నారదుడు ప్రశ్నించాడు :-
ఓ మహాద్యుతీ ! మహిషంతోగూడ క్రౌంచగిరిని స్కందుడు ఎలా చీల్చాడో విపులంగా నా కెరిగించండి. అందుకు పులస్తుడు చెప్పసాగాడు. నారదా! యిది చాలా పురాతనకాలపు కథ. పవిత్రమైనది. కార్తికేయుని యశోభివృద్ధిని వివరించే విషయం చెపుతున్నాను వినుము. ఆ విధంగా శివుని వీర్యాన్ని మ్రింగిన అగ్నిదేవుడా తేజస్సును భరించలేక తన తేజస్సును కోల్పోయాడు. అంత నాతడు దేవతలతో చెప్పుకోగా వారంతాకలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. మార్గమంధ్యంలో అగ్ని కుటిలాదేవినిచూచి ఆమెతో అమ్మా ! ఈ శివతేజాన్ని భరింపలేకున్నాను. ఇది ముల్లోకాలను దహిస్తోంది. అంచేత దీనిని నీవు ధరిస్తే నీకు చక్కని పుత్రుడు కలిగి ధన్యతచెందుతానని చెప్పాడు. అంతట కుటిలతన వెనుకటి ఉదంతాన్ని జ్ఞప్తికితెచ్చుకొని నదీరూపంధరించి ఆ శివవీర్యాన్ని తన నీళ్ళలోకి వదలమని అగ్నితో చెప్పింది. ఆ కుటిలాదేవి శివవీర్యాన్ని ధరించి పోషించింది. అగ్ని కూడ తన భాద వదలించుకొని స్వేచ్ఛగావెళ్ళిపోయాడు. అగ్ని అయిదువేలేండ్లు ఆ అద్భుతతేజాన్ని ధరించినందువల్ల దాని ప్రభావాన అతని రక్తమాంసాస్థిమేదోంత్ర రేతస్సులు చర్మంతసహా అన్నీ బంగారు మయమయ్యాయి. ఆ కారణాన హుతాశనుడీనాటికీ ‘హిరణ్యరేత’ అని కొనియాడబడుతున్నాడు. కుటిల కూడ ఆ దివ్యవీరాన్ని అయిదువేలేండ్లు గర్భంలో ధరించి ఆ వేడిని భరింపలేక బ్రహ్మవద్దకువెళ్ళింది. ఆ మహానది అలా శివవీర్యాజ్వాలల్లో దగ్ధంకావడం చూచి బ్రహ్మ, ఆ శుక్రం నీ గర్భంలో ఎవరు ఉంచారని ప్రశ్నించాడు. అందులకామె ఓ మహానుభావాః శివశుక్రాన్ని తాగిన అగ్ని దానిని భరించలేక నాలో ఉంచితే ప్రస్తుతం నేనది భరిస్తున్నానని చెప్పింది. అయిదువేలేండ్లు నుంచి నేను ధరిస్తున్నా యింకా అది పక్వదశకువచ్చి బయటపడలేదని తనగోడు చెప్పుకుంది. అంతట నా బ్రహ్మ ఆమెతోనిట్లా అన్నాడు. ‘నీవు వెంటనే ఉదయాద్రికి వెళ్ళిపో. అక్కడ నూరుయోజనాల భయంకరమైన రెల్లువనం ఉంది. ఓసుందరీ! ఈ తేజాన్ని దానిలో వదలివేయుము. పదివేల ఏండ్లతర్వాత బాలకుద్భవిస్తాడు”.
ఆ రెల్లుదుబ్బులు విస్తరించిన పర్వత సానువులలో వీర్యాన్ని వదలుము. పదివేలేండ్ల తర్వాత బాలకుడు జన్మిస్తాడు”. అలా బ్రహ్మ చెప్పిన మాటలు విని ఆ సుందరి ఉదయగిరికి వెళ్ళి గర్భపిండాన్ని అక్కడ వమనంగావించి మరల బ్రహ్మవద్దకు వెళ్ళి మంత్రశక్తివల్ల నదిగా మారిపోయింది. ఆ తేజస్సువల్ల ఆ రెల్లువనం అక్కడి చెట్లుచెమలు మృగపక్షులూ అన్నీ బంగారు కాంతితో వెలిగిపోయాయి. అంతట పదివేలేండ్లు గడచిన వెనుక ఉదయభానుని కాంతితో కమలరేకుల్లాంటి నేత్రాలతో చక్కని బాలుడు ఉద్భవించి. ఆ రెల్లువనంలో వెల్లకిలాపండుకొని బొటనవ్రేలు నోటిలోపెట్టుకొని మేఘగంభీరస్వనంతో ఏడువసాగాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ఆరుగురు కృత్తిగా సుందరీమణులు రెల్లుపొదలో పరుండిన బాలకుని చూచారు. అంతట జాలిగొని ఆ స్కందుడు (శిశువు)న్న చోట వెళ్లి నేనుముందంటే నేను ముందంటూ ఆ బిడ్డకు స్తన్యం యిచ్చేందుకు పోటీపడ్డారు. వారల తగవుచూచి ఆ బాలుడు ఆరు ముఖాలవాడయ్యాడు. అంతట ఆ ఆరుగురు కృత్తికలు వాత్సల్యంలో ఆ బిడ్డకు ఒకేసారి పాలుత్రాగించారు. అలా కృత్తికల స్తన్యపానంచేసి ఆ బాలకుడు దినదినప్రవర్ధమానుడయ్యాడు. బలవంతులలో శ్రేష్ఠుడయిన ఆ శిశువు కార్తికేయుడుగా ప్రసిద్ధివహించాడు. ఈ లోపల బ్రహ్మ అగ్ని దేవుని, నీ కుమారుడు గుహుడు ఎంతవాడయ్యాడని అడిగాడు. శివవీర్యం చాలక రూపం ధరించడం తెలియక పావకుడు నా పుత్రుడెవడో గుహుడెవడో నాకు తెలియదన్నాడు ”అది కాదోయీ! నీవు పూర్వం మ్రింగి కుటిలానదీజలాల్లో వదలిన శివవీర్యం శరవణవనంలో బాలకుడుగా జన్మించాడ”ని వివరంగా చెప్పాడు విరించి. అది వింటూనే మహావేగంగా పరుగెత్తే మేక మీద కూర్చొని అగ్ని శరవణవనానికి వెళ్ళడం చూచిన కుటిల, ”ఓ అగ్నీ! యింత హడావిడిగా ఎక్కడకు వెళుతున్నావని అడిగింది. ”అక్కడ శరవణవనంలో జన్మించిన నా పుత్రుడికోసం వెళ్తున్నా”నని అగ్ని చెప్పగా నామె ఆ బిడ్డడు నా కుమారుడని నిలదీసింది. అలా అగ్నీ కుటిలాదేవి నాబిడ్డడంటే నా బిడ్డడని కీచులాడుకొనుచుండగా నచటకు నారాయణుడు వచ్చి మీ వివాదానికి కారణమేమని అడిగాడు. శివశుక్రంవల్ల కలిగిన బాలకుడికోసం మా తగవు అని వారలు చెప్పగా నా విష్ణువు, ఈ విషయం తేల్చవలసినది ఆ త్రిపురాంతకుడే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేయుడ”ని సలహాయిచ్చాడు.
వాసుదేవుడు చెప్పినట్లుగా కుటిల అగ్ని శివునివద్దకు వెళ్ళి ఆయనను ఆ బిడ్డ ఎవరి కుమారుడో నిజం చెప్పమని అర్థించారు. వారల మాటలు విని శంకరు డానందంపట్టలేక ”ఆహా!ఆహా! ఎంతమంచిమాట|” అని పార్వతితో అన్నాడు. అది విని పార్వతి భర్తతో, ”నాధా’ ! మన మా బాలకుని వద్దకు వెళ్దాము. అతడు మనలో నెవరివద్దకువస్తాడో ఆ వ్యక్తికే తనయుడు కాగలడ”ని అన్నది. మంచిదంటూ శివుడులేచి, ఉమ కుటిల అగ్ని వెంటరాగా శరవణవనానికి వెళ్ళాడు. అక్కడ వారు నలుగురూ, ఆ బిడ్డను కృత్తికల ఒడిలో చూచారు. యోగి అయిన ఆ బాలకుడు పరిస్థితిని బాగా ఆలోచించి నాలుగు రూపాలు ధరించాడు. వారిలో కుమారుడు శంకరుని సమీపిస్తే విశాఖుడు గౌరి ఒడిలోకి వెళ్ళాడు. శాఖుడు కుటిల నాశ్రయించగా మహాసేను డగ్ని చేతుల్లోకి వెళ్లాడు. అదిచూచి హరుడు ఉమ కుటిల అగ్ని నలుగురు ఎంతో సంతోషించారు. అప్పుడా కృత్తికలు ఈ షణ్ముఖ బాలకుడు శివుని కుమారుడా? అని అడిగారు. అంతట హరుడు అందరకూ సంతోషం కలుగునట్లుగా ఒక నిర్ణయం వినిపించాడు. ”ఈ బాలకుడు కార్తికేయుడుగా మీ కుమారుడు. కుమారుడుగా కుటిలకు పుత్రుడు. ఈ అవ్యయుడు స్కందుడుగా ఉమాతనయుడుగా ప్రఖ్యాతు డౌతాడు. ఇక గుహుడను పేరుతో నాకు ఔరసుడు. మహాసేనుడుగా ఈ మహాయోగి హుతాశనుని పుత్రుడు. ఈ శరవణవనంలో పుట్టినందున శారద్వతుడుగా ప్రసిద్ధుడౌతాడు. ఆరు తలలు కలిగినందుకు ఈ మహావీరుడు షణ్ముఖుడుగా కీర్తింపబడతాడు”. ఈ విధంగా అందరనూ తృప్తిపరచి ఆ శూలపాణి బ్రహ్మాదిదేవతలందరనూ స్మరించాడు. తత్‌క్షణం వారందరూ వచ్చి శివపార్వతులకు వందనాలు చేసి అగ్ని, కుటిల, కృత్తికలను ప్రీతితో సంభావించి, తన శరీరకాంతితో దేవతల కండ్లకు మిరుమిట్లుగొలుపుచూ సూర్యుని వలె ఉగ్రమైన తేజస్సుతో వెలిగిపోతున్న నా షడాననుణ్ణి చూచి మహదానందభరితులై ”హరా’ దేవా మీరూ శ్రీఅంబికా, అగ్నిదేవుడు ఈ విధంగా దేవకార్యాన్ని సంపన్నం గావించారు. ”వెంటనే లేవండి మనమందర మీక్షణమే మహాశక్తి నంతమూ అవ్యయమూ అయిన కురుక్షేత్ర తీర్థానికి వెళ్ళి ఈ అద్భుత బాలకుణ్ణి పవిత్ర సరస్వతీ జలాలతో అభిషక్తుని గావించుదాము” అన్నారు.
దేవగంధర్వకిన్నర సేనల కితడు నాయకుడౌతాడు. భయంకరులైన మహిషాసుర తారకాసులను వధించగలడు”. అది విని హరుడు మంచిదంటూ లేచాడు దేవతలు కూడ ఆయన వెంట కుమారునితో కలిసి మహాఫలదాయియగు కురుక్షేత్రానికి చేరుకున్నారు. హరిహర బ్రహ్మలు యింద్రాదిదేవతలు మునులూ అంతా కలిసి అభిషేక ప్రయత్నాలు చేశారు. అంతట అచ్యుతాలు మహాఫలదాయకాలయిన నదీజలాలు సప్తసముద్రోదకాలు, శ్రేష్ఠమైన ఓషధులు వేయింటిని కలిపి , ఆ గుహునకు మంగళాభిషేకస్నానం చేయించారు. సమస్తదేవసేనల నాయకుడుగా కుమారు నభిషేకించు సమయాన గంధర్వులు గానంచేశారు. అప్సరసలు నాట్యాలు గావించారు. అలా అభిషేకించబడిన ముద్దుబిడ్డను చూచి ముప్పిరిగొన్న వాత్సల్యంకో ఒడిలోకి తీసుకొని ఉమ ముద్దులతో ముంచెత్తింది. కార్తికేయుని అభిషేకంతో తడిగా ఉన్న ముఖాన్ని మాటిమాటికీ గుండెలకు హత్తుకొని ముద్దాడింది. ఆ సమయాన ఆ గిరినందిని, ఇంద్రుని ఒడిలో నుంచుకొని తేజరిల్లిన దేవమాత అదితిని మరపించింది. అలా అభిషేకించబడిన తనయుని చూచి శివుడు ఆనందభరితుడైనాడు. అగ్నికృత్తికలు కుటిల కూడ ఎంతో ఆనందించారు. దేవసేనావతిగా పట్టాభిషిక్తుడైన గుహునకు హరుడు, ఇంద్రతుల్య పరాక్రమవంతులైన ఘంటాకర్ణ లోహితాక్షనందిసేనకుముదమాలీలను నలుగురు ప్రసిద్ధులైన ప్రమథులను కాన్కగాయిచ్చాడు. నారదా! అలా శివుడు తన గణముఖ్యులను స్కందునకు యివ్వడం చూచి బ్రహ్మాదిదేవతలందరూ తమతమ ప్రమథులను సమర్పించారు. బ్రహ్మ స్థాణుగణాన్ని యిస్తే విష్ణువు సంక్రమ, విక్రమ, పరాక్రములనే ముగ్గుర్ని యిచ్చాడు. ఇంద్రుడు ఉత్కేశ, పంకజులను, రవిరండక, పింగళులను సమర్పించారు. చంద్రుడు మణి, వసుమణులనూ, అశ్వనీదేవతలు వత్సడునంది లను వారిని యిచ్చారు. అగ్ని జ్యోతి, జ్వల జ్ఞిహ్వులనూ, ధాత కంద, ముకుంద, కుసుములనే ముగ్గురు అనుచరులను యిచ్చారు. త్వష్ట చక్రాసు చక్రుల నిద్దరను, వేధ అతిస్థిర, సుస్థిరలను యిచ్చారు. పూషుడు పాణిపత్యజకాలకులనే యిద్దరు బలశాలురను యిస్తే, హింమవంతుడు స్వర్ణమాలుడు ఘనాహ్వుడనే ఉత్తమ ప్రమథులనిచ్చాడు. వింధ్యుడు తన ఔన్నత్యానికి తగినట్టుగా అతిశృంగుడు పార్షదుల నిచ్చాడు. వరుణుడు సువర్చస అతివర్చసులను, సముద్రుడు సంగ్రహ విగ్రహులను, నాగులు జయమహాజయులనువారిని, అంబిక ఉన్మాదుడు, శంకుకర్ణ, పుష్పదంతులను, వాయుదేవుడు ఘస, అతిఘనులను, అంశుమంతుడు పరిఘ, గటక, భీమ దహాతిదహనులకు ఆ షణ్ముఖునకిచ్చారు. యముడు ప్రమాథ, ఉన్మాథ, కాలసేన, మహాముఖ, తాళపత్ర , నాడీజంఘులను అనుచరులను ఆరుగురను, ధాత సుప్రభ సుకర్మలను గణద్వయాన్నీ ఆ మహాసేనునకర్పిచారు.
ఓ బ్రాహ్మణోత్తమా! ఆ స్కందునకు మిత్రుడు సువ్రతసత్య సంధులను యక్షులు అనంత, శంకుపీట నికుంభ కుముద అంబుజ, ఏకాక్ష కునటి చక్షు, కిరీటి, కలశోదర, సూచీవక్త్ర కోకనద ప్రహాసప్రియక, అచ్యుతులనే పదిహేను గురుగణాలను అర్పించారు. కాళిందినది కాలకందునీ, నర్మద రణోత్కటుని, గోదావరి సిద్ధయాత్రుని, తమసానది అద్రి కంపకుని, సీత సహస్రవాహుని వంజల స్మితోదరుని, మందాకిని నందునీ, విపాశ ప్రియంకరుని, ఇరావతి చతుర్దంష్ట్రుని వితస్త షోడశాక్షుని, కౌశికి మార్జారుని, గౌతమి క్రథ క్రౌంచులను, బాహుద శతశీర్షుని, వాహానది గోనంద నందికులను, భీమరథి భీముని, పరయువేగారిని, కాశీ అష్టబాహుని, గండకి సుబాహుని, మహానది కువలయుని, మధూదక మధువర్ణుని, ధూతపాప జంబూకుని, వేణా శ్వేతాననుడిని, పర్ణాస శ్రుతవర్ణుని, రేవసాగరవేగిని, ప్రభావనది అర్థుని, సహుని, కాంచన కనకేక్షకుని విమల గృధ్రపత్రుని, మనోహర చారువక్త్రుని, ధూత పాపమహారావుని, కర్ణానది ద్రుమ సన్నిభుని, సువేణు సుప్రసాదుని, ఓఘవతి జిష్ణుడిని, విశాల యజ్ఞబాహువును, ఆ స్కందునకు ఇచ్చాయి. ఈ విధంగా నదులన్నీ కార్తికేయుని కార్యానికి తోడ్పడినాయి. తన ప్రియ పుత్రునికి కుటిల దేవేంద్రునితో సమాన ఖలులైన, కరాళ, సితకేస, కృష్ణకేశ, జటాధర, మేఘనాధ, చతుర్ధంష్ట్ర, విద్యుజ్జిహ్వ, దశానన, సోమాప్యాయన, దేవయాజిలనే పదిమంది గజ ప్రముఖులను యిచ్చింది. ఇక కృత్తికలందరు ఆ షణ్ముఖునకు హంసాస్య కుండజఠర, బహుగ్రీవ, హయావన, కూర్మ గ్రీవులనే గణ పంచకాన్ని పుత్రవాత్సల్యంతో యిచ్చారు. ఋషులంతా కలిసి స్థాణుజంఘ, కుంభవక్త్ర లోహజంఘమహానన పిండకారులనే అయిదుగురను స్కందునకు ఆశీస్సులతో యిచ్చారు.
ఆ స్కందదేవునకు పృథూదక తీర్థం నాగజిహ్వ. చంద్రభాస, పాణికూర్మ, శశీక్షక, చాషవక్త్ర, జంబూక గణాలను యిచ్చింది. చక్రతీర్థం సుచక్రాక్షుని, గయాశిరతీర్థం మకరాక్షుని, కనఖలతీర్థం పంచశిఖఅనేస్వంతగణాన్ని కుమారున కిచ్చాయి. బంధుదత్తుని వాజిశిరం, బాహుశాలుని పుష్కరం, మానసతీర్థం సరౌజస మాహిషకపింగళులను యిచ్చాయి. ఔశనస తీర్థం వసుదాముని, ప్రభాసం నందినిని, ఇంద్రతీర్థం విశోకుని, ఉదపానం ఘనస్వననూ, సప్తసారస్వత తీర్థం అద్భుతం గొలిపే నలుగురు మాతృకలు గీతప్రియ, మాధవి తీర్థనేమి స్మితాననలను యిచ్చాయి. నాగతీర్థం ఏకచూడను, కురుక్షేత్రం పలాసదను, బ్రహ్మయోని చండశిలను, త్రివిష్టపం భద్రకాళిని, చరణపావనతీర్థం చౌండి, భైండి యోగభైండిలను గణాలను యిచ్చాయి. మహీసోపానీయను, మానససరోవరం శాలికను, బదరికాశ్రమంశతానంద, శాతఘంట ఉలూఖలమేఖలలను, పద్మావతి మాధవీ గణాలను యిచ్చాయి. కేదారక్షేత్రం సుషను, ఏకచూడ, దేవి, ధమధమా, ఉత్క్రాథని వేదమిత్రలనే మాతృగణాల నిచ్చింది. రౌద్రమహాలయం సునక్షత్రాన్ని, కద్రూల, సుప్రభాత, సుమంగళ, దేవమిత్ర చిత్రసేనలను యిస్తే ప్రయాగ కోటర, ఊర్ధ్వవేణి శ్రీమతి బహుపుత్రిక పతితి, కమలాక్షీలనే మాతృగణాన్ని యిచ్చింది. సర్వపాపవిమోచనక్షేత్రం సూపల, మధుకుంభ, ఖ్యాతిదహదహ పరా, ఖటకటా సంతానిక వికవికలను యిచ్చింది. క్రమతీర్థం చత్వరవాసిని, జలేశ్వరి, కుక్కుటిక, సుధామా, లోహమేఖలా గణాలను యివ్వగా శ్వేతతీర్థం వపుష్మతి, ఉలూకాక్షి, కోకనామ మహాశనీ రౌద్రాకర్కటిక తుండగణాలను కార్తికేయునకిచ్చింది. ఇందరు భూతాలు గణాలు మాతృకలు ఆ స్కందుని సేవించడం చూచి మహాత్ముడగు వైనతేయుడు పరమ వేగశాలి ఐన తన కుమారుడు మయూరు (నెమలి)ని, అరుణుడు తన పుత్రుడు తామ్రచుడు (కోడి)ని, ఆయనకు సమర్పించారు. అగ్ని దేవుడు శక్తిని, పార్వతి వస్త్రాన్ని, బృహస్పతి దండాన్ని, కుటిల కమండలాన్ని విష్ణువు పుష్పమాలను, శంకరుడు ధ్వజాన్ని, ఇంద్రుడు తనమెడలోని స్వర్ణహారాన్ని విశాఖునకు ఇచ్చారు. భూతగణాలందరు తన్ను పరివేష్ఠించి కొలువగా మాతృగణాలు వెంట రాగా దేవ సేనాధిపత్య వహించిన ఆహరాత్మజుడు మయూరం మీదనెక్కి భాస్కర ప్రభతో వెలిగిపోయాడు.
ఇది శ్రీ వామన మహాపురాణంలో ముప్పది యొకటవ అధ్యాయము ముగిసినది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹