Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – పదిహేనవ అధ్యాయం

ప్రాణేశ్వరీ విద్య (సర్ప విష, దుష్ట ఉపద్రవ హారం)

సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది.

“ఋషులారా! ఇపుడు మీకు పరమ శివుని ద్వారా గరుత్మంతుని కుపదేశింపడిన ప్రాణేశ్వర మహా మంత్రాన్ని విన్నవిస్తాను. ఐతే, దానికి ముందు ఏయే స్థానాల్లో, సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం.

శ్మశానం, పుట్ట, పర్వతం, నుయ్యి, చెట్టు తొఱ్ఱ- వీటిలో నివసించే పాము కాటువేసినపుడు ఆ వేసిన చోట మూడు ప్రచ్ఛన్నరేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్టి రోజున, కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైనవారు బ్రతకరు. కటి, కణత, సంధిభాగాలు, ముఖము, గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది.

ఆ దివాకర – భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం వుంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాల చక్రధారంగా గ్రహాలను కాలసర్పాలను ఈ విధంగా జోడించారు.

శేషుడు – సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు మంగళుడు, కర్కోటకుడు – బుధుడు,పద్ముడు – గురుడు, మహాపద్ముడు శుక్రుడు, శంఖుడు – శని, కులికుడు – రాహువు.

రాత్రయినా పగలైనా బృహస్పతి (గురుడు) భోగకాలం వచ్చినపుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాముకాటుకి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగమూ అంతే.

రాత్రి, పగళ్ళ గణన ముప్పది – ముప్పది ఘటికలలో వుంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రములో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ళ బొటన వ్రేళ్ళలోనూ, విదియనాడు కాళ్ళపైనా, తదియనాడు మోకాళ్ళలోనూ, చవితినాడు వాటికి నా పంచమినాడు తొడల మధ్యలోనూ, షష్ఠినాట నాభిలోనూ, సప్తమినాడు ఛాతీపైనా, అష్టమినాడు స్తనాలలోనూ, నవమినాడు గొంతుపైనా, దశమినాడు ముక్కుపైనా, ఏకాదశినాడు కన్నులలోనూ, ద్వాదశినాడు చెవుల వద్దనూ, త్రయోదశినాడు కనుబొమ్మలు మధ్యలోనూ, చతుర్దశినాడు కణతలపైనా, పున్నమి అమావాస్యలలో మస్తకంపైననూ మానవులలో నివాసముంటాడు.

చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చును. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు కానీ సాధకుడు శరీర మర్ధన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు.

ఓం హంసంః అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమ మంత్రం. విషరూపంలో నున్న పాపాన్ని నశింపజేసే శక్తి గల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో నాలుగు ప్రకారాలున్నాయి. మొదటిది బీజ బిందువుతో, రెండవది అయిదు స్వరాలతో, మూడవది ఆరు స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి వుంటాయి.

ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులేస్వాహా అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహా మంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్పవిషాలను విరిచి ప్రాణులను కాపాడదలచుకున్న సాధకుడు ముఖంలో ”ఓం”నూ కంఠంలో ”కురు”ను ఇరుగుల్భాలలో ”కులే” నీ రెండు పాదాలపై ”స్వాహా” మంత్రాన్నీ శాశ్వతంగా న్యాసం చేయించుకొని వుండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గృహాలలో పాములు నిలువలేవు.

ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో వేయిమార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయముండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు. దేవతలూ, అసురులూ ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైనారు.

ఒక అష్టదళపద్మాన్ని చిత్రించి ఓం సువర్ణరేఖే కుక్కుట విగ్రహరూపిణి స్వాహా అనే మంత్రములోని రెండేసి అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి. ఆ తరువాత ఓం పక్షి స్వాహా అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాముకుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమౌతుంది.

ఓం పక్షి స్వాహా అనేది కూడా సాధకుల పాలిటి కల్పవృక్షము. ఈ మంత్రం ద్వారా బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా కరన్యాసమూ, ముఖ, హృదయ, లింగ, పాదభాగాలపై అంగన్యాసము చేసియున్న వ్యక్తి యొక్క నీడనైనా, కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి.

ఈ మంత్రాన్ని ఒక లక్షమార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపార చూస్తే చాలు; ఆ వ్యక్తిలోని కెక్కిన విషం దిగిపోతుంది.

”ఓం హ్రీం హ్రాం హ్రీం భి (భీ) రుండాయై స్వాహా”

ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విషప్రభావం క్షీణిస్తుంది.

మరొక సాధన ఇది. సాధకుడు తన రెండు పాదాలలోనూ ”అ ఆ”లనూ, (చీలమండల్లో) గుల్భాలలో ”ఇ ఈ”లనూ, జానువులలో ”ఉఊ”లనూ, కటిలో ”ఏఐ”లనూ, నాభిలో ”ఓ”నూ, ఛాతీ పై ”జానీ”, ముఖంలో ”అం”నీ, మస్తకంలో ”అః” నూ స్థాపించుకొని. ”ఓం హంసః” అను బీజమంత్రసహితంగా న్యాసం చేసుకొని నిత్యం జప పూజనాలనూ చేస్తూ వుంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది.

సాధకుడు ”నేను స్వయంగా గరుత్మంతుడను” అను భావనతో ధ్యానంలోకి వెడలి పోయి ఈ మంత్రసాధనను చేయాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంత సేపూ అతనిలో ”తాను గరుడుడను” అనే ధ్యాసయే వుండాలి. ”హం” అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తినికలిగి వుంటుంది.

”హంసః” మంత్రాన్నిఎడమచేతిలో న్యాసం చేసుకొనియున్న సాధకుడు ధ్యాన, పూజన, నిత్య జప శక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్నీ, శ్వాస నాళికనీ అదుపు చేసే శక్తినీ, సంపూర్ణ సామర్థ్యాన్నీ కలిగి వుంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకీ మాంసంలోకీ దూసుకొని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది.

పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై ”ఓం హంసః” మంత్రాన్ని వ్యాసం చేసి భగవంతుడైన నీలకంఠస్వామినీ ఇతరదేవతలనీ కూడా ధ్యానించాలి. దీని వల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు.

ప్రత్యంగిరా జడాన్ని బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టి పిండితే, రోగి నోటిలోకి, పిండితే విష ప్రభావం తగ్గుతుంది.

1. పునర్నవ,

2. ప్రియంగు,
3. వక్త్రజ (బ్రాహ్మి),

4. శ్వేత బృహతి,

5. కూష్మాండ,

6. అపరాజిత జడం,

7. గేరు, కమల గట్టఫలం –

వీటన్నిటినీ నీటిలోవేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారు చేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని త్రాగిస్తే విషప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీష వృక్ష పంచాంగాలను (ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు) గాజరబీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి, కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషము నుండి విడుదల లభించవచ్చు.

ఓం హ్రీం అః ను ఉచ్ఛరిస్తూ హృదయ లలాటాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విధ్యుక్తముగా పదిహేను వేలమార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిదులు కాగలరు. దీర్ఘాయువులూకాగలరు.

ఋషులారా! బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రమొకటుంది. ఆ మంత్ర జప విధానాన్ని శివుడుపదేశించాడు. ఇది గోపనీయమైనా మీకు వినిపిస్తాను. దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేది వుండదు.

ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలచుకొన్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను వ్రాసుకుంటూ పోవాలి. ఓం కారం బ్రహ్మబీజమైతే శివకేశవ బీజ హ్రీంకారం. త్రిశూలమును గీసి దాని మూడు తలలపై హ్రీం కారాన్ని లిఖించాలి.

సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా త్రిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారియై ఆకాశంవైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలూ, కుత్సిత గ్రహాలూ, వినాశకర మేఘాలూ, రాక్షసశక్తులూ భయపడి పారిపోతాయి. ఆ ధనుస్సు ధూమ్రవర్ణంలో వుండాలి. ఈ మంత్రం ముల్లోకాలనూ రక్షించగల సామర్థ్యం గలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కర లేదు కదా!

ఓం జూం సూం హూం ఫట్ అనేది మరొక మంత్రం. సాధకుడు ఎనిమిది కాచు కర్రలను దీనితో అభిమంత్రించి ఎనిమిది దిక్కులలో పాతి వుంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా, విద్యుజ్ఞ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది. ఇదీ గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో ఎనిమిది కర్రలను ఇరువది యొక్క మార్లు అభిమంత్రించి ఎనిమిది దిక్కుల్లో పాతి వుంచితే ఆ మధ్య భాగంలో వున్న వారికి సర్వోపద్రవముల నుండీ రక్షణ లభిస్తుంది.

‘ఓం హ్రాం సదాశివాయనమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికెన వేలు వాడుతూ అనార్ పుష్పం వలె కాంతులు వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి.. దానిని చూడగానే దుష్టజనులు, దుష్టమేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి.

‘ఓం హ్రీం గణేశాయ నమః |

ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః |

ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య డామరాయ నమః ।

ఈ మంత్ర సంగ్రహాన్ని ”భైరవ పిండ” మంటారు. ఇది విషాన్నీ, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్నీ సమాప్తం చేయడంలో కడు సమర్థము. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణనీ, భూత-రాక్షసాది గణాల ఉపద్రశక్తుల నుండి రక్షణనీ కల్పించగలదు.

”ఓం నమః” అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకొని ధ్యానం చేయడాన్ని ”వజ్రముద్ర” అంటారు. ఇది విష, శత్రు, భూతగణాలను నశింపజేయ గలదు. ”ఓం క్షుం (లేదా క్ష ) నమః” అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకొని స్మరణ చేసినా అదే ఫలముంటుంది. ఓం హ్రాం (లేదా హోం) నమః అనే మంత్రోచ్ఛాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ, పాప గ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్ష (క్ష్మ) నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితముంటుంది.

‘ఓం లసద్ ద్విజిహ్వాక్ష స్వాహా’ అనే మంత్రాన్నుచ్చరిస్తూ దైవ ధ్యానం చేయడం వల్ల పంట పొలాలు గ్రహ, భూత, విష, పక్షి పీడల నుండి రక్షింపబడతాయి.

ఓం క్ష్వ (క్షం) నమః అనే మంత్రాన్ని నగారాపై ఎఱ్ఱని సిరాతో రాసి చదువుతూ కర్రతో కొడితే ఆ శబ్దాలను వినగానే పాప గ్రహాది ఉపద్రవకారక తత్త్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి.

పదిహేనవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment