Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – డెబ్భై ఎనిమిదవ అధ్యాయం

అశౌచం, ఆపద్వృత్తి

మునులారా! ఇపుడు మృత్యువు ఆవరించాక మనిషికి కలిగే మరణశౌచాన్ని వర్ణిస్తాను వినండి.

రెండేళ్ళలోపు వయసున్న బాలకుడు మృతి చెందితే వానిని పాతిపెట్టాలి. జలాంజలి నీయకూడదు. ఈ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపలవుండాలి. శ్మశానం కారాదు. శవాన్ని గంధ, మాల్య, అనులేపనాదులతో బాగా అలంకరించాలి. (మనుస్మృతి 5/68,69), రెండేళ్ళు దాటి, ఉపనయనమయ్యేలోగా మరణించిన బాలకుని బంధుగణమంతా కలసి శ్మశానానికి గొనిపోయి లౌకికాగ్నితో, యమసూక్త పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి.

ఉపనయనమై , మరణించిన బాలునికి అన్ని క్రియలనూ ఆహితాగ్నితో సమానంగా చేయాలి. మరణతిథికి ఏడవ లేదా పదవరోజున ముందుగా, అతని వర్ణంలో గోత్రంలో నుండు పరిజనులు (సమాన గోత్ర, సమాన పిండ, సమానోదక జనులు) అపనః శోశుచదఘం అనే ఋగ్వేద (1/97/1-8) మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే వీలైనంతగా ఇంటికి దూరంగా నున్న జలాశయానికి పోయి జలాంజలులివ్వాలి.

ఇలాగే మాతామహునికీ ఆచార్యపత్నికీ ఇతరులకు కూడా ఇవ్వాలి. ఉపనయనమైనాక మరణించిన వానికి కూడా సంపూర్ణ కర్మకాండను నడిపించాలి.

మిత్రుడు, వివాహిత స్త్రీ (సోదరి మొదలైనవారు) వదిన, మామగారు, ఋత్విక్కు మరణించినపుడాయా ఆత్మల అభ్యున్నతికై జలాంజలులిస్తూ పేరునీ గోత్రాన్ని చెప్పి ఒకేసారి జలాంజలి నివ్వాలి. ఈ జలాంజలులనే ధర్మోదకాలని కూడా అంటారు) పాఖండులూ, పతితులూ పోయినపుడు ధర్మోదకాల తంతువుండదు. బ్రహ్మచారి (ఆశ్రమంలో వుండి పోయిన యువసన్యాసి) వ్రాత్యుడు, వ్యభిచారిణియగు స్త్రీకి కూడా ధర్మోదకాలివ్వరు.

తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నవారికీ కూడా అశౌచముంటుంది కాబట్టి వారు జలాంజలులకర్హులు కారు,వ్యక్తి మరణించినపుడు పెద్దపెట్టున ధ్వనులు చేస్తూ రోదించడం నిషిద్ధం. జీవుల స్థితి అనిత్యమనే జ్ఞానం కనీసం అప్పుడైనా వుండాలి.

యథాశక్తిగా శ్మశానానికి గొనిపోయి దహనక్రియను గావించి స్వజనులంతా ఆ వ్యక్తి ఇంటికి రావాలి. ద్వారంలో ప్రవేశిస్తూనే వేపాకును నమలి, ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్ల ఆవాలు ఈ నాల్గింటినీ – ముట్టుకొని రాతిపై పాదాలను ఒక్క క్షణం వుంచి అప్పుడు నెమ్మదిగా ఇంటిలోనికి రావాలి.

ఎవరి ప్రేతాన్ని ముట్టుకొని శ్మశానం కెళ్ళకుండా ఇంటికి వచ్చినా ఇంటిలోకి ప్రవేశిస్తూ ఈ విహిత కర్మనంతటినీ ఆచరించాలి. దహనం పూర్తయ్యేదాకా గానీ దహనక్రియకు గానీ మరుభూమిలోవుండి వచ్చిన సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్ధులవుతారు. పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. (ప్రేతానుగమనమే పుణ్యము)

ఆ రోజు భోజనం మానకూడదు గానీ వారు పెట్టినదే తినాలి. అడగకూడదు. పరిజనులంతా విడివిడిగా మూడు రాత్రులు నేలపైనే శయనించాలి. పిండయజ్ఞానంతరం మృతవ్యక్తినుద్దేశించి విహిత పిండదాన ప్రక్రియానుసారము దంజెమునపసవ్యం చేసుకొని మూడు రోజుల దాకా పిండరూప అన్నాన్ని మౌనంగా భూమిపై పెడుతుండాలి.

శ్రాద్ధం పెట్టే అధికారమున్న వ్యక్తి నీలాకాశం క్రింద నిలబడి ఒక శిక్య మట్టి పాత్రతో నీటినీ మరొక మట్టిపాత్రతో పాలనీ ఆ ప్రేతాత్మకు సమర్పించాలి.

ఆ సమయానికి ఆ అధికారికి ఏదైనా అశౌచంవుంటే దానిని క్రౌతాగ్నిలో స్మార్తాగ్నిలో చేసే నిత్యకర్మ (అగ్నిహోత్రం, దర్శ పూర్ణ మాసం, విహిత స్మార్తాగ్నిలో సాయం-ప్రాతః హోమం) అనుష్టానం ద్వారా శ్రుతిలో ఆజ్ఞాపింపబడిన పద్ధతి ద్వారా శుద్ధి చేసుకొని శ్రాద్ధకర్మను తప్పనిసరిగా చేయాలి.

దంతములు మొలవకముందే పిల్లలు మరణిస్తే వారి బంధువులకు ఖననం జరిగిన వెంటనే శుద్ధి లభిస్తుంది. దంతాలు మొలిచాక పుట్టుజుత్తులు తీయించక ముందు మృతి చెందిన పిల్లల బంధువులకు ఒక రాత్రి, ఒక పగలు అశౌచముంటుంది. చూడాకరణమై ఉపనయనం కాక చనిపోయిన బాలల బంధువులకు మూడు రాత్రులు గడిచేదాకా అశౌచం వుంటుంది.

ఉపనయనమైన తరువాత మృతి చెందిన వాని బంధువులలో సపిండకులకు పదిరాత్రుల దాకానూ సమానోదకులకు మూడు రాత్రుల దాకానూ అశౌచముంటుంది.

రెండు సంవత్సరాల వయసు రాకుండానే మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు పది రాత్రులు గడిచేదాకా అశౌచముంటుంది. పరివారంలో జననమో మృతియో జరిగినా ఈ పదిరాత్రుల మైల పట్టింపులో తేడా వుండదు.

సపిండులు మరణిస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు పది, పన్నెండు, పదిహేను, ముప్పది దినాల మైల వుంటుంది. పెండ్లికి, నిశ్చితార్థానికి ముందు చూడాకరణ తరువాత మృతి చెందిన కన్య బంధువులకు ఒక పగలు, ఒక రాత్రి గడిచాక శుద్ధి అవుతుంది. దంతాలు మొలిచేలోగానే మృతి చెందిన బాలకుని ఖననం బదులు అగ్ని సంస్కారం చేస్తే. ఒక రోజు దాటగానే శుద్ధి జరిగిపోతుంది.

గురువు, అంతేవాసి (ఆశ్రమంలో వుండేవాడు) శిష్యుడు, వేదాంగ ప్రవక్త, బంధువు, శ్రోత్రియుడు (వేదాలలో ఒక శాఖని బోధించినవాడు ) అనౌర పుత్రుడు (దత్తపుత్రుని) వంటివాడు) రాజు, తెలిసిన మనిషి మృతి చెందినవార్త తెలియగానే గాని దహనానంతరం గాని స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డవారికీ అంతే.

సత్రమును ఇరవైనాలుగు గంటలూ ప్రజలకోసమే ఆశించకుండా నడిపేవాడు (అన్నం ఉచితంగా పెట్టేవాడు) కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తున్నవాడు, బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు, వానప్రస్థి, బ్రహ్మవిదుడైన సన్యాసి- (వీరు మానవాతీతులనో ఏమోగాని) వీరికి ఎవరు పోయినా మైల అంటదు.ఎట్టి అశౌచమూ వుండదు.

దాన కార్యక్రమానికై సిద్ధం చేయబడిన సామగ్రికీ, వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికీ, సంగ్రామ సమయంలో ఆ భయంతో నున్న ప్రజలకి మైల వుండదు. అలాగే వరదల వంటి భయంకర విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నవారికీ, అరాచక విప్లవ ప్రాంతాల్లో జీవిస్తున్నవారికీ ఏమైలా అంటదు.

గ్రీష్మ ఋతు ప్రభావం వల్ల కుంచించుకు పోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకూ పనికిరాదు. అంటే జలాశయానికే శుద్ధి అవసరం. అది నీటితో నిండినప్పుడే అవుతుంది.

ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ లేదా వైశ్యవృత్తులను స్వీకరించవచ్చు. వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితుల్లోనైనా వైశ్యవృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు, సోమలత, వస్త్రాలు, లతలు, ఔషధీలతలు, పాలు, పెరుగు, నెయ్యి, నీరు, నువ్వులు, అన్నం, రసం, ఉప్పు, తేనె, లక్క, హవిష్యాన్నం, మణులు, చెప్పులు, మృగచర్మం, మాంసం, సుగంధద్రవ్యాలు, మూలాలు – వీటిని అమ్మరాదు.

బ్రాహ్మణుడు తన శ్రోత స్మార్త – యాజ్ఞపూర్ణతకై కావలసిన ధాన్యాన్నీ, అత్యావశ్యకములైన మందులనూ తిలలు విక్రయించి కొనుక్కోవచ్చును. అదీ ఆపత్కాలంలోనే. అప్పుడు కూడా లవణాదికములను అమ్ముకొనరాదు.

తన వైయక్తికయజ్ఞాలను చేసుకొంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే వంటాడు. అతని బ్రాహ్మణ్యానికి తరుగూ విరుగూ వుండవు. వ్యవసాయం, పశుపాలనమూ కూడా అప్పుడు తప్పుకాదు. అయితే గుఱ్ఱాలను అమ్ముకోరాదు.

ఆపత్కాలంలో అనివార్యమైనపుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును. ఇది మూడు రోజుల వఱకే అంగీకార్యము. ఆ బ్రాహ్మణుని నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని ఒక్కరోజు మాత్రమే ఆకలి తీర్చుకొనుటకు వాడుకోవాలి. ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశం, రీతి, శాస్త్రాధ్యయనం, వేదజ్ఞానం, తపము, జపము మున్నగు వైశిష్ట్యాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి. అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు.”

డెబ్భై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment