సరోవర మహాత్మ్యం
సనత్కుమారుడు చెప్పనారంభించెను:- అంతట దేవాధిదేవుడైన శంకరుడు ఋషుల సమక్షంలో బ్రహ్మ పురోగాములైన దేవతలతో ఆ ఉత్తమ తీర్థ మహిమ వివరించాడు. ఈ సాన్నిహిత సరస్సు సకల తీర్థాలలో ఉత్తమోత్తమమైనది. ఇది నాకు నివాసం కావడం వల్ల ముక్తి ప్రదాయకమైనది. ఇక్కడి నా లింగ దర్శనం చేసినంత మాత్రాన్నే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాదు లందరకు పరమపదం లభిస్తుంది. మధ్యాహ్న సమయాన, ప్రతిరోజూ, సముద్ర నదీ సరోవరాల సమస్త తీర్థాలు యిక్కడ ఈ స్థాణుతీర్థంలో చేరికలుస్తాయి. ఈ స్తోత్రం ఎవరు శ్రద్దాభక్తులతో యిక్కడ చదివి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటారో వారలకు నేనెల్లప్పుడు అందుబాటులో ఉంటాను. సందేహం లేదు. ఆ విధంగా సెలవిచ్చి భగవానుడగు రుద్రుడంతర్థాన మొందాడు. దేవతలంతా తమతమ నెలవులకు వెళ్ళారు. ఆ స్థాణు లింగమహిమ వల్ల ఆ లింగ దర్శనం చేసిన మానవులందరకూ స్వర్గప్రాప్తి కలిగి స్వర్గలోకం మనుష్యులతో నిండిపోయింది. దానితో భయమునందిన దేవతలు ఆ మానవుల ఉపద్రవాన్నుంచి తమ్ము రక్షింపమని బ్రహ్మకడకు పోయి మొరబెట్టుకున్నారు. ఆ త్రిదశాధిపతి అయిన బ్రహ్మ, అలాగైతే ఆలస్యము చేయక వెంటనే సరోవరాన్ని మట్టితోపూడ్చి యింద్రునకూరట కలిగించండని దేవతలతో చెప్పాడు. అంత ఇంద్రుడు వారం రోజులపాటు, ధూళివర్షం కురిపించి ఆ సరస్సును పూడ్చినాడు. అది చూచి మహేశ్వరుడా లింగాన్ని వటవృక్షాన్ని చేతితో ఎత్తి పట్టుకున్నాడు.
అందుచేత ఆద్యతీర్థంలోని నీరు పుణ్యతమైనది. అచట స్నానం చేస్తే సర్వతీర్థస్నానఫలంలభిస్తుంది. ఆవట లింగేశ్వర సమీపంలో శ్రాద్ధం చేసినవాని పితరులు సంతోషించి దుర్లభమైన ఫలం యిస్తారు. పూడిపోయిన సరోవరాన్ని చూచి ఋషులక్కడి ధూళిని శ్రద్ధాభక్తులతో తమ శరీరాలకు పూసుకునేనవారు. అందువల్ల ఆమునులు కూడా పాపముక్తులై దేవతలకు సైతం పూజ్యులై బ్రహ్మపదానికి వెళ్తారు. సిద్ధమహాత్ములెవరైననూ ఆలింగాన్ని పూజించినచో పరమసిద్ధిని పొంది పునరావృత్తిరహితలోకానికి వెళ్తారు. ఈ విషయం గ్రహించినంతనే బ్రహ్మ అచట ఆద్య లింగాన్ని ప్రతిష్ఠించి దానిమీద శిలాలింగాన్ని పెట్టాడు. తర్వాత చాలా కాలానికి ఆద్యలింగ ప్రభావ స్పర్శతో శిలాలింగం కూడ తనను ముట్టుకున్న వారలకు పరమ పదప్రాప్తి కలిగించింది. ఓ విప్రోత్తమలారా! శైలలింగ స్పర్శమాత్రాన్నే మానవులు పరమపదం పొందడంచూచి దేవతలు బ్రహ్మతో ఆ విషయం చెప్పుకున్నారు. అది విని విరించి దేవతలకు మేలు చేయుటకై ఆ శిలాలింగం మీద ఒక దానిపై నొకటిగా ఏడు లింగాలు స్థాపించాడు. అప్పుటినుంచి శమదమపరాయణులయిన ముముక్షువులు అక్కడి ధూళిసేవనం వల్లనే పరమ పదాన్ని పొందుతున్నారు. కురుక్షేత్రంలో గాలిలో ఎగిరే ధూళి కణాలుకూడ తమస్పర్శతో మహాపాపులను గూడా పవిత్రులను పరమ పదసంపాదకులను చేయ జాలియున్నవి. ఆ స్థాణుతీర్థంలో ప్రవేశించిన స్త్రీ పురుషాదులకు, వారు తెలిసి ప్రవేశించినా తెలియక ప్రవేశించినా సరే, సర్వ దుష్కృతనాశం కలుగుతుంది. లింగదర్శనంవల్ల వటవృక్షస్పర్శవల్ల ముక్తికలుగుతుంది. అచట సన్నిధి జలాల్లో స్నానమాడిన వారి కోరికలు సిద్ధిస్తాయి. అక్కడ పితృదేవతలకు వదలెడి తర్పణోదకాల బిందుబిందువూ అనంత ఫలంయిస్తుంది. లింగానికి పడమర భాగాన నల్ల నువ్వులతో శ్రద్ధాతర్పణాలుయిచ్చిన వారు మూడుయుగాల పర్యంతం సుఖిస్తారు. మన్వంతర కాలంవరకూ లింగం అక్కడ నిలచియున్నంతకాలం అలాంటి వారల పితరులు ఉత్తమోదకాలు పానం చేస్తుంటారు. కృతయుగంలో దానికి సాంనిహిత్య తీర్థమనీ, త్రేతాయుగంలో వాయు తీర్థమనీ ద్వాపర కలియుగాలమధ్య రుద్రహ్రదమనీ పేర్లు. చేత్రకృష్ణ చతుర్దశినాడు రుద్రహ్రదంలో స్నానం చేసినవారలకు పరమపద ప్రాప్తి కలుగుతుంది. అచటి వటమూలాన కూర్చుని పరమ శివుని ధ్యానించిన వారల కా స్థాణువటమహిమ వల్ల చింతమనోరథాలు నెరవేరుతాయి.
ఇతి శ్రీ వామన మహా పురాణం సరోవర మహాత్మ్యంలో యిరువది నాల్గవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹