బ్రహ్మజ్ఞాన నిరూపణం – షడంగ యోగం
శౌనకాదులారా! ఇపుడు నేను వేదాంత, సాంఖ్య సిద్ధాంతానుసారం వివరింపబడిన బ్రహ్మజ్ఞానాన్ని వర్ణిస్తాను. “నేను జ్యోతిర్మయ పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువును” అని మనసులో స్థిరీకరించుకొని ఆలోచిస్తూ “సూర్యునిలోనూ, అగ్నిలోనూ,నాహృదయాకాశం లోనూ ఒకే జ్యోతి త్రిస్వరూప ధరమై వున్నది” అని నిశ్చయించుకోవాలి.
ఆవులోనే నెయ్యి ఉంటుంది. అయినా దాని వల్ల ఆవుకి బలం రాదు. కాని అదే నెయ్యి నొక పద్ధతి ప్రకారం బయటికి తీసి అదే ఆవుకి పెడితే మహాబలప్రదమవుతుంది. అలాగే భగవంతుడు ప్రతి మనసులోనూ వెలుగుతుంటాడు. కానీ ఆయనను పద్ధతి ప్రకారం పూజిస్తేనే పలుకుతాడు. యోగమనెడి వృక్షాన్నెక్కదలచుకొన్న వాడికి కర్మజ్ఞానం అవసరం కాని యోగవృక్షారూఢునికి వైరాగ్యం తప్ప ఇంకేదీ అక్కర్లేదు కదా!
యోగమోక్షాలను గూర్చి కాకుండా శబ్ద, విషయాదికముల గూర్చియే తెలుసు కోవాలనుకొనే వానిలో రాగ, ద్వేషాలుత్పత్తి అవుతాయి. లోభ, మోహ, క్రోధాలకు వశీభూతుడై పాపాచారుడవుతాడు. సుసంయతంగా చేతులనూ ఉపస్థయనగా, మూత్రేంద్రియము ఉపస్థనీ, ఉదరాన్నీ, వాక్యాన్ని ఉంచుకోగలిగినవాడే విప్రుడని బుద్ధిమంతులు వక్కాణిస్తారు. ఎవరి చేతులైతే పరద్రవ్యాన్నపహరించవో, హింసచేయవో, జూదమాడవో వారి చేతులే సుసంయత హస్తాలనబడతాయి. పరస్త్రీపై కామమును సర్వదా పరిహరించునదే సంయత ఉపస్థ. అలాగే లోభరహితంగానూ పరిమితంగానూ భోజనము చేయువానిదే సుసంయత ఉదరము హిత పరిమిత, సత్య వాక్కులతో నుండునదే సుసంయత వాక్యము. సంయత హస్తాలు కూడా తపస్సు, యజ్ఞాదుల నాచరిస్తేనే సఫలహస్తాలవుతాయి.
ఇక ధ్యానమనగా మనో బుద్ధిరింద్రియా అత్యంతిక ఐక్యత. అనగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు – ఇవన్నీ ధ్యేయతత్వంపై సంపూర్ణంగా సంలగ్నమైయుండుట. సబీజమనీ నిర్బీజమనీ ధ్యానం రెండు విధాలు, అవిద్యాది క్లేశాలను బీజమంటారు. వాటిని అనుభవిస్తూ కూడా వాటిని మఱచి చేసేది సబీజ ధ్యానం. విద్య బాగా వుండి ఏ క్లేశమూ అనుభవంలోకి రానిది నిర్భీజ ధ్యానం. చింతనకి మూలాధారమైన బుద్ధి మన భ్రూమధ్యంలో ఉంటుంది. విషయాసక్తుడైన వానికి అది ప్రాపంచిక వస్తువులనూ అశాశ్వతానందాన్ని కోరుకుంటూ సంసార సాగరంలోనే మునిగి ఉంటుంది. కనులు సగం మూసి విషయాలను విడచి శాశ్వతానంద సంధాయకుడైన భగవంతుని చింతనలో మునిగినవాడు ఆ కనుబొమల మధ్యనే జ్యోతిశ్చక్రాన్నీ ఆ చక్రంలో తన ఆరాధ్య దైవాన్ని చూడగలడు. ఇదే నిజమైన బుద్ధి.ఆ బుద్ధి గలవాడే జితేంద్రియుడూ, తంద్రామోహాలకతీతుడునగు జ్ఞాని.
అతడు ముందు చూడగలిగే వెలుగు అతని ఆత్మయే. అది స్వప్రకాశవంతుడైన పరమాత్మను చూపిస్తుంది. జీవికి అంతిమ లక్ష్యం ముక్తియే. అది జీవికి పుర్యష్టకమూ, త్రిగుణాత్మకమూనగు ప్రకృతిని పరిత్యజించిన తరువాతనే లభిస్తుంది.ఈ పుర్వష్టకం, నిజానికి, కమలరూపంలో ఉంటుంది. సంసారం చేస్తున్న జీవుడు దీని కర్ణము. (అనగా కర్ణికలో వుంటాడు). సత్త్వ రజస్తమోగుణాలే ఈ కమల ప్రకృతి.
ఈ మాయావృత కమలానికి ఎనిమిది దళాలుంటాయి. అవి ఏవనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, సత్త్వ, రజ తమాలు. ఈ వేదాంత, ప్రతీకాత్మక బోధనం వల్ల తేలేదేమిటంటే ముక్తి ప్రాప్తి కోసం సాధన చేసే సాధకుడు ఈ కమలాన్ని అనగా మాయనీ, ఇంద్రియాలనీ పూర్తిగా మరచి, ఈ కర్ణిక ఇచ్చే సుఖ, భోగ, పదవి, సాంసారిక భోగాదుల నుండి దిగిపోయి భగవచ్చింతన చేయాలి. షడంగ యోగం వైపు మళ్ళాలి. ప్రాణాయామ, జప, ప్రత్యాహార, ధారణ, సమాధి, ధ్యానములు యోగం యొక్క ఆరు సాధనలు.
ఇంద్రియ నిగ్రహము వల్ల పాపక్షయమూ, పాపక్షయం వల్ల దేవప్రీతి సులభమౌతాయి. దేవప్రీతి ముక్తిమార్గమునకు తలుపు తెరుస్తుంది. అప్పుడు మొదటి సాధనం ప్రాణాయామంతో పని పడుతుంది. ఇది అనివార్య సాధనం కూడ, గర్భమనీ అగర్భమనీ ఇది రెండు విధములు. జప, ధ్యాన యుక్తమగు ప్రాణాయామమును గర్భప్రాణాయామమని వ్యవహరిస్తారు. రెండవ రకంలో జపధ్యానాలుండవు. ముప్పదియారు మాత్రల పాటు చేసే ప్రాణాయామము ఉత్తమనిపించుకుంటుంది.
ఇరవై నాలుగైతే మధ్యమమనీ పన్నెండైతే నిమ్నమనీ పెద్దలు చెప్తారు. ఓంకారాన్ని జపిస్తూనే ప్రాణాయామం చేయాలి. ఈ బ్రహ్మవాచక ఓం కారం బ్రహ్మని ప్రసన్నుని చేస్తుంది.ఆరక్షరాల ఓం నమో విష్ణవే అనే మంత్రాన్నీ, పన్నెండక్షరాల గాయత్రి మంత్రాన్నీ జపించాలి. అన్ని ఇంద్రియాల ప్రవృత్తీ సాంసారిక విషయ వాంఛలవైపే మళ్ళుతూ వుంటుంది. ఈ ప్రవృత్తిని నివృత్తి చేయడమే అనగా ఇంద్రియాలను నిగ్రహించి విషయ వాసనలను సంహరించి కోరికలు లేకుండా చేసుకోవడమే ప్రత్యాహారం అని చెప్పబడింది.
మనస్సును బుద్ధితోవాటు ఈ ప్రత్యాహారంలో స్థిరంగావుంచి పన్నెండుమార్లు ప్రాణాయామం చేసి అలా చేయడానికి పట్టినంత కాలం పాటు బ్రహ్మలో మనసును (బ్రహ్మపై అని ఉద్దేశము) నిలిపి వుంచుటను ద్వాదశ ధారణాత్మక ధ్యానమంటారని బ్రహ్మోపదేశము. నియత రూపంలో (ద్వారా) బ్రహ్మాకార వృత్తిలో సాధకుడనుభవించే సంతుష్టిని సమాధి అంటారు.ధ్యానం చేస్తున్నంతసేపూ మనసును చంచలం కాకుండా అనుకున్న పని అయ్యేదాకా నిలుపగలిగే శక్తికి ధారణయని పేరు. మనస్సు ధ్యేయతత్త్వం పైననే ఆసక్తిని కలిగియుండి మిగతా సంసారంపై నిరాసక్తతను పెంచుకొనుటయే ధ్యానం.
ధ్యానపరాయణులైన సాధకులు, ముఖ్యంగా మునిగణము, ధ్యేయ పదార్థ చింతనను అవిశ్రాంతంగా గావిస్తూ అందులోనే నిశ్చలంగా నిలిచిపోతే దానినే పరమధ్యానమంటారు. సాధకునికి కనులు తెరచినా మూసినా ధ్యేయ దైవతమే కనిపిస్తూ వుంటే, తనకీ దైవానికీ తేడా లేదనే పరిస్థితి ఏర్పడితే, శరీరంపై పాములు పాకుతున్నా, పుట్టలు మొలుస్తున్నా తెలియని దశ ఏర్పడితే దానిని ”సమాధి” అంటారు. ఎవరి మనసైతే సంకల్పరహితమై పోతుందో, ఎవరి ఇంద్రియాలు విషయ చింతన నుండి సంపూర్ణంగా విరతాలై పోతాయో వారు సమాధి స్థితులుగా చూడబడతారు.
వారే బ్రహ్మలో లీనమై వుంటారు. వారు మరల వెనుకకు వచ్చి మానవ లోకంలో మామూలుగా జీవించడం ఎక్కడో జరుగుతుంది. యోగులను కూడా చెడగొట్టే దోషాలు కొన్ని వుంటాయి. చిత్తము యొక్క అస్థిరత, భ్రాంతి, దౌర్శనస్యం, ప్రమాదంవంటివి. మనస్సును స్థిరంగా వుంచుకోవడం కోసం సాధకుడు ముందుగా స్థూల స్వరూపాన్ని చింతించాలి. తరువాత నిశ్చలుడై తన కనుబొమల మధ్యలో జ్యోతి స్వరూపుడైన పరమాత్మను ఊహిస్తూ ఆ చర్యపై అనురక్తుడై స్థిరత్వాన్ని సాధించాలి.
ఈ విశ్వంలో పరమాత్మయే తప్ప వేరేదియు లేదు, ఆ పరమాత్మయే విశ్వ రూపము” అనే నిశ్చయానికి వచ్చి పరమాత్మ కాని పదార్థాలన్నీ అసత్తులే (అనిత్యాలే) అనే జ్ఞానాన్ని పొంది ఆ వస్తువులన్నిటినీ పరిత్యజించాలి. తన హృదయపద్మంలోనే ఓంకార రూపంలో వ్యాపించియున్న పరబ్రహ్మను ధ్యానించాలి. క్షేత్రంగాని క్షేత్రజ్ఞుడు గాని ఇంకా ప్రవేశించని త్రిమాత్రలతో యుక్తమైన ఓంకారాన్ని జపించాలి. తరువాత ఓంకార స్వరూపుడైన ప్రధాన పురుషుని కూడా ధ్యానించాలి. అనంతరం ఆ పద్మంపై కృష్ణ, రక్త, శ్వేత వర్ణాలలో నుండు తమ, రజ, సత్త్వ గుణాల మూడు మండలాలనూ ధ్యానించాలి. వాటిలో నున్న జీవాత్మయగు పురుషుని ధ్యానించాలి. అనంతరం ఐశ్వర్యాది ఎనిమిది గుణాలనూ (ధ్యానించాలి) భావించుకోవాలి.
ఇదివఱకు చెప్పిన దానికి భిన్నమైన కమలం ఈ దశలో సాధకుని హృదయంలో వికసిస్తుంది. ఈ కమలానికి కర్ణిక జ్ఞానం, కేసరాలు విజ్ఞానం, నాళం వైరాగ్యం, కందం వైష్ణవ ధర్మం. ముక్తి సాధకుడు ఈ హృత్పద్మం కర్ణికలో నున్న ప్రణవ రూప బ్రహ్మ యొక్క ధ్యానాన్ని చేతన, నిశ్చల వ్యాపక రూపాల్లో చేయాలి. ఇలా ఓంకార స్వరూపబ్రహ్మను ధ్యానిస్తూనే ప్రాణాలను పరిత్యజించిన వారికి బ్రహ్మసాయుజ్యం ప్రాప్తిస్తుంది. యోగి తన దేహగత పద్మంపై హరిని కూర్చుండబెట్టుకొని సడలని భక్తి భావంతో ఆయనను ధ్యానించాలి. కొందరు మహా సాధకులు తమ జ్ఞాన రూప చక్షువులతో ఆత్మ ద్వారా పరమాత్మని చూడగలరు.
సాంఖ్య దర్శనవేత్తలు ప్రకృతి పురుష వివేకం ద్వారానూ, యోగవేత్తలు యోగప్రభావం చేతనూ ఆత్మద్వారా ఆత్మదర్శనం (పరమాత్మను చూడగలుగుట) చేయగలరు. ఆత్మ జ్ఞానరూపమే. నిజానికీ మాహాత్మ్యమంతా జ్ఞానానిదే. అదే బ్రహ్మ ప్రకాశకం, భవబంధాల పాలిటి ఖడ్గం. ఈ జ్ఞానం ఏకాగ్రచిత్తత అనే ప్రధాన యోగం ద్వారా స్వంతమవుతుంది. ఏకాగ్రచిత్తతకు ముక్తి ప్రదాయక స్థాయి వుంది. అది యోగికి ఆత్మ దర్శనాన్ని కలిగించడంలో సమర్థమవుతుంది.
ఎవరైతే ఇంద్రియాలను జయించి జ్ఞానంతో ప్రదీప్తుడవుతాడో అతడే యోగి. అతడే పరమాత్మలో ప్రవేశించి ముక్తుడనబడతాడు. ఆసనం, స్థానం వంటి విధులు యోగ సాధనాలు కావు, పైగా, అవి యోగసిద్ధిని ఆలస్యం చేసే విలంబకాలవుతాయి. శిశుపాలుడే యోగసిద్ధిని పొందాడో అది కేవలం స్మరణ మాత్రాననే సిద్ధించింది. అయిదే దానికి పూర్వ జన్మ సుకృతం తోడైంది. యోగుల తీరు వేరు. వారు ఆత్మతోనే ఆత్మను చూస్తారు; అన్ని ప్రాణులపై కరుణను కురిపించగలరు; విషయాసక్తి ఏ కోశానా లేనివారు; శిశ్నం తోడి పనినిగాని, నాలుక గోలనుగాని పరిత్యజించినవారు.
వీరే దేహాంతమందు ముక్తిని పొందగలరు. యోగి ఇంద్రియాలతో చేయవలసిన ఏ పనినీ చేయకుండా, కఱ్ఱ వలె సుఖదుఃఖానుభూతులకు అతీతుడై బ్రహ్మములో కలిసిపోతాడు. అదే ముక్తి. మేధావియైన సాధకుడు అన్ని ప్రకారాల వర్ణ భేదాలనూ, ఐశ్వర్య భేదాలనూ, శుభాశుభాలనూ, పాపాలనూ ధ్యానాగ్నిలో పూర్తిగా భస్మం చేసి పరమగతిని పొందుతాడు. కఱ్ఱను కఱ్ఱకు రాపిడి చేస్తే అగ్ని దర్శనమైనట్టు యోగికి బ్రహ్మజ్ఞానంతో ధ్యానాన్ని అనుసంధానం చేయగా శ్రీహరి దర్శనమవుతుంది.
ఆ దర్శనమే యోగోత్కర్ష, దానిని మించిన పరమావధి లేదు. ఏ ఒక్క బాహ్యమైన ఉపాయం ద్వారానూ ముక్తి ప్రాప్తించదు. అది పూర్తిగా ఆభ్యంతరిక యమనియమాది ఉపాయాల ద్వారానే సాధ్యమవుతుంది. సాంఖ్యజ్ఞానం, యోగాభ్యాసం, వేదాంతాది శ్రవణాల వల్ల ఏ ఆత్మ సాక్షాత్కారమైతే సాధింపబడుతుందో అదే ”ముక్తి” అనబడుతుంది. ఈ ముక్తిని పొందిన వానికి, లేదా సాధించిన యోగికి అనాత్మలోనే ఆత్మ అసత్పదార్థంలోనే సత్తత్త్వం దర్శనమిస్తాయి..
(తరువాతి అధ్యాయంలో నారదుడు భగవంతుని ద్వారా వింటున్నట్లుగా చెప్పబడింది. నారదుని ద్వారా వ్యాసుడు, ఆయన నుండి సూత మహర్షి ఆ మహావిషయాన్ని తెలుసుకున్నారనుకోవాలి)
నూట యాబై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹