Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ఐదవ అధ్యాయం

మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి – సృష్టి విస్తారం

శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస – ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు ఏడుగురు అనగా బర్హిషద, అగ్నిష్వాత్త, క్రవ్యాద, ఆజ్య, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడ ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురూ అమూర్త రూపులు. చివరి నలుగురు మూర్త రూపులు, అంటే కళ్ళకు కనిపిస్తారు.

కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం (కుడి బొటనవ్రేలు) నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతీ, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్యా పుట్టారు. వీరికి శుభ లక్షణాలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు.

దక్షుడు ఒక అసాధారణ రూపవతీ, సుందర సులక్షణ లక్షిత జాతాయగు (తన) ఖ్యాతియను కూతురిని భృగుమహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులూ, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు.

మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండుడు. పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు.

మరీచి – సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలి, కుహూ, రాకా అనుమతి నామక కన్యలు కలిగారు.

అనసూయ అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహప్రజాపతికి క్షమయను పతి ద్వారా కర్మశుడు, అర్ధవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా ఆరువేలమంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు,సూర్యునంత తేజస్సంపన్నులు.

వసిష్ఠునికి పత్ని ఊర్జాద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులుదయించారు. వీరిని సప్తమహర్షులంటారు.

(ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు)

శివశంకరా! దక్షప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్ని దేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమఓజస్వులు

దక్ష కన్యయైన స్వధకుమేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు ‘’బ్రహ్మవాదినులు” మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడూ, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి.

అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వాయంభువమనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వాయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధతేజస్వినీ, తపస్వినీయైన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్నీ క్రమంగా రుచి ప్రజాపతికీ, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకూ దక్షిణయను కూతురూ జన్మించారు. యజ్ఞునికి పన్నెండు మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే ‘యామ’ అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు.

దక్షప్రజాపతికి ప్రసూతి ద్వారా ఇరవై నలుగురు కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన పదముగ్గురు కన్యలను దక్షిణా పుత్రుడయిన ధర్ముడు పత్నులుగా స్వీకరించారు

పరమశివుడు, మరీచి, అంగిరమహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడు, అగ్ని పితరుడు – అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు.

వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శ్రుతుడు, క్రియకు దండలయ, వినయులూ, బుద్ధికి బోధుడూ, లజ్జకు వినయుడూ, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమా, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారలు పుట్టారు. కామదేవునికి రతి పత్నికాగా వారికి హర్షుడుద్భవించాడు.

కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివునీ, సతినీ తప్ప ఇతర బంధువుల నందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్నీ తనకు జరిగిన అవమానాన్నీ తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణ త్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికీ దేవసేనానికీ తల్లియై లోకారాధ్య అయింది.

అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియై పోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాక పాణి శంకరభగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు.

ఐదవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment