నిత్యకర్మలు – అశౌచాలు
శాస్త్రవిహితమైన ప్రతి దినకర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడూ బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకొని ధర్మార్థ చింతన చేయాలి.
విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలం లోనే నెలకొనియున్న ఆనంద స్వరూపి, అజరామరుడు, సనాతన పురుషుడునగు విష్ణు భగవానుని ధ్యానించాలి. తరువాత యథావిధిగా శౌచాదిక్రియలను చేసుకొని పవిత్ర నదిలో స్నానం చేయాలి. ప్రాతఃకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్నానము లౌకిక, పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపజేస్తుంది.
రాత్రి సుఖంగా నిద్రించేవారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు, అశుచులూ కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను మొదలు పెట్టాలి.
స్నానం ప్రాతఃకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి, సమస్త విఘ్న, అనిష్టకారిణియైన కాలకర్ణియను శక్తి, దుఃస్వప్న కారణంగా కలిగే చింతలూ, పాపాలూ కడుక్కుపోతాయి. నిజానికి, స్నానం లేని కార్యమేదీ ప్రశస్తం కాదు. అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు. లేదా తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానమంటారు.
బ్రాహ్మ, ఆగ్నేయ, వాయవ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానములారు రకములు. ఏది చేయడానికి తన కధికారముందో దాన్ని మానవులుచేయాలి. మంత్ర సహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకొనేది బ్రాహ్మస్నానము. శిరసు నుండి సిరిపాదము దాకా యథావిధానంగా భస్మంతో అన్ని అంగాలనూ మెత్తుకొనేది ఆగ్నేయస్నానం.
ఇలాగే గోధూళిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకొనేది వాయవ్య స్నానం. ఇది ఉత్తమ స్నానంగా పరిగణింపబడుతోంది. ఎండ వుండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్యస్నానం. సాధారణ జలాలతో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం.
దీనినే మానస ఆత్మ నివేదనమంటారు. బ్రహ్మాకార అఖండ చిత్త వృత్తి అని బ్రహ్మవాదులందరి చేతా సేవింపబడేది కావున దీనినే ఆత్మతీర్ధమని కూడా అంటారు. (తీర్థమంటే స్నానమని అర్థముంది).
స్నానానికి పూర్వం పాలుగారే చెట్టునుండి గానీ, మాలతి, ఉత్తరేను, మారేడు గన్నేరు కర్ర నుండిగాని తీసిన పలు దోముపులతో ఉత్తరం వైపుగానీ తూర్పువైపు గానీ తిరిగి పవిత్ర స్థలంలో కూర్చొని పళ్ళు తోముకోవాలి.
ఆ తరువాత ఆ పుల్లను శుభ్రంగా కడిగి పవిత్రస్థానంలో పారవేయాలి.తరువాత స్నానం చేసి దేవతలకు, ఋషులకూ, పితృగణాలకూ విధ్యుక్తంగా తర్పణా లివ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనకులాగే అంగభూత ఆచమనం చేయాలి.
సంధ్యోపాసనలో అంగరూపంలోనే కుశోదక బిందువులతో, ఆపోహిష్టా… మున్నగు వారుణ మంత్రాలనూ, సావిత్రీ మంత్రాన్ని జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్నీ భూఃభువఃస్వః అనెడి వ్యాహృతులనూ జోడించి గాయత్రిని జపించి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి.
సంధ్య వార్చని ద్విజుడు అపవిత్రుడి క్రిందే లెక్క,
ప్రాంగ్ముఖం సతతం విప్రః సంధ్యోపాసన మాచరేత్ |
సంధ్యాహీనో.. శుచిర్నిత్య మనర్హః సర్వకర్మసు ||
యదన్యత్కురుతే కించి న్నతస్య ఫలభాగ్భవేత్ |
అనన్య చేతసః సంతో బ్రాహ్మణా వేదపారగాః ||
ఉపాస్య విధి వత్సంధ్యాం ప్రాప్తాః పూర్వపరాంగతిం |
యో న్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః ||
విహాయ సంధ్యా ప్రణతిం సయాతి నరకాయుతం |
తస్మాత్ సర్వప్రయత్నేన సంధ్యోపాసనమాచరేత్ ||
సంధ్యోపాసన ద్వారా యోగమూర్తి, పరమాత్మ, భగవంతుడునైన నారాయణుడు పూజితుడవుతాడు. కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు తిరిగి కూర్చుని నిత్య సంయత భావంతో పది లేదా వంద లేదా వేయిమార్లు, వీలును బట్టి, గాయత్రి మంత్ర జపాన్ని చేయాలి.
తప్పనిసరిగా రోజూ వేయిమార్లు గాయత్రి మంత్రజపాన్ని చేయడం సర్వోత్కృష్టమైన దైవకార్యంగా సర్వ వైదిక వాఙ్మయంలోనూ ప్రశంసింపబడుతోంది. గాయత్రి లేక ద్విజుడు లేడు.
ఏకాగ్రచిత్తంతో, ఉదయమే, భాస్కర భగవానుని ధ్యానించాలి. ఋగ్యజుస్సామ వేదాలలో కనుపించు వివిధ సౌరమంత్రాల ద్వారా ఆయనను ధ్యానించి, తలను నేలపై ఆనించి ఈ క్రింది మంత్రాలతో నమస్కరించాలి.
ఓం ఖఖోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే ||
నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణే ||
త్వమేవ బ్రహ్మ పరమమాపోజ్యోతీ రసో మృతం ||
భూర్భువః స్వస్వ మోంకారః సర్వోరుద్రః సనాతనః |
ఈ ఉత్తమ శ్లోకాన్నీ, ఆదిత్య హృదయాన్నీ త్రిసంధ్యలలోనూ చదివాకనే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మరల శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి.
తరువాత అగ్నిని ప్రజ్వలింపజేసి విధివత్తుగా అగ్నిదేవునికి ఆహుతులను ప్రదానం చేయాలి. ఇంటి యజమాని అశక్తుడైనపుడు అతని ఆజ్ఞ మేరకు పుత్ర పత్ని, శిష్య, సహోదరులలో ఎవరో ఒకరు ఈ ఆహుతులనివ్వాలి. మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు. అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు.
తరువాత దేవతలకు నమస్కరించి అర్ఘ్య, పాద్య, చందన, సుగంధ ద్రవ్యానులేపన, వస్త్ర, నైవేద్యాది ఉపచారాలతో పూజించి, తన గురువుగారిని కూడా పూజించాలి. తరువాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్రజపం చేసి అప్పుడు శిష్యులకు చదువు చెప్పాలి.
ఈ చదువులో భాగములే వేదార్ధ ధారణ కలిగించుట, వేదార్థ విచారమును చేయించుట. ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తరువాత చర్చలను చేపట్టుట, ఉపనిషత్ వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించుట మున్నగునవి. ఇదీ ఒక సత్ప్ర్బహ్మణుని ద్వారా సమాజం ఆశించే వరదానం. తరువాత అవసరం మేరకు రాజు వద్దకు గానీ శ్రీమంతుల గృహాలకు గానీ పోయి వారి చేత దైవ, ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి.
మధ్యాహ్నకాలంలో మరల స్నానం చేయాలి. ముందుగానే శుద్ధి చేయబడిన మట్టినీ, పూలనూ, అక్షతలనూ, తిలలనూ, కుశలనూ, ఆవుపేడను ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి. నది, చెఱువు, తటాకము, సరోవరము వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇంక సిద్ధం చేసిన మట్టితో తలనూ శరీరాన్నీ తోముకొని స్నానం చేయాలి. ఆవుపేడను కూడా ఇలాగే వినియోగించాలి.
(అయిదు ముద్దలను ఉసిరికాయలంతేసి తయారు చేసుకోవాలనీ ఈ పంచమృత్తికాపిండాలు లేకుండా స్నానానికి బయలుదేరడమే దోషమనీ శాస్త్రం చెప్పింది).
జలాశయం తీరంలోనే మృత్తికా గోమయాదులను వంటికి పూసుకొని వరుణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరల సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై భక్తి గౌరవాలను కలిగియుండాలి. ఎందుకంటే అది విష్ణు స్వరూపం. ప్రణవస్వరూపుడైన సూర్యుని దర్శిస్తూ మూడుమార్లు జలంలో మునకలు వేయడంతో స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి.
అంతశ్చరసి భూతేషు గృహాయాం విశ్వతోముఖః ||
త్వం యజ్ఞస్త్వం వషట్కార ఆపోజ్యోతీ రసోమృతం ||
ద్రుపదాదివ…అనే మంత్రాన్ని పూర్తిగా మూడుమార్లు జపించి, ప్రణవ, వ్యాహృతులతో సావిత్రీ మంత్రాన్ని మూడుమార్లు ఉచ్చరించాలి. విద్వాంసులు అఘమర్షణ మంత్రాలను కూడా చదవాలి. అనంతరం
ఓం ఆపోహిష్ఠా మయోభువః ఇదమాపః ప్రవహత,
అనే మంత్రాలనూ వ్యాహృతులనూ పఠిస్తూ శరీరాన్ని తుడుచు కోవాలి. మరల ఆపోహిష్టా… ఇత్యాది మంత్రాలనూ అఘమర్షణ మంత్రాలనూ మూడేసి మార్లు జపించడం ద్వారా అఘమర్షణ విధిని పూర్తిచేయాలి. పిమ్మట ద్రుపదాదివ… లేదా గాయత్రి లేదా ‘తద్విష్ణోః పరమం పదం” మున్నగు మంత్రాలను చదవాలి.
ఓంకారాన్ని పలుమార్లుచ్చరిస్తూ శ్రీహరిని స్మరించాలి. అఘమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీటి నుంచుకొని చివర్లో దానిని తలపై జల్లుకొంటే పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుని స్తుతించాలి. పుష్పాంజలిని తలపై పెట్టుకొని సూర్యభగవానుని తలచుకొంటూ మంత్రం చదివి నీటిలో వదలివేయాలి.
ఉదయిస్తున్న సూర్యుని చూడరాదు. విశేష ముద్ర ద్వారానే ఆయనను దర్శించాలి. ఓం ఉదుత్యం…, చిత్రం… తశ్చక్షు…. ఓం హం సః శుచిషద్… అనే మంత్రాలనూ, సావిత్రి మంత్రాన్నీ, సూర్య సంబంధి వైదిక మంత్రాలనూ సూర్యునుద్దేశించి చదవాలి. తరువాత పూర్వాగ్రకు శాసనంపై కూర్చుని సూర్యుని దర్శిస్తూ స్ఫటిక, రుద్రాక్ష లేదా పుత్రజీవ రుండమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రం జపించాలి.
శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొల లోతుననిలబడి ఈ మంత్ర జపాలన్నీ చేసుకోవాలి. లేనివారు పొడిబట్టలు కట్టుకొని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమిపై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారము, స్వాధ్యాయం చేసుకోవాలి.
తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణలివ్వాలి. మంత్ర ప్రారంభంలో ఓం కారాన్నీ, చివర్లో నమఃను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు ”తర్పణలిస్తున్నాను” అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా జంధ్యాన్ని ఉపవీతీ, నివీతీ, ప్రాచీనవీతీ దశలలోకి మార్చుకోవడం మరచిపోరాదు.
క్రోధాదులను మనసులోకి రానీయకుండా పుష్పాలను పట్టుకొని పురుషసూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలూ జలంలో వ్యాపించి వుంటారు. కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజను చేసేవానికి అనగా పూజకునికి సమాహితచిత్తము అత్యంతావశ్యకము. దేవతలందరినీ తలచుకొని ఒక్కొక్కరికీ వేరువేరుగా పుష్పాంజలులను సమర్పించడం ప్రశస్తమైన పూజావిధి.
మునులారా!దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయు పుణ్యప్రదం కానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆదిమధ్యాంతాలలో హృదయంలో హరిని ధ్యానించుకోవాలి.
ఓం తద్విష్ణోరితి… అనే మంత్రాన్నీ పురుషసూక్తాన్నీ మనసులో అనుకుంటూనే వుండాలి. శరణాగతి చేస్తూనే వుండాలి.
విష్ణువు పట్ల అనురక్తచిత్తుడు, శాంతస్వభావుడునైన భక్తుడు తద్విష్ణో…, అప్రేతే సశిరాః అనే మంత్రాలతో పూలనభిమంత్రించి విష్ణువుకి సమర్పించాలి. పంచయజ్ఞలను ఆ దేవదేవుని కంకితంగా నిర్వర్తించాలి.
వైశ్యదేవమే దేవయజ్ఞం. కాకి మున్నగు ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం. బిచ్చగాళ్ళకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలు ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజూ ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితరులకు నిత్యం చేసే శ్రాద్ధకర్మ పితృయజ్ఞమంటారు. ఇది ఉత్తమగతులను ప్రాప్తింపజేస్తుంది. తరువాత బంధువులతో కలసి మౌనంగా భోంచెయ్యాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ అన్నాన్ని నిందించరాదు.
మునులారా! ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసే మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినమూ యథాశక్తి వేదాభ్యాసమూ, పంచయజ్ఞాలూ చేసే వారి పాపాలన్నీ శీఘ్రమే పటాపంచలయిపోతాయి. మోహం వల్ల గాని బద్ధకం చేత గానీ దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తరువాత పంది కడుపున పుడతాడు.
ఇక అశౌచమనగా అపవిత్రము. అపవిత్రము నిత్య పాపవర్ధకము. అపవిత్ర వ్యక్తుల సంసర్గం అశౌచాన్ని తెస్తుంది. వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు.
విద్వాంసులైన బ్రాహ్మణులు మైల పట్టిన పది దినాలనూ అశౌచంగానే పరిగణిస్తారు. ఇవి జనన, మృత్యువుల కారణంగా ఏర్పడతాయి.
మైల నుండి క్షత్రియులు పన్నెండు దినాలకూ వైశ్యులు పదిహేను రోజులకూ శూద్రులయితే ఒక నెలకి శుద్ధులౌతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులూ అశుచి వుంటుంది.
సన్యాసులకు మైల అంటదు. అశౌచముండదు. గర్భస్రావం జరిగిన ఇంట్లో అది ఎన్ని నెలలకు జరిగిందో అన్ని రాత్రుల పాటు అశౌచముంటుంది..
దేవయజ్ఞ, భూత యజ్ఞ, పితృయజ్ఞ, మానుష యజ్ఞ, బ్రహ్మ యజ్ఞాలు పంచయజ్ఞాలు.
ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹