నృసింహస్తోత్రం – తన్మహిమ
శౌనక మహామునీ! ఇపుడు మీకు సాక్షాత్తు పరమశివునిచే చెప్పబడిన నారసింహస్తుతి (నృసింహస్తోత్రము) ని మీకు వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృగణాలవారంతా కలిసి కూడబలుక్కొని శంకరుని వద్దకేగి ”స్వామీ! మేమంతా మీరు దయతో అవునంటే ఈ విశ్వంలోని దేవ, అసుర, మనుష్యాది ప్రాణులన్నిటినీ తినేస్తాము. అనుజ్ఞనివ్వండి అన్నారు. పరమశివుడు వెంటనే “హే మాతృకలారా! మీరంతా ప్రజలని రక్షించటానికి సృష్టింపబడ్డారు. మీద్వారా రక్షణయే గాని భక్షణ జరుగరాదు. మీరు వెంటనే ఈ భయంకర పాపపుటాలోచనను మీమీ మనసులనుండి తొలగించండి” అని ఆజ్ఞాపించాడు. అయినా ఆయన మాటలను సరకు చేయకుండా ఆ మాతృగణాలు త్రైలోక్యభక్షణను ప్రారంభించాయి. అంతట శివుడు నృసింహరూపుడైన విష్ణుదేవుని ఇలా ధ్యానించాడు.
”ఆద్యంత రహితుడు, సమస్త చరాచరజగత్ సృష్టికే కారణమైనవాడు, విద్యుత్ సమానమై మెరుపులనీను నాలుక గలవాడు, మహాభయంకరములైన దంతములున్నవాడు, దేదీప్యమానములైన కేసరముల (జూలు) చే సుశోభితమైన గ్రీవము కలవాడు, రత్నజటే త అంగదాలచే కిరీటముచే శోభిల్లువాడు, స్వర్ణకాంతులీను జటలతో మిఱుమిట్లు గొలుపు శిరోభాగవిరాజితుడు, స్వర్ణమేఖలచే అలంకరింపబడిన నడుముగల వాడు, నీలకమల శ్యామవర్ణశోభితుడు, రత్నఖచితములైన అందెలు గలవాడు, సంపూర్ణ బ్రహ్మాండ వ్యాపితమైన తేజస్సు గలవాడు, వర్తులాకార రోమాలంకృతుడు, దేవశ్రేష్ఠతమ పుష్పహారాభి శోభితుడు, విశాలనేత్రుడునగు నృసింహస్వామిని నేను ధ్యానిస్తున్నాను. శివుడిలా ప్రార్ధించగానే నారాయణుడాయన వేడిన నృసింహరూపంలోనే సాక్షాత్కరించాడు. ఈ రూపము దేవతలకే దుర్నిరీక్ష్యముకాని శివునికి కాదు. శంకరుడు నృసింహస్వామికి ప్రణామం చేసి ఆయన దర్శనమైన ఆనందంలోని అతిరేకతతో ఇలా స్తుతించాడు.
నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర ||
దైత్యేశ్వరేంద్ర సంహారి నఖశుక్తి విరాజిత ||
నఖమండల సంభిన్న హేమ పింగళ విగ్రహ ||
నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురో ||
కల్పాంతాం భోద నిర్దోష సూర్యకోటి సమప్రభ ||
సహస్ర యమ సంత్రాస సహస్రేంద్ర పరాక్రమ ||
సహస్ర ధనదస్ఫీత సహస్ర చరణాత్మక ||
సహస్ర చంద్ర ప్రతిమ సహస్రాంశు హరిక్రమ ||
సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్తుత ||
సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ ||
సహస్ర జన్మమధన సహస్ర బంధమోచన ||
సహస్ర వాయువేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర ||
ఈ విధంగా స్తుతించి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికిలా విన్నవించాడు. ”భగవన్! అంధకాసురుని చంపడం కోసం అవసరమౌతారని నేను కొందరు. మాతృకలను సృష్టించాను. ఇపుడా మాతృకలు హింసా ప్రవృత్తికాకరాలైనా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణుల్ని తినేస్తున్నారు. అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారిలేక వారి సంహారానికై మిమ్ము వేడుకొంటున్నాను.
వెంటనే నృసింహమూర్తి జిహ్వాగ్రభాగమునుండి సహస్ర సంఖ్యలో దేవీ. స్వరూపములతో మహాశక్తులుద్భవించి ఆ మాతృకలన్నిటినీ భస్మం చేసి పారేశాయి. ఈ విధంగా నృసింహస్వామిలో కల్యాణ కారకుడైనాడు.ఈ నారసింహస్తోత్రాన్ని నియమపూర్వకంగా పఠించేవారి సమస్త మనోరథాలనూ శ్రీహరి నెరవేరుస్తాడు. కనులు మూసుకొని నృసింహదేవుని ఈ క్రింది రూపాన్ని ధ్యానించి. చూడగలిగినవారు దైవసమానులే కాగలరు.
ధ్యాయే నృసింహంతరుణార్క నేత్రం ||
సితాంబుజాతం జ్వలితాగ్ని వక్త్రంః ||
అనాది మధ్యాంతమజం పురాణం ||
పరాత్పరేశం జగతాం నిధానం ||
మంచుపొరలనూ, పొగమంచునూ సూర్యుడు నాశనం చేసినట్టు ఈ స్తోత్రాన్ని భక్తిగా నియమంగా పఠించే మానవుల కష్టాలనూ పాపాలనూ నృసింహస్వామి పటాపంచలు చేస్తాడు. కల్యాణకారియైన మాతృవర్గయుక్తమైన, నృసింహదేవుని మూర్తిని నిర్మించి దానిని పూజించిన వారి వెంట ఆ స్వామి నిత్యమూ నిలచి రక్షిస్తాడు.
నూట నలబై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹