కర్మక కథనము
జగత్సృష్టి, ప్రళయాదిక చక్రగతిని తెలుసుకున్న విద్వాంసులు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములనే మూడు సాంసారికతాపాలను తెలుసుకుని జ్ఞాన వైరాగ్య మార్గాలను స్వీకరించి అత్యంతిక లయను అనగా మోక్షాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. ఇపుడు సంసార చక్రాన్ని వర్ణిస్తాను. ఇది లేనిదే పురుషార్థి పరమాత్మలో లీనం కాలేడు.
మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి వుంటుంది. మార్గంలో తన కోసం తిలోదకాలనూ పిండప్రదానాలనూ చేసిన వారి దయవల్ల వాటినే తింటూ వుండాలి. త్రాగుతుండాలి. అక్కడి నుండి పుణ్యకర్ములు స్వర్గానికేగగా పాపకర్ములు నరకంలో పడిపోతారు. స్వర్గ నరకాల అనుభవం తరువాత ప్రాణి భూలోకానికి మరలి వచ్చి స్త్రీ గర్భంలో ప్రవేశించడం, రెండు బీజాకారాలను ధరించడం రక్తమాంస పుష్టిని పుంజుకొని అండాకారాన్ని ధరించడం జరుగుతుంది. అండము అలాగే భూమిపై పడి కొన్ని జీవులు పుట్టగా మనిషి మాత్రం క్షీరదాలన్నిటివలెనే లోపలే పూర్తి ఆకారాన్ని ధరించి సర్వాంగాలతో పుడమిపై పడడం జరుగుతుంది. మానవులు సాధారణంగా పూర్తిగా తొమ్మిది మాసాలూ జనని గర్భంలో వుంటారు. అంతవఱకూ అందరికీ పూర్వజన్మ గానీ జన్మలుగానీ గుర్తుంటాయి. పూర్వజన్మలో చేసిన తప్పులు, పొరపాట్లు ఇక చేయకూడదని అనుకుంటారు గానీ నేలపై బడగానే వైష్ణవ మాయ కమ్మేసి అన్నీ మఱచిపోతారు.
సామన్యజీవికి బాల్య, కౌమార, యువ, వృద్ధ అనే అవస్థలు (దశలు) ఉంటాయి. మరల మృత్యువు కబళించడం, జనన మరణ చక్రం పరిభ్రమించడం జరుగుతాయి.నరక భోగానంతరం (పుణ్యలేశమన్నది లేని) జీవి పాప యోనిలో జన్మిస్తాడు. పతితుని నుండి దానం పట్టిన విద్వాంసుడు కూడా, పాపుల వలెనే, అధోయోనిలో జనన మొందుతాడు. యాచకుడు, నరకం నుండి తిన్నగా క్రిమి యోనిలోనూ, గురుపత్నినీ గురుద్రవ్యాన్నీ ఆశించినవాడు కుక్క యోనిలోనూ, మిత్రుని అవమానాల పాలు చేసి అన్యాయం చేసినవాడు గాడిద కడుపునా, తల్లిదండ్రులను కష్టపెట్టినవాడు తాబేటి కడుపునా, స్వామి ద్రోహి కోతియోనిలోనూ పుడతారు. అలాగే పుట్టి, గిట్టి మరల నరకగాములే అవడం ఎక్కువగా జరుగుతుంది.నమ్మి దాచుమని యిచ్చిన సొమ్మునపహరించినవాడు పరమ పాతకుడు. వాడు నరకానికి పోయి అన్ని శిక్షలనూ అనుభవించి తిరిగి భూమిపై పడ్డపుడు క్రిమి యోనిలో పడతాడు.
ఈర్ష్యాళువు కూడా ఆ నరకానికే పోతాడు. గానీ మరల భూమిపై పడ్డపుడు రాక్షసి గర్భంలో పడతాడు. విశ్వాసఘాతకుడు నరకము నుండి వచ్చి చేపకడుపున పుడతాడు. ఇలాగే ధాన్యపు దొంగలకూ, స్త్రీని అపహరించేవారికీ, అన్నదమ్ముల భార్యలతో సంభోగించిన వారికీ, గురు లేదా తత్సమానుల పత్నులతో పోయిన వారికీ, క్రమంగా నరకలోకం నుండి రాగానే, ఎలుక, తోడేలు, కోకిల, పందిజన్మలు వస్తాయి.యజ్ఞ దాన వివాహాది పవిత్ర, శుభకార్యాలలో గోలచేసి అల్లరి పెట్టి అడ్డు పుల్లలు వేసి విఘ్నాలు కలిగించే పాపాత్ములు నరకం నుండి వచ్చి క్రిములౌతారు. దేవతలకు నివేదించకుండా పితరులకు అర్పించకుండా బ్రాహ్మణులకూ, అతిథికీ పెట్టకుండా ఆబగా అన్నం తినేసేవాడు నరకం నుండి వచ్చి కాకిగా పుడతాడు. పెద్దన్నను అవమానించినవాడు క్రౌంచపక్షిగా పుడతాడు. కృతఘ్నుడైన వ్యక్తి క్రిమిగానో, తేలుగానో పుడతాడు. అంటే ముందు క్రిమిగా పుట్టి గిట్టి అలాగే కీటకం, దీపపు పురుగు జన్మలెత్తి చివర తెలుగా పుట్టి చచ్చి నరకానికి మళ్ళీ పోతాడు. నిరాయుధుని చంపినవాడు గాడిదై పుడతాడు. స్త్రీలను, బాలురను చంపినవాడు క్రిమిగానూ అన్నం దొంగ పిల్లిగానూ, భోజనం దొంగ ఈగగానూ, నువ్వుల దొంగ ఎలుకగానూ, నేతిదొంగ ముంగిసగానూ, మాంసం దొంగ కాకిగానూ తేనె దొంగ అడవియీగగానూ, అప్పాల దొంగ పురుగుగానూ, నీటిదొంగ కాకిగానూ, కఱ్ఱలదొంగ హరిలపిట్టగానూ, అగ్ని చోరుడు కొంగగానూ, కూరలదొంగ నెమలిగానూ, కుందేలుని దొంగిలించిన వాడు కుందేలుగానూ కళలదొంగ నపుంసకునిగానూ, పూలదొంగ దరిద్రునిగానూ జన్మిస్తారు.
(వీరంతా దేహాంతంలో నరకానికి పోయి అక్కడ అన్ని పాపాలకూ అన్ని శిక్షలనూ అనుభవించి చివరగా ఈ పాపాలవల్ల ఈ ఈ యోనుల్లో జన్మిస్తారు) ఇంటిని అపహరించినవాడు మహాభయానకాలైన రౌరవాది నరకాలలో పడిపోతాడు. ప్రాణుల పట్ల దయనే చూపిస్తూ, చక్కగా చల్లగా మంచిగానే అందరితోనూ మాట్లాడుతూ, పరలోక దృష్టితోనైనా సాత్త్వికానుష్ఠాన, సత్కార్య నిష్పాదన, సత్యధర్మ పాలనలను గావిస్తూ, ఇతరుల హిత చింతననూ, ముక్తి సాధనేచ్చనూ, వేదప్రమాణ బుద్ధినీ కలిగియుండి, గురువులనూ పెద్దలనూ దేవరులనూ సిద్ధరులనూ సేవిస్తూ, సాధుజనులు చేసిన నియమాలను పాటిస్తూ జీవించినవారే స్వర్గానికేగగలరు. మరల భువికి మరలినపుడు ఉత్తమ జన్మనొందగలరు పున్నెము పండి యోగ శాస్త్రం ద్వారా చెప్పబడిన యమ నియమాలను అష్టాంగ యోగాలను ఆలంబనగా చేసుకొని సద్ జ్ఞానులై సమాజం కోసమే జీవించిన వారు దేహాంతంలో అత్యంతిక ఫలాన్ని అనగా మోక్షాన్ని పొందగలరు.
నూట నలబై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹