పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు
వ్యాసమహర్షీ! ఇపుడు నేను ప్రతిపదాది తిథుల వ్రతాలను ఉపదేశిస్తాను. ప్రతి పదా అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేషవ్రతం పేరు శిఖి వ్రతం. ఈ ప్రతాన్నాచరించిన వారికి వైశ్వానరపదం సిద్ధిస్తుంది. పాడ్యమి నాడు ఏకభుక్తవ్రతం. అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి వుండిపోవాలి. వ్రతం చివర్లో కపిల గోవును . దానమివ్వాలి.
చైత్రమాసారంభంలో విధిపూర్వకంగా గంధ, సుందరపుష్ప, మాలాదులతో బ్రహ్మను పూజించి హవనం చేసినవారు అభీష్ట ఫలప్రాప్తి నందగలరు. కార్తిక శుద్ధ అష్టమినాడు పూలను వాటి మాలలనూ దానం చేయాలి. ఇలా ఏడాదిపొడవునా చేసిన వారికి రూప సౌందర్యం లభిస్తుంది.
శ్రావణ కృష్ణ తదియనాడు లక్ష్మీ, శ్రీధర,విష్ణుమూర్తులను బాగా అలంకరించ బడిన శయ్యపై స్థాపించి పూజించి రకరకాల పండ్లను నివేదించి ఆ శయ్యాదులను బ్రాహ్మణునికి దానం చేసి ఈ విధంగా ప్రార్ధించాలి. శ్రీధరాయనమః శ్రియైనమః ఈ తదియనాడే ఉమామహేశ్వరులనూ, అగ్నినీ కూడా పూజించాలి.
ఈ దేవతలందరికీ హవిష్యాన్నాన్నీ, తన కిష్టమైన పదార్థాలనూ, తెల్లకమలాల (దమనకాల) నూ నివేదించాలి.
ఫాల్గుణాది తదియల వ్రతంలో ప్రతి ఉప్పు తినరాదు. వ్రతాంతమున బ్రాహ్మణుని ఆయన పత్నితో సహా పూజించి అన్న, శయ్యా, పాత్రాది ఉపస్కరయుక్త మైన ఇంటిని దానం చేసి భవానీ ప్రీయతాం అనాలి. ఇలా చేసిన వారికి దేహాంతం లో భవానీలోకం ప్రాప్తిస్తుంది. ఈ లోకంలో కూడా సర్వసుఖాలూ లభిస్తాయి.
మార్గశిర తదియనుండి క్రమంగా తిథి నాటి కొకరుగా గౌరి, కాళి, ఉమ, భద్ర, దుర్గ, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివా, నారాయణీ దేవీ స్వరూపాలను పూజించాలి. దీనివల్ల ప్రియజన వియోగాది కష్టాలు కలగకుండా వుంటాయి.
మాఘశుద్ధ చతుర్థినాడు ఆహారమేమీ తీసుకోకుండా బ్రాహ్మణునికి తిలాదానం చేసి ప్రతి తిలలను నీటిని ఆహారంగా భావించి ప్రశ్న చేయాలి.
ఈ విధంగా ప్రతినెలా రెండేళ్ళపాటు చేసి వ్రత సమాప్తిని గావించాలి. ఇలా చేసిన వారికి జీవితంలో ఏ విఘ్నాలూ కలగవు. ప్రతి చవితి నాడూ గణపతిని యథావిధిగా పూజించాలి. ఈ పూజలో మూలమంత్రమైన ఓం గఃస్వాహా ను వీలైనన్ని మార్లు పఠిస్తూ ఈ క్రింద పేర్కొన్న విధంగా అంగన్యాస పూజనూ చేయాలి.
ఓం గ్రౌం గ్లాం హృదయాయనమః అంటూ కుడిచేతి అయిదు వేళ్ళతోనూ గుండెను ముట్టుకోవాలి.
ఓం గాం గీం గూం శిరసే స్వాహా అంటూ తలనూ
ఓం హ్రూం హ్రీం హ్రీం శిఖాయై వషట్ అంటూ శిఖనూ
ఓం గూం కవచాయ వర్మణే హుం అంటూ కుడి వ్రేళ్ళతో ఎడమభుజాన్నీ
ఎడమచేతి వ్రేళ్ళతో కుడిభుజాన్నీ స్పృశించాలి.
ఇంకా ఓం గౌం నేత్ర త్రయాయ వౌషట్ అంటూ కుడిచేతి వ్రేళ్ళ కొనలతో రెండు కనులనూ, లలాట మధ్య భాగాన్నీ స్పృశించాలి.
చివరగా ఓం గౌం అస్త్రాయ ఫట్ అనే మంత్రవాక్యముతో కుడిచేతిని తలపైకి లేపి ఎడమవైపు నుండి తలవెనుకకు గొనిపోయి కుడివైపు నుండి ముందుకి తీసుకువచ్చి చూపుడు, మధ్యమ వ్రేళ్ళతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్టు చరచాలి.
ఆవాహనాదులలో ఈ క్రింది మంత్రాలను పఠించాలి.
ఆగచ్ఛోల్కాయ గంధోల్క పుష్పోల్కో ధూపకోల్కకః ।
దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాథ విస (మా)ర్జనం II
పూజాద్రవ్యాలన్నిటినీ తేజః స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టుమని చేసిన ప్రార్థన ఇది.
ఆవాహన తరువాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగుష్టాదిన్యాసం చేయాలి. ఇలా
ఓం మహా కర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ।
కరన్యాసం కడముట్టినాక ఈ మంత్రాన్నే పఠిస్తూ తిలాదులతో వినాయకుని పూజించి వాటినే ఆహుతులుగా ఇవ్వాలి. గణాలను కూడా స్మరిస్తూ
ఓం గణాయనమః,
ఓం గణపతయే నమః,
ఓం కూష్మాండకాయ నమః
అంటూ పూజించాలి. ఇదే విధంగా గణాలను పూజిస్తూ ”స్వాహా”ను చేర్చి ఆహుతులిలా ఇవ్వాలి.
ఓం అమోఘోల్కాయ స్వాహా
ఓం నమః ఏకదంతాయ స్వాహా
ఓం నమో త్రిపురాంతక రూపాయ స్వాహా
ఓం నమః శ్శ్యామదంతాయ స్వాహా
ఓం నమో వికారలా స్యాయ స్వాహా
ఓం నమః ఆహవేషాయ స్వాహా
ఓం నమః పద్మ దంష్ట్రాయ స్వాహా
అనంతరం ప్రతి గణదేవునికి ముద్రలను ప్రదర్శించి, నృత్యం చేసి, చప్పట్లు కొట్టి, హాస్య ప్రసంగాలను చేయాలి. ఇలా చేసిన వారికి సకల సౌభాగ్యాలూ కలుగుతాయి. మార్గశిర శుద్ధ చవితినాడు దేవగణముల వారిని పూజించాలి.
సోమవారము,చవితి రోజులలో ఉపవాసముండి గణపతి దేవుని పూజించి ఆయనను జప, హవన,స్మరణల ద్వారా ప్రసన్నం చేసుకోగలిగినవారికి విద్య, స్వర్గం, మోక్షం లభిస్తాయి.
ప్రతి శుద్ధ చవితినాడూ చక్కెర లడ్లతో, కుడుములతో విఘ్నేశ్వరుని పూజించేవారికి సర్వకామనలూ సిద్ధిస్తాయి, సర్వసౌభాగ్యాలూ అబ్బుతాయి. దమనకాలతో ఇదే విధంగా పూజించేవారికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో శుద్ధ చవితిని మ అని కూడా అంటారు.
ఓం గణపతయేనమః ఈ మంత్రంతో గణపతిని పూజించాలి. ఏ మాసపు శుద్ధచవితి నాడైనా గణపతిని పూజించి హోమ, జప, స్మరణములను చేస్తే అన్ని విఘ్నాలూ నశించి అన్ని కోరికలూ తీరతాయి. గణపతికి గల విభిన్న నామాలను జపిస్తూ గాని స్మరిస్తూ గాని ఆ ఆద్యదేవుని పూజిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది. ప్రతి ఈ లోకంలో నున్నంతకాలం సమస్త సుఖాలనూ అనుభవిస్తాడు. అంతలో స్వర్గాన్నీ మోక్షాన్నీ పొందుతాడు.
వినాయకుని పన్నెండు నామములూ ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి.
గణపూజ్యో వక్రతుండ ఏకదంష్ట్ర త్రియంబకః ||
నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్న రాజకః ||
ధూమ్రవర్ణో భాలచంద్రో దశమస్తు వినాయకః ||
గణపతి ర్హస్తిముఖో ద్వాదశారే యజేద్గణం ||
ఒక్కొక్క నామాన్నే జపిస్తూ ఒక్కొక్క చవితి నాడూ యథావిధిగా పూజ చేసి అలా ఒక ఏడాది చేసినవారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది.
ఇక పంచమి నాడు నాగులను పూజించాలి. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక మాసాలలో శుక్ల పంచమి తిథుల్లో వాసుకి, తక్షక, కాళియ, మణిభద్రక, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనుంజయ నామకులైన ఎనమండుగురు నాగరాజులనూ పూజించాలి.
వీరికి నేతితో స్నానం చేయించి పూజ చేయాలి. ఈ నాగాధీశులు తమ భక్తులకు ఆయురారోగ్యాలనూ, స్వర్గలోక నివాసాన్నీ ప్రసాదించగలరు. అనంతుడు, వాసుకి, శంఖుడు, పద్ముడు, కంబలుడు, కర్కోటకుడు, ధృతరాష్ట్రుడు, శంఖకుడు, కాళీయుడు, తక్షకుడు, పింగళుడు – ఈ పన్నిద్దరు నాగులనూ ఇదే క్రమంలో నెలకొకరిని పూజించాలి. భాద్రపద శుద్ధపంచమి నాడు ఎనమండుగురు నాగులనూ ఒకేసారి పూజించాలి. నాగరాజులు స్వర్గాన్నీ మోక్షాన్నీ ప్రసాదించగలరు.
శ్రావణశుద్ధ పంచమినాడు ద్వారానికి రెండువైపులా ఈ నాగుల చిత్రపటాలను పెట్టి పూజించాలి. నైవేద్యంగా పాలనూ నేతినీ వుంచాలి.
ఈ పూజవల్ల విషదోషాలు ఆ యింటి కంటవు. పాము కాటు ఆ ఇంటి వారినేమీ చేయలేదు. అందుకే ఈ పంచమిని దంష్ట్రా ద్వార పంచమి అంటారు.
తొంబై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹