దానధర్మ మహిమ
ఋషులారా! దానధర్మం చాలాగొప్పది. అన్ని వర్ణాలలోకీ అధ్యాయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం గొప్పది. వారిలో సత్రియానిష్ఠుడు అనగా కర్మనిష్ఠగలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య, తపస్సు గల బ్రహ్మతత్త్వ వేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలచుకున్నపుడు ఇది చూడాలి. భోజనం పెట్టడానికీ అన్నదానం చేసేటప్పుడూ ఆకలీ, పేదరికమూ మాత్రమే కొలబద్దలు, అలా కాకుండా గృహస్థైనవాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది దానాలు చేసేటపుడు సత్పాత్రునికే చేయాలి.
విద్యా, తపస్సూలేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్రదానం వల్ల దాతా, ప్రతిగ్రహీతా కూడా అధోగతి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజూ చేయాలి. నిమికాలాల్లో అనగా సూర్యచంద్రాది గ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చెయ్యాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినపుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలనూ గిట్టలకు వెండి చుట్లనూ అలంకరించి ఒక కాంస్యపాత్రతో సహా ఇవ్వాలి. కొమ్ములకుండే బంగారం పది సౌవర్ణికాలు (నూటయెనిమిది మాశలు) గిట్టలకు పెట్టే వెండి ఏడు పళంలు వుండాలి.
గోదానాన్ని దూడతో సహాచేయాలి. ఆ దూడనీ అలంకరించాలి. ఆవు రోగరహితమై వత్స సహితమైవుండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కాని పిప్పల కఱ్ఱతో గాని చేసిన కొయ్యదూడనీయవలెను. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నవో అన్నేళ్ళు స్వర్గ సుఖములు సంప్రాప్తమౌతాయి. అదే కపిల గోవైతే దాత యొక్క ఏడు తరాలు ఉద్దరింపబడతాయి.
గర్భము నుండి దూడ బయల్వెడలుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానముగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేసే స్తోమతులేనివారు పాలిచ్చే ధేనువును గానీ గర్భముతోనున్న ధేనువును గాని దానం చేసి నా స్వర్గ ప్రాప్తి వుంటుంది.
అలసిన మనిషికి ఆసనాదికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవచేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలను కడగడం. ఆయన వాడే జాగానూ, వస్తువులనూ శుభ్రం చేయడం – ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గ ప్రాప్తి వుంటుంది.
భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, శయ్య, కుంకుమ, చందనాదులను దానమిచ్చినవారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులౌతారు.
సత్పాత్రునికి విద్యాదానమొనర్చిన వానికి దేవ దుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాన్నీ, యజ్ఞాల విభిన్న విధులనూ సంపాదితం చేసి, శాస్త్రాలనూ విభిన్న ధర్మశాస్త్రాలనూ తరువాతి తరం వారికోసం కొంత మూల్యాన్ని స్వీకరించియైనా సరే, వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేద, శాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటినే సృజించాడు.
కాబట్టి ఎంతగట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారి కందించాలి. ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే వ్రాసివుంచిన వారికి, దానం చేసినవారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి రెండింతల పుణ్యం లభిస్తుంది.
నాస్తికుల వచనాలూ, కుతర్కాలూ ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకనిని అధోగతి పాలు జేయడానికా శబ్దమే చాలు.
దానం పుచ్చుకొనే అర్హత, అవకాశం వుండీ కూడా తమ వద్ద పుష్కలంగా వున్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికీ, తమ వద్దలేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికిప్పించిన వారికీ దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది.
కులట, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రులు కానివారు కుశ, శాక, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చును. తల్లిదండ్రులను పోషించడానికై గాని దేవతలను అతిథులను పూజించుటకు గాని, తనకు ప్రాణం మీదికి వచ్చినపుడు గాని పతితులు కుత్సితులు కానివారెవరు దానమిచ్చినా స్వీకరించవచ్చును; అదీ అవసరం మేరకే.
డెబ్బయవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹