లోకాల్లో సాటిలేనిది. చంద్రకాంతతో వెలిగే ఆ లావణ్య రాశి నిజంగా ¸వన మదాలసయే. ఆమె ఒకనాడు నందనోద్యానంలో సఖులతో విహరించడం చూచి ఆ దుష్టుడు పాతాళకేతు అపహరించాడు. ఆమె రక్షణ కోసం ఆ అశ్వాన్ని వదిలారు. ఆ రాజకుమారుడు పాతాళకేతువును సంహరించి ఆమెను విడిపించి శచీదేవితో యింద్రునకు మాదిరి ప్రకాశించాడు. అది విని నారదడు అలా మహిష తారకులు హతులైన తర్వాత ధీమంతుడైన హిరణ్యాక్షుని కుమారుడేమి చేశాడని ప్రశ్నించగా పులస్త్యుడిలా చెప్ప మొదలు పెట్టాడు. నారదా ! ఆ దుర్బుద్థీ, దేవాతంకుడైన అంధకుడు తారకాసుర మహిషాసురుల సంహారం చూచి ఆగ్రహోదగ్రుడయ్యాడు. తనకున్న స్వల్ప పరివారంతో పరిఘపాణియై బయలుదేరి ఆ దుష్టుడు పాతాళాన్నుంచి వచ్చి భూమిమీద నలువైపులా తిరుగసాగాడు. అలా సంచరిస్తూ ఒకనాడు సుందరమైన కండరాలతో నొప్పిన మందరపర్వతాన సఖులతో కూర్చున్న గిరి కుమారగౌరి సౌందర్యం చూచి ఆ కామాంధుడు బుద్దిహీనుడై యిలా ప్రశ్నించాడు. ఈ వనంలో విహరించే ఆ లావణ్య రాశి ఎవరు ? ఈమె నా అంతఃపురవాసిని కాని నాడు నాయీ జీవితం వ్యర్థం. ఈతను మధ్యను కౌగిలించుకొనని నా రూప సంపద నిరర్థకం కదా. ఈ మృగ నేత్రినీ నన్ను కూర్చగలవాడే నాకు నిజమైన బంధువు మిత్రుడు సోదరుడూ నాసర్వస్వమూను. అంటూ వదరుతున్న ఆ దైత్యేంద్రుని మాటలకు రెండు చెవులు చేతులతో మూసికొని తలపంకిస్తూ బుద్ధిసాగరుడైన ప్రహ్లాదుడిలా హితబోధచేశాడు. దైత్యేంద్ర ! అలాంటి మాటలనకుము. ఆమె ఎవరనుకుంటివి? జగజ్జనని ! లోకేశ్వరుడు శూలపాణియగు శంకరుని యిల్లాలు. వంశక్షయానికి దారితీసే యిలాంటి దుష్టాలోచనలు మానుము. ఆమెవరదార. రసాతలంలో పడిపోకుము. దుర్మార్గులకే కాదు సజ్జనులకు గూడ యిలాంటి దుష్ట సంకల్పం మంచిదికాదు. ఇలాంటి పరదారగ్రహణం నీ విరోదులు చేయుదురుగాక. నీవీ ప్రయత్నాన్ని విరమించుకో. గాధిరాజు విప్రుల ధేనువులను అపహరించిన సైనికులను చూచి పలికిన హిత వాక్యాలు నీవు వినలేదా? ఇతరుల మీద చాడీలు చెప్పటం కన్నా మరణించుట మేలు. అబద్దం చెప్పడం కన్నా నోరు మూసుకొని ఉండటం మంచిది. ఇతరుల భార్యలను కోరడం కన్నా నపుంసకత్వం ఉత్తమం. పరధనాపహరణం కన్నా బిచ్చమెత్తుకొవడం శ్రేష్టం. మోహంతో క్రోధంతో కండ్లు మూసుకొని పోయిన ఆ దుష్టుని మీద ఆ హితవచనాలు ఏమి పనిచేయలేక పోయాయి. ఈ స్త్రి నా విరోధి తల్లి. అని అరుస్తూ ఆమె ఉన్న వైపు పరుగుతీసాడు.
అంతట నారాక్షసులంతా యంత్రాలనుంచి వెడలిన శిలలలాగా విజృంభించారు. వారలను బలపూర్వకంగా వజ్రపాణియై నందీశ్వరుడు నివారించాడు. మయుడు తారుడితోపాటు ఆ దైత్యులంతా వజ్రాఘాతాలను తల్లడిల్లి భయంతో పది దిక్కులకు పారిపోయారు. అలా వారలను మర్దించిన నందిని చూచి కోపంతో, అంధకుడు పరిఘతో గట్టిగా ప్రహరించి నేలపడగొట్టెను. నంది మూర్ఛిల్లడం ఆ దుష్డుడు తన మీదకు రావడం చూచి గౌరి భయంతో నూరురూపాలు ధరించింది. ఆ స్త్రీల మధ్య నా దురాత్ముడు ఆడ ఏనుగుల మధ్య పరుగులు తీసే మదపుటేనుగులాగా గంతులేయసాగాడు. వాళ్ళ మధ్య అసలు గౌరి ఎవరో చూడలేక పోయాడు. అందులో ఆశ్చర్యమేముంది? పుట్టు గ్రుడ్డివాడు, మోహంతో కళ్లుమూసుకపోయినవాడు, మదాంధుడు, లోభంతో నిండిపోయినవాడు ఈ నలుగురు కళ్లు తెరచుకొనినప్పటికీ చూడలేరు. అలాగే ఎదుట ఉన్న గౌరిని కూడా ఆ అంధకుడు గుర్తించలేకపోయాడు. స్త్రీలనే భావంతో వారలమీద చేయి చేసుకోలేరు. గౌరి యొక్క నూరురూపాలలో విజృంభించిన ఆ దేవీ శక్తులన్నీ వానిపైబడి శస్త్రాస్త్రాలతో మర్దించి నేలబడగొట్టారు. అంధకుడావిధంగా భూపతితుడు కాగానే శతరూపాలు ధరించిన అంబిక అంతర్దానమై పోయింది. మట్టి గరచిన తమ నాయకుణ్ణి చూచి దైత్య దానవ వీరులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధానికి తలపడగా గణేశ్వరుడు, తన గణాలతో, వజ్రం చేతబట్టి కోపించిన యింద్రునివలె ఎదురొడ్డి నిలిచాడు. అలా విజృంభించి దానవులందరనూ, మయునితోసహా, పారద్రోలి అంబిక సన్నిధికి వెళ్ళి నమస్కరించాడు. అంతట గౌరి తన రూపాలనన్నింటినీ విసర్జించి యిలా అన్నది. మీరంతా భూలోకంలో స్వేచ్ఛగా తిరుగుతూ మానవులచేత పూజలు స్వీకరించండి. ఉద్యానవనాల్లో అరణ్యాలలో వనస్పతులలో వృక్షలలో నివసించండి. నిశ్చితంగా శతావరులుగా విహరించండి. ఆ గిరి నందిని ఆ దేశాన్ని తలదాల్చి ఆ శతావరులందరూ ఒకరొకరుగా నామెకు ప్రణమిల్లి, కిన్నరులంతా తమ్ము కీర్తిస్తుండగా సర్వదిక్కులకూ వెళ్ళిపోయారు. ఇంతలో అంధకుడు మూర్ఛనుండి తేరుకొని చూస్తే ఆచట గౌరికనిపించలేదు. తన బలాలన్నీ ఓడిపోయినట్లు గ్రహించి ఆ దుష్టుడు కూడా చల్లగా పాతాళానికి జారుకున్నాడు. అప్పటినుండీ ఆ కామోపహతుడు పగలు తిండీ రాత్రులు నిద్రా మాని గౌరిని స్మరిస్తూ మతి భ్రష్టుడయ్యాడు.
ఇది శ్రీవామన మహాపురాణంలో ముప్పది మూడవ అధ్యాయం ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹