సరోవరమాహాత్మ్యం
సనత్కుమార వచనం :- అలా బ్రహ్మపలికిన మాటలువిని ఋషులందరు యిప్పుడు జగత్తునకు శ్రేయస్సు ఎలా కలుగుతుందని మరల ప్రశ్నించారు. అందరు విరించి యిలా అన్నాడు. మనమందరంవెళ్లి ఆ దయామయుడు త్రిలోచనుడు శూలపాణి ని శరణుకోరుదము. ఆయన అనుగ్రహంవల్ల యథాపూర్వస్థితి ఏర్పడుతుంది. అంతట బ్రహ్మతో కలిసి ఆ మునులందరు కైలాసానికి వెళ్ళి ఉమాసహితుడైన శంకరుని దర్శించారు. అప్పుడు లోకపితామహుడగు బ్రహ్మ వరదాయకుడు దేవాది దేవుడునైన ముల్లోకేశ్వరుడు శివుని యిలా స్తోత్రం చేశాడు.
ఓ అనంతా నీకు నమస్కారం ! పినాకధారీ వరదా, మహాదేవా, స్థాణూ ! పరమాత్మా నీకు ప్రణామాలు ! భువనేశా ! తారకా ! సకలజ్ఞానప్రదాయకా ! నీకు నమస్సులు ! దేవా ! నీవొక్కడవే పురుషోత్తముడవు. పద్మగర్భా ! పద్మేశా ! నీకు ప్రణామములు. ఘోరరూపా, శాంతిరూపా, చండకోపనా ! విశ్వేశా ! నీకు నమస్కారములు. సురనాయకా ! శూలపాణీః విశ్వభావనా ! ప్రభూ ! నీ కనేక ప్రణామాలు !
బ్రహ్మ ఋషులుచేసిన స్తోత్రంవిని మహాదేవుడిలా అన్నాడు. భయపడకండి, వెళ్ళండి, లింగం పునఃప్రతిష్ఠిత మౌతుంది. నాకు ప్రీతికరంగా నేను చెప్పినట్లు చేయండి. నిస్సందేహంగా లింగప్రతిష్ఠ జరుగుతుంది. నాలింగాన్ని ఎవరు భక్తితో పూజిస్తారో వారలకు అసాధ్యమంటూ ఉండదు. పాపాలు తెలిసిచేసినప్పుటికీ, ఎలాంటివైనా లింగార్చన చేసినంతటనే పటాపంచలౌతాయి. సందేహింపకుడు. మీరలు పడగొట్టిన లింగాన్ని వెంటనే తీసుకవెళ్ళి సాన్నిహిత్యమనే మహత్సరోవరంలో ప్రతిష్ఠించండి. అందువల్ల మీ మనోవాంఛితాలన్నీ నెరవేరతాయి. స్థాణువనే పేర దానిని దేవతలంతా పూజిస్తారు.
స్థాణ్వీశ్వరంలో ఉన్నందున నన్నచట స్థాణ్వీశ్వరుడని పిలుస్తారు. స్థాణువును సదా స్మరిస్తే సర్వకిల్బిషాలసు తొలగిపోతాయి. ఆ దేవుని దర్శనమాత్రాననే పరిశుద్ధ దేహులై మోక్షగాములౌతారు. పరమేశ్వరుని మాటలువిని బ్రహ్మాది దేవతలతోకూడి ఆ ఋషులు దారువనం నుంచి లింగాన్ని కదలించి తీసికొని వెళ్ళుటకుపక్రమించారు. అయితే వారందరూ కలిసి ప్రయత్నించినా ఆ లింగాన్ని కదలించలేకపోయారు. ఇక దారిఏమని బ్రహ్మనుప్రశ్నిచగా ఆయన మీరెంతగా శ్రమించినా దేవదేవుని ఇచ్ఛానుసారం భూపతితమైన లింగాన్ని తీసి కొనపోలేరు. కనుక ఆయననే మరల శరణువేడితే ఆయనే దయతో దానిని తీసికొనిరాగడు. అంతఅందరూ మరలకైలాసానికి వెళ్ళారు. అయితే అక్కడ వారలకు రుద్రుడగుపించలేదు. అప్పుడు బ్రహ్మధ్యానస్థుడై ఆలోచించగా శంకరుడు ఏనుగురూపంలో, ఆయననుస్తోత్రంచేస్తున్న ఆ దేవతలు, ఋషుల మనస్సులలోనే ఉన్నట్టు కనుగొన్నాడు. అంతట బ్రహ్మను ముందుంచుకొని ఆ దేవతలు ఋషులంతా, ఆ దేవుడు స్వయంగా విరాజిల్లే ఆ మహత్సరోవరానికి వెళ్ళారు. అక్కడకూడ ఆ శివుని కాక వారంతా అన్వేషణసాగించారు. చింతాకులమైన హృదయాలతో ఉండిపోయారు. అప్పుడచట పార్వతీదేవి కమండలధారిణియై ప్రసన్నవదనంతో కనిపించగా ఆమె నందరు స్తోత్రం చేశారు. ప్రీతురాలైన ఆ ఉమామహేశ్వరుని వెదకివెదకి బాగా అలసిపోయారు. కాబట్టి మీరంతా ముందీ అమృతాన్ని త్రాగండి. అనంతరం శంకరుని జాడతెలిసికోగలరు. అన్నది. ఆ భవాని మాటలకు సంతుష్టులై వారందరచటకూర్చొని ఆ పవిత్రమైన అమృతపానం చేశారు. అనంతరం సుఖాసీనులై వారామెను హస్తిరూపంలో అచ్చటికి వచ్చిన ఈశ్వరుడెచటనున్నాడని అడిగారు. అప్పుడామె ఆ సరోవర మధ్యంలో హస్తిరూపాన ఉన్న శివుని చూపించింది. నీటిలో మునిగి యున్న ఆ మహాదేవుని చూచి బ్రహ్మను ముందుంచుమని ఆ దేవర్షులిలా అన్నారు.
మహాదేవా ! నీవు వదలిన త్రిలోకవందనీయమైన లింగాన్ని యితరులెవ్వరూకొని తెచ్చుటకు సమర్థుల కాకున్నారు. బ్రహ్మాదుల నివేదనము విని ఈశ్వరుడు వారందరను వెంటబెట్టుకొని దేవదారువనాశ్రమానికి వెళ్ళి ఏనుగురూపంతో లింగాన్ని తొండంతో అలవోకగా పట్టుకొనితెచ్చి మహర్షుల స్తోత్రపాఠాలమధ్య నామహాసరస్సుకు పశ్చిమదిక్కున నిలిపాడు. అంతనా దేవతలు ఋషులంతా తమ జన్మలు ధన్యమైనవని సంతోషించి ఆ పరమశివుని యిలా స్తోత్రం చేశారు.
పరమాత్మా అనంతయోనీ లోకసాక్షీ పరమేష్ఠీ భగవాన్ సర్వజ్ఞా క్షేత్రజ్ఞా నీకు నమస్కారము.
పరావరజ్ఞా జ్ఞానజ్ఞేయా సర్వేశ్వరా మహావిరించీ
మహావిభూతీ మహాక్షేత్రజ్ఞా మహాపురుషా సర్వభూతావాసా
మనోనివాసా ఆదిదేవా సదాశివా మహాదేవా నీకుప్రణామము.
ఈశానా దుర్విజ్ఞేయా దురూరాధ్యా మహాభూతేశ్వరా
పరమేశ్వరా మహాయోగేశ్వరా త్రినేత్రా మహాయోగీ
పరబ్రహ్మా పరంజ్యోతీ బ్రహ్మవేత్తలలో ఉత్తముడా ప్రణవస్వరూపా
వషట్కారస్వాహాకారస్వధాకారరూపా పరమకారణా
సర్వగతా సర్వదర్శీ సర్వశక్తిరూపా సర్వదేవా ఆభవా
సహస్రార్చీ అనేకకిరణా సుధామా హరధామా అనంతధామా
మేఘస్వరూపా సంకర్షణా బడవానలా అగ్నిచంద్రమయా నీకునమస్సులు.
పవిత్రుడా మహాపవిత్రుడా మహామేఘుడా మహామాయాధారీ
మహాకామా కామాంతకా హంసా పరమహంసా పరమాధీశ్వరా
మహేశ్వరా మహాకాముకుడా మహాహంసా భవనాశకా సురసిద్ధార్చితా
హిరణ్యవాహా సువర్ణవీర్యా సువర్ణ నాభా హిరణ్యకేశా ముంజకేశా
సర్వలోకవరప్రదా సర్వానుగ్రహకరా కమలశయనా దర్భశయమా
హృదయనివాసా జ్ఞానసింధూ శంభూ విభూ
మహాయజ్ఞా మహాయాజ్ఞీకుడా సర్వయజ్ఞమయుడా
సర్వయజ్ఞప్రియా
సర్వయజ్ఞసంస్తుతా నిరాశ్రయా
సముద్రశయనా అత్రిపుత్రా భక్తులయెడదయగలవాడా
అభగ్నయోగా యోగధరా వాసుకిమహామణికాంతులతో
వెలిగేవాడా హరితనేత్రుడా ముక్కంటీ జటాధరా నీకునమస్సులు.
నీలకంఠా చంద్రమౌళీ అర్దనారీశ్వరా కృత్తివాసా
దుస్తరమైన సంసారాన్ని హరించేవాడా భక్తవత్సలా మమ్మనుగ్రహింపుము.
నీకు వేలాది ప్రణామములు. ఆ విధంగా బ్రహ్మపురోగాములయిన దేవతలు వాలఖిత్యాది ఋషులు భక్తి ప్రపత్తులతో చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ మహాదేవుడా ఏనుగురూపాన్ని వదలి ఆ లింగమధ్యంలో సన్నిహితుడైనాడు.
ఇది శ్రీవామనమహాపురాణం సరోవరమాహాత్మ్యంలో యిరువది మూడవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹