సరోవర మాహాత్వ్యం
ఓ బ్రాహ్మణోత్తములారా,
మానుష తీర్థానికి తూర్పుగా క్రోశెడు దూరాన ద్విజోత్తములచే సేవిపబడునట్టి ఆపగనే ప్రసిద్ధిచెందిన నది ఉన్నది. అక్కడ పాలలో వండినేతితో కలపబడిన శ్యామక (సామధాన్యం) సరమాన్నం బ్రాహ్మణులకు సమర్పించువారు పాపముల పొందరు. ఆ నదీ తీరాన శ్రాద్ధకర్మలు జరుపువారల సర్వ కామ్యములు సిద్ధించుటకు సందేహములేదు. తమవంశంలో ఎవడైనా ఒకడు పుత్రుడు కాని పౌత్రుడు కాని ఆనదీ తీరాన తమకు తిలతర్పణం చేయువాడు పుట్టి తమకు నూరుకల్పాల వరకు సద్గతులు కలిగించునాయని పితృదేవతలు ఎదరుచూస్తూ ఉంటారు. భాద్రపద కృష్ణ పక్ష చదుర్దశినాడు విశేషించి మధ్యాహ్న సమయాన అచ్చట పిండ ప్రదానం చేయువానికి మోక్షం కలుగుతుంది. అచట నుండి బ్రహ్మకు ముఖ్యస్థానమైన బ్రహ్మోదుంబరమనే లోక విశ్రుతమైన ప్రదేశానికి వెళ్లాలి. బ్రాహ్మణులారా! అచట ఉన్న బ్రహ్మర్షి కుండలలో స్నానం చేసినవాడు సప్తర్షులు అనుగ్రహం వల్ల ఏడు సోమయాగాలు చేసిన పుణ్యం. ఫలం పొందగలరు. భూలోకంలో దుర్లభమైన ఆ తీర్థన్ని భరద్వాజ గౌతమజమదగ్ని కశ్యపవిశ్వామిత్ర వసిష్ఠ అత్రి మహర్షులు కలిసి కల్పించారు. ఆ తీర్థాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా సేవించినందున బ్రహ్మోదుంబర తీర్థంగా ప్రశస్తిపొందింది.
ఓ బ్రాహ్మణోత్తములారా! అవ్యక్తజన్ముడగు ఆ బ్రహ్మ తీర్థాన స్నానం చేసినచో బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి తిరుగులేదు. ఆ ప్రదేశాన నొక బ్రాహ్మణునకు భోజనం, పితరులనుద్దేశించి, పెట్టినచో దానసంతుష్టులై పితరులాతనికి దుర్లభమైన వరము లొసంగుదురు. విడిగా సప్తమహర్షులనుద్దేశించి ఆకుండంలో స్నానంచేస్తే ఆ బుషుల అనుగ్రహం వల్ల సప్తలోకాధిపత్యమూ పొందవచ్చును. సమస్తపాపాలను పోగొట్టు కపిస్థలమనే ప్రసిద్ధ తీర్థం ఉంది. అక్కడ వుద్ధకేదారేశ్వర మహాదేవుడు నెలకొని ఉన్నాడు. అక్కడ దండితో కూడియున్న రుద్రుని, స్నాతుడై అర్పించి నచో అంతర్థాన శక్తిని పొంది శివలోకంలో సుఖించవచ్చు. అచ్చట తర్పణం విడిచ ముమ్మార్లు ఆచమనం చేసి దండి దేవునకు నమస్కరించినచో కేదరాక్షేత్రాటన ఫలం పొదగలరు. చైత్రశుక్ల చతుర్దశినాడు శివునకు ప్రీతిగా అక్కడ శ్రాద్ధ మొనర్చినచో పరమపదం లభించును. అచట నుండి దుర్గ, కాత్యాయని, భద్ర, నిద్ర, మాయ సనాతనీ అనే పేర్లతో విరాజిల్లే దేవీస్థానమైన కలశాలని వెళ్ళవలెను. ఆ కలశ తీర్థంలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న దుర్గాదేవిని దర్శించినచో దుస్తరమైన సంసారసాగరాన్ని నిస్సందేహంగా దాటవచ్చు. తర్వాతముల్లోకాల్లో దుర్లభమైన నరక క్షేత్రాన్ని దర్శించాలి. కృష్ణ చతుర్దశినాడు అందువేంచేసిన మహాదేవుని సేవించినచో కోర్కెలన్నీ ఫలించి శివలోకం పొందవచ్చు. బ్రాహ్మణులారా ! ఆ నరక క్షేత్రంలో ముక్కోటి తీర్థాలున్నవి.
ఆ సరోవరం మధ్య భాగాన ఉన్న ఒక బావిలో కోటి రుద్రులున్నారు. ఆ సరస్సులో స్నానంచేసి కోటి రుద్రులను స్మరించి ఆ చోట రుద్రుల అనుగ్రహం వల్ల కోటి రుద్రులను పూజించిన ఫలం లభించి సర్వదోషములు తొలగిపోవును. ఇంద్ర జ్ఞానం పొంది పరమ పదం లభించును. అక్కడే సర్వ పాపభయాలు పోద్రోలు ఇడాస్పద తీర్థం కలదు. దాని దర్శన మాత్రముననే నరులు ముక్తి పొందగలరు. అక్కడ స్నానంచేసి దేవ పితృగణాలను అర్చిస్తే కోరిన కోర్కెలు సిద్ధించును. ఎలాంటి దుర్గతులు కలుగవు. అచటనే సర్వకిల్పిషనాశకమైన కేదారతీర్థం ఉంది. అచట స్నానమాడిన మానవునకు సకల దాన ఫలమూ కలుగుతుంది. అక్కడనే భూలోకంలో దుర్లభమైన కింరూప తీర్థం ఉంది. ఆ మహా తీర్థంలో మునిగినచో సర్మయజ్ఞ ఫలాన్నీ పొందవచ్చు. నరక క్షేత్రానికి తూర్పు దిశగా ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందిన అన్యజన్మమనే తీర్థం ఉంది అది అన్ని పాపాలనూ నశింపచేస్తుంది. నరసింహరూపాక్రూరరాక్షసుని సంహరించిన విష్ణువు ఆ సింహరూపంలోనే ఉండి. సింహాల పట్ల మమకారం పెంచుకున్నాడు. అంతట దేవ గంధర్వాదులంతా శివుణ్ణి ఆరాధించి సాష్టాంగ ప్రణామాలు చేసి విష్ణువు ఘోరరూపాన్ని గురించి విన్నవించారు. అంతట నా మహేశ్వరుడు శరభమనే మృగరూపం ధరించి నరసింహదేవునితో వేయి దివ్యవర్షాలు యుద్ధం చేశాడు. అలా పోరాడి పోరాడి చివరకా దేవులిద్దరూ సరోవరంలో పడిపోయారు. ఆ సరోవరం తీరాన ఒక రావి చెట్టు క్రింద నారద మహర్షి ధ్యానస్ధుడై యుండి ఆ విషయం చూచాడు. అలా చూస్తుండగానే విష్ణువు చతుర్భుజాకారాన్ని శివుడు లింగాకృతిని పొందినిలిచారు. ఆ పరమ పురుషుల నిద్దరిని చూచి నారదుడు భక్తితో యిలా స్తోత్రం చేశాడు.
”శివా! నీకు నమస్కారము! దేవా| నమస్కారము. విష్ణుదేవా ప్రభవిష్ణూ! నీకు నమస్సు ! హూ ! ఉమాపతీ ! స్థితిలయ భర్తా ! నీకు నమస్కారం. బహురూపధారివగు హరా ! విశ్వరూపివయిన విష్ణూ! మీకు నమస్సులు. సిద్ధమూర్తివగు ముక్కంటీ ! జ్ఞానదాతవగు కృష్ణా! మీకు నమోవాకములు. ”నేనెంతో ధన్యుడను, సుకృతిని. పురుషోత్తములైన మిమ్ములను దర్శింపగలిగితిని. మీయిర్వురచే పవిత్రీ కృతమైన యీనా ఆశ్రమం పుణ్యస్థలం. ఈ నాటి నుండి యిది అన్యజన్మ క్షేత్రంగా ఖ్యాతి చెందగలదు. ముల్లోకాల్లో ఉత్తమమైన ఈ చోట స్నానం చేసి పితరులకు తర్పణము లిచ్చిన శ్రద్ధాళువుకు మహేంద్ర జ్ఞానం కలుగును. నేనెల్లప్పుడూ నివసించే అశ్వత్థ మూలాన్ని చూసి, ఆ వృక్షానికి వందన మొనర్చువారు భయంకరమైన యమదర్శనం చేయరు. విప్రోత్తములారా! అచట నుండి ఉత్తమమైన నాగహ్రదానికి వెళ్ళవలె. పౌండరీక తీర్జంలో స్నానం చేసినచో పౌండరీక యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. విశేషించి చైత్రశుక్లదశమి నాడచట స్నానజపశ్రాద్ధాదులు చేసి ముక్తి పొందవచ్చు. అచట నుంచి దేవతలు సేవించే త్రివిష్గప తీర్థానికి వెళ్ళాలి. అక్కడ పాప విమోచనం చేసే వైతరణీ అనే పుణ్యనది ఉన్నది. అక్కడ స్నానం చేసి శూలపాణి మహాదేవుని అర్పించినచో సర్వ పాపాలు వదలి పరమ గతిని పొందవచ్చు. ఆ తర్వాత రసావర్తమనే ఉత్తమతీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన ఉత్తమమైన సిద్ధికలుగుతుంది. చైత్రశుక్ల చతుర్దశినాడు అలేపకమను తీర్థంలో మునిగి శివపూజకావించినచో ఏ మాత్రం పాపం అంటజాలదు.
ఓ బ్రాహ్మణులారా ! అటనుండి ఉత్తమమైన ఫలకీవనానికి వెళ్ళాలి. అక్కడ దేవగంధర్వసాధ్యఋష్యాదులు వేయి దివ్య సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. దృషద్వతి నదిలో మునిగి దేవపితృతర్పణాదులు చేసిన మానవుడు అగ్నిష్టోమాతి రాత్ర క్రతు ఫలం పొందుతాడు. కృష్ణపక్ష సోమవారం నాడచ్చట శ్రాద్ధం పెట్టినచో కలుగు ఫలం వినండి. గయాశ్రాద్ధం పితృదేవతల నెల్లప్పుడూ ఎలా తృప్తిపరుస్తుందో అలాగే ఫలకీవనంలో గావించిన శ్రాద్ధకర్మ కూడ అంతటి ఫలాన్నీ యిస్తుంది. అంతేకాదు; మనసారాఫలకీవనాన్ని స్మరించినంత మాత్రాననే మానవుని పితరులు సంతృప్తులౌతారు. అందుకు సందేహములేదు. అక్కడే సర్వదేవతల నిలయమైన మహాతీర్థం ఒకటి ఉంది. అందులో స్నానం చేసిన వానికి వేయి ఆవులు దానం చేసినంత ఫలం లభిస్తుంది. పాణిఖాత తీర్థంలో స్నాతుడై పితృ తర్పణం చేసిన మానవునకు రాజ సూయం చేసిన ఫలం కల్గి సాంఖ్యయోగాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత అతి మహిమగల మిశ్రక తీర్ధం వస్తుంది, దథీచి మహర్షికై వ్యాసముని సర్వతీర్ధజలాలను అచట కలిపారు. ఆ మిశ్రకంలో స్నానం చేసినచో సకల తీర్ధాల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. అటనుండి నియతా హారియై నిష్ఠతో వ్యాస వనానికి వెళ్ళాలి. అక్కడ మనోజవ తీర్థంలో మునిగి దేవతారత్నం శివుని దర్శిస్తే మనుసులోని తలపులన్నీ సిద్ధించడం నిశ్చయం. అనంతరం మధువటి అనే దేవీతీర్థంలో నరుడు శుచియై స్నానం చేసి దేవపితృ తర్పణాదులు చేస్తే ఆ దేవి కృపవల్ల గొప్పసిద్ధులు లభిస్తాయి.
నియతాహారియైన ఉత్తమనరుడు దృషద్వతీ కౌశికీ నదుల సంగమంలో స్నానం చేసినచో సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. అంతట హంసతీర్థం వస్తుంది. అక్కడనే పుత్రశోకంతో తల్లడిల్లిన వ్యాసుడు ప్రాణత్యాగానికి సిద్దపడ్డాడు. అంతట దేవతలు ఉపశమన వాక్యాలు పలికి ఆయన నిర్ణయాన్ని మార్పించారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి పుత్రశోకమంటూ కలుగదు. తర్వాత కిందత్తమనే తీర్థంలో ఒక ప్రస్థం (కొలత) నువ్వులు దానం చేసినచో ఋణ బాధలు తొలిగిపోయి పరమసిద్ధి లభిస్తుంది. ‘అహ్నం సుదినం’ అనే అతి దుర్లభాలైన తీర్థాల్లో నిర్మలాంతఃకరణుడై స్నానం చేసిన వానికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ముల్లోకాల్లో ప్రసిద్ధమైన ‘కృతజప’ తీర్థం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి అచట గంగాస్నానం చేసి మహాదేవుని అర్పిస్తే అశ్వమేధఫలం లభిస్తుంది. అక్కడ కోటి తీర్థంలో స్నానం చేసి శ్రద్ధా బక్తులతో కోటీశ్వర స్వామిని దర్శిస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అట నుండి మూడు లోకాల్లో ప్రసిద్ధి గాంచిని వామన క్షేత్రానికి వెళ్ళనగును. అచ్చోటనే వామన మూర్తి బలిని వంచించి ఆయన రాజ్యాన్ని యింద్రునకు ప్రసాదించారు. అక్కడ విష్ణుపదీ తీర్థంలో స్నానం చేసి వామన దేవుని పూజించిన నరుడు సకల పాప విముక్తుడూ విష్ణులోకాన్ని పొందుతాడు.
బ్రాహ్మణోత్తములారా ! అక్కడనే సకలపాపనాశనియైన జ్యేష్ఠాశ్రమం ఉండి. దాని దర్శనమాత్రాన్నే నరుడు ముక్తుడౌతాడు. ఇతి తథ్యం. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడుపవసించి ద్వాదశినాడా తీర్థంలో స్నానంచేస్తే తోటివారిలో శ్రేష్ఠత్వం లభిస్తుంది. ఆ చోట అత్యంతవ్రత దీక్షాపరులు పవిత్రులయిన బ్రాహ్మణులను విష్ణుభగవానుడు నిలిపినాడు. ఆ విష్ణుభక్తులు కొసగుదానములు, అచట జరుపబడు శ్రాద్ధములు అక్షయమైమన్వంతరాంతంవరకూ వానికర్తలకు ఫలములిస్తూ ఉంటవి. అక్కడే త్రిభువన ప్రసిద్ధమైన కోటితీర్థం ఉండి. దానిలోస్నానం చేసిన వారలకు కోటియజ్ఞఫలం కలుగుతుంది. ఆ తీర్థంలో కోటీశ్వరమహాదేవుని దర్శనంచేస్తే ఆస్వామి కృపవల్ల గణాధిపత్యం లభిస్తుంది. ఆ చోటనే మహిమాన్వితమైన సూర్యతీర్థం ఉంది. అక్కడభక్తియుక్తుడై స్నానంచేయువాడు సూర్యలోకానికి పోతాడు. అచటనుంచి సకల కల్మషనాశకమైన కులోత్తారణ తీర్థానికి వెళ్లాలి. సకలవర్ణాశ్రమవాసులనూ ఉద్దరించుటకై దానిని స్వయంగా విష్ణుభగవానుడే పూర్వం జన్మించాడు. బ్రహ్మ చర్యానంతరమే మోక్షం పొందవలెననికోరే వారాతీర్థంలో ప్రవేశించినంతనే పరమపదాన్ని దర్శిస్తారు. ఆ తీర్థంలో స్నానం చేసిన బ్రహ్మచారిగానీ, గృహమేధికానీ వానప్రస్థుడుకానీ లేక యతీశ్వరుడు కానీ తమ యిరవై యొక్క తరాలవారిని తరింప చేస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులతో ఏవరైనా విష్ణుభక్తితత్పరులై అక్కడ స్నానంచేసి విష్ణుపదాన్ని దర్శించగలరు. వామనదేవుని సహితంగా ఈ కురుక్షేత్రాన్ని ఎంతదూరంగా ఉన్న వారైనాసరే భక్తితో స్మరిస్తేచాలు. వారలకు ముక్తి కలిగితీరుతుంది. అలాంటప్పుడు ఆ పవిత్రభూమిలో నివసించే వారిభాగ్య విషయం చెప్పతరమా!
ఇది శ్రీ వామన మహా పురాణంలోని సరోవర మాహాత్వ్యంలో పదిహేనవ అధ్యాయం సమాప్తం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹