సరోవరమహత్యం
సనత్కుమారుడిలా అన్నాడు :- అంతట త్రిలోకేశ్వరుడైన శివుడు, వాక్య కోవిదుడు, వేనునకు తృప్తిగొలుపు నట్టి ఉత్తమ వాక్యాలు మాటాడాడు – ‘భళీ! సువ్రతుడవగు రాజా! నీ స్తోత్రానికి నేను సంతోషించాను. వేయేల నీవెల్లప్పుడు నా సమీపాన నివసించ గలవు. చాలా కాలం నావద్ద ఉండి, అనంతరం నా శరీరం నుంచియే జన్మించి, అంధకాసురడనే దేవాంతకుడవు కాగలవు. వెనుక నీవు కావించిన, వేదనిందా పూర్వకమైన అధర్మాచరణం వల్ల హిరణ్యాక్షుని యింట్లో పుట్టి పెద్దవాడవు కాగలవు. ఆ జన్మలో నీవు ఎప్పుడు జగన్మాతపై మరులు చెందుదువో అప్పుడు నేను శూలంతో నీ దేహాన్ని ఛేదించి నిన్ను అర్బుదునివలె పవిత్రుణ్ణి చేస్తాను. అప్పుడు కూడా యీవిధంగా నన్ను స్తోత్రంచేసి మెప్పించిన నా శివగణాలలో ప్రథముడుగా భృంగిరిటి అనే పేరుతో ప్రసిద్ధి చెందగలవు. నా సన్నిధిలో ఉంటూ నీవు సిద్ధి పొందెదవు. వేనుడు కావించిన ఈ దివ్య స్తోత్రాన్ని చదువువారలు, వినువారలు, ఎట్టి అశుభాలు లేకుండా దీర్ఘాయుష్మంతులగుదురు. సర్వదేవతలలో శివునకు వలెనే సర్వస్తోత్రాల్లో ఈ వేనస్తవం విశిష్టతను కలిగిఉంటుంది. యశో రాజ్యసుఖం, ఐశ్వర్య ధన గౌరవాలు ప్రదానం చేసే దిగా ఈ స్తవం కీర్తి గావించింది. విద్యార్థులు దీనిని భక్తితో వినాలి. వ్యాధి పీడితులు, దుఃఖార్తులు, దీనులు, చోరరాజ భయాన్వితులు ప్రయత్న పూర్వకంగా దీనిని శ్రవణం చేయాలి. రాజ సేవ నుండి తొలగింపబడినవారు సర్వభయాల నుండి ముక్తులౌతారు. ఈ దేహంతోనే గణాలలో శ్రేష్ఠులౌతారు : యశోతేజఃసమన్వితులై పవిత్రులౌతారు. ఈ స్తోత్రం పాఠం జరిగి గృహాలలో రాక్షస పిశాచ భూత వినాయకులెటువంటి విఘ్నాలూ కలుగజేయలేరు. భర్త అనుమతితో ఈ స్తవాన్ని గృహిణులు వింటే వారలు అటు మాతృ పక్షాన, ఇటు పితృ వంశాన దేవతలుగా పూజింపబడతారు. ఎవరైతే ఈ స్తవాన్ని రోజు మానసిక ఏకాగ్రతతో గానం చేస్తారో, అథవా వింటారో వారల సర్వకార్యాలు సిద్ధిస్తాయి. వారలు మనస్సులో సంకల్పించినవీ నోట ఉచ్చరించినవీ అన్నీ సిద్ధిస్తాయి. త్రికరణాల ద్వారా చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇక నీకు శభమగుగాక. నీకు కావలసిన వరము కోరుకొనుము.
వేనుడిలా విన్నవించాడు. “ప్రభో ! శంకరా ! ఈ లింగ మహాత్మ్యదర్శనాల వల్ల నీ దివ్య దర్శనం వల్లా నేను సకల పాపాల నుంచి విముక్తుడనైనాను. నీవు నా యెడ ప్రసన్నుడవై వరమివ్వనెంచినచో, దేవద్రవ్య భక్షణం కారణంగా శునక యోనిలో పుట్టిన ఈ నీ సేవకునిగూడ అనుగ్రహించుము. ఈ శునకానికి భయపడియే నేనీ సరస్సులో మునుగుట జరిగినది. మొదట నన్నీతీర్థంలో స్నానంచేయవద్దని దేవతలు శాసించారు. ఆ పని నా చేత చేయించి ఈ శునకం నాకు మహోపకారం చేసింది. కనుకనే నేను మిమ్ములనీ వరం అర్థిస్తున్నాను. ఈ కుక్కకు ముక్తి నివ్వండి” వేమని మాటలు విని శంకరుడు సంతోషించి, తప్పకుండా ఈ శునకం కూడ పాపముక్తిని పొందుతుందని చెప్పాడు. ” నా అనుగ్రహం వల్ల దీనికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. నా యీ స్తవం విన్నందున దీని పాపాలన్నీ పోతాయి. ఓ రాజా ! ఈ కురుక్షేత్ర మహిమ, ఈ సరస్సు మహాత్మ్యం నాలింగోత్పత్తి వృత్తాంతం విన్నవారు పాపముక్తులౌతారు. సనత్కుమారుడింకా యిలా అన్నాడు. సర్వలోక వంద్యుడైన ఆ పరమ శివుడిలా ఆనతిచ్చి అందరూ చూస్తుండగా అక్కడే అంతర్హితుడైనాడు. ఆ కుక్కకు వెంటనే పూర్వజన్మ స్మృతి కలిగి దివ్యదేహంతో రాజు ఎదుట నిలచినది. ఇక అక్కడ వేమని పుత్రుడు తీర్థస్నానం చేసి తండ్రిని చూచుటకై తిరిగి వచ్చి కుటీరం శూన్యంగా ఉండటం చూచి ఎంతో దుఃఖించాడు. అప్పుడు మహా సంతోషంతో తన ఉత్తమ పుత్రునిచూచి వేనుడిలా అన్నాడు. ” వత్సా! నీలాంటి సత్పుత్రుని పొంది నేను నరక సముద్రాన్నుంచి తప్పించుకున్నాను. నీవు రోజూ నాకు చేసిన తీర్థ జలాభిషేచనం, ఈ మహనీయుని (కుక్క) అనుగ్రహం , ఈ తీర్థ తీర నివాసం, స్థాణుదేవుని దర్మనానుగ్రహంవల్ల పాపముక్తుడనై స్వర్లోకానికి, శివలోకానికి వెళ్తున్నాను .అట్లు కుమారుని అభినందించి అచట మహేశ్వర ప్రతిష్ఠ గావించి ఆ స్థాణు తీర్థంలో పుత్రునివల్ల నుద్ధరింపబడిన ఆవేనుడు సిద్దిబొందాడు. ఆ కుక్క కూడా ఆ స్థాణుతీర్థమహిమవల్ల సర్వకల్మషాలు తొలగి శివమందిరాన్ని చేరింది. ఆ రాజుకూడ అలా పితృఋణాన్ని తీర్చుకొని, చక్కగా భూమి పాలనం చేసి, ధర్మమార్గాన పుత్రవంతుడై నిర్విఘ్నంగా యజ్ఞంచేసి, బ్రాహ్మణుల కోర్కెలుదీర్చి, సకల విధాల సుఖాలు అనుభవించి బంధుమిత్రులను ఋణవిముక్తుల గావించి, భార్యల కోర్కెలన్నియు తీర్చి, తనకుమారునకు రాజ్యాభిషేకం గావించి చివరకు కురుక్షేత్రానికి వెళ్లాడు. ఆ పవిత్రక్షేత్రంలో ఘోరతపస్సు గావించి శంకరుని పూజించి స్వేచ్ఛతో శరీరం వదలి పరమపదాన్ని చేరాడు. ఈ స్థాణుతీర్థ ప్రభావం స్థాణ్వీశ్వరుని మహిమను శ్రద్ధగా శ్రవణం గావించిన వారలు సర్వపాపాలు వదలి పరమగతిని చేరుకుంటారు.
ఇది శ్రీ వామనపురాణం సరోవర మాహాత్మ్యంలో ఇరువది ఆరవ అధ్యాయం సమాప్తం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹