గ్రహ శాంతి
మునులారా! సిరిసంపదలూ, సుఖశాంతులూ కోరుకొనేవారు ముందు తమపై విభిన్న గ్రహాల ”చూపు” ఎలావుందో చూసుకొని ”అది” బాగులేని చోట జాగ్రత్తపడాలి. అంటే తమతమ జాతకాల్లో నున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి తొమ్మిది గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమలను అనగా మూర్తులను క్రమంగా రాగి, స్ఫటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి.
ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, పసుపు, తెలుపు, చివరి మూడు గ్రహాలూ నలుపు. వీరి పూజాద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో వుంటాయి. ఈ నవగ్రహాలనూ ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి (లేదా స్థాపింపబడిన చోటికి పోయి) సువర్ణ, వస్త్ర పుష్పాలను నవగ్రహ మండపానికి సమర్పించాలి.
గంధ, బలి. ధూప, గుగ్గులాదులను కూడా ఇవ్వాలి. చరు (అనగా హోమంకొరకు వండబడిన అన్నం)ని మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్నీ ఉద్దేశించి సమర్పించాలి. ఆ తరువాత ఈ గ్రహాలనూ ఆయా మంత్రాలతో దిగువనిచ్చిన విధంగా జపించి అర్చించాలి.
ఓం ఆకృష్ణన రజసా… సూర్య
ఓం ఇమందేవా… చంద్ర
ఓం అగ్నిమూర్ధదివః కకుత్… మంగళ
ఓం ఉద్బుదస్వ… బుధ
ఓం బృహస్పతే… బృహస్పతి.
ఓం అన్నత్పరిస్రుతం… శుక్ర
ఓం శం నో దేవీ… శని
ఓం కయానశ్చి… రాహు
ఓం కేతుం కృణ్వన్… కేతు
ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందార, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, శమి, దుర్వ, కుశ సమిధలను నేయి, పెరుగు, తేనెలలో ముంచి హవనం చేయాలి. తరువాత మరల పైన చెప్పబడిన మంత్రాలను చదువుతూ ఈ క్రింది పదార్థాలను ఆహుతులివ్వాలి.
సూర్యునికి బెల్లం, చంద్రునికి ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమాన్నం, బృహస్పతికి పెరుగన్నం, శుక్రునికి నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్ల గుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద.
ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరు పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో రకమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుఱ్ఱం, నల్ల ఆవు, ఆయుధాలు, మేకలను దానంచేయాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు. సిరులను కురిపించగలవు; రాజ్యాలనే ఇవ్వగలవు; రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు.
డెబ్భై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹