Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై నాల్గవ అధ్యాయం

మొదటి భాగము | నీతిసారం – నాల్గవ భాగము

వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నినీ, దుష్టమిత్రునీ, దురాచారియైన రాజునీ, కుపుత్రునీ, గుణహీనకన్యనీ, కుత్సిత దేశాన్నీ దూరం నుండే పరిత్యజిస్తాడు.

కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత వుండదు; మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు; బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు;

పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు; స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు.

కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గల వారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది.

పోయినవాళ్ళే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ‘ఆహా! మృతులెంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్నీ, ఈ దేశం ముక్కలైపోడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాసక్తలైన పత్నులనీ, దురాచారాసక్తులైన పుత్రులనీ చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో ఉన్నా ఈలోకంలోని మనకంటే సుఖంగానే వుండివుంటారు. అని వృద్ధులంతా తమలో తాము, తమతోతాము సంభాషించుకుంటు ఉంటారు.

కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణియైన స్త్రీకి ప్రేమ వుండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ వుండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా వుంటుంది?

ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ పాతికశాతంమందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడ. మిగతావాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువమంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్నభుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది.

పరాన్నంచ పరస్వంచ పరశయ్యాః పరస్త్రీయః |

పరవేశ్మని వాసశ్చ శక్రాదపి హరే శ్రియం ||

ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరినుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్య మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసివస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు గానీ ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములై పోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి.

స్త్రియో నశ్యంతిరూపేణ తపః క్రోధేన నశ్యతి |

గావో దూర ప్రచారేణ శూద్రా న్నేన ద్విజోత్తమః ||

అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, “శూద్రాన్నంవల్ల ఎంతటి ద్విజోత్తములైనా దిగజారిపోతారు..

పిల్లల, శిష్యులపట్ల బాధ్యతకు బదులుగా అతి గారాబం, స్వార్థం, చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల, గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశా నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో వుండడం వల్ల చివికిపోతాయి.

నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు. ఎక్కువగా సంధికోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనముకదా! సన్మానమే వుంటే ఇక ధనమెందుకు? మానమూ దర్పము నశించినవానికెంత ధనముండి ఏమి లాభము?. వాడు జీవించుట మాత్రము దేనికి? మాన, స్వాభిమాన యుగళము లేక ధన, ఆయుర్యుగళ ముండీలేనట్లే కదా!

నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన, మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు.

అధమాధన మిచ్చంతి ధనమానౌహి మధ్యమాః ||

ఉత్తమా మానమిచ్ఛంతి మానోహి మహతాం ధనం ||

అడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలూ అలాగే లభిస్తాయి.

నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే వనే! ||

స్వయమేవ మృగేంద్రతా నిత్య మూర్జిత సత్త్వస్య ||

బద్ధకస్తుడైన వర్తకుడు, అహంకారియైన సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్యా తమ వృత్తులలో రాణించలేరు.

దరిద్రుడై వుండీ దాత కావాలనే కోరికా, ధనికుడై యుండీ పీనాసితనమూ, అతి గారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడమూ, మంచివాడై వుండి దుష్టులను సేవించడమూ, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడమూ మనిషిని దుశ్చరిత్రుని చేసే పంచలక్షణాలు,

దాతా దరిద్రః కృపణో- ర్ధయుక్తః పుత్రో- విధేయః కుజనస్యసేవా |

పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ ||

కాంతా వియోగః స్వజనాప మానంఋణస్యశేషః కుజనస్యసేవా |

దారిద్ర్య భావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః ||

అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి. అయిదుంటాయి. అవి పత్నీవియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన ఋణం, దుర్జనులను సేవించవలసిరావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమొగమై పోవడం. మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గానీ వాటిలో నాలుగు మాత్రం తీక్షమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి.

అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు. అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని. శరీరం, సత్సంగినీ మనోనుకూలావశవర్తినీయైన భార్య ఈ పంచ భాగ్యాలూ పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి.

లేడి, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప ఈ అయిదూ క్రమంగా శబ్ద, స్పర్శ, – రూప, గంధ, రసాలను ప్రమాదకరస్థాయిలో ఇష్టపడి సేవించి పీకలమీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ అయిదింటినీ ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు.

కురంగమాతంగ పతంగ భృంగ మీనా హతాః పంచభిరేవ పంచ ||

ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో యః సేవతే పంచభిరేవ పంచ ||

బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ అయిదు పనులనూ చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ వుండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహూతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకూ పెళ్ళిళ్ళకూ పోవడం. ఈ పనులలో ఒక్కటి చేసినా బ్రాహ్మణునికి పూజించేవారూ, గౌరవించేవారూ మిగలరు.

ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలూ మనం పుట్టినపుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకొని జీవించడమే. భగవంతుని దయవుంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు.

ఆయుః కర్మ చ విత్తం చవిద్యా నిధనమేవచ |

పంచైతాని వివిచ్యంతే జాయమానస్య దేహినః ||

మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరవారితోడు, యౌవనం, ధనం ఈ అయిదూ అస్థిరాలు. మనిషికి సంబంధించినవన్నీ, ధర్మకీర్తులు తప్ప, అస్థిరాలే.

ఆభ్రచ్ఛయాఖలే ప్రీతిః పరనారీషుసంగతిః ||

పంచైతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనానిచ ||

అస్థిరం జీవితం లోకే అస్థిరం ధనయౌవనం ||

అస్థిరం పుత్ర దారాద్యం ధర్మః కీర్తిర్యశః స్థిరం ||

నూరేళ్ళ జీవితం గొప్పనుకుంటాం కానీ ఈ నూరేళ్ళూ దేనికీ చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడచిపోతుంది కదా! మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యంచే తినివేయబడుతుంది.

ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వియోగ దుఃఖము లాంటి వన్నీ వుంటాయి కదా! ఇక జీవిక అనగా కొలువు, తిండికోసం పనిచేసే సమయం, దానిలోని సాధకబాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి. కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవకర్మాల్ని ఆచరించాలి. అంతేకాని, దానికి ”చాలా వేళ వుందిలే” అనుకోకూడదు.

అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయసు పెరుగు తోందని సరదాపడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్తపడాలి. ”యవ్వనవేళ” లోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి.

మనిషికీ పశువుకీ గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, ఆగివున్నా, మేలు కొనివున్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం. ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండి తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాలకోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికీ పశువుకీ పెద్దగా తేడా వుండదు. పశువు కూడా పిల్లలకి పాలిస్తుందిగా!

గచ్ఛ తస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతో నచేత్ ||

సర్వసత్త్వ హితార్థాయ పశోరిన విచేష్టితం ||

హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్ప వాడైపోయి, వేద, పురాణ, శాస్త్ర చర్చలవేళల్లో తర్క వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ, తన కడుపు నిండగానే తనివితీరి పోయిందనుకునే వాడికి పశువుకీ ఏమి తేడా వుంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువుకంటె భిన్నుడనుకోవాలి.

పరాక్రమం, విద్య, అర్ధలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికీ అతని మాత విసర్జించే మలానికీ, సమాన ప్రయోజనమే వుంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే ఒక ఏడాదిపాటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు.

కాకివలె బతికి ఏమి లాభం? హంస వలె గానీ సింహమువలె గానీ జీవించవలె.కాకి పెంటను తిని బతుకుతుంది. ఎన్నేళ్ళయినా వుంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులనూ, భృత్యులనూ ధనంతో కంటే ప్రేమతో కట్టిపడవేయ గలిగినవానిదే మానవజీవనమవుతుంది.

మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావముండాలి. ఆత్మాభిమానముండాలి గాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసుచేసుకొని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిననాడు ఊరి ప్రజలు ”మొన్న ఒక కాకి పోయింది. నేడు ఈయన పోయాడు. ఊరికి ఒరిగిందీ లేదు తరిగిందీ లేదు” అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్ధం లేదు.

యో వాత్మనీహ నగురౌ నచ భృత్యవర్గా |

దీనే దయాం నకురుతే నచ మిత్ర కార్యే ||

కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే |

కాకో-పి జీవతి చిరం చ బలించ భుంక్తే ||

స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తితా |

యే పరాధీన కర్మాణో జీవంతో పి చతే మృతాః ||

స్వాతంత్య్రమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మృతకల్పులు ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే వున్నాయి. వాటిని నమ్ముకొనరాదు.

ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడా, గడ్డిమంటా, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరూ,వేశ్యలకు ప్రేమా, దుష్టుని మనసులో పుట్టే ప్రీతీ ఈ ఆరూ క్షణభంగురాలు.మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటినీ నమ్మరాదు.

అభ్రచ్ఛాయా తృణా దగ్నిర్నీచసేవా పథోజలం |

వేశ్యారాగః ఖలే ప్రీతిః షడేతే బుద్బుదోపమాః ||

బాల్యం తీరిన తరువాత నోరుపెట్టినా ఎవరూ పడరు. గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం. నిర్బలులకు రాజే బలం. మూర్ఖునకు మౌనం బలం. దొంగకి అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ వుంటుంది.

మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కల్యాణం వైపు మనసును మళ్ళించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి, మనసు విశాలమై మరిన్ని మంచిపనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టెయ్యాలి.

యథాయథా హి పురుషః శాస్త్రం సమధి గచ్ఛతి ||

తథా తథా స్యమేధా స్యాద్వి జ్ఞానంచాస్య రోచతే ||

యథా యథా హి పురుషః కల్యాణే కురుతే మతిం ||

తథా తథా హి సర్వత్ర శ్లేష్యతే లోక సుప్రియః ||

ఇంకా ఉంది

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment