పులస్తుడిట్లనెను :-
దేవతలు తనను దేవసేనల కధిపతిగా అభిషేకించిన తర్వాత ఆ కుమారుడు భక్తితో శివునకు పార్వతికి, అగ్నికి, ఆరుగురు కృత్తికలకు బ్రహ్మకు తలవంచి ప్రణామాలు చేసి యిలా అన్నాడు. ”ఓ దేవతలారా! మీకు నమస్సులు ఓ తపోధనులారా! మీకు ప్రణామాలు. మీ అందరి అనుగ్రహ ప్రసాదాలతో నేనా శత్రువులను మహిష తారకులను జయించెదను. శిశువు నగుటచే మీతో మాటాడుట నాకు తెలియదు. విరించితో కలిసి మీరందరూ నాకనుజ్ఞ నొసగుడు. అలా మాటడిన కుమారునివచనాలు విని దేవతలంగా భయంవీడి ఒకరినొకరు చూచుకున్నారు. శివుడు కూడ పుత్ర వాత్సల్యంతో లేచి విరించి చేయి పట్టుకొని స్కందుని వద్దకు తీసుకవెళ్ళాడు. అంతట ఉమాదేవి కుమారునితో ‘నాయనా! పుత్రా రమ్మురమ్ము! ఓ శత్రుసంహారకా! సర్వజన వంద్యుడైన అచ్యుతుని దివ్య చరణాలకు నమస్కరించుము.’ అని అన్నది. అందులకాతడు నవ్వి, ‘అమ్మా! నాలాంటివాడు గౌరవంతో నమస్కరించదగిన ఆయన ఎవరమ్మా? అని అడిగెను. అందులకా అంబిక, ”నీవు మొదట ఆయనకు నమస్కరించుము. తర్వాత ఆయనను గురించి బ్రహ్మ నీకు చెప్పగలడు. ఆయన్ను మించిన దైవం మరొకరెవ్వరూ మాతోసహా లేరని మీ తండ్రి నాకు చెప్పినాడు. కనుక నా గరుడధ్వజునకు నమస్కరించుమనెను. పార్వతి చెప్పిన ప్రకారం ఆ స్కందుడు జనార్దనునకు మ్రొక్కి చేతులు జోడించికొని నిలబడగా నా విష్ణువు స్వస్తివాచనం గావించి అనుజ్ఞ నొసగెను.
నారదుడిట్లనెను :- ఓ బ్రహ్కర్షీ ! స్కందునకా గరుదధ్వజుడొనర్చిన పవిత్రమైన స్వస్తివాచనము నాకు వినపించుడు. అందులకు పులస్త్యుడు, స్కందునకు విజయమూ, మహిషునకు సర్వనాశనము కలుగుటకై శ్రీహరి గావించిన స్వస్తివాచనము నీవిధంగా వివరించాడు. ఓ శిఖిధ్వజా ! రజోగుణియైన వర్మయోని విరించి నీకు క్షేమం కలుగ చేయుగాత ! అజుడు చక్రధరుడునైన విష్ణువు నీకు సేమం కలుగజేయుగాక. వృషభారూఢుడగు శంకరుడు సపత్నీకుడై నిన్నెల్లవేళల రక్షించుగాక. పావకుడు మేలు చేయుగాక. దినకరుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురు శుక్ర శనైశ్చరులు నీకు సదా క్షేమం కలుగచేయుదురు గాక. మరీచ అత్రి పులహపుంస్తులు, క్రతు వసిష్ఠులు, భృగువు అంగిరసుడు మార్కండేయుడు, సప్తమహర్షులు నీకు సదా కళ్యాణం కలుగజేయుదురుకాక. విశ్వేదేవతలు, ఆశ్వినులు, శూలపాణులైన రుద్రులు, సాధ్యులు మరుత్తులు అగ్నులు యక్షులు పిశాచాలు వసువులు కిన్నరులు వీరందరు నీకు అభ్యుదయానికి సదా తోడ్పడుదురుగాక, నాగులు గరుడులు నదులు సరోవరాలు, తీర్థాలు, పవిత్రక్షేత్రాలు సముద్రాలు మహాబలురైన భూతగణాలు ఆ గణాధ్యక్షులు, అందరూ నీకు క్షేమం కలుగజేయుటకై ఎల్లప్పుడు సన్నద్దులై యుందురుగాక. ద్విపాత్తులు చతుష్పాత్తులు బహుపాదాలుగలవి పాదాలు లేని జీవులందరనుండియు నీకు రక్ష కలుగుకాక. తూర్పుదిక్కున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమ దిశన వరుణుడు, ఉత్తరాన చంద్రుడు నిన్ను రక్షింతురుగాక. ఆగ్నేయదిక్కున అగ్ని, నైరుతి దిశన కుబేరుడు, వాయవ్యాన వాయుదేవుడు ఈశాన్నదిశను శివుడు నిన్ను కాపాడుదురుగాక. ఊర్ధ్వదిశన ధృవుడు, అధోదిశన శేషుడు, ఈ దిశాంతరాలలో ముసలం, నాగలి చక్రం ధనుస్సు ధరించిన (సంకర్షణ వాసుదేవుడు) వారలు నిన్ను రక్షింతురుగాక. సముద్రజలాల్లో వారాహ ప్రభువు, సంకట స్థలాలలో నరసంహదేవుడు, సామవేదరూపుడయిన మాధవుడు నిన్ను కాపాడుదురుగాక !
పులస్త్యుడిట్లనెను : – ఆవిధంగా స్వస్తి వాచనాలు స్వీకరించి, శక్తి ధరులలో శ్రేష్ఠుడైన ఆగుహుడు దేవతలందరకు సాష్టాంగ ప్రణామాలుచేసి లేచి పైకి ఎగిరాడు. ఆయన ననుసరించి, ఆయనకు సందుష్టులై దేవతలిచ్చిన భూతగణాలుకూడ కామరూపులగుటచే పక్షులరూపంలో, ఆకాశమార్గాన బయలుదేరారు. ఆ కార్తికేయునితోబాటు, మాతృగణంకూడ రాక్షస వధార్థం, ఆకాశవీథిన ఆయనను గమించారు. ఆవిధంగా ఆకాశాన చాలాదూరం ప్రయాణం చేసిన మీదట ఆస్కందుడా గణాలనందరను భూమిమీదకు దిగమని ఆదేశించాడు. గుహుని వచనానుసారం వారంతా భూమిమీదకుదిగి భయంకరంగా బొబ్బలు పెట్టారు. ఆ మహాధ్వని, భూమ్యాకాశాలలోనిండి సముద్రబిలంగుండా రాక్షసులకు నిలయమైన పాతాళానికి వ్యాపించింది. ఆ ప్రళయగర్జన చెవుల పడటంతో మహిషతారకులు, విరోచనజంభకుజంభులు అదిరపడి, యిదేమి పిడుగు పాలువలెనున్నదని వితర్కించుచూ అందరూకలిసి అంధకుని వద్దకు వెళ్ళారు. నారదా ! అలా అంశకుని సమీపించి ఆ దానవవీరులంతా ఉద్విగ్నులై ఆ ధ్వనిని గురించ ఆలోచించసాగారు. వారలా సంప్రదించుకుంటూండగా భూలోకాన్నుంచి పాతాళకేతువనే సూకరముఖడు, బాణం దెబ్బతగిలి తూలుకుంటూ భయంకంపితుడై, దైత్యరాజైన అంధకాసురిని సమీపించి దీనవదనంతో యిలా అన్నాడు. ”రాక్షసప్రబో! నేను భూలోకంలో గాలవృషి ఆశ్రమాన్ని ధ్వంసం చేసే సంకల్పంతో పందిరూపందాల్చి వెళ్ళి దానిని పాడుచేయసాగాను. ఇంతలో ఎవడో మానవుడు బాణంతో నామెడ ఎముకను గట్టిగా బద్దలు కొట్టాడు. నేనా చావుదెబ్బకు భయపడి పారిపోగా నాతడు నావెంట పడినాడు. గుర్రపు డెక్కల ధ్వనులమధ్య. ‘నిలు! నిలు!’ మనుచూ ఆవీరుడు వెంబడించాడు. అంతట భయంతో దక్షిణ సముద్రం చివరకు పరుగుతీసి, కొంచెం వెనుదిరిగి వారెవ్వరో అని పరికించాను. రకరకాల వేషాలు ధరించి ఎందరో మనుష్యులు, వాళ్ళలో కొందరు మేఘాల్లాగ గర్జిస్తూంటే మరికొందరు ప్రతిగర్జనలు చేస్తున్నారు. ఇంకా కొందరు ఈరోజు తప్పకుండా ఆమహీషాసురుణ్ణి చంపేస్తాం, ఆతారకాసురుణ్ణి మట్టి కరిపిస్తాం అంటూ కేకలు పెడుతున్నారు. ప్రభూ! వాళ్ళ సింహనాదాలకు బెదరిపోయి ప్రాణాలరచేతిలో పెట్టుకొని భూలోకాన్నుంచి ఒక పెద్ద బిలంలో పడిపోయాను. నావూరు హిరణ్యపురాన్ని వదిలిపెట్టాను. అయినా ఆ వీరుడుకూడ నన్ను వెంటాడుతున్నాడు. మీ అండకు చేరాను నా ప్రాణాలు రక్షించండి దొరా!”
సూకరముఖుడి దీనవచనాలు విని అంధకుడు, భయపడకుము నిన్ను తప్పక రక్షిస్తానని మేఘస్వరంలో అభయమిచ్చాడు. అప్పటికే అంధకుడికి తెలుపకనే మహాబలశాలురైన మహిషతారకం, బాణరాక్షసవతలు తమతమ బలాలతో భూలోకానికి యుద్ధం చేసేందుకు వెళ్లారు. స్కందుని గణాలు, భయంకరాకారాలతో తమ గర్జనలతో లోకాలన్నీ కంపింప చేస్తూండే ప్రదేశానికి ఆ రాక్షస నాయకులంతా తమతమ సాయుధబలలాలతో వచ్చి చేరారు. నారదా! అలా రక్కసిమూకలు విరుచుకుపడటం చూచి కార్తికేయుని గణాలు నిప్పులు గురిపిస్తూ, మాతృగణాలతో సహా, శత్రువులమీదకు లంఘించారు. వారిలో ముందుభాగాన బలశాలియైన స్థానువు పెద్ద గుదియ తీసికొని, పశువులను రుద్రుడు సంహరించునట్లుగా పరబలాన్ని చెండాడసాగాడు. ఆ మహాదేవుడు చేసే సంహార కార్యాన్ని చూచి కలశోదరుడు గొడ్డలి తీసుకొని మహారాక్షసులందరను సంహరించాడు. భయంకరమైన అగ్నిగుండంలాంటి నోరు తెరచుకుని జ్వాలాముఖుడు, రెండు చేతులతో రాక్షసును నోటిలోనికి కుక్కుకొని సంహరించాడు. భయంకరమైన ప్రాసపట్టుకొని దండకుడు కోపంతో పిచ్చివాడివలె విజృంభించి వాహనంతోకూడా ఎత్తి మహాసముద్రంలో, ఆ మహాసురుడిని విసరివేశాడు. వ్రజలను వశపరచుకున్న మంత్రి ప్రాసాయుధంతో రాజుతల ముక్కలు చేసినట్లు శంశుకర్ణుడు రాక్షసులను నాగలితో తనవైపు లాగికొని రొకలిబండతో వాళ్ళ తలలు బద్దలు కొట్టసాగాడు.
గణశ్వరుడైన పుష్పదంతుడు ఖడ్గండాలు పట్టుకొని రాక్షసులను రెండు మూడు ముక్కలుగా అనేక ఖండాలుగా నరక మొదలుపెట్టాడు. భయంకరమైన దండాన్ని తిప్పుతూ పింగళుడు ఎక్కడకువెళ్ళితే అక్కడ రాక్షసుల శవాలు కుప్పలుకుప్పలుగా కనిపించాయి. గణపతి సహస్ర నయనుడు శూలంత్రిప్పుతూ అశ్వగజరథాలతో సహా రాక్షసవీరులను సంహరించాడు. ఇంద్రుడు పిడుగులు కురిపించి కొండలను పిండిచేసినట్లు భీముడు భయంకరమైన శిలావృష్టితో శత్రువధ గావించాడు. అయిదు జటలుగల శకట చక్రాక్షుడనే కణాధిపతి, తన ముద్గరాన్ని మహావేగంతో త్రిప్పుతూ ఎందరనో యమాలయానికి పంపాడు. ఇక గిరభేద అనే సార్థక నాముడు తన అరచేసి దెబ్బలతోనే ఏనుగులతోసహా ఆరోహకులను, రథాలతోసహా రథికులను బూడిదగా పొడిపొడి చేశాడు.
ఓ నారదా ! ఇక బలశాలి అయిన నాడీజంఘుడు తన పాదాలతో మోకాళ్ళతో వజ్రాల్లాంటి ముష్టిఘాతాలతో ఉక్కు గుదియలతో శత్రునాశం గావించాడు. కూర్మగ్రీవుడు తన మెడతో తలతో పాదాలతో శత్రువులను చీల్చి మృత్యువుకు విందు చేశాడు. ముద్ధోన్మాదులైన ఆ రాక్షసులను పిండారకుడు తన దవడలతోను దంష్ట్రలతోను కొమ్ములతోను చీల్చి చెండాడాడు. ఆ విధంగా తమకు ఎదురులేని రాక్షససైన్యం గణాధిపతుల చేతుల్లో హతమైపోవడంచూచి మహారోషంతో మహిషుడు తారకుడు, ప్రచండ సేనాధిపతులు, ముందుకు లంఘించారు. ఆ యిద్దరు దైత్య నాయకులు శ్రేష్ఠమైన ఆయుధాలతో తమ్ము ప్రహరించడం చూచి ప్రమథులు నలువైపులనుండి వారిని ముట్టడించి యుద్ధం చేయసాగగా, హసాస్యుడు మహిషుణ్ణి పట్టిశంతో చావమోదాడు. షోడశాక్షడు త్రిశూలంతో శతశీర్షుడు వాడి కరవాలంతో శ్రుతాయుధుడు గదతో విశోకుడు రోకలిబండతో బంధుదత్తుడు శూలంతో ఒక్క పెట్టున వాడిమాడుమీద ప్రహరించాడు. ఇంకా అనేకులు పార్షదులుకూడ శూలాలు శక్తులుపట్టిసాలతో ఆ మహిషుని ప్రహరించినప్పటికీ మైనాక పర్వతంలాగా ఆ వీరుడు ఏమాత్రం చలింపలేదు. భద్రకాళి ఉలూఖలుడు ఏకచూడుడు వాడియైన ఆయుధాలతో తారకుణ్ణి పొడవసాగారు. ఆవిధంగా ప్రమథులు మాతృగణాలు ప్రహరిస్తూన్నా ఆ మహాసురులు ఏమాత్రం బాధకు లోనుగాక పైపెచ్చు ఆ దేవగణాలను హింసింపసాగారు. మహిషుడు ప్రచండ గదాయుధంతో ప్రమధులను పరహరించి ఓడించి కార్తికేయుడున్నవైపు పరుగు తీశాడు. అలా మీదకు లంఘిస్తూన్న మహిషుని చూచి సుచక్రాక్షుడు మహాకోపంతో చక్రాయుధంతో వాడికి అడ్దుతగిలాడు. ఓ బ్రహ్మర్షీ! అలా మహారధులైన గణాధ్యక్షులు రాక్షసాధిపతులు. గదలు చక్రాయుధాలుచేబట్టి పరస్పరం ప్రహరించు కుంటూ సముజ్జీలుగా భయంకరంగా అలవోకగా యుద్ధం చేశారు. మహిషుడు గదను విసిరతే సుచక్రాక్షుడు చక్రాన్ని వాడిమీద ప్రయోగించాడు. భయంకరమైన అంచులుగల ఆ చక్రం గదను పొడిపొడిగావించి మహిషుడి మీదికివచ్చింది. అదిచూచి ధైత్యులంతా అయ్యో! మహిషుడు చచ్చాడుగదా! అని ఆక్రోశంచేశారు. అదివిని బాణుడు ప్రాసంతీసుకొని ఎర్రనికండ్లతో అయిదువందల ముష్ఠిఘాతాలతో చక్రాన్ని ఎదుర్కొన్నాడు. మరొక అయిదువందల బాహువులతో సుచక్రాక్షుణ్ణి బంధించగా నాతడు బలవంతుడయిన బాణునిముందు ఏమీ చేయలేకపోయాడు.
సుచక్రాక్షుణ్ణి చక్రంతోసహా బాణుడు బంధించడంచూచి మహాబలుడై నమకరాక్షుడు గదాపాణియై బాణుడిపైదూకి గదతో వానినెత్తిమీద మోదాడు. ఆదెబ్బకు తాళలేక బాణుడు సుచక్రాక్షుణ్ణి వదిలిపెట్టాడు. దానితో సిగ్గుతో తలవంచుకుని సుచక్రాక్షుడు యుద్ధభూమి వదిలి సాలిగ్రామానికి వెళ్ళిపోయాడు. మకరాక్షునిచేత చావుదెబ్బతిన్న బాణుడుకూడ కాలికి బుద్ధి చెప్పాడు. ఓ దేవర్షీ! రాక్షస సైన్యమంతా భగ్నమైపోవడం చూచి మహాబలియైన తారకాసురుడు మండిపడి ఖడ్గం తీసికొని ఆ గణాధిపతులందరను వెంబడించి తరిమికొట్టాడు. అలా వాడిచేతుల్లో దెబ్బలుతిని హంసాస్యుడు మొదలయిన గణపతులు మాతృకాగణాలు పారపోయి స్కందునిచేరి మొరపెట్టుకున్నారు. బెదరిపోయిన తన గణాలను కత్తితో మృత్యువులాగా వాండ్లను తరిమికొడుతున్న తారకుణ్ణిచూచి స్కందుడు తన భయంకరమైన శక్తితో వాడి వక్షస్థలాన్ని చీల్చి వేశాడు. దానితో వాడు విగతజీవుడై నేలవ్రాలాడు. అలా తన సోదరుడు నేలగూలడంచూచి మహిషుడి పొగరంతా నీరు గారి పోయింది. భయంతో గడగడ వణుకుతూ ఆ దుర్మార్గుడు యుద్ధభూమిన వదలి హిమాచలంలోని కైలాస శిఖరానికి పారిపోయాడు. తారకుడు స్కందుని శక్తికి బలిగావడం, మహిషుడు హిమగిరికి పారిపోవడం రాక్షసబలాన్ని గణాలు చీల్చిచెండాడడంచూచి బ్రతుకుజీవుడా! అంటూ బాణాసురుడుకూడా పారిపోయి సముద్రజలాల్లో అదృశ్యుడయ్యాడు. అలా తారకుని తనశక్తి కెరగావించి పారిపోతున్న మహిషుణ్ణిచూచి కార్తికేయుడు మయూరంమీదనెక్కి మహా వేగంతో ఆ దుష్టుని వెంబడించాడు. ఆ మహిషుడు వెనుకకుతిరిగి చూడగా మయూరధ్వజుడు శక్తితో తనను వెంబడించడం గమనించి కైలాసాన్ని వదలి క్రౌంచగిరి గుహలో దూరి దాగుకున్నాడు. అలా క్రౌంచగుహలో దూరిన మహిషుణ్ణి చంపకుండా స్కందుడు నిలబడిపోయి, స్వంత సోదరుణ్ణి ఎలా చంపడమా అని ఆలోచనలోబడినాడు. వెంటనే బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు వచ్చి క్రౌంచ పర్వతంతోసహా ఆ మహిషుణ్ణి భేదించమని కుమారునితో తొందరపెట్టారు. అప్పుడే దేవకార్యం సిద్ధిస్తుందన్నారు. అందుకా గుహుడు చిరునవ్వుతో మీరు చెప్పింది బాగుగానే వుంది. కాని నా మాతామహుని మనుమని. నా మేనమామ కుమారుని, నాసోదరునే ఎలా చంపగలను? గోబ్రహ్మణ వృద్ధులను, ఆప్త వాక్యము పలుకువానిని, బాలురను స్వంత సోదరులను, పతివ్రతయైన భార్యను, ఆచార్యపరులను, గురువులను, అపరాధులైనను సరే వధింపరాదనే వేదములు శాసిస్తున్నాయి. దానిని వేదవేత్తలు మహర్షులు ఉత్తమ వ్రతంగా పాలిస్తూ ఉన్నారు. అతి పాపులసైతం ఆ నీతిని పాటించి స్వర్గర్హులౌతున్నారు. ఈ శ్రేష ధర్మాన్ని తెలిసికూడా, ఓ మహానుభావులారా! నేను నా మేనమామకొడుకును. మాతులేయభ్రాతను సంహరింపలేను. ఆదైత్యుడా గుహనుండి బయటకు వచ్చిన వెంటనే వధిస్తానని చెప్పాడు. నారదా! కుమారుడు చెప్పినదివిని, ఆలోచించి దేవేంద్రుడతనితో యిలా అన్నాడు. కుమారా! నీవు నాకన్న తెలిసినవాడవుకావు. ఎందుకిలా వాదిస్తావు? భగవంతుడు శ్రీహరి స్వయంగా చెప్పిన ధర్మసూక్తివిను. ఒకనికోసం అనేకులను చంపకూడదు అట్లే ఎక్కువమందిన రక్షించుటకు ఒక్కని చంపడం పాపం కానేరదు.
అధర్మం వినియే నేను పూర్వం, ఓ అగ్నిపుత్రా! యుద్ధంలో నా సోదరుడు తమ్ముడూనైన వముచిదైత్యుని సంహరించాను. కాబట్టి ఎందరో దేవతల రక్షణకోసం క్రౌంచంతోబాటుగ మహిషుణ్ణి వధించుము. అగ్నిదత్తమైన శక్తిని తీసికొని పరాక్రమించుము. ”ఇంద్రుని మాటలువిని కనులెర్రజేసి కదలిపోతూ స్కందుడిలా అన్నాడు. ”ఓ వృత్రహంతా! నీవు మహామూర్ఖుడవు! నన్నిలా ఆక్షేపణ చేస్తున్నావు. నేవెంత నీబలమెంత? నిజంగా నీకు బుద్ధిలేదు.” అందుకు యింద్రుడు ఓ గుహా! నీకంటే నేనే బలశాలిని అన్నాడు. అయితే రమ్ము! ఎవరు బలవంతులో యుద్ధంలో తేల్చుకుందామని అంటూన్న కుమారునితో ఇంద్రుడు అందుకు ద్వంద్వయుద్ధం అవసంరలేదు. ఈ క్రౌంచపర్వతాన్ని ఎవరు ముందుగా చుట్టివస్తారో వారే బలవంతుని చెప్పగా స్కందుడు వెంటనే నెమలిమీదనుంచి క్రిందకుదిగి పాదచారియై త్వరత్వరగా ఆగిరి ప్రదక్షిణం చేసి వచ్చాడు. ఇంద్రుడు మాత్రం ఐరావతాన్నిదిగి ప్రదక్షిణంచేసి, గుహుడు వచ్చుసరికి, నిలబడియున్నాడు. ఓయి మూర్ఖా! ఇలా నిలబడినావేమని తన్నడిగిన గుహునితో ఇంద్రుడు నా ప్రదక్షిణం నీకన్నా ముందే పూర్తయిందన్నాడు. గుహుడు కాదు. నీకన్నా ముందు నేను చేశానన్నాడు. అలా నేను ముందుచేశానంటే నేను ముందుచేశానని తగవులాడు కుంటూ వారిద్దరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తీర్పు చెప్పమన్నారు. అప్పుడు విష్ణువు, ఎవరో చెప్పుట ఎందులకు? క్రౌంచగిరినే అడగండి. అతడే చెప్పుతాడనగా, గుహుడు క్రౌంచుని ముందుగా ఎవరు ప్రక్షిణించారో చెప్పమనికోరాడు. అంతట క్రౌంచుడు, మహామతియైన వగభేరి (ఇంద్రుడే)యే ముందుగా ప్రదక్షిణం చేశాడన్నాడు. దాంతో అగ్ని పుత్రుడి కళ్లెర్రబడ్డాయి,! పెదవులు అదిరాయి! కోపం పట్టలేక ఆ కుటిలాతనయుడు భయంకరమైన తన శక్తితో ఆ క్రౌంచుని లోపలున్న మహిషున్ని చీల్చి సంహరించాడు.
ఓ నారదా! అలా తనకుమారుడు క్రౌంచుడు చచ్చుట చూచి, నగాధిరాజు కుమారుడైన సువాభుడు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అటు మహిషాసురుడు వధింపబడటంతో బ్రహ్మేంద్రరుద్రమరుదశ్వినీవస్వాదిదేవతలు ఆనందంతో కేరింతలు కొడుతూ స్వర్గానికి వెళ్ళిపోయారు. అలా వచ్చిన తన మేనమామను చూచి కార్తికేయుడు తనశక్తిని పెరిక సునాభుని కూడ వధించుటకు సిద్ధమయ్యాడు. అంతట శ్రీహరి వెంటనే నతని నాలింగనం చేసుకొని సునాభుడు నీకు పూజ్యుడు బాబూ. అంటూ వారించాడు. హిమవంతుడు కూడ వచ్చి పుత్రుడు సునాభుని చేయిపట్టుకొని వేరొక చోటికి తీసికెళ్ళాడు. అంతట గరడా రూఢుడైన హరి వెంటనే మయూరంతోసహా కార్తికేయుణ్ణి తనవెంట స్వర్గానికి గొని పోయాడు. అక్కడ స్కందుడు శ్రీహరిని చూచి శోకంతో, అజ్ఞానంవల్ల మూర్ఖుడనై నామాతులేయ సోదరుణ్ణే వధించాను. ఆ పాపానికి పరిహారంగా శరీరత్యాగం చేసుకుంటాననగా నా విష్ణువు, అంతకన్న ఘోరమైన పాపాలు కూడ పోగొట్టేది వృథూదకమనే మహాతీర్థం ఉంది. అందులో స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే సర్వపాపాలుపోయి సూర్య ప్రభతో వెలిగిపోతావు. కాబట్టి అక్కడకు వెళ్ళుమని ఆదేశించాడు. శ్రీహరి మాట ప్రకారం కుమారుడు పృథూదక క్షేత్రానిక వెళ్ళి స్నానంచేసి భక్తితో శంకర దర్శనం గావించి విధ్యుక్తంగా దేవతలనందరను అర్చించాడు. తర్వాత శివుడు నివసించే శైలానికి వెళ్ళాడు. యుద్ధభూమినుండి వెళ్లిన సుచక్రాక్షుడా పర్వంతం మీదనే వాయు భక్షణం చేస్తూ వృషభధ్వజుని గూర్చి కఠోర తపస్సు చేయగా శివుగనుగ్రహించి వరం కోరుకొనుమన్నాడు. అందులకాతడు ‘ఓపరమేశ్వరా! నన్నవమానించిన బాణాసురుని బాహువులను ఖండిచగల అద్భుతమైన చక్రాయుధాన్ని అనుగ్రహించుము. అని వేడుకున్నాడు. అందుకు హరుడు తథాస్తు ! నీవు కోరినట్లే, రోజురోజుకూ వృద్ధింగతమగు చున్న బాణాసురుని బాహు సహస్రాన్ని ఖండించే చక్రాన్ని యిస్తున్నాను తీసుకో. ఈ ఆయుద శ్రేష్ఠానికి ఎదురుండదు. సందేహంలేద’ ని చక్రప్రదానం చేశాడు. అలా శంకరుని వలన వరంపొంది గణధ్యక్షుడైన సుచక్రాక్షుడు స్కందుని వద్దకు వెళ్ళి నమస్కరించి సంతోషంతో హరుడు తనకు యిచ్చిన విషయమంతా చెప్పాడు.
ఓ మహర్షీ! ఫాలాక్షుని పుత్రుడు కుమారుడు, దివ్యవైన శక్తి ఆయుధంతో గావించిన మహిషాసుర వధ క్రౌంచ భేదనము, శరణాగతుని రక్షించుటకాపర్వతం కావించిన ప్రాణత్యాగం వివరంగా నీకు వినిపించాను. పవిత్రమైన ఈ కథ పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పెంపొందిపజేస్తుంది.
ఇది శ్రీ వామనమహాపురాణంలో ముప్పది రెండవ అధ్యాయం ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹