భగవద్భక్తి నిరూపణం – భక్తుల మహిమ
సూతుడు శౌనకాది మహామునులకు విష్ణుభక్తిని ఈ విధంగా వర్ణించి చెప్పాడు.
“విష్ణుభగవానుడు భక్తి చేత , ఇంక దేనిచేతా సంతుష్టినొందడు. మనిషి శ్రేయస్సుకి మూలం నిరంతర హరినామ స్మరణే. అదే పుణ్యోత్పత్తి సాధనం, అదే జీవన మధురఫలం..
యథా భక్త్యా హరిస్తుష్యేత్ ||
తథా నా న్యేన కేన చిత్ ||
మహతః శ్రేయసో మూలం ||
ప్రసవః పుణ్యసంతతేః ||
జీవితస్య ఫలం స్వాదు ||
నియతం స్మరణం హరేః ||
ఈ కారణం చేతనే విద్వాంసులు విష్ణుసేవనే భక్తి యొక్క అత్యంత ప్రముఖ సాధనంగా పేర్కొంటారు. భగవంతుడు, త్రిలోకనాథుడునైన విష్ణుదేవుని నామాలనూ ఆయన కర్మాది కీర్తననూ చేస్తూ అందులో తన్మయులైపోయి ఆనందబాష్పాలను రాలుస్తూ రోమాంచితులై గద్గద కంఠులయ్యే వారే ఆయన మహాభక్తులు.
తే భక్తాలోకనాథస్య నామ కర్మాది కీర్తనే ||
ముంచంత్య శ్రూణి సంహర్షిద్యే ప్రహృష్టతనూరుహాః ||
అందుచేత మనమంతా జగత్ప్రష్ట, దేవదేవేశ్వరుడునైన విష్ణు భగవానుని ఉపదేశాలను అనుసరించాలి. నిజమైన విష్ణువే గౌరవించేదెవరినంటే…
ప్రణామ పూర్వకం భక్త్యా యో |
వదేద్ వైష్ణవో హి సః ||
తద్భక్త జన వాత్సల్యం |
పూజనం చానుమోదనం ||
తత్కథా శ్రవణే ప్రీతిః |
అశ్రునేత్రాంగ విక్రియాః ||
యేన సర్వాత్మనా విష్ణా |
భక్త్యా భావో నివేశితః ||
విప్రే భ్యశ్చ కృతాత్మత్వాన్ |
మహా భాగవతో హి సః ||
విశ్వోపకరణం నిత్యం |
తదర్ధం సంగవర్ణనం ||
స్వయమభ్యర్చనం చైవ |
యో విష్ణుం చోపజీవతి ||
వేదశాస్త్రానుసారం నిత్యకర్మలను నిర్వహిస్తూనే విష్ణువుని స్మరించేవారు, భక్తి భావంలో లోకాన్ని తనకు భిన్నంగా భావించుకొని తాను విష్ణువువైపే మళ్ళుతున్నానని త్రికరణశుద్ధిగా తామరాకు మీది నీటిబొట్టువలె జీవిస్తూ, విష్ణునామ సంకీర్తననూ విష్ణులీలనూ మాత్రమే మనసుకి పట్టించుకుంటూ, బ్రహ్మజ్ఞానం గల సద్ర్బాహ్మణులలో విష్ణువునే దర్శిస్తూ తమ సమస్త జపతపాది సాధనాలన్నిటినీ విష్ణు పాదాలపైనే సమర్పిస్తూ ఆయననే ఏకమాత్రాశ్రయంగా కొలిచేవారు వైష్ణవులు.
మహాభాగవతులు విష్ణుభక్తి ఎనిమిది ప్రకారాలని విశ్వసిస్తారు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఈ భక్తిని మ్లేచ్ఛ వ్యక్తి కూడా పాటించవచ్చు. హరిభక్తిలో తన్మయుడై వుండే వాడే ఈలోకంలో శ్రేష్ఠ బ్రాహ్మణుడు, అతడే ముని, అతడే ఐశ్వర్య సంపన్నుడు, అతడే మోక్షార్హుడు. వానినే మనం గౌరవించాలి. వానికే దానమివ్వాలి. అతనినే హరిగా భావించుకోవాలి. అతనినెంతగా పూజిస్తే మనం అంతగా పవిత్రులమౌతాము. అతడు జన్మతః చండాలుడైనా. విష్ణు భక్తి మహిమ వల్ల మనలను పవిత్రులను చేయగలడు.
భక్తిరష్టవిధా హ్యేషా |
యస్మిన్ మ్లేచ్ఛో పి వర్తతే ||
స విప్రేంద్రో మునిః శ్రీమాన్ |
సయాతి పరమాం గతిం ||
తస్మై దేయం తతో గ్రాహ్యం |
సచ పూజ్యో యథా హరిః ||
స్మృతః సంభాషితో వాపి |
పూజితో వా ద్విజోత్తమః ||
పునాతి భగవద్భక్త |
శ్చండాలో పియదృచ్ఛయా ||
హే దేవాధిదేవా! మీరు నాపై దయను కురిపించండి. నేను మిమ్మల్నే శరణు వేడుతున్నాను. అని ఏ ప్రాణి మనసా కోరినా శ్రీహరి సంపూర్ణ ప్రాణి లోకం నుండి అభయం ప్రసాదిస్తాడు. తను శరణిచ్చిన ప్రాణికి ఏ భయమూ లేకుండా చేయాలనేది ఆయన ప్రతిజ్ఞ.
దయాంకురు ప్రపన్నాయ |
తవాస్మీతి చయో వదేత్ ||
అభయం సర్వభూతేభ్యో |
దద్యాదేతద్ వ్రతం హరేః ||
మంత్రజపం చేసి జపకర్తలుగా ప్రసిద్ధి చెందినవారు వేయిమంది కంటె వేదాంత దర్శనాలలో శాస్త్రాలలో పారంగతుడైన విద్వాంసుడొక్కడు శ్రేష్ఠము. సర్వవేదాంత శాస్త్రనిష్ణాతులైన ఇలాటి వేయిమంది విద్వాంసులకంటే విష్ణుభక్తుడొక్కడు శ్రేష్టతరం. విష్ణు భక్తుడంటే మాటలు కాదు. అతడు హరిని తప్ప ఎవరినీ ఎరుగడు. అన్నపానములపై శ్రద్ధ ఉండతడికి హరియే గుర్తు చేస్తే తప్ప తినడు, తాగడు. అలాటి భక్తుడే శ్రేష్టమానవుడు.
ఇటువంటి విష్ణుభక్తులే సశరీరంగా శ్రీ విష్ణు పరమపదమును ప్రాప్తించు కోవడంలో సఫలులవుతారు. ఇట్టి పరమభాగవతులు స్వయంగా విష్ణు స్వరూపులే కాగలరు. విష్ణువే వీరికి పరాయణుడు. ” ఈ భక్తి అవ్యభిచారిణి అనగా నితాంత సుదృఢము. యాజ్ఞికులు, అశ్వమేధ రాజసూయాది అత్యున్నత యజ్ఞాలను చేసినవారు చేయించినవారు, వేదపారంగతులు, మునిసత్తములు, విద్యా సాగరులు అయినా కూడా విష్ణుభక్తి లేకుంటే సంసారాన్ని, నరకాన్ని తరించలేరు అనగా దాటుకుని పోలేరు.
విష్ణుభక్తులకు ఈ సాంసారిక క్లేశాలంటవు. నరకముండదు. నిర్దయులూ, దుష్టాత్ములూ, దురాచారులూ కూడా పశ్చాత్తప్తులై విష్ణుభక్తిలో సంలగ్నులై శేషజీవితాన్ని గడిపితే వారికి పరమగతి ప్రాప్తిస్తుంది.మనిషి భక్తి భగవంతుడైన జనార్దనుని పట్ల అచలమై దృఢంగా నిలబడిపోతే వానికి స్వర్గము రుచింపదు. ఆ భక్తియే వానికి ముక్తి, ఓయి శౌనకా! ఈ సంసారమనే దుర్గంలో దుర్గమ కర్మమార్గంలో పరిభ్రమించే మన మానవజాతికి విష్ణుభక్తి ఒక్కటే ఆలంబన. అదే విష్ణుప్రీతికరం. విష్ణు మహిమలను విననివాడు చెవులున్న చెవిటివాడు. విష్ణు సంకీర్తన ద్వారా శరీరం గగుర్పొడవని వాడు జీవన్మృతుడే. వీరు ధర్మమార్గ బహిష్కృతులు.
ద్విజశ్రేష్టులారా! ఎవని అంతఃకరణలోనైతే విష్ణుభక్తి అనే విష్ణుచక్రం దేదీప్య మానంగా తిరుగుతుంటుందో వాడు ఈ సంసార ఆవాగమన చక్రం నుండి విముక్తుడవు తాడు. మనస్సులో హరి చింతనము మాత్రమే కలవానికి ముక్తి నిశ్చయము, ఎందు కంటే విష్ణువును పూజించడం మొదలుపెట్టగానే ఎవరైనా ధర్మాత్ములై పోతారు. చింతలూ వంతలూ లేని శాశ్వత సుఖం, ఈ లోకంలోనే వారికి చేకూరుతుంది. ధర్మార్థ కామాల ప్రభావం వారిపై వుండదు. ఎందుకంటే పరమసుఖ రూపమైన మోక్షమే వారి కరతలామలకమై ఉంటుంది.
త్రిగుణాత్మికమైన మాయ కూడా విష్ణువే . హరి భక్తులామాయను సులువుగా దాటిపోగా ఇతరులా మాయలో తలమునకలుగా పడికొట్టుమిట్టాడు తుంటారు. మనోబుద్ధిరింద్రియాలలో శ్రీహరి వెలుగుతున్న వానికి యజ్ఞారాధనతో పనిలేదు. భక్తి ద్వారానే నారాయణారాధన జరగాలి. మరోసాధనం, శ్రీహరిని చేర్చగలిగేది, లేదు. విభిన్న ప్రకారాల దానాలు, పుష్పసమర్పణలు, దివ్యానులేపనాలు విష్ణు ప్రసన్నతను కలిగిస్తాయి. కాని వీటన్నిటి కంటె భక్తికే ఆయన సంతుష్టుడౌతాడు.
సంసార విషవృక్షస్య ద్వేఫలే హ్యమృతోపమే ||
కదాచిత్కేశవే భక్తి స్తద్భక్తా ర్వాసమాగమః ||
సంసారం అనగా జగత్తు అనే విషవృక్షానికి అమృత సమానఫలాలు రెండే పండుతాయి. విష్ణుభక్తి ఒకటి కాగా రెండవది విష్ణుభక్తులతోడి సత్సాంగత్యము. తమ వంశంలో విష్ణుభక్తుడొకడు ప్రసిద్ధి గాంచగనే వాని పితరులు ఆ లోకంలో పాటలు పాడుతూ ఆనందనృత్యాలు సలుపుతారు. దుర్యోధనుడు, శిశుపాలుడు వంటి దుర్మార్గులే కృష్ణుని స్పృశించి ఆయనతో కలిసి జీవించడం వల్ల నిష్పాపులయ్యా రంటే ఇక ఆయన భక్తులుగానే జీవించిన భీష్మ విదురాదుల సంగతి చెప్పనేల?
అజ్ఞానినః సురవరే సమాధిక్షిపంతో |
యత్సాపినో పి శిశుపాల సుయోధనాద్యాః ||
ముక్తింగతాః స్మరణ మాత్ర విధూత పాపాః |
కః సంశయః పరమభక్తి మతాం జనానాం ||
ఫల, పుష్ప, పత్ర, జలబిందువుల్లో ఏ ఒక్కదానినైనా పండబారిన నిండు భక్తితో సమర్పించి సనాతన పురుషుడైన ఆ దేవదేవుని సులువుగా పొందవచ్చు. ధ్యానయోగమంటే ఏమిటో తెలియని వారు కూడా అప్రయత్నంగా ఆయనను ధ్యానించి ముక్తినందగలిగారు.
“హే మాధవా! నా ఈ గుఱ్ఱంలాంటి మనస్సు అనేక ఇంద్రియచ్ఛిద్రాల నుండి సోకిన విషయవాసనలను చూసి చూసి మతిపోయి ఎటుపోవాలో తెలియక కష్టాల దారిలో పరుగులు పెడుతోంది. దీనిని నీవు ఆపాలి. నీ చరణాలవైపు మళ్ళించు కోవాలి. అపుడు నా మనసు వాటిని వదలి కదలలేదు. నేను ముక్తివైపు కదలిపోగలను’ అని ఆ మహావిష్ణువుని మనం ప్రార్థించాలి.
భవోద్భవ క్లేశ శతైర్హత స్తథా |
పరిభ్ర మన్నింద్రియ రంధ్ర కైర్హయైః ||
నియమ్యతాం మాధవ మే మనోహయ |
స్త్వదంఘ్రి శంకౌ దృఢభక్తి బంధనే ||
విష్ణువే పరబ్రహ్మ. ఆయనే మూడు విభిన్న రూపాలను ధరిస్తాడని వేద శాస్త్రాదులలో ప్రతిపాదింపబడింది. ఈ తథ్యాన్ని (మాయను గెలిచి) అర్థం చేసుకొన్న వారికి అంతా విష్ణుమయం. ఈ జగమంతా విష్ణుమయం.
నూట నలబై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹