లగ్నఫలాలు, రాశుల చర-స్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల, ఏడు వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్తకార్యాలు
ఈశ్వరాదులారా! సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో వుంటాడు. ఆయన దినంలో క్రమంగా ఆరురాశులను దాటుకొని పోయి రాత్రిలో కూడా ఆరురాశులను దాటి వస్తాడు.
మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలినీ కర్కాటక లగ్నంలోనైతే వేశ్యా అవుతుంది.
సింహ లగ్నంలో పుట్టినామెకు పుత్రసంతానం అల్పం. కన్యాలగ్నంలో పుట్టిన కలికి రూపవతి; తులా లగ్నంలో పుట్టిన తెఱవ రూపవతీ, ఐశ్వర్యవంతురాలూ కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది.
ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతీ, మకరలగ్నంలోనైతే తనకన్న తక్కువ స్థాయి పురుషుని పెండ్లి చేసుకొనేదీ అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగ పిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్త అవుతుంది.
ఇక రాశుల చర, స్థిర భేదాలు చూద్దాం.
తుల, కర్కాటక, మేష, మకరాలు, చరరాశులు. ఈ రాశులున్నపుడు యాత్రకు వెళ్ళవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిరరాశులు. ఇవి ఉన్నపుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి.
కన్య, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చర, స్థిర-రెండు స్వభావాలూ గల కార్యాలను, విద్వాంసులు, ఈ రాశులున్న కాలంలో చేపడతారు.
యాత్రలను చరలగ్నాలలోనూ, గృహప్రవేశాది స్థిరకార్యాలను స్థిరలగ్నాలలోనూ చేయాలి. దేవతాదుల స్థాపనా, వైవాహిక సంస్కారాలూ ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాలా శ్రేయస్కరం.
పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మూడింటినీ, నందాతిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశిలను భద్రా తిథులనీ, తదియ, అష్టమి, త్రయోదశులను జయాతిథులనీ అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి – ఈ మూడిటినీ రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యమునూ చేయరాదు.
సౌమ్యస్వభావుడైన బుధుడు చర స్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమ తత్త్వములు గలవారు.
చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు (అంటే బుధుడు, గురుడు) శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆది వారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి..
శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియవీరులు బయలుదేరవచ్చును. రాజ్యాభిషేకాలకూ, అగ్ని కార్యాలకూ సోమవారం ప్రశస్తదినంగా పరిగణింప బడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్నీ కూడా ఈ రోజే మొదలెట్టవచ్చు.
గురువారంనాడు వేదపారాన్నీ, దేవపూజనీ, వస్త్రాలంకార ధారణనూ చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికీ, గజారోహణకీ, శనివారం గృహప్రవేశ, గజబంధనాలకీ మంచివి.
నలబై ఐదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹