పదునాలుగు మన్వంతరాలూ పదునెనిమిది విద్యలూనూ
రుద్రాదిదేవతలారా! పూర్వకాలంలో సర్వప్రథమంగా స్వాయంభువ మనువు ఉద్భ వించాడు. ఆయనకు అగ్నీధ్రాది పుత్రులు జనించారు.ఈ మన్వంతరంలో అనగా ఈ మనువు కాలంలోనే మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, వసిష్ఠులనే సప్తర్షులు దయించారు.
తరువాత నేర్పడిన పన్నెండు దేవగణాలలో జయ, అమిత, శుక్ర, యామ అను గణాలు సోమపాయులు. వీరి నుండి విశ్వభుక్, వామదేవులనే వారు ఇంద్రపదవిని సాధించారు. వాష్కలి అను రాక్షసుడు ఈ కాలంలోనే వీరిని పీడించి విష్ణువు చక్రాయుధం దెబ్బకు మరణించాడు.
తరువాత స్వారోచిష మనువు ఉద్భవించాడు. ఇతనికి చైతక, వినత, కర్ణాంత, విద్యుత్, రవి, బృహద్గుణ, సభులను పుత్రులు జనించారు. వీరిలో సభుడు మహాబలిగా, మండలేశ్వరునిగా, పరాక్రమశాలిగా ప్రసిద్ధుడైనాడు.
ఈ మన్వంతరంలో ఊర్జ, స్తంభి. ప్రాణ, ఋషభ, నిశ్చల, దత్తాలి, అర్వరీవాన్ – అను పేరు గల ఏడుగురు మహామునులు సప్తర్షులుగా ప్రసిద్ధులైనారు. ఈ కాలంలోనే పన్నెండు తుషితగణాలూ, పారావత దేవగణాలూ ఏర్పడ్డాయి. విపశ్చిత్తుడను నాయకుడు ఇంద్ర పదవినధిష్టించాడు. అతని శత్రువైన పురుకుత్సర నామకుడగు దైత్యుని శ్రీ మధుసూదన దేవుడు ఏనుగు రూపంలో సంహరించాడు.
అనంతరం ఔత్తరమనువు ఉద్భవించాడు. ఈయనకు అజ, పరశు, వినీత, సుకేతు, సుమిత్ర, సుబల, శుచి, దేవ, దేవావృధ, మహోత్సాహ, అజిత నామకులు పుత్రులు ఉదయించారు.
ఈ మన్వంతరంలో రథాజ, ఊర్ధ్వబాహు, శరణ, అనఘ, ముని, సుతప, శంకువులనే మహామునులు సప్తర్షులైనారు. వశవర్తి, స్వధామ, శివ, సత్య, ప్రతర్దన అను పేర్లు గల అయిదు దేవగణాలు జనించాయి.
ప్రతి గణంలోనూ పన్నెండుగురేసి దేవతలుండే వారు. స్వశాంతి నామధేయుడు ఇంద్రుడు కాగా అతని శత్రువైన ప్రలంబాసురుడనే రాక్షసుని విష్ణుదేవుడు మత్స్యావతారమును ధరించి సంహరించాడు.
తరువాతి మనువు పేరు తామసుడు. ఆయన పుత్రులు జానుజంఘ, నిర్భయ, నవఖ్యాతి, నయ, విప్రభృత్య, వివిక్షిప, దృఢషుధి, ప్రస్తలాక్ష, కృతబంధు, కృత, జ్యోతిర్ధామ, పృథు, కావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక నామకులు కాగా జ్యోతిర్ధార, దృష్టకావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక, సురాగ, స్వధీయులు సప్తర్షులు.
హర్యాది నాలుగు దేవతాగణాలుండగా శిబి చక్రవర్తి ఇంద్రుడైనాడు. అతని శత్రువైన భీమరథ దైత్యుని శ్రీ మహావిష్ణువు కూర్మావతార మెత్తి సంహరించాడు.
అయిదవ మనువైన రైవతుని పుత్రులు మహాప్రాణ, సాధక, వనబంధు, నిరమిత్ర, ప్రత్యంగ, పరహ, శుచి, దృఢవ్రత, కేతుశృంగులు. ఇతని కాలంలోని సప్తర్షులు వేదశ్రీ, వేదబాహు, ఊర్ధ్వబాహు, హిరణ్యరోమ, పర్జన్య, సత్యనామ స్వధామనామధేయులు.
ఈ మన్వంతరంలో అభూతరజ, దేవాశ్వమేధ, వైకుంఠ, అమృత నామక దేవగణాలు విలసిల్లగా విభుడను మహావీరుడు ఇంద్రుడైనాడు. ఆతని శత్రువైన శాంతశత్రుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు హంస రూపంలో వచ్చి వధించాడు.
ఆరవ మనువు చాక్షుషుడు. ఆతని పుత్రులు ఊరు, పురు, సత్యద్యుమ్న, సత్యబాహు, కృతి, అగ్నిష్టు, అతిరాత్ర, నర, సుద్యుమ్నులు. నాటి సప్తర్షులు హవిష్మన్, సుతను, స్వధామ, విరజ, అభిమాన, సహిష్ణు, మధుశ్రీ మహామునులు.
ఈ చాక్షుష మన్వంతరంలో ఆర్య, ప్రసూత, భవ్య, లేఖ, పృథుక నామక దేవగణాలు విలసిల్లినాయి. మనోజవుడు ఇంద్రునిగా ఎన్నుకోబడినాడు. దేవశత్రువు, దీర్ఘబాహుడునగు మహాకాలాసురుని శ్రీ మహా విష్ణువు హయరూపుడై వధించాడు.
ఏడవ మనువైన వైవస్వతుని పుత్రులు మహావిష్ణుభక్తులైన ఇక్ష్వాకు, నాభ, విష్టి, శర్యాతి, హవిష్యంతి, పాంశు, సభ, నేదిష్ట, కరూశ, పృశాథ, సుద్యుమ్నులు, మహాతపస్సం పన్నులైన అత్రి, వశిష్ట, జమదగ్ని, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు వైవస్వత మన్వంతరపు సప్తర్షులు.
నలభైతొమ్మిది మరుద్గణాలు, ఆదిత్య, వసు, సాధ్య మున్నగు ద్వాదశ దేవగణాలు వర్ధిల్లుతున్నాయి. పదకొండుగురు రుద్రులు, ఎనమండుగురు వసువులు, పదిమంది విశ్వేదేవులు, ఇద్దరశ్వనీ కుమారులు, పదిమంది ఆంగిరులు దేవగణాల్లోవున్నారు. ఇంద్రుని పేరు తేజస్వి. హిరణ్యాక్షుడను దేవశత్రువుని శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి సంహరించాడు.
ఇక రాబోయే మన్వంతరాలను గూర్చి వర్ణిస్తాను. మనవైవస్వత మన్వంతరం తరువాత రాబోతున్నది సావర్ణి మన్వంతరము.
ఆ మనుపుత్రులు విజయ, ఆర్యవీర, నిర్మోహ, సత్యవాక్, కృతి, వరిష్ఠ, గరిష్ట, వాచ, సంగతులు. మహామునులైన అశ్వత్థామ, కృపాచార్య, వ్యాస, గాలవ, దీప్తిమాన్, ఋష్యశృంగ, పరశురాములు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సుతపా, అమృతాభ, ముఖ్య నామక మూడు దేవగణాలుంటాయి. ఒక్కొక్క గణంలో ఇరవైమంది దేవతలుంటారు.
విరోచన పుత్రుడైన బలి చక్రవర్తి దేవేంద్ర పదవినందు కుంటాడు గానీ అతనికి అహంకారం పెరగడంతో విష్ణువే వామన రూపంలో వచ్చి ఆతని నుండి మూడడుగుల దానాన్ని గ్రహించి అడుగుకొక లోకంగా ముల్లోకాలనూ ఆక్రమిస్తాడు. బలి సిద్ధినీ మోక్షాన్నీ పొందుతాడు.
వరుణపుత్రుడైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువుగా వస్తాడు. ఆతని పుత్రులు ధృతికేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, పృథుశ్రవుడు, బృహద్యుమ్నుడు, ఋచీకుడు, బృహదుణుడు అనువారలు. ఈ మన్వంతరంలో మేధాతిథి, ద్యుతి, సవస, వసు, హష్య, కవ్య, విభులు సప్తర్షులు, పర, మరీచిగర్భ, సుధర్ము లిండ్రులుగా ఎన్నికవుతారు. వారి ప్రధానశత్రువైన కాలకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడై వధిస్తాడు.
పదవ మనువు ధర్మసావర్ణి, ఆతని పుత్రులు సుక్షేత్ర, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి, ఇంద్రులు.
ఈ మన్వంతర సప్తర్షులు అయోమూర్తి, హవిష్మన్, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు.
ప్రాణి నాయకులొక వంద దేవగణాల వారుంటారు. మహాబలశాలియు శాంతియను ”పేరుగలవాడును నగు దేవపురుషుడు ఇంద్రుడవుతాడు. అతని శత్రువైన బలియను అసురుని విష్ణువు తన గదతో సంహరిస్తాడు.
పదకొండవ మనువైన రుద్రసావర్ణి కొడుకులు సర్వత్రగ, సుశర్మ, దేవానీక, పురు, గురు క్షేత్రవర్ణ, పుత్ర, దృధేషు ఆర్ద్రక నామకులు.
ఈ మన్వంతరంలోని సప్తర్షులు హవిష్మన్, హవిష్య, వరుణ, విశ్వ, విస్తర, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కామగమ, నిర్మాణ, రుచి అను పేర్లతో నాలుగు దేవగణాలు ఒక్కొక్కటీ ముప్పదేసిమంది దేవతలతో వర్ధిల్లగలవు.
వృషభుడను దేవపురుషుడు దేవేంద్రుడు కాగా ఆతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీరూపమున అవతరించి వధిస్తాడు.
ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు.
తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి పన్నెండవ మనుపదవినధిష్టిస్తాడు. ఆయన పుత్రులు, దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరథ, మిత్రవాన్, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాన్; మిత్రవాహ, ప్రవాహులు.
ఈ మన్వంతరంలో సప్తర్షులుగా తపస్వి, సుతప, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధన, నామధేయులైన మహామునులు: ప్రవర్తిల్లుతారు.
స్వధర్మ, సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ప్రతి గణంలోనూ పదేసిమంది దేవతలూ, మొత్తం జాతికి ఋతధాముడను దేవేంద్రుడూ ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు.
పదమూడవ మనువు రౌచ్యుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరత, ధృతి, సునేత్ర, క్షేత్రవృత్తి, సునయులు. ధర్మ, ధృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుత్సక, నిర్మోహ, సుధర్మ, సుకర్మ దేవగణాలు ముప్పది మూడేసి మంది దేవతలతో వర్ధిల్లుతాయి. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభుడను దైత్యుని శ్రీమహా విష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు.
పదునాల్గవ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గభీర, ధృష్ట, తరస్వీ, గ్రాహ, అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు. అగ్నీధ్ర అగ్నిబాహు, మాగధ, శుచి, అజిత, ముక్త, శుక్రమహామునులు సప్తర్షులు, చాక్షుష, కర్మనిష్ఠ, పవిత్ర, భ్రాజిన, వచోవృద్ధ దేవగణాలు ఒక్కొక్క గణంలో మరల ఏడేసి ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా ఆతని శత్రువైన మహాదైత్య నామక దైత్యుని శ్రీమహా విష్ణువే స్వస్వరూపంలో దిగి వచ్చి వధిస్తాడు.
అరవై రెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹