అగస్త్యార్ఘ్య వ్రతం
భుక్తి ముక్తి ప్రదాయకమైన ఈ వ్రతాన్ని కన్యారాశిలో సూర్య సంక్రాంతికి మూడు రోజుల ముందు ప్రారంభించాలి. కాశపుష్పాలతో (రెల్లు పూలతో) అగస్త్యుని మూర్తిని తెలతెల వారుతుండగా పూజించి కుంభంలోని నీటితో ఆ మహనీయునికి అర్ఘ్యమివ్వాలి.
ఆ రోజంతా ఉపవసించి రాత్రి జాగరం చేసి తెల్లవారినాక బంగరు లేదా వెండి పాత్రలో, అయిదు రంగులున్నదానిలో, సప్తధాన్యములను పోసి, పెరుగునీ చందనాన్నీ కూడా రంగరించి అగస్త్యఃఖనమానః… అనే ఋగ్వేద మంత్రం చదువుతూ మరల అర్ఘ్యప్రదానం చేయాలి. దీనికి ముందే పెరుగులో ముంచిన అక్షతలతోనూ, పూలతోనూ, పండ్లతోనూ ఆయన మూర్తిని పూజించాలి.
అర్ఘ్యానంతరం ఈ మంత్రంతో ప్రార్థించాలి.
కాశపుష్ప ప్రతీకాశ అగ్ని మారుత సంభవ |
మిత్రా వరుణయోః పుత్ర కుంభయోనే నమోస్తుతే ||
ఈ వ్రతాన్ని శూద్రులు, స్త్రీలు కూడ చేయవచ్చును. పూజానంతరం ఒక కుండలో బంగారాన్నీ, వేరే దక్షిణనీ పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వాలి. వేరే ఏడుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా ప్రతి సంక్రాంతినాడూ చేస్తూ ఒక యేడాది పాటు చేసినవారు సర్వ ప్రకారాలు శ్రేయస్సులకూ అధికారులౌతారు.
ఎనభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹