బ్రహ్మమూర్తి ధ్యాన నిరూపణం
పవిత్రకంతో భగవానుని పూజించి, ఆ పై శాస్త్రోక్తంగా బ్రహ్మను ధ్యానించిన సాధకుడు హరి సమానుడవుతాడు. (అంటే నా స్వరూపమే వానికీ వస్తుంది). మాయా జాలాన్ని ముక్కలు చేసే బ్రహ్మధ్యానాన్ని వినిపిస్తాను.
ప్రాజ్ఞుడు అనగా విశేష సాధకుడు తన వాణినీ, మనసునీ అదుపులో పెట్టుకొని తన ఆత్మలో జ్ఞాన స్వరూపుడైన బ్రహ్మ కోసం యజ్ఞం చెయ్యాలి. జీవ-బ్రహ్మల అభేద దర్శనాన్ని వాంఛించి, దానికోసం తపము చేసి మహద్ బ్రహ్మజ్ఞాన భావనను కొంతకాలం పాటు భావించాలి.
బ్రహ్మధ్యానమే సమాధి. ”అహం బ్రహ్మాస్మి” అనే స్థాయికి చేరుకోవడం సమాధి ద్వారానే సాధ్యం. తనకంటే భిన్నుడు కాని బ్రహ్మను తురీయ రూపుడని కూటస్థ నిరంజన పరబ్రహ్మయని వేదాలు వర్ణించాయి.
ఈ స్థితిని చేరుకోగలిగిన సాధకుడు దేహ, ఇంద్రియ, మనోబుద్ధ్యహంకారాలు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, (గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు) వివిధ గుణ, జన్మ, భోజన శయనాది భోగాలు- వీటన్నిటికీ అతీతుడవుతాడు.
మానవుడు తన శరీరాన్ని రథంగానూ, ఆత్మను రథిగానూ ఊహించుకోవాలి. బుద్ధి సారథి, మనస్సు త్రాడు ఇంద్రియాలు గుఱ్ఱాలు.
ఇంద్రియాలు, మనసు, ఆత్మలను కలిపి ”భోక్త” అనే మాటతో గుర్తించారు మనీషులు. ఇంద్రియాలను జ్ఞానసహాయంతో అదుపులో పెట్టుకొనేవారే పరమపదాన్ని చేరుకోగలరు. స్వర్ధుని (అజ్ఞాన ప్రవాహం)ని దాటి విష్ణువు లేదా పరబ్రహ్మనందుకోగలరు.
అహింసాది ధర్మాలూ, యమ శౌచాది కర్మ నియమాలూ ఈ పరమ యోగ సాధనానికి సోపానాలు. పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ప్రాణాయామం చేయాలి. ప్రాణ, అపానాది వాయువులపై విజయాన్ని పొందడమే ప్రాణాయామమనబడుతుంది. ధారణ చేయాలి. మనస్సును నియంత్రితం చేసుకోవడమే ధారణమనబడుతుంది. సమాధిగతులు కావాలి.
మనస్సును బ్రహ్మపై లగ్నం చేయడమే కాక ఆయనలో కేంద్రీకృతం చేయాలి. ఇది సమాధి అనబడుతుంది. ఈ సమాధి కుదరకపోతే బ్రహ్మమూర్తి (ఆకారం)ని ఈ రకంగా ఊహించుకొని ప్రార్ధించాలి.
హృదయకమల కర్ణికా మధ్యంలో వెలిగేవాడు, శంఖ, చక్ర, గదా, పద్మములచే సుశోభితుడు, శ్రీవత్స చిహ్నుడు, కౌస్తుభ, వనమాల,లక్ష్మీ(కళ)లచే అలంకృతుడు, నిత్య శుద్ధుడు, ఐశ్వర్య సంపన్నుడు, సత్య, పరమానంద స్వరూపుడు, ఆత్మ, జ్యోతి స్వరూపుడు, ఇరవై నాలుగు విభిన్న ఆకారాలలో అవతరించినవాడు, శాలగ్రామాలలో ద్వారకా శిలలలో నివసించేవాడు, పరమేశ్వరుడు అయిన పరమాత్మయే ధ్యాన యోగ్యుడు. బ్రహ్మ నేనూ బ్రహ్మనే. అహం బ్రహ్మాస్మి.
ఈ రకంగా సర్వయమ నియమాలనూ పాటిస్తూ ఏకాగ్రచిత్తంతో యోగసాధనతో ధ్యానం చేసి పరమాత్మను తనలోనే చూడగలిగేవాడు కోరుకుంటే ఏదైనా దొరుకుతుంది. అతడు “వైమానిక దేవుడై పోతాడు. నిష్కాముడై ఈ బ్రహ్మమూర్తిని ధ్యానిస్తూ ముక్తినొందుతాడు.
ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹