Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – తొంబై ఆరవ అధ్యాయం

భీమా – ఏకాదశి (భీమైకాదశి) (సంస్కృత వ్యాకరణం ప్రకారం ”భీమైకాదశి” అనాలి)

ప్రాచీనకాలంలో పాండు పుత్రుడైన భీమసేనుడు మాఘశుద్ధ హస్తనక్షత్ర యుక్త ఏకాదశినాడు ఈ పరమ పుణ్యప్రద వ్రతాన్ని చేసి పితృణ మిముక్తుడైనాడు. ఆ మరుసటి రోజును ఆనాటినుండి భీమద్వాదశిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా ఆ రోజు శాస్త్రోక్తంగా వ్రతం చేస్తే నశిస్తాయి.

బ్రహ్మ హత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నీగమనం ఈ పాపాలు మహాపాత కాలని ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కదాన్నయినా చేసినవాడు త్రిపుష్కర తీర్ధాలలో మునిగినా శుద్ధుడు కాదు, పవిత్రుడు కాలేడు. ఈ వ్రతం మహాపాతకుని కూడా శుద్ధునీ, పవిత్రునీ చేయగలదు. నైమిష, కురు, ప్రభాసక్షేత్రాలూ, కాళింది (యమున) గంగ మున్నగు తీర్థాలూ ఎట్టి పాపాన్నయినా కడిగివేయగలవు గానీ మహాపాపములను నశింప జేయలేవు. దానాలూ, జపాలూ, హోమాలూ, పూజలూ కూడా అంతే.

పృథ్వినే దానం చేయగా వచ్చేపుణ్యాన్ని త్రాసులో ఒకవైపూ, ఈ పవిత్ర భీమైకాదశి ద్వారా హరిని పూజింపగా వచ్చిన పుణ్యాన్నొక వైపూ వేసి తూస్తే ఏకాదశిపుణ్యమే ఎక్కువ శక్తిమంతమని తేలిపోతుంది.

వ్రత విధానమేమనగా ముందుగా వరాహ దేవుని స్వర్ణ ప్రతిమను తయారుచేయించి దానిని నూతన తామ్రపత్రంలో కలశపై స్థాపించాలి. తరువాత బ్రాహ్మణులచే సమస్త విశ్వమునకే బీజభూతుడైన విష్ణుదేవుని రూపమైన ఆ వరాహ ప్రతిమను తెల్లని పట్టుబట్టలచే కప్పించి స్వర్ణ నిర్మిత దీపాదులచే ప్రయత్నపూర్వకంగా పూజచేయించాలి.

ఓం వరాహాయనమః – చరణ కమలాలు

ఓం క్రోడాకృతయేనమః – కటిప్రదేశం

ఓం గంభీర ఘోషాయనమః – నాభి

ఓం శ్రీ వత్సధారిణే నమః – వక్షఃస్థలం

ఓం సహస్ర శిరసే నమః – భుజాలు

ఓం సర్వేశ్వరాయనమః – గ్రీవము

ఓం సర్వాత్మనే నమః – నోరు

ఓం ప్రభవాయ నమః – లలాటము

ఓం శతమయూఖాయనమః – కేశరాశి

పైన చెప్పబడిన మంత్రాలను జపిస్తూ స్వయంగా ప్రతియే వాటికెదురుగా చెప్పబడిన, మహావిష్ణువు యొక్క శరీరభాగాలను పూజించాలి. తదనంతరం రాత్రి జాగారం చేసి హరికథా శ్రవణం చేయాలి. అదీ విష్ణు పురాణమైతే ప్రశస్తం.

మరుసటి దినం స్నానాదికాలనూ నిత్యపూజనూ ముగించి నిన్న పూజలందిన స్వర్ణమయ వరాహమూర్తిని పూజాసక్తు డైన బ్రాహ్మణునికి దానమిచ్చి పారణ చేయాలి.

ఈ విధంగా ఈ వ్రతాన్ని చేసిన వానికిక పునర్జన్మ వుండదు. పితృ, గురు, దేవ ఋణాలూ తీరిపోతాయి. ఈ లోకంలో వున్నంతకాలం అన్ని కోరికలూ తీరి సుఖశాంతులతో జీవిస్తాడు. ”ఈ వ్రతమే అన్ని వ్రతాలకూ ఆది” అని పెద్దలంటారు.

తొంబై ఆరవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment