Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ముప్పై మూడవ అధ్యాయం

వర్ణాశ్రమ ధర్మాలు

వర్ణమంటే కులం కాదు. నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ నేడు కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికీ పోలిక లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా అది హస్తిమశకాంతరమే. వర్ణమనగా వృత్తి. అంతే. అనువాదకుడు

వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలేర్పడినాయి. సృష్టి స్థితి లయ కారకులైన దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. హరి అన్ని వర్ణాలకీ హరియే ధర్మాలు వేరు.

యజన, యాజన, దాన, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన ఈ ఆరుకర్మలూ బ్రాహ్మణ ధర్మాలు, దానము, అధ్యయనము, యజ్ఞము- ఇవి క్షత్రియులకూ వైశ్యులకూ కూడా సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవికాక పరిపాలన, దండన క్షత్రియులకూ, వ్యవసాయం (అంటే పొలాల సేద్యం మాత్రమే కాదు, వ్యాపారం కూడా) వైశ్యులకూ విధ్యుక్త ధర్మాలు. పై మూడు వర్ణాల వారినీ సేవించుట ”శూద్రుల ధర్మము.”

ఈ సేవించుట అనే మాటనే పట్టుకొని పెడర్థాలు తీసి అపార్థాలు సృష్టించి, వర్ణం అనే మాటను అర్ధంతో సహా మరుగున పడేసి, ”కులం” అనేమాటను సృష్టించి, అనర్ధం చేశారు పాశ్యాత్యులు. ఆ విధంగా వారు హిందూ. సంఘాన్ని విభజించి పాలిస్తే వారి మానసపుత్రులైన కొందరు భారతీయ మేధావులు ఈ కులతత్త్వాన్ని మరింత ముందుకి సాగదీసుకొనిపోయి ముందుబడిపోయిన వారనీ, వెనుకబడి పోయిన వారని రెండు జాతులను సృష్టించి వారు కలవకుండా జాగ్రత్తపడుతూ రాజకీయ లాభాన్ని పొందుతున్నారు. భారతీయ సమాజంలో ఆదియుగంలో కులాలు లేవు. శూద్రులు ఇతర వర్ణాలను సేవించాలి. అంటే.

నౌకరీ చాకిరీ వారికి చేస్తూ బతకాలని కాదు. వివిధ కర్మల్లో సాయపడాలని మాత్రమే. శూద్రులు తపస్సు చేసి, వేదం చదివి బ్రాహ్మణులగుట బ్రాహ్మణుల చేతనే పూజలందుట పురాణాల్లో కనిపిస్తుంది. నిజానికి ఈ పురాణాన్ని మునులకు చెప్తున్నదెవరు?

అలాగే శూద్రులు రాజ్యాలేలుట వస్తు విక్రయము చేయుట కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అనగా శూద్రులే ఆయా వర్ణాల పనులలో సాయపడి ఆ పనిని బ్రహ్మాండంగా చేయడంతో వారికి ”వర్ణోన్నతి” ని కల్పించి వారిని ఆ వర్ణము వారినిగా గుర్తించి వుంటారు. కాబట్టి హిందువుల్లో కులాల్లేవు. ఇప్పటి కులపు లెక్కలే ”అప్పట్లో” వుండుంటే మహాపద్మనందుడూ, చంద్రగుప్తుడూ మగధ రాజులూ, భారత సమ్రాట్టులూ కాకూడదు కదా! శ్రీకృష్ణుడు భగవంతుడే కాకపోనేమో! వర్ణాలు వర్ణాలే. కులాలు కులాలే.

శిల్ప రచన, పాకయజ్ఞ, సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యాశ్రమాన్ని జీవితపు తొలినాళ్ళలో అందరూ పాటించాలి.

భిక్షాచరణ, గురు శుశ్రూష, స్వాధ్యాయము, సంధ్యావందనము, అగ్ని కార్యము. ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులలో రెండు రకాల వారుంటారు. మొదటి రకం ఉపకుర్వాణులు. అంటే శాస్త్రోక్తంగా వేదాదులను ఇతర విద్యలను అధ్యయనం చేసి స్నాతకులై గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు.

రెండవ విధం నైష్ఠికులు – అంటే స్నాతకులైన తరువాత కూడా గురుకులంలోనే వుండి చదువుతూ, ఆ చదువునే బోధిస్తూ, బ్రహ్మజ్ఞానతత్పరులై, సాధకులై మృత్యుపర్యంతము గురుకులంలో వుండిపోయేవారు.

అగ్నికార్యము, అతిథిసేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలు ఇవి గృహస్థుల సంక్షిప్త ధర్మాలు. గృహస్థులలో సాధకులనీ, ఉదాసీనులనీ రెండు ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలలోనే మగ్నుడై వుండేవాడు సాధకుడు. పితృ, దేవ, ఋషి, ఋణాలను తీర్చుకొని, ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు. వీనిని మౌక్షికుడంటారు.

ఇక వానప్రస్థం. బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. ఈ దశలో భూశయనం, ఫల మూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యధోచితంగా పంచి ఇచ్చుట ధర్మాలు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ, దేవార్చన, ఆహుతి ప్రదానం విస్తూ, స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ వుండే వానప్రస్థి తాపసోత్తమునిగా పరిగణింప బడతాడు. తపస్సుద్వారా, శరీరాన్ని శుష్కింపజేసి నిరంతరం భగవతాధ్యానంలో వుండే వానప్రస్థి చివరికాలంలో సన్యాసిగా గౌరవింపబడతాడు.

వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. సన్యాసాశ్రమం వేరు. భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసానురక్తుడై బ్రహ్మప్రాప్తి కోసమే ప్రయాసపడుతూ, జితేంద్రియుడై జీవించువానిని “పారమేష్టిక సన్యాసి” అంటారు.

ఎల్లప్పుడూ ఆత్మతత్త్వానుసంధానం పైననే ప్రేమను చూపిస్తూ, నిత్యతృప్తులై సంయమ నియమాలతో జీవిస్తూ, మహామునులుగా, యోగులుగా, ప్రతిష్ఠితులైన సన్యాసులను ”భిక్షు” శబ్దంతో గౌరవిస్తారు.

భిక్షాచరణము, వేదాధ్యయనం, మౌనావలంబనము, తపము, ధ్యానము, సమ్యక్ జ్ఞానము, వైరాగ్యము ఇవి సన్యాసాశ్రమి యొక్క సామాన్యధర్మాలు. జ్ఞాన సన్యాసులనీ, వేద సన్యాసులనీ, కర్మసన్యాసులనీ పారమేష్ఠిక సన్యాసులు మువ్విధాలు. అలాగే యోగులలో కూడ ప్రారంభి, భౌతిక, అంత్యాశ్రమీ స్థాయులున్నాయి.

వీరందరికీ ఆరాధ్యమూ, ఆశ్రయమూ ఒకటే- యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ. మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అర్ధం వల్ల కామమనే పురుషార్ధం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి, యని రెండు విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. వేద, శాస్త్రానుసారము అగ్ని మున్నగు దేవతలనూ, గురు, విప్రాదులను ప్రసన్నం చేసుకోవడానికి చేయబడు కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా, విధిపూర్వక కర్మానుష్టానం ద్వారా చిత్తశుద్ధినీ, ఆత్మజ్ఞానాన్నీ కలిగింపజేసేవి నివృత్తి కర్మలు, క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ సరలత, అనసూయత, తీర్ధానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియనిగ్రహ, దేవార్చనలూ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశున్యం, (దర్జా) ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సామాన్య ధర్మాలు.

క్షమాదమో దయా దాన మలో భో భ్యాస ఏవచ ||

ఆర్జవంచాన సూయాచ తీర్ధాను సరణం తథా |

సత్యం సంతోష ఆస్తిక్యం తథా చేంద్రియ నిగ్రహః ||

దేవతాభ్యర్చనం పూజా బ్రాహ్మణానాం విశేషతః |

అహింసా ప్రియవాదిత్య
మపై శున్య మరూక్షతా ||

ఏతే ఆశ్రమికా ధర్మా శ్చాతుర్వర్ణ్య బ్రవీమ్యతః ||

ఇపుడు ఈ చతుర్వర్ణాలవారూ చేరుకొనే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు ప్రాజాపత్య లోకప్రాప్తి నొందుతారు. యుద్ధంలో పారిపోకుండా, తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు ఇంద్రస్థానాన్ని పొందగలరు.

నిత్యమూ తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు మరుద్ దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు గంధర్వలోకం ప్రాప్తిస్తుంది.

ఊర్ధ్వ రేతస్కులై, బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి వందల యేళ్ళ తపస్సు ద్వారా బ్రహ్మలోకంలో నొక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు ఎనభై ఎనిమిది వేలమంది మన భారతీయ పరంపరలో వున్నారు. ఆ స్థానమే గురుకుల నివాసియైన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి దేహాంతంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది. పునర్జన్మ వుండదు. ఆమోక్ష పదం పరబ్రహ్మ వ్యోమమనీ, ఈశ్వర సంబంధి పరమానంద నిలయమనీ, అమృతస్థానమనీ చెప్పబడింది. ఇదే ముక్తిపదం అష్టాంగమార్గ సమ్యక్ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది. వాటిని గూర్చి వినండి.

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఈ అయిదింటి ని”యమ” (సునియమ) ములంటారు. ప్రాణులను బాధింపకుండుట అహింస, ప్రాణుల హితమునకే వాడబడు వాక్కు (సత్యము), ఇతరుల వస్తువులను కోరకుండుట, వాడకుండుట అస్తేయము, లైంగిక సంబంధము లేకుండ జీవించుట బ్రహ్మచర్యము, తనకున్నదంతా త్యాగం చేయడం అపరిగ్రహం”.

శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ప్రణిధానములనబడు అయిదింటినీ నియమములంటారు. శౌచమనగా శరీరాన్నీ పరిసరాలనూ మనస్సునూ పరిశుభ్రంగా వుంచుకొనుట. సంతోషమనగా తుష్టి, ఇంద్రియ నిగ్రహమే తపము, మంత్రజపమే స్వాధ్యాయము. భగవత్ పూజ నాదికములు ప్రణిధానము.

పద్మాది ఆసనములను భక్తితో వేసి జపము చేయుట ఆసనసాధనము. వాయువును నిరోధించి క్రమబద్ధీకరించడం ప్రాణాయామం. మంత్రోచ్ఛారణ చేస్తూ దేవధ్యానంలో వుండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామమంటారు. అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భప్రాణాయామమంటారు. వీటిలో మరల వాయువును లోపలికి పీల్చి అలాగే వుండి పోవడాన్ని పూరకమనీ, వాయువును పీల్చుట నాపి దేహాన్నీఇంద్రియాలనూ స్థిరంగా వుంచడం కుంభకమనీ, అంతవఱకు లోపల ఆపిన వాయువును మెలమెల్లగా బయటకు వదలుట రేచకమనీ వ్యవహరింపబడుతున్నాయి.

ప్రణవ (ఓంకార) జప ప్రక్రియలో ”మాత్ర” (అంటే రెప్పపాటు కాలం)కి విశేష మాహాత్మ్యముంది. ఆ మాత్రానుసారము పన్నెండుమార్లు ప్రణవ జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశమాత్రిక (లఘు) అనీ, ఇరవై నాలుగు మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రిక (మధ్యమ) అనీ, అదే ముప్పదియారు పర్యాయములైతే ”షట్” త్రింశన్మాత్రిక (ఉత్తమ) అనీ అంటారు.

ఈ యామాల్లోనే నిరోధం ప్రత్యాహారం, బ్రహ్మచింతన ధ్యానం, మనోధైర్యం ధారణ, ఇవి పారిభాషిక పదాలు, అహంబ్రహ్మ నేను బ్రహ్మను అను అభేదజ్ఞానంతో బ్రహ్మరూపంలో ప్రవేశించి నిలిచి పోవడమే సమాధి. తరువాత ఆనంద స్వరూపుడైన పరమాత్మను తత్త్వమసి అను శ్రుతి ద్వారా తెలుసుకోవడమే బ్రహ్మానందము.

”నేను అశరీరిని, ఇంద్రియాతీతుడను. మనోబుద్ధ్యహంకారాల నుండి జాగృతుడను, జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థల నుండి ముక్తుడను, బ్రహ్మ యొక్క తేజః స్వరూపమేదైతే వుందో అదే నేను. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్య, ఆనందస్వరూప, అద్వయ అనే లక్షణాలున్న ఆదిత్య పురుషుడు, పూర్ణ పురుషుడు నేనే” అని భావించుకుంటూ సమాధి నుండి ఆత్మ విడివడి ఊర్ధ్వలోకాలకు పోయి బ్రహ్మలోకంలో నిలిచిపోతుంది. ఆ వ్యక్తి ముక్తిని పొందాడని అర్థం. ఇది తపస్సు.

ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment