మరకతమణి – లక్షణాలు, పరీక్షా విధి
నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకొని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగి పోతుండగా అతని తలపై నున్న మణి ప్రకాశం క్రింద నున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పఱచుకొన్నాయి.సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండు పఱచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడిచేశాడు.
వాసుకి భయపడి పారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్రసుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా, తురుష్క దేశానికి దగ్గరల్లో నున్న ఆ పర్వతం కొండకోనల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలసి సముద్రంలోకి ప్రస్థానించి మహాలక్ష్మి సమీపానికి దగ్గరగా పోగా, అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలో నున్న భూమి మరకతమణులకు ఖజానా అయింది.
వాసుకి పరుగెడుతున్నపుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం (కక్కివేయుట) చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది.
ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మిణుగురు పురుగు వెనుకభాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రంవలెనూ, నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోకకళ్యాణ కారకాలు.
గరుత్మంతుని స్పర్శ వలనయోమో గాని ఇక్కడి మరకతమణులు సర్వవిషవ్యాధులనూ నశింపజేసే శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి దుర్లభాలు; దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకూ, మరెన్నో ఔషధాలకూ లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలై పోతాయి.
గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించునవే ఈ నాటికీ ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొనివున్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని. ఏవైనా వాసుకి వదలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తరువాతనే.
రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకొన్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగరుపొడి వున్నట్టుగా భ్రమింపజేస్తూ.
సూర్యకిరణాలు గానీ వేరే ఉత్తమ కాంతులు గానీ సోకినపుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మద్య భాగం నుండి సూర్యసమాన కాంతులు ఉజ్జ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ వుండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి, వేళ్ళూనుకొని మనను పరవశింపజేస్తుంది.
ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతరమణికీ వుండదు. ఈ లక్షణాలున్న మరకత మణినే సకల సద్గుణవతిగా భావించాలి.
వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛకిరణాలతో కూడుకొని వుంటుంది; దాని ఉజ్జ్వలకాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా వుంటుంది.
(పై లక్షణాలు, కాంతులు వుండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులో మెత్తగా వుండే మరకతమణులు కూడా మంచివే)
చిత్రవర్ణంలో ఉండి, కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తనే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ వుండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా వుండి, మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే… అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడంకాని పెట్టుకోవడం కాని చేయరాదు. భల్లాతకీ, పుత్రికాయని రెండు శైల విశేషాలున్నాయి.
కొన్ని రత్నాలు వాటి రంగుల్లో గాని, వాటి కలగలుపు రంగుల్లో గాని వుంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కావు. అయితే, పుత్రికా వర్ణం క్షేమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కాని మణి చిన్నదై పోయి గాజులా సన్నగా వుంటుంది. అదీ మంచిది కాదు.
కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు కాని లాభం కూడా వుండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు.
శుభఫలితాల కోసం మరకతాన్ని ధరించదలచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గో-సువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకొని పెట్టుకోవచ్చు. అన్ని దేవ, పితృ కర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకత మణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తి, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తి ఈ రత్నానికుంటాయి.ఇది పద్మరాగమణికంటె అధికమూల్యాన్ని కలిగి వుంటుంది.
యాబై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹