త్రిపురదేవి గణేశాదుల పూజ
ఋషులారా! ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికీ, మూర్తికీ పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి.
ఓం గాం హృదయాయ నమః,
ఓం గీం శిరసే స్వాహా,
ఓం గూం శిఖాయై వషట్,
ఓం గ్రైం కవచాయ హుం,
ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్,
ఓం గః అస్ర్తాయ ఫట్
తరువాత సాధకుడు. ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః అంటూ దుర్గమ్మ యొక్కయూ, ఓం గురుపాదుకాభ్యాం నమః అంటూ గురువు గారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి త్రిపురాదేవికీ, ఆమె ఆసనానికి నమస్కారం చేసి ‘ఓం హ్రీం దుర్గే రక్షిణి’ అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గ అనే తొమ్మిది శక్తులనూ పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత ఓం ఐం క్లీం (హ్రీం) సౌంత్రిపురాయై నమః అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి.
తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికీ (పద్మానికి), మూర్తికీ, హృదయాది అంగాలకీ నమస్కారం చేసి ఆ పద్మపీఠంపై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండ, చండిక – అను ఎనమండుగురు దేవతలనూ పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులనూ అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారలు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గ, విఘ్నరాజాదులనూ, గురువునూ, క్షేత్రపాల దేవతలనూ పూజించాలి.
సాధకుడిపుడు ఒక పంచగర్భ మండలాన్నిగానీ త్రికోణ పీఠాన్నిగానీ వేసి దానిపై శుక్లవర్ణ సుశోభితా, వరదాయినీ, వీణాపుస్తక ధారిణీ, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృతా యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని లక్షమార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అపుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు.
పదిహేడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹