గయ, గయా శీర్ష మహిమ విశాలుని కథ
వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూతమహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు.
“మహామునులారా! గయకు బయలుదేరదలచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణచేయాలి. తరువాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళుతున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగూ వాని పితరులు స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది.
గృహాచ్చలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి |
స్వర్గారోహణ సోపానం పితౄణాంతు పదే పదే ||
కురుక్షేత్రం,విశాల (బదరీక్షేత్రం), విరజా (జగన్నాథక్షేత్రం), గయాక్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి.
గయలో కనఖల నామక త్రైలోక్య ప్రసిద్ధి గాంచిన తీర్థమొకటుంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు.
మనసులోగాని స్వీయజీవిత చరిత్రలో గాని పాపమున్న వారు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలిక్కడ నిత్యమూ తిరుగుతుంటాయి. అవి పాపాత్ములను రానీయవు.
ఉదీచి తీర్ధంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థముంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయఫలాలనిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్రియలను చేయాలి.
మన పితృగణాలు, కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిష్వాత్త, బర్హిషత్, సోమప నామధేయులు. శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరునాఇలా ప్రార్థించాలి.
కవ్యవాహస్తథా సోమో యమశ్చై వార్యమాతథా |
అగ్నిష్వాత్తా బర్హిషదః సోమపాః పితృదేవతాః ||
ఆగచ్ఛంతు మహాభాగా యుష్మాభిరక్షితా స్విహ |
మదీయాః పితరోయే చకులే జాతాః సనాభయః ||
తేషాం పిండ ప్రదానార్థమాగతో స్మి గయా మిమాం |
ఇలా ప్రార్థించి ఫల్గుతీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవునీ, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితౄణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరల స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడుటే గాక తన తండ్రితో తనతో సహా ఆపై పదితరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి పది తరాల వారిని కూడా ఉద్దరించగలడు.
భక్తుడు, సంప్రదాయ విధేయుడునైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది.
ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకొని అక్కడి మతంగవాసిలో శ్రాద్ధకర్మం, పిండప్రదానం చేయాలి. ధర్మారణ్యంలోకి వెళ్లడం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలమూ, ఆ తరువాత బ్రహ్మ తీర్థం వెళ్ళడం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలూ దక్కుతాయి. తరువాత కూప, యూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ, పిండోదక కృత్యాలను గావించాలి. కూపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి.
మూడవరోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడస్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూప, కూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్నీ పిండప్రదానాన్నీ చేయాలి. తరువాత గో ప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రాహ్మలుంటారు. వారిని పూజించి,సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది.
నాలుగవ రోజు ఫల్గుతీర్థంలో స్నానం చేసి దేవతలకూ పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాలలో పితరులకు శ్రాద్దాలు పెట్టాలి.
ఆ తరువాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలనిచ్చి, సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయు శ్రాద్ధ కర్మలకు అక్షయ ఫలాలుంటాయి.
నవదైవత్య, ద్వాదశ దైవత్యములను పేర్లతో రెండు రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టక అనగా పుష్య, మాఘ, ఫాల్గున మాసాల్లో నవమీ తిథినాడు వృద్ధి చంద్ర నవమీ తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథినాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చేయాలి.
శ్రాద్ధంతు నవదైవత్యం కుర్యాద్ ద్వాదశ దైవతం |
అన్వష్టకాసు వృద్ధాచ గయా యాం మృతవాసరే ||
అత్ర మాతుః పృథక్ శ్రాద్ధ మన్యత్ర పతినా సహ |
దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకొని రుద్రపాదాలను స్పృశించిన వానికి పునర్జన్మ వుండదు.
గశిర తీర్థంలో శ్రాద్ధమును పెట్టడాన్ని మించిన పుణ్యకర్మలేదేమో! ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్విని మూడుమార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ శమీపత్ర పరిమాణంలో పిండాలను తయారుచేసి పెట్టాలి. దాని వల్ల పితృగణాల వారు దేవగణాల వారై పోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానమూ అవసరం లేదు.
త్రిర్విత్తపూర్ణ పృథివీం దత్త్వా యత్ ఫలమాప్నుయాత్ |
సతత్ఫల మవాప్నోతి కృత్వాశ్రాద్ధం గయా శిరే ||
శమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్దయాశిరే |
పితరోయాంతి దేవత్వం నాత్ర కార్యా విచారణా ||
ముండప్ప తీర్థంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసినా ఘన తపశ్శక్తి, అత్యధిక ఫలాలూ కలుగుతాయి.
గయాశీర్ష తీర్థంలో పేరు పేరునా ఎవరెవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో వున్నవారు స్వర్గానికి పోగా, స్వర్గంలో నున్నవారు మోక్షాన్ని పొందుతారు.
ముండపృష్టే పదంన్యస్తం మహాదేవేన ధీమతా |
అల్పేన తపసాతత్ర మహాపుణ్యమవాప్నుయాత్ ||
గయాశీరేతుయః పిండాన్నామ్నా యేషాంతు నిర్వహేత్ |
నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయుః ||
అయిదవ రోజు గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడి అక్షయవటం క్రింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్నీ ఉద్దరించగలరు. అక్షయ వట మూలం వద్ద శాక, ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే కోటిమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది.
ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి, దర్శించి అక్షయ లోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తిశ్రద్ధలతో గావించిన వారి నూరుతరాలు ఉద్దరింపబడతాయి.
ఏష్టవ్యా బహవః పుత్రాయ ద్వేకో పి గయాంప్రజేత్ ॥
ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, ”ఓ వణిజుడా! నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసి పెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనౌతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది” అని చెప్పగా అతడలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలసి గయ అంతా కలయతిరిగి తన పితరులకు పిండప్రదానాలు చేయగా వారంతా, ప్రేతంతో సహా ముక్తులైనారు.
గయ నుండి తన వూరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం, అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరల పుడమిపై పుట్టినపుడు విశాలదేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు ”ఏయే సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానమూ, సుఖజీవనమూ లభిస్తాయి?” అని అడిగాడు. వారు ”విశాల రాకుమారా! గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలూ తీరుతాయి” అని చెప్పారు.
విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ నావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో ముగ్గురు పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి ”మహాపురుషులారా! మీ?’ అని అడిగాడు.
వారిలో శ్వేతవర్ణంలో నున్న పురుషుడు నాయనా విశాలా!నేను నీ తండ్రిని.నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు. నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు.
నీవు గయా శీర్షితీర్థంలో చేసిన పిండప్రదానం వల్ల నేను ప్రేత రూపం నుండీ, వారు నరకకూపం నుండీ విముక్తులమై స్వర్గానికి వెళుతున్నాము. నీకు శుభమగు గాక” అని చెప్పి ఇతరులతోపాటు అంతర్ధానం చెందాడు.
విశాలుడు సమర్ధవంతంగా రాజ్య పాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు.
గయాతీర్థంలో పిండప్రదానం చేసినపుడు ఈ క్రింది మంత్రాలను చదవాలి.
యే స్మత్కు లే తు పీతరో లుప్తపిండోదక క్రియాః |
యే చాప్యకృత చూడాస్తు యేచ గర్భాద్విని స్మృతాః ||
యేషాం దాహో న క్రియా చ యే. గ్నిదగ్ధస్తథా పరే ||
భూమౌ దత్తేన తృప్యంతు తృప్తా యాంతు పరాంగతిం |
పీతా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః ||
మాతా పితామహీ చైవ తథైవ ప్రపితా మహీ |
తథామాతా మహశ్చైవ ప్రమాతా మహ ఏవచ ||
వృద్ధ ప్రమాతా మహశ్చ తథా మాతా మహీపరం |
ప్రమాతామహీ తథా వృద్ధా ప్రమాతా మహీతివై ||
అన్యేషాం చైవ పిండో ఒయ మక్షయ్య ముపతిష్ఠతాం |
”మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నాగయా క్షేత్ర కృత పిండప్రదానాలు అక్షయాలై అందాలి గాక! వారంతా తృప్తులై ముక్తి చెందాలి గాక” అని దీని భావము.
యాబై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹