Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై ఒకటవ అధ్యాయం

నీతిసారం మొదటి భాగం

సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు, “మహామునులారా! సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికీ చెడతాడు.

వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య, పిరికివాని చేతిలోని ఆయుధంవలెనే వానికి పనికిరాదు. అంధుని భార్య యొక్క అందమూ అంతే.

సుందర భోజ్య పదార్థాల కలిమి, వాటిని అరిగించుకొనే శక్తి, రూపవతియగు భార్యా, ఆమెను అన్ని విధాలా సంతృప్తి పఱచగలిగే శక్తి, ధనమూ, వైభవమూ, దానం చేసే బుద్ధీ ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి.

వేదానికి ఫలం అగ్నిహోత్రం; విద్య యొక్క ఫలాలు శీలమూ, సదాచారమూ; వల్ల లాభం సత్యానందం, పుత్రప్రాప్తి; అలాగే ధనం వుండేది దానానికీ, భోగానికీ,ధనం ఉండాలి కానీ అనర్థాన్ని తెచ్చి పెట్టే ధనం అభిలషణీయం కాదు. మణిని కోరుకోవచ్చు. కాని పాముపడగపై నున్న మణి కోసం పాకులాడకూడదు కదా!

అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వాని వద్ద నుండి కూడా గ్రహించవచ్చు. బాలకుని వద్ద నుండైనా సుభాషితాన్ని ఆలకించి ఆదరించాలి. స్వర్ణము అపవిత్ర స్థానంలో వున్నా చేజిక్కించుకోవచ్చు. అలాగే నీచవ్యక్తి వద్ద శ్రేష్ఠ విద్య వుంటే నిస్సంకోచంగా ఆ విద్యను నేర్చుకోవచ్చు.

రాజుతో స్నేహం మంచిదికాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి వుంటుంది.

వివేకవంతుడు తన వంశంలోని వారందరినీ భగవద్భక్తులతో కలిసివుండేలా చేస్తాడు. పిల్లలను విద్యాధ్యయనంలో మగ్నులను చేస్తాడు. శత్రువులను ప్రమాదాలలో ముంచుతాడు. తనకిష్టులైన వారిని ధర్మమార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు.

భృత్యులనూ, ఆభరణాలనూ వేటికి తగినచోట్లలో వాటినుంచాలి. చూడామణిని కాలికి పెట్టుకోలేము కదా! కాబట్టి భృత్యుని కరుణించవచ్చు కాని నెత్తికెక్కించుకోరాదు. మనస్వియైన మనుజుడు పూలగుత్తి వలె నరుల తలలపైనైనా వుండాలి లేదా అడవిలోనే రాలిపోవాలి.

మణీలక్కా కొండొకచో కలిసే వుండవచ్చు. స్వచ్ఛంగా స్వయం ప్రకాశం మానంగా వుండే మణిని లక్క సహాయంతో ఆభరణాలలో అమరుస్తారు. అయినా దేని విలువ దానిదే. గుఱ్ఱం, ఏనుగు, ఇనుము, కఱ్ఱ, రాయి, బట్ట, ఆడది, మగవాడు, నీరు ఇవన్నీ కలిసి ఒకే చోట వుండవచ్చు కాని దేని విలువ దానిదే.

అర్థం వల్ల సాధారణంగా వచ్చే అనర్థాలు దైవానుగ్రహమున్న వానికి రావు. కాబట్టి దేవుని పూజించాలి.

కొన్ని కొన్ని పరిస్థితుల్లో సిగ్గు లేదా బిడియము లేదా మొగమాటము పనికిరావు. డబ్బు రావలసిన చోట, ప్రయోగాలలోను, కార్యసిద్ది ప్రయత్నంలోను, భోజన వేళ, సంసార వ్యవహారంలోను లజ్జను పరిత్యజించాలి.

ఎటువంటి ఊరనుండాలో ఎవరు చొప్పడకున్నట్టి ఊరు చొరకూడదో వినండి..

ధనినః శ్రోత్రియోరాజా నదీ వైద్యస్తు పంచమః ||

పంచయత్ర న విద్యంతే నకుర్యాత్ తత్ర సంస్థితం ||

దానధర్మాలు లేనిచోట, రాకపోకలు కనబడని చోట, అనుచితాచారులను భయపెట్టి ఆపే యంత్రాంగం పని చేయని చోట, ప్రజలు సిగ్గుని చిన్నప్పుడే వదిలేసిన చోట అది ఎంత రమ్యమైన గ్రామమైనా, నగరియైనా ఒక్క రోజైనా నిలువరాదు. అలాగే దైవజ్ఞులు, వేదజ్ఞులు, పాలకుడు, సజ్జనులు, జలసమృద్ధి అనగా నీటివసతి లేనిచోటకూడా నిలువరాదు..

ఎనభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment