Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఒకటవ అధ్యాయం

ప్రాసాద లక్షణాలు

దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తువిదుని పర్యవేక్షణలో అరవై నాలుగడుగుల పొడవు, అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారుచేయాలి. దానిలో నలభై ఎనిమిది అడుగుల మేరను పిట్టగోడలను కట్టి వుంచాలి. నలుదిక్కులలోనూ మొత్తం పన్నెండు ద్వారాలనేర్పాటు చేయాలి.

మనిషికిలాగే దేవాలయానికీ జంఘ వుంటుంది. ఇది మనిషి తొడకి రెండున్నర రెట్ల పరిమాణంలో వుంటుంది. దీనిపైనే గర్భగుడి నిర్మింపబడుతుంది. దీనిని నిర్మించి మూడు లేదా అయిదు భాగాలు చెయ్యాలి. జంఘపై నిర్మింపబడు గర్భగుడి భాగ విస్తార.. పరిమాపము అనగా కట్టడమును ”శుక్రాంఫ్రి” అంటారు. దీని ద్వారపు ఎత్తు శిఖరపు యెత్తులో సగముండాలి.

నాలుగు శిఖరాలను తయారు చేసి వాటిలో మూడవభాగపు కొలతలో వేదిబంధనం చేయాలి. నాలుగవ భాగంలో మరల ప్రాసాదం కంఠభాగాన్ని నిర్మించాలి. నాలుగు శిఖరాల మధ్యంలో పైకి వుండే భాగాన్ని కంఠభాగమంటారు.

మరోలా కూడా చేయవచ్చు. భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి ఖండాన్ని పదహారు సమాన భాగాలుగా చేసి వాటిలో నాలుగవ ముక్కలో గర్భగుడిని నిర్మించి, మిగిలిన పన్నెండు భాగాలనూ పిట్టగోడచే ఆవృతం చేయించాలి. ఈ చతుర్థభాగం ఎత్తును అనుసరించే మిగతా అన్ని భాగాల కొలతలూ నిర్ణయింపబడతాయి. భిత్తి (గోడ)కి శిఖరం రెండింతల ఎత్తు. ప్రదక్షిణభాగం విస్తృతి శిఖరం ఎత్తులో చతుర్థాంశం.

దేవప్రాసాదానికి నాలుగు దిక్కులలోనూ బయటికి పోడానికి ద్వారాలుండాలి. ద్వారం గర్భగుడి గోడలో అయిదవ వంతు కొలతలతో నుండాలి. గర్భగుడిలో ప్రతి అంశము యొక్క కొలతలూ వాస్తు శాస్త్రాన్ని అనుసరించే వుండాలి. ఎక్కడా ఏ మాత్రమూ తేడా ఉండరాదు.

ఇక లింగ నిర్మాణ పరిమాణం.

లింగపు కొలతలను బట్టే దాని పీఠం కొలతలుండాలి. పీఠభాగానికి రెండింతల పరిమాణంలో దానికి నలువైపులా గర్భభాగం వుండాలి. పీఠగర్భాన్ని అనుసరించి దాని గోడ, ఆ గోడ విస్తీర్ణంలో అర్ధభాగం కొలతలో లింగపీఠము యొక్క జంఘభాగము కట్టబడాలి. దానికి రెండింతల ఎత్తు శిఖరానికుండాలి. ద్వారాలు నాలుగు హస్తాల (ఆరడుగుల పొడవుండాలి. (ఇదే వాస్తు చెప్పే అష్టభాగం )

ద్వారంలాగే పీఠమధ్యభాగం కూడా ఛిద్రయుక్తంగానే వుండాలి. పాదిక, శేషిక, భిత్తి, ద్వార పరిమాణాలను అనుసరించియే అర్థ అర్ధ పరిమాణ దూరాల్లో అన్నిటినీ నిర్మించాలి. ఆ గర్భ భాగ విస్తృతికి సమానంగా మండప జంఘా భాగాన్ని నిర్మించి దానికి రెండింతల పరిమాణంలో ఉన్నత శిఖరభాగాన్ని కట్టాలి. శుక్రాంఘి భాగాన్ని ఇదివఱకటిలాగే కట్టి పై ద్వారాన్ని ఎత్తులోనే వుంచాలి.

ప్రాసాదానికి నాలుగు వైపులా ఒక అడుగు పరిమాణంలో పునాదిని నిర్మించి వుంచాలి. దీనిని ”నేమి” అని కూడా అంటారు. గర్భగుడికి ఈ నేమి రెండింతలుండాలి. ప్రహరీ గోడకి రెండింతల ఎత్తులో శిఖరముండాలి.

లక్షణాలను బట్టి ప్రాసాదాలనేక ప్రకారాలుగా వుంటాయి. ఇలా : వైరాజ, పుష్పక, కైలాస మాలిక (మాణిక), త్రివిష్టప. ఇవి క్రమంగా చతురస్ర, ఆయత, వృత్త, వృత్తాయత, అష్టకోణాకారాలలో వుంటాయి.

వైరాజ నామక ప్రాసాదంలో మరల తొమ్మిది ప్రకారాల చౌకోర ప్రాసాదాలు నిర్మింప బడుతున్నాయి. అవి మేరు, మందర, విమాన, భద్రక, సర్వతోభద్ర, రూచక, నందన, నందివర్ధన, శ్రీవత్సములు.

పుష్పక నామక ప్రాసాద నిర్మాణ కళలో ఈ క్రింది తొమ్మిది రకాలున్నాయి. వలభి, గృహరాజ, శాలగృహ, మందిర, విమాన, బ్రహ్మమందిర, భవన, ఉత్తంభ, శివికావేశ్మ.

కైలాస ప్రాసాద నిర్మాణ కళనుండి వలయ, దుంధుభి, పద్మ, మహాపద్మ, ముకులీ, ఉష్ణపీ, శంఖ, కలశ, గువావృక్ష మున్నగు ప్రకారాలుద్భవించాయి. అలాగే గజ, వృషభ, హంస, గరుడ, సింహ, సమ్ముఖ, భూముఖ, భూదర, శ్రీజయ, పృథివీధర మాలికా నామక వృత్తాయత ప్రాసాద కళా ప్రాదుర్భూతములు ఇవి.

అలాగే త్రివిష్టప శిల్పకళ నుండి వజ్ర, చక్ర, ముష్టికవభ్రు, వక్రస్వస్తిక, ఖడ్గ, గదా, శ్రీవృక్ష, విజయ, శ్వేత ప్రకారాల ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి. ఇవేకాక త్రికోణ, కార, అర్ధచంద్రాకార, చతుష్కోణ, షోడశకోణీయ ప్రకారాల ప్రాసాదాలను ఒక నిర్దిష్ట ఫలం కోసం, క్రమంగా, రాజ్య, ఐశ్వర్య, ఆ యువర్ధన, పుత్ర, లాభ, స్త్రీ ప్రాప్తిల కోసం ప్రత్యేక మండపాలతో నిర్మిస్తారు.

ముఖ్యద్వార స్థానంలోనే ధ్వజాదులనూ గర్భగృహాన్నీ నిర్మించాలి. సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలలో మండపాన్ని నిర్మిచంచి అందులో నాలుగవ వంతు కొలతలతో నొక భద్రగృహాన్ని నిర్మించాలి. భద్రగృహంలో కిటికీలుండవు. ప్రాసాదంలో ఏర్పాటు చేసే లతా మండపానికి భూమిని, విషమంగానూ అనేక రంగులతోనూ చేయాలి. పరిమాణపు లెక్కలు అవసరం లేదు. విషమరేఖలతో అలంకరించాలి.

ప్రాసాదము యొక్క ఆధారభూమి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలతో నాలుగు మండపాలతో సుశోభితమై వుండాలి. నూరు శృంగాల (బురుజు స్తంభాల)తో వుండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదమంటారు. ఇది ఉత్తమం. ఇందులో ప్రతిమండపానికీ మూడేసి భద్రగృహాలుండాలి.

ఇవేకాక ఎన్నో రకాల దేవ ప్రాసాదాలున్నాయి. స్వయంభూదేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు.

చతురస్ర ఆలయాలలో చంద్రశాలయుక్తాలైన అరుగులుండాలి. వాటికెదురుగా ఆయా దేవతల వాహనాలకై లఘు మండపాలను నిర్మించాలి.

దేవప్రాసాదాలలో ద్వారానికి దగ్గరగా నాట్యశాల వుండాలి. ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మింపబడాలి. ఆలయానికి దగ్గర్లోనే అందులోనే పని చేసేవారికి ఇళ్ళు కట్టించాలి.

మన దేవాలయాలు కళలకు కాణాచులు. నాట్యం, సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ వుండాలి. సంస్కృత వ్యాకరణం, ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులు అక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మబంధువులగా ఎదగాలి. విద్యాలయాలలో జీతం పుచ్చుకొని పనిచేయడం విద్యాదానం కాదు. కోవెలలో కోటి విద్యలను కాకున్నా తమకి వచ్చిన కొన్ని విద్యలను విద్యార్హులైన విద్యార్థులకు నేర్పడం ద్వారా గురువులు (టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు) సార్థక జన్ములౌతారు. దేవాలయాన్ని నిర్మించినపుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్నీ కేటాయించి, ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూమతం.

ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment