Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నలబై ఆరవ అధ్యాయం

సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక, హస్త రేఖలాధారంగా వ్యక్తుల ఆయుః పరిజ్ఞానం

మహేశా! ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి, చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను.

అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో వుండి, పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలూ, ముడులూ కనబడకుండా ఎవనికైతే వుంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్న వాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణంలో, ముక్కలు కాకుండా, నల్లగీతలు లేకుండా వుండే గోళ్ళు కూడా రాజలక్షణాలే.

కాలివేళ్ళొకదానికొకటి తగులుతూ వుండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగా నున్నవాడు, తెల్లగా పారల్లాటి గోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టిరంగులో పాదాలున్న వాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు; నల్లనిపాదాల వారు తాగుబోతు; తెల్లని పాదాల వాడు తిండిపోతు.

కాలిబొటనవ్రేలు దిబ్బగా వుండేవాడు భాగ్యహీనుడు; వికృతంగా వుండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నదిగా, విరిగినట్టు వుండేవాడు కష్టాలపాలవుతాడు.

కాలిచూపుడు వేలు బొటన వ్రేలికన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు, అలాగని కామభోగమూ అనుభవంలోకి రాదు.

తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా వుంటే ఐశ్వర్యం పడుతుంది. కాని, బంధనాల్లో వుండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు,రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా వుండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా నున్న వానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి వున్నవాడు ఏ ఆడదాన్నయినా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్ఠమైన పశు, పక్షి (సింహం, ఏనుగు, హంస) గమనము గలవాడు. రాజుగాని గొప్ప ధనికుడు గాని కాగలడు.

కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు ఏడు ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప (కడుపు వంటి) కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహం పీఠం వలె పొడవుగా నుండే పీఠము గల వానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా రోమయుక్తమైయున్న వక్షఃస్థలము గల పురుషుడు శతాయువు, ధనవంతుడునై అన్ని భోగాలనూ అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు.

చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల, వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత, వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు.

ధ్వజం కాని శంఖంగాని వుండే సముద్ర, ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితు డైన రాజు కాగలడు. కుడిచేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు; ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలిక్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖగలవాడు వందేళ్ల దాకా (ప్రస్తుతం కాలంలో జీవిస్తాడు.)

పాము పొట్టవలె పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగా నున్న బొడ్డు గల పురుషునికి ధనధాన్యాలూ సకల భోగాలూ వుంటాయి. పొట్టిగా నీచంగా వుండే నాభి గల వానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి (అనగా బొడ్డుకి పైన కడుపులోపడే సన్నటి మడత) క్రింద విషమంగా వుండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్ధికీ ఎడమవైపు వంగే బొడ్డు శాంతికీ సూచకాలు.

నూరు దళాల కమలానికి వుండే కర్ణికలాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత వున్నవాడు శస్త్రంచే చంపబడతాడు.

రెండున్నవాడు స్త్రీ భోగి, మూడున్నవాడు రాజు లేదా ఆచార్య పీఠము, నాలుగున్నవాడు అనేక పుత్రవంతుడు అవుతారు.

భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా నున్న నరుడు రాజవుతాడు; సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా నున్నవాడు రాజ సమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి, ఎగుడు దిగుళ్ళుగా, ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడి కుంటుంది. వక్షం రెండు వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది.

పుష్టిగా వుండే వక్షఃస్థలం శూర వీర లక్షణం. గడ్డము వంకరగా వుండేవాడు ధనహీనుడు; ఉన్నతంగా సమానంగా వుండేవాడు భోగి. బలంగా లేకుండా అణగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా వుండే మెడ శూర వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా వుంటాడు.

చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల మెడల వలె పొడవుగా నుండి, శుష్కించినట్లుడే మెడ గలవాని వద్ద ధనం నిలువదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాల కలిమి బాహు మూలములకు మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతుని కుంటాయి.

భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికీ ఎగువ దిగువ భుజాలు దొంగకీ వుంటాయి. ఆజానుబాహువులు సర్వశుభ లక్షణం. చేతిపై భాగంలో గోతులున్నవాడికి పిత్రార్జితం లభించదు, పిరికితనం కూడా వుంటుంది. ఎత్తుగా వుండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా వుండే వాడి జీవితం కూడా కలిమి లేముల మయమవుతుంది.

లక్క వలె ఎఱ్ఱనైన అరచేతులు కలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యముండదు. అదే నల్లగా, నీలంగా వుంటే మత్తు పదార్థాలు సేవించే వాడవుతాడు. గరుకుగా వుంటే నిర్ధనుడౌతాడు.

చంద్రమండలము వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు, వంకరగా, ముక్కలనతికినట్లుగా, సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై, మంచి జాతికి చెందిన ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజ లక్షణము.

గొట్టె కోతి ముఖ కవళికలు ధనవంతునికుంటాయి. సాధారణం కంటే పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా వుండకూడదు.

అలాగుండి, దింపుడు కనులు కూడా వుండేవానికి పుత్రసంతానం కలుగదు; కలిగినా మిగలదు. కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు.

కమలదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు. జీవితంలో కూడ శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు; ధనవంతుడై స్వయంకృషితో పైకొస్తాడు. దానిమ్మపూవుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నుల వాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాల మారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు.

తేనెరంగు పింగలవర్ణము కలిసిన కనుల చాయగల వానిని లక్ష్మి ఎన్నడూ విడచి పెట్టదు. గోరోచనము, గురిగింజ, హరతాలము (వేషగాళ్ళు ముఖానికి పూసుకొనే పసుపు రంగు) కలిసిన పింగళవర్ణనేత్రుడు బలవంతుడు ధనవంతుడు.

నుదురు అర్ధచంద్రాకారంలో నున్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం. చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాటమధ్యంలో అయిదు అడ్డరేఖలున్నవారు నూరేళ్ళు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. నాలుగు రేఖలుంటే ఎనభై, మూడుంటే డెబ్బది రెండుంటే అరవై ఒకటుంటే నలభైయేళ్లు జీవిస్తారు. నుదుటిపై ఒక గీతా లేనివారికి పాతికేళ్ళే ఆయుర్దాయము.

ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూల చిహ్నంగాని, పట్టిసం గుర్తుగాని వున్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడునైన రాజు కాగలడు.

శిరస్సు గొడుగులాగ వుండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో వుండి సమానమైన పొడవు వెడల్పులున్న తల గల గలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విర లంగా, స్నిగ్ధమై, కోమలమై, తుమ్మెదల లేదా కాటుక రంగులో నున్న కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు. రాజు కూడా కాగలడు. కఱకుగా బెరుకుగా వుండే కేశాలున్నవాడు, ముందు వైపు ముక్కలగు తల వెండ్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తాడు..

నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment