గయా మాహాత్మ్యము – శ్రాద్ధాది కర్మల ఫలము
క్షేత్రంలోని చోటులేదు. అక్షయ ఫలాలూ బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయ,
గయాయాం నహి తత్నం యత్ర తీర్థం న విద్యతే |
పంచక్రోశో గయాక్షేత్రే యత్ర తత్ర తు పిండదః ||
అక్షయం ఫల మాప్నోతి బ్రహ్మ లోకం నయేత్ పితౄన్ |
స్వపిండాన్ని జనార్దనుని చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.
ఏషపిండో మయా దత్త స్తవ హస్తే జనార్దన |
పరలోకం గతే మోక్షమక్షయ్యముపతిష్ఠతాం ||
గయాక్షేత్రంలో నెలకొనియున్న ధర్మపృష్ట, బ్రహ్మసర, గయా శీర్ష, అక్షయ వట తీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన ఇరవై తరాలను ఉద్ధరించగలడు.
ఇక్కడి మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యమంటారు. దానికి తూర్పులో బ్రహ్మసదం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం ఉన్నాయి. భరతాశ్రమంలోనూ, మతంగ పర్వతం పైనా పితృకర్మలను చేయాలి.
గశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ మహానదీ తీర్ధానికి పశ్చిమంగానూ చంపక వనమొకటుంది. అందులో పాండుశీలయను తీర్థముంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమప్రశస్తం.
ఆ తీర్థానికి దగ్గర్లో నిశ్చిరా మండల మహాహ్రద, కౌశికీ ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధకర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. వైతరణీ నదికి ఉత్తరంలో తృతీయా అను పేరుగల జలాశయమొకటుంది. అక్కడే క్రౌంచపక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టేవానికీ, పితరులకూ స్వర్గం లభిస్తుంది.
క్రౌంచపద తీర్థానికి ఉత్తరంలో నిశ్చిరా నామంతో ప్రసిద్ధమైన జలాశయముంది. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేదీ ఇక వుండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే వుండే వారెంత పుణ్యశాలులో కదా!
మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది; కుటుంబమూ ఉద్ధరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసినవానికి పన్నెండేళ్లు సంధ్యవార్చిన పుణ్యం దక్కుతుంది.
ఒక మాసం అనగా రెండు పక్షాలూ పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నంచేయువాడు తప్పక తనతో బాటు ఏడుతరాల వారినుద్ధరించగలడు. ఇక్కడి ముండపృష్ట, అరవిందపర్వత, క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి. గ్రహణాలలోనూ మకర సంక్రాంతినాడూ గయలో వుండి పిండప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని మూడు లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది వుండరు. అది అతి దుర్లభం.
మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలక్షేత్రం, గృధ్రకూట పర్వత గుహ – ఈ నాలుగు చోట్లా శ్రాద్ధ కర్మ చేసిన వారికి మహా ఫలాలబ్బుతాయి.గయలోని మాహేశ్వరీలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటము నుండి బయలుదేరి గంగ యొక్క ధార వచ్చి ప్రవహిస్తుంటుంది.
ఆ పరమ పవిత్ర మాహేశ్వరీ ధార ప్రవహించే తీర్ధంలో పితృకర్మ చేసినవారు ఋణ విముక్తులౌతారు. (విశాల గూర్చి తదుపరి అధ్యాయంలో వుంటుంది).
గయ వెళ్ళి తమకి పిండంపెడతాడనే ఆశయే మానవులను పుత్రసంతానం కోసం, అవసరమైతే యజ్ఞాలైనా చేసి, ప్రయత్నించేలా చేస్తుంది. గయకి వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారులవైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. ”ఇక మనకి నరకభయం లేద”నే ధీమా వారి మనసంతటా నిండి వుంటుంది.
గయాప్రాప్తం సుతందృష్ట్యా పితౄణా ముత్యవోభవేత్ |
పద్భ్యామపి జలం స్పృష్ట్వా అస్మభ్యం కీల దాస్యతి ||
స్వంతపుత్రులూ, పిండాధికృతులైన వారే కాక అన్య వంశజులు కూడా మృతుల నామ గోత్రాలను చదివి శ్రాద్ధకర్మలను చేయవచ్చును. గయలోని గయాకూపమను పేరు గల పవిత్ర తీర్ధంలో ఎవరి పేరిట పిండప్రదానము చేస్తే వారికే అందడమే గాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది.
ఆత్మణోవా తథాన్యోవా గయాకూపే |
యదాతదా |
యన్నామ్నా పాతయేత్ పిండం తం |
యే బ్రహ్మ శాశ్వతం ||
గయలోని కోటితీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది గలదు.
అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్నీ, గోదానాన్నీ ఇక్కడ చేసినవారు తమతో సహా తమ ఇరువది యొక్క తరాలను ఉద్ధరించగలరు.
యా సా వైతరణీనామ త్రిషు లోకేషు విశ్రుతా ॥
సావతీర్ణా గయా క్షేత్రే పితౄణాం తారణాయ హి ||
గయాతీర్థ యాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలచుకున్నపుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినపుడు ఋత్విక్కులుగా వరించిన బ్రాహ్మణులకే అనగా, ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద, సోమపానక తీర్థాలలో వుంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులౌతారు.
గయా తీర్థంలో హవ్యకవ్యాది పక్వాన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విధ్యుక్తంగా సంతుష్టపఱచాలి. గయలో వృషోత్సర్గం (ఎద్దును స్వేచ్ఛగా వదలివేయుట) చేసిన వారికి నూరు అగ్నిష్టోమయజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు. అది తిలరహితంగా వుండాలి. అన్యులకూ వేయవచ్చును.
ఆత్మనోపి మహాబుద్ధిర్గయాయాంతు తిలైర్వినా |
పిండ నిర్వాపణం కుర్యాదన్వేషామపి మానవః ||
ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధుబాంధవులకైనా, మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండప్రదానాలను చేయవచ్చును.
ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి నూరుగోదానాల ఫలం దక్కుతుంది. మతంగ వాపిలోస్నానం చేస్తే సహస్ర గోదానాల ఫలం దక్కుతుంది. నిశ్చిరా సంగమంలో స్నానం చేసినవాడు తన పితరులను బ్రహ్మలోకానికి గొనిపోగలడు. వసిష్టాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది.
బ్రహ్మ సరోవరానికి దగ్గర్లోనే అగ్నిధారానది ప్రవహిస్తోంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్నే పవిత్రీకరించగలదు. దీనికి కపిలయని మరో పేరు కూడా వుంది. ఇక్కడ స్నానం చేసి, పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించినవానికి అగ్నిష్టోమయజ్ఞ ఫలం లభిస్తుంది.
కుమారధారలో శ్రాద్ధకర్మ చేసిన వానికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి, పూజించి, ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది.
సోమకుండ తీర్ధంలోస్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్త వాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసినవారు సర్వసౌభాగ్య ప్రాప్తి నొందుతారు.
ప్రేతకుండ తీర్ధంలో పిండప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండీ విముక్తి కలుగుతుంది. దేవనది, లేలహాన, మథన, జానుగర్త కాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడ పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వసిద్ధేశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల ఋణాలన్నీ తీరిపోతాయి.”
యాబై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹