Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నలబై ఎనిమిదవ అధ్యాయం

స్త్రీల, పురుషుల సామాన్య లక్షణాలు

పరమేశ్వరాదులారా! మీకిపుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత, భవిష్యత్కాలాలను తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు,కాషాయరంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులౌతారు.పాదాలు శంఖువు ఆకారంలోనున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు అందరాని పొందును వాంఛిస్తుంటాడు.

తలవెంట్రుకలు కుంచితమై వుండేవారికి విదేశంలో మృత్యువు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు రాజు, రాణిలకుంటాయి. గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి.

మోకాళ్ళపై మాంసం ఉండకపోవడం మంచి లక్షణం. అల్పమైన, చిన్నమోకాళ్ళు ప్రేమికులకుంటే, విశాలంగా వికటాకారంలో దరిద్రులకుంటాయి. జానువులు మాంస పరిపూర్ణమై వున్నవారికి రాజ్యప్రాప్తి వుంటుంది. పెద్ద మోకాళ్ళున్న వారు దీర్ఘాయువు లౌతారు.

మాంసపుష్టి గల తుంటి ఎముక, పక్కటెముక ప్రదేశమున్నవారు సుఖపడతారు. సింహసమానమైన ప్రక్కటెముక గలవారు రాజ పురుషులౌతారు. (స్త్రీలకూ అదే స్థాయి దక్కవచ్చు) సింహసదృశ కటి ప్రదేశమున్నవారు పాలకులౌతారు. కోతి కటి వంటి కటి గలవారు నిర్ధనులు.

సమానబాహు మూలములు ఉన్నవారు అత్యధిక భోగవిలాసులౌతారు. అవి క్రిందికి వుంటే ధనహీనులూ, ఉన్నతంగా కానీ విషమంగా కానీ వుంటే కుటిలురూ కాగలరు. చేప కడుపువారు మిక్కిలి ధనవంతులుగా వుంటారు.

విశాలమైన, సుశోభితమైన బొడ్డు గలవారు సుఖజీవనులు కాగా, లోతెక్కువున్న నాభి గలవారు కష్టాలనుభవిస్తారు.

త్రివళుల మధ్య భాగంలో క్రిందికి వంగియున్న బొడ్డుగలవారు శూల రోగగ్రస్తులవుతారు. ఎడమవైపు వంగిన నాభి శక్తి సంపన్నులకూ, కుడివైపు వంగిన బొడ్డ మేధావులకూ వుంటుంది. బొడ్డు ఒక వైపు విశాలంగా వున్నవారు చిరంజీవులూ, ఎత్తుగా నున్నవారు ఐశ్వర్యవంతులూ, అధోముఖంగా వున్నవారు గోధనసంపన్నులూ, పద్మకర్ణిక సదృశనాభి. గలవారు రాజత్వాధికారాలను పొందువారూ కాగలరు.

ఉదరభాగంలో నొక సన్నని మడత (వళి, బలి) గలవారు శతాయువులు, రెండున్న వారు మహాభోగులు. త్రివలీయుక్తులు మహారాజ ఆచార్య పదాధికారులూ, వక్రవళులవారు ఒక గమ్యం లేకుండా జీవించేవారూ కాగలరు.

పక్కలు (ఉదరపార్శ్వాలు) పుష్టిగా, మాంస యుక్తములై వుండుట రాజలక్షణము. కడుపుపై వుండే రోమాలు మృదువుగా కోమలంగా, సమదూరంలోనుండుట రాజలక్షణం. వీటికి విపరీతంగా దట్టంగా, గరుకుగా, విషమంగా రోమాలున్నవారు దూతకర్ములూ, నిర్ధనులూ, సుఖరహితులూ కాగలరు.

గూళ్ళలో (భుజసంధుల్లో) విషమత, ఎముకల కలయికా గలవాడు లేని వాడౌతాడు. అంటే నిర్ధనుడౌతాడు. అవే సంధులున్నతంగా వుంటే భోగీ నిమ్నంగా వుంటే దరిద్రులూ అవుతారు. స్థూలంగా వుంటే ధనికులౌతారు.

పలక వలె నుండు కంఠమున్నవారు నిర్ధనులూ, ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ వుండే కంఠం గలవారు సుఖజీవనులూ కాగలరు. మహిష సదృశ గ్రీవులు వీరులూ, లేడి వంటి మెడ గలవారు. శాస్త్ర పారంగతులూ అవుతారు. శంఖసమాన కంఠమున్నవారు రాజులూ, రాణులూ, పొడవు మెడవారు సుఖులూ, భోజనప్రియులూ అవుతారు.

రోమరహితంగా నున్నగా వుండేపిరుదులుశుభలక్షణం. మరోలా వుంటేఅశుభ లక్షణం. పుష్టిగా, తిన్నగా, విశాలంగా, బలంగా, వృత్తాకారంలో, పూర్తిగా చాచితే మోకాళ్ళందేటంత పొడవుగా భుజాలున్నవారు రాజులో తత్సమానులో అవుతారు. చిన్నభుజాలు నిర్ధనులకుంటాయి. ఏనుగు తొండం వలె నున్న భుజాలు శుభలక్షణం.

భవనంలో వాయు ప్రదేశం కోసమేర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో వుండే వేళ్ళు శుభలక్షణం. చిన్నవేళ్ళు మేధావులకుంటాయి. బల్లపరుపుగా వుండే వేళ్ళు భృత్య లక్షణం. పెద్దవిగా వుండే వేళ్ళునిర్ధన లక్షణం. కృశించిన వేళ్ళుకలవాడు వినయసంపన్నుడై వుంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం, పులి పంజా లాంటి చేతులుబలీయ లక్షణం.

అరచేతి భాగాలు అణగిపోయినట్లుండేవారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా, బలంగా, సుగంధయుక్తగా వుండడం రాజ లక్షణం. ముక్కలుగా, భాగాలు కలిపినట్లుగా, శబ్దం చేస్తూ వుండే మణికట్టు గలవారు నిర్ధనులూ, నీచప్రవృత్తి గలవారూ కాగలరు.

గోళాకారంలో, లోతుగానున్న అరచేతులు ధనవంతుల కుంటాయి. ఉన్నత కరతల మున్నవారు దాతలూ, విషమభాగాలున్నవారు కఠోర మనస్కులూ కాగలరు. లక్క రసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్నవారిలో వ్యభిచరించే లక్షణముంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు.

ఊక (పొట్టు) రంగులో గోళ్ళున్నవారు నపుంసకులౌతారు. కుటిలంగానూ, బద్దలుగానూ గోళ్ళున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్ళున్నవారు తర్కం చేస్తారు. రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ వుండే గోళ్ళున్నవారు రాజులు కాగలరు.

బొటనవ్రేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తి గల వారికుంటుంది; వైభవం కూడా వుంటుంది. అంగుష్ఠ మూలభాగంలో యవచిహ్నమున్న వారికి అధిక పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వేళ్ళలోని పర్వాలు పొడవుగా నున్నవారు పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగళులు దారిద్య్ర సూచకములు.

సఘనాంగళులున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన మూడురేఖలు కరతల భాగాన్ని దాటుకొని పోయి వ్రేళ్ళదాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణము.

అరచేతిలో రెండు మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలూ, దాతలూ అవుతారు; వజ్రాకార ముంటే ధనవంతులు, చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులూ కాగలరు.

మహారాజుల అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాళ చిహ్నాలు. అతులనీయ ఐశ్వర్యం గల మహారాజుల కరతలంపై వుంటాయి.

అరచేతిలో త్రాటి గుర్తున్న వారికి గోధనం మెండుగా వుంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో నున్నవారు కూడా రాజులవుతారు.

చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు; వేదికాకారమున్నవారు ‘అగ్నిహోత్రి’ అనే పదానికర్షులౌతారు; నూయి, దేవకుల్యం, త్రికోణం వున్నవారు ధార్మికులు.

అంగుష్ఠమూలంలో దళసరి రేఖలున్నవారికి కొడుకులూ, పలచటి గీతలున్నవారికి కూతుళ్ళూ ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలందాకా పయనించే రేఖ గలవారు నూరేళ్ళూ జీవిస్తారు. కాని, ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే, చెట్టు మీది నుండి క్రిందపడి మరణిస్తారు.

రేఖలు మరీ ఎక్కువగా నున్న మానవులు దరిద్రులౌతారు. చిబుకం కృశించి పోయినట్లుండుట ధన హైన్యానికీ, మాంస పుష్టితో నుండుట సంపన్నతకీ సూచనలు.

స్నిగ్ధంగా, దిట్టంగా సమానభాగాలలో వుండే సుందర, తీక్షదంతాలు శుభప్రదం. రక్తవర్ణంలో, సమతలంగా, నున్నగా, పొడుగ్గా వుండే నాలుక మంచి లక్షణం, ధనికుల ముఖాలు కొంచెం కోలగానూ, నిర్ధనుల వదనాలు పొడవుగానూ, రాజుల ముఖాలు, సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ వుంటాయి.

పాపకర్ముని మొగము భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపలకలుగానూ వుంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకూ, చిన్నముఖాలు వీనాసులకూ ఉంటాయి. భోగుల ముఖాలు, సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ వుంటాయి.

చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా, ముడుచుకున్నట్లుండి, ఎఱ్ఱని మీసాలతో ఎఱ్ఱని గెడ్డంతో వుంటుంది; స్త్రీముఖంలో గెడ్డం, మీసాలు వుండవు. చిన్న చెవులూ, ఎఱ్ఱని, పెద్ద వెంట్రుకలూ గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు.

శంఖువు ఆకారంలో చెవులున్నవారు రాజులౌతారు గానీ చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులౌతారు. గండస్థలం క్రిందికున్నవారు భోగులౌతారు; పూర్ణంగా, సుందరంగానున్నవారు మంత్రులవుతారు.

సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులవుతారు. శుష్కించినట్లున్న ముక్కుగలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివరి భాగం భిన్నంగా వుండి, నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి, ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు.

పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్యసంపన్నులూ, కుంచించుకుపోయిన నాసిక గలవారు దొంగలూ కాగలరు. చప్పిడిగా అణగిపోయి వున్న ముక్కు అకాలమృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగియున్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోళాలతో, సాపుగా, సొంపుగా వుండే నాసిక చక్రవర్తి కుంటుంది.

వక్ర ఉపాంతభాగాలతో నుండి, పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకీ మధు పింగళవర్ణంలో నేత్రాలు దురాత్ములకీ వుంటాయి. ఎండ్రకాయ కనుల వంటి కనులున్న వాడు(రు) క్రూర కర్ముడౌ (లౌ)తారు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజ లక్షణం.

స్థూలనేత్రాల వారు మంత్రులవుతారు. నీలికమలముల వంటి నయనాలున్నవారు విద్వాంసులూ, నల్లకనులవారు సౌభాగ్యశాలులూ అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములూ, ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులూ కాగలరు. సుందర విశాల నేత్రాలున్న వారు రకరకాల సుఖాల ననుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్ళు అల్పాయుష్కులౌ తారు. విశాలంగా వుండి పైకి లేచే కనులున్నవారు సుఖపడతారు.

కనుబొమ్మలు విషమంగా వుండే వారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా వంపు తిరిగియున్న కనుబొమ్మలు గలవారు. గొప్ప ధనికులై మహాభోగములననుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న, ఖాళీ గల కనుబొమ్మలు నిర్ధనులకూ, బాగా వంగియున్న కనుబొమలు అందని వారి పొందునంద గలిగే వారికీ వుంటాయి. అయితే, వీరికి పుత్ర సంతానముండదు.

నుదురు అర్ధచంద్రాకారంలో వుంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ వుంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తయిన, సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. కిందికీ, లోనికీ వంగిన నుదురున్నవారు చెఱసాల పాలవుతారు.

ఎవరైనా నవ్వినపుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్టులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకొని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికీ అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ.

నూరేళ్ళాయుర్దాయం గలవారి మస్తకంపై మూడు రేఖలుంటాయి. నాలుగు రేఖలు రాజలక్షణం, ఆయుర్దాయం తొంబదియైదు. రేఖారహితమైన లలాట మున్నవారు తొంబది యేళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభిచరించే వారెక్కువ. నుదుటిపై వుండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే, ఆ విధమైన రేఖలున్నవారు ఎనభై యేళ్ళు బ్రతుకుతారు. అయిదు, ఆరు లేదా ఏడు రేఖలున్నవారు యాభై యేళ్ళే జీవిస్తారు. ఏడు కన్న నెక్కువ గీతలున్న వారిలో నలభై సంవత్సరాలు బతికే వారే ఎక్కువ.

బల్లపరుపుగా, అణగినట్లుగా తల వుండే వారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల గలవారికి పాపం వైపే మనసు వెళుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తలవెంట్రూకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షయకరం. అతిశయరక్షత అనగా మొరటుదనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా, రక్తమాంసరహితంగా వుండే అంగాలన్నీ అశుభసూచకాలే. మానవశరీరంలో మూడంగాలు. విశాలంగా, మరో మూడు గంభీరంగా ఒక అయిదు పొడవుగా చిన్నగా, ఆరు ఎత్తుగా నాలుగు పొట్టిగా, మరొకయేడు రక్తవర్ణంలో వుండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు.

నాభి, స్వరం స్వభావం ఈ మూడూ గంభీరంగా వుండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా వుండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల, దీర్ఘంగా ఎత్తుగా వుండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగావుండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు ఈ యేడూ రక్తవర్ణంలో వుండాలి.

దంతాలు, వేళ్ళు, పర్వాలు, గోళ్ళు, కేశాలు – ఈ అయిదూ పొడవుగా వుండాలి. అలాగే స్తనాల మధ్యభాగమూ, రెండు భుజాలూ, దంతాలూ, నేత్రాలూ, నాసికా, దీర్ఘంగా వుండడం కూడా శుభలక్షణాలే.”

స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడీ విధంగా తెలిపాడని విష్ణుభగవానుడూ సూతమహర్షీ ప్రవచింపసాగారు.

“రెండు పాదాలూ నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ వుండే గోళ్ళతో, చిక్కని వేళ్ళతో, ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్జీ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్ళాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు.

గూఢమైన చీలమండలూ, పద్మపత్ర సమానాలైన అరికాళ్లూ శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామె రాణి అవుతుంది. రోమరహిత, సుందర శిరావిహీన, కోలజంఘలున్న స్త్రీ శుభలక్షణం.

విస్తీర్ణ, పుష్టియుక్త, గంభీర, విశాల, దక్షిణావర్త, నాభీ, మధ్యభాగంలో త్రివళులూ ఉత్తమనారీ లక్షణాలు. రోమరహితంగా, విశాలంగా నిండుగా, పుష్టిగా, చిక్కగా, ఒకదాని కొకటి సర్వసమానంగా, గట్టిగా వుండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి. గ్రీవం రోమరహితంగా, ఓష్టం. అధరం అరుణకాంతులమయంగా ముఖం గుండ్రంగా, పుష్టిగా, దంతాలు కుంద పుష్పసమంగా, గొంతు కోయిల గొంతులా, ముఖం దాక్షిణ్య భావ యుక్తంగా, కన్నులు కరుణ రసాన్ని చిప్పిలుతూ వుండే స్త్రీ సర్వజన పూజితకాగలదు. ఇతరుల సుఖాన్ని గుణించే నిరంతరం ఆలోచిస్తూ, సాధింపులూ వేధింపులూ ఎలా చేయాలో, కనీసం, తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు.

నీలికమలాల వలె కళ్ళు, బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమలు, అర్ధచంద్రాకారంలో నుదురు గల స్త్రీకి, సర్వసంపదలూ ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా, సరిసమానంగా పుష్టిగా వుండే చెవులు శుభలక్షణాలు. దట్టంగా వుండే కనుబొమ్మలూ, ఎండినట్లుండే చెవులూ శుభలక్షణాలు కావు.

నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా, ఉంగరాలు తిరిగేజుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలో గాని, అరికాలిలో గాని అశ్వ, హస్తి, శ్రీ, వృక్ష, యూప, బాణ యవ, తామర, ధ్వజ, చామర, హార, పర్వత, కుండల, వేది, శంఖ, చక్ర, పద్మ, స్వస్తిక, రథ, అంకుశాది గుర్తులలో కొన్ని వున్న స్త్రీలు రాజపత్నులవుతారు..

నలబై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment