పులస్తుడు అన్నాడు :-
నారద ! చండముండులు వధింపబడి తమ సైన్యమంతా చెల్లాచెదరు కావడంచూచి శుంభనిశుంభులు రక్తబీజుడనే ఘోరరాక్షసుణ్ణి ముప్పదికోట్ల అక్షౌహిణీ సైన్యంతో యుద్ధానికి పంపించారు. వారు రావడం చూస్తూనే చండిక భయంకరమైన సింహనాదం చేసింది. ఆదైత్యులు కూడా సింహనాదాలు చేశారు. ఆమె గర్జిస్తుండగా నామెనోటినుండి, అక్షమాలకమండలాలు ధరించి హంసల విమానం మీద కూర్చున్న బ్రహ్మాణి వెలువడింది. మరుక్షణాన మూడుకన్నులు త్రిశూల, సర్పకుండలాలు వలయాలు ధరించి వృషభారూఢయై మహేశ్వరి ఉద్భవించింది. అంతట మహర్షీ! ఆమె కంఠాన్నుండి నెమలి ఈకలు శక్తిని ధరించి నెమలి మీద కూర్చొని కౌమారి పుట్టింది. ఆమె బాహువుల నుండి శంఖచక్రగదాఖడ్గశార్జగబాణాలు ధరించి గరుడుని అరోహించి రూపసి అయిన వైష్ణవి జన్మించింది. ఆమె పృష్ఠభాగాన్నుంచి మహోగ్రమైన రోకలిపట్టుకుని క్రోధంతో దంష్ట్రలతో భూమిని త్రవ్వుతూ శేషనాగం మీద కూర్చొని వారాహీదేవి వచ్చింది. ఆమె స్తనమండలాన్నుంచి ఏనుగుమీద కూర్చొని వజ్రాంకుశాలూ వివిధాలంకారాలు ధరించి మహేంద్రి ఆవిర్భవించింది. అంతట భయంకరమైన జూలువిదిల్చి ఆసటలతో ఆకాశంలోని గ్రహనక్షత్రతారకలను చెదరకొట్టుచు వాడియైన గోళ్ళతో భయంకరాకారయగు నారసింహీ, ఆదేవిహృదయాన్నుంచి బయటకువచ్చింది. వారలచేత సంహరించబడిన రాక్షసబలాన్ని చూచి నిర్భయంగా ఆ చండిక మరొకపర్యాయం గర్జించింది. ముల్లోకాలలో నిండిన ఆ మహానాదాన్ని విని దేవదేవుడు త్రిశూల త్రినేత్రు డచటకువచ్చి అంబికకు అభివాదంచేసి – ‘దుర్గేః నేను చేయవలసిన కర్తవ్యం ఆజ్ఞాపించమని’ కోరాడు. ఆయన వాక్యాలతోబాటు దేవి శరీరం నుండి వచ్చిన శివ ఆయనతో, శంకరా నీవు శుంభనిశుంభుల వద్దకు దూతగా వెళ్ళి వారితో – మీరు బ్రతుకదలచుకుంటే వెంటనే సపరివారంగా సప్తపాతాళానికి వెళ్ళండి. దేవతలకు వారి స్వర్గం యిచ్చింవేయండి. బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞయాగాదులు చేసుకుంటారు. అలాగాక బలంతో క్రొవ్వియుద్ధం చేయదలచుకుంటే ఆవశ్యంగా రండి. అందరూ యమలోకానికి పంపుతామని చెప్పమన్నది.
ఓ నారదా! ఆమె శివుని దూతగా నియోగించినందున శివదూతి అనుపేరు గలిగినది. శంకరుని హితవచనాలువిని ఆ గర్విష్టులు హూంకారాలు చేస్తూ ఆ కాత్యాయని ఉన్నవైపు పరుగులుతీశారు. అంతట ఆ రాక్షసులందరు బాణాలు శక్తులు, అంకుశాలు పరశువులు, శూల భుశుండి పట్టిసాదులు, వాడిగల ప్రాసపరిఘలు ఆ దేవి మీద ఒక్కమారుగా వర్షించారు. ఆ మహేశ్వరి ఉత్తమమైన ధనుస్సును సంధించి వందలాది నిశితబాణాలు గుప్పించి, ప్రచండమైన విక్రమంతో, ఆమహాసురల శస్త్రాస్త్రాలను తునాతునకలు గావించి వారల బాహువుల ఖండించింది. మరెందరనో బాణసహస్రాలు వర్షించి వధించింది. మారి త్రిశూలంతో కొందరను పరిమార్చింది. కౌశికి ఖట్వాంగంతో కొందరను వధించింది. ఇక బ్రాహ్మిమంత్రించిన జలం చిలకరించి ఎందరనో హతమార్చింది. మహేశ్వరి శూలంతో శత్రువుల వక్షాలను చీల్చి చంపితే వైష్ణవి మరెందరనో భస్మంగావించింది. కౌమారీ శక్తితో ఐంద్రి వజ్రంతో, ముట్టెతోను చక్రంతోను వారాహి, వాడిగోళ్ళతో చీల్చి నారసింహీ, వికటాట్టహాసధ్వనులతో శివదూతీ ఎందరనో యమసదనానికి పంపించారు. రుద్రుడు త్రిశూలంతో వినాయకుడుపరశువు ఎందరనో హతమార్చారు. ఈ విధంగా పరమేశ్వరి తన అసంఖ్యాక రూపాలతో దైత్యముఖ్యులనెందరనో సంహరించింది. వారల దెబ్బలకు భూపతితులైన రాక్షసులందర్నీ భూతగణాలు తినివేయడంతో మహాప్రళయం ఏర్పడింది. ఆ విధంగా దేవతలు మాతృగణాల సంహారకాండకు భయాతురులై రాక్షసవీరులు జుట్టుముడులు వీడగా కళ్ళచూపులు చెదిరిపోగా ఫారిపోయి రక్తబీజుని ఆశ్రయించారు. అంత నారక్తబీజుడు భయంకరంగా గర్జిస్తూ శ్రేష్ఠమైన ఆయుధాలతో మాతృకాగణాలను, భూతగణాలను చీకాకుపరుస్తూ కదనరంగానికి దూకాడు. అది చూచిన మాతృకాగణాలు వాడి శరీరాన్ని వాడిస్త్రాస్త్రాలు వర్షించి చిల్లులుపడజేసారు. వాడి శరీరాన్నుంచి క్రిందపడిన ప్రతి రక్తపుబిందువునుంచి వాడంతటివాడు మరొక రక్తబీజుడు పుట్టసాగాడు. యుద్ధభూమి అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఆ విచిత్రాన్ని గమనించిన కౌశికి కేశిని పిలిచి – ఓ చండీ! నీ నోటిని విశాలంగా తెరచి వాడి వంటి నుండి పడే రక్తబిందువులన్నీ త్రాగేసి వేయుమని ఆదేశించింది. దేవి ఆదేశం ప్రకారమే ఆ చండి పై పెదవి ఆకాశాన్నీ క్రింది పెదవి భూమిని తాకునట్లు తన భయంకరమైన వక్త్రాన్ని తెరిచి ఆ శత్రువును జుట్టుపట్టుకొని తన నోటిలోవెసనకొని మింగేసింది. శూలంతో వాడి వక్షం ఖేదించి రక్తం ఒక్క బొట్టు కూడ క్రిందపడకుండా త్రాగేసింది. శరీరంలోని నెత్తురంతా పోవడంతో ఆ రక్తబీజుడు శక్తిహీనుడైపోయాడు. వాడి వెంటనే స్వర్ణాలంకృతమైన చక్రంతో నూరుముక్కలు చేసింది.
దేవతలు యిలా స్తోత్రం చేశారు. హే భగవతి ! పాపనాశిని నీకు నమస్సులు ! దేవశత్రువుల దర్పం నాశమొనర్చు తల్లీ! హరిహరులకు రాజ్యమిచ్చు జననీ ! యజ్ఞకార్యాలు రక్షించు తల్లీ ! నీకు నమస్సులు. దేవ శత్రువులనురుమాడు తల్లీ! శుఁభనిశుంభల చంపినమాతా, నమస్సులు! ప్రజల ఆర్తిపోగొట్టే తల్లీ ! త్రిశూలధారిణీః నారాయణీ! చక్రధారిణీ! నీకు నమస్సులు. ఎల్లపుడు భూమిని ధరించెవారాహీ ! నారసింహీ ! వజ్రం ధరించిన ఐంద్రీ! మయూర వాహినివగు కౌమారీ! నీకు నమస్కారము.
హంస వాహనివగు బ్రాహ్మీ ! మాలాధారిణివగు కేశినీ! గార్దభారూఢవగు తల్లీ ! ఎల్లర దుఃఖాలుపోగొట్టు జగన్మయీః నీకు నమస్కారము. దేవబ్రాహ్మణ శత్రువుల సంహరించి విశ్వరక్షణచేసే విశ్వేశ్వరీ, సర్వమయీ, త్ర్యంబకే! వరదాయినీ! నీకు ప్రణామాలు. మమ్మనుగ్రహింపుము. నీవు బ్రహ్మాణివి, మృడానివి, నెమలిమీదనెక్కు శక్తిధారిణి కౌమారివి, వారాహివి, గరుడారూఢవై శార్జ్గం ధరించిన వైష్ణవీదేవిని. చూడభయంకరమై, ఘర్ఘురధ్వనులుచేసే నారసింహివి. వజ్రంధరించి మాహేంద్రివి. చండముండవు, శవగమనప్రియవు, యోగిని, ఇవన్నియు నీ రూపాలే. నీకు నమస్సులు. త్రినయనా భగవతీ, రాత్రింబవళ్ళు అవనతశిరులై నీ చరణాలను సేవించువారలకు, స్తోత్రాలతో బల్యన్నాలతో పుష్పాలతో నిన్ను పూజించు ఘనులకు జీవితంలో పరాభవంగాని అశుభంగాని ఎన్నడూ కలుగవు. తల్లీ నీకు నమోవాకములు!” దేవతలు గావించిన ఈ స్తోత్రంవిని ఆ అంబిక వారలతో మీ ప్రసాదంవల్లనే సంగ్రామ రంగంలో శత్రు విజయం నాకు చేకూరినదని నవ్వుతూ అన్నది. మీరందరు గావించిన ఈ స్తోత్రాన్ని భక్తితో కీర్తించు మానవులకు దుస్వప్ననాశనం కలుగుతుంది. సందేహం లేదు. ఇక మీకు కావలసిన వరం కోరుకొనండి అని ఆ తల్లి ఆదేశించింది.
దేవతలన్నారు : – తల్లీ! దేవతలకు మరొకవరం యివ్వదలచినచో బ్రాహ్మణ శిశు గోవులకు మేలుగావింపుము. మళ్ళీ నీ అగ్ని శరీరంతో రాక్షసులను భస్మమొనరింపుము. అందులకు అంబిక యిలా అన్నది. దేవతలారా ; నేను మరల శంకరుని ముఖమందలిస్వేదం (చెమట) నుండి రుధిరాననం (ముఖం) తో జన్మించి అంధకాసురుణ్ణి సంహరిస్తాను. అప్పుడు నన్ను చర్చిక అంటారు. మళ్ళీ నందుని యింట యశోదకు జన్మించి విప్రచిత్తి లవణాసురుడు శుంభనిశుంభాదులను నా దంతాలతో చీల్చి చంపుతాను. తర్వాత, దేవతలారా, కలియుగంలో జనులు తిండిలేక మాడిపోవు సమయాన యింద్రునింట మారిగా పుట్టి సత్యభామాదేవి సహాయంతో దేవతలనందరకు అన్ని రకాల కూరగాయలు సమకూర్చి రక్షిస్తాను. అప్పుడు నా పేరు ‘శాకంభరి’. ఆ తర్వాత మరల శత్రువులను సంహరించి ఋషులను రక్షించుటకు వింధ్యగిరులలో పుట్టి దైత్యులను వధించి సురాలయానికి చేరుకుంటాను. అంతేకాదు. ఆ తర్వాత కూడ మరొక పర్యాయం అరుణాక్షుడనే రాక్షసుడు ప్రజలను బాధించునపుడు నేను ఒక పెద్ద గండుతుమ్మెదగా పుట్టి వాడిని చంపి దేవతలకు మేలు గావించి మరల స్వర్గానికి వెళ్తాను. ఈ విధంగా భవిష్యత్తులో కూడ మీరు కోరినట్లు సాధుసంరక్షణ చేస్తూ ఉంటాను.
పులస్త్యు డన్నాడు : –
వరదాయిని అయిన ఆ అంబిక యిలా వరప్రదానం చేసి, బ్రాహ్మణశ్రేష్ఠుల కభివాదనం చేసి భూతగణాదులనందరను పంపివైచి సిద్ధసంఘాలు తన వెంటరాగా స్వర్గానికి వెళ్ళినది. అంబిక యొక్క విజయగాధలు తెలిపే ఈ అభ్యాసం చాల పవిత్రమైనది ప్రాచీనమైనది. ఇది అన్ని శుభాలు చేకూర్చుతుంది. ఇది సకల రాక్షసనాశకమని భగవానుడు స్వయంగా వక్కాణించాడు. కనక మానవులంతా దీనిని సదా శ్రవణంచేస్తూ ఉండాలి.
ఇది శ్రీ వామన పురాణంలో ముప్పదియవ అధ్యాయం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹